Honorable Prime Minister Narendra Modi Ji

అట్టడుగు స్థాయి ప్రజలతో అనుబంధం నా అదృష్టం

భారత్ ఇప్పుడు ముందుండి నడిపించే దేశంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వివిధ వేదికలపై మన గళాన్ని వినిపించాలని కోరుకునే స్థాయి నుంచి కొత్త అంతర్జాతీయ వేదికలను నడిపించే, సృష్టించే దేశంగా మారామని తెలిపారు. పేదరికంలో పెరగడం, అట్టడుగు స్థాయి ప్రజలతో కలిసి తిరిగడం వల్ల ప్రజల జీవితాలను మెరుగుపరచడంపై ఎలా దృష్టి పెట్టాలి అనే దానిపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారి జీవన సౌలభ్యం, వ్యాపార సౌలభ్యం వంటి వాటిపై దృష్టి సారించిన డజన్ల కొద్దీ సంస్కరణల ఫలితంగా భారత్ వృద్ధి ప్రయాణం వేగం పుంజుకుందని వివరించారు. ప్రజాస్వామ్యంలో వస్తున్న పెనుమార్పులు కుటుంబ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. ఒకే సమయంలో బహుళ తరాల నాయకత్వాన్ని అభివృద్ధి చేయగల సామర్థ్యం బిజెపికి ఉందన్నారు. బిజెపిలో ప్రతి మూడునాలుగేళ్ళకు కొత్త ముఖాలు కనిపిస్తాయని, బిజెపి స్పష్టమైన లక్ష్యంతో నడిచే క్యాడర్ ఆధారిత పార్టీ అని స్పష్టం చేశారు. అట్టడుగు స్థాయి కార్యకర్తగా కార్యకలాపాలు ప్రారంభించి కృషి, అంకితభావం ద్వారా అంచెలంచెలుగా ఎదిగామన్నారు. ఈ నిబద్ధత వల్లనే దేశం, ముఖ్యంగా యువత బిజెపితో బలమైన అనుబంధాన్ని అనుభూతి చెందుతోందన్నారు. ఇండియా టుడే న్యూస్‌మేకర్ ఆఫ్ ది ఇయర్ 2023గా ఎంపికైన సందర్భంగా నరేంద్ర మోదీ ఆ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రత్యేకమైన తన నిర్వహణా శైలి గురించి విస్తృతంగా చర్చించడమే కాకుండా కీలకమైన జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:

ప్ర. అభినందనలు ప్రధానమంత్రి జీ. మీరు ఇండియా టుడే న్యూస్‌మేకర్ ఆఫ్ ది ఇయర్ 2023గా ఎంపికయ్యారు. దీని గురించి మీకు ఎలా అనిపిస్తుంది?

జ: న్యూస్‌మేకర్ ఆఫ్ ది ఇయర్ 2023 ద్వారా ప్రత్యేక గుర్తింపు కల్పించినందుకు ధన్యవాదాలు. ఈ సంవత్సరం చాలా మంది వార్తల్లోని వ్యక్తులు ఉన్నారు: రికార్డు స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తి సాధిస్తూ గుర్తింపు పొందుతున్న, ప్రపంచవ్యాప్తంగా తృణధాన్యాల విప్లవాన్ని తీసుకువస్తున్న మన రైతులు; దేశవ్యాప్తంగా జీ-20ని విజయవంతం చేసిన మన ప్రజలు; తమ నైపుణ్యాల ద్వారా విజయ పథాన్ని నిర్దేశిస్తున్న మన విశ్వకర్మలు; ఆసియా క్రీడలు, ఆసియా పారా గేమ్స్, ఇతర టోర్నమెంట్‌లలో మనల్ని గర్వపడేలా చేసిన మన క్రీడాకారులు; స్టార్టప్‌లు లేదా విజ్ఞానశాస్త్ర రంగంలో కొత్త రికార్డులు సృష్టిస్తున్న మన యువత; అన్ని రంగాల్లోనూ కొత్త హద్దులను అధిగమిస్తోన్న మన నారీ శక్తి వీరంతా వార్తల్లోని ప్రముఖులే. ప్రత్యేకించి ఇప్పుడు మహిళల నేతృత్వంలోని అభివృద్ధి ద్వారా సాధికారత కొత్త చరిత్ర లిఖితమవుతోంది. ఎన్నో ఏళ్లుగా దేశ ప్రజలకు సేవ చేయడం నా అదృష్టం. ఈ సమయంలో ఎన్నో విజయాలతో పాటు సవాళ్లను కూడా ఎదుర్కొన్నాం.

ప్ర. ఈ సవాళ్లు ఏమిటి?

జ: 2023లో భారత్ వేగవంతమైన అభివృద్ధి చాలా కీలకమైనది, ఎందుకంటే ఇది వికసిత్ భారత్‌ దిశగా మన ప్రస్థానానికి మార్గాన్ని నిర్దేశిస్తుంది. మన దేశంలో నిద్రాణంగా ఉన్న శక్తిసామర్థ్యాలకు తలుపులు తెరిచాం. అంతర్జాతీయ వేదికల్లో ఇప్పుడు భారత్ సభ్యురాలిగా ఉండాలని, తన సహకారాన్ని అందించాలని ఇప్పుడు కోరుతున్నారు. వెనుకబడిపోయామని భావించే దేశం నుంచి ఇప్పుడు ముందుండి నడిపించే దేశంగా మారాం. వివిధ వేదికలపై మన గళాన్ని వినిపించాలని కోరుకునే స్థాయి నుంచి మనం కొత్త అంతర్జాతీయ వేదికలను నడిపించే, సృష్టించే దేశంగా మారాం. నేడు ప్రపంచ ఏకాభిప్రాయం స్పష్టంగా ఉంది. ఇది భారతదేశపు శకం.

ప్ర. 2023పై ఆత్మావలోకనం చేసుకుంటే ఇప్పటివరకు మీ ప్రయాణంతో మీరు సంతృప్తి చెందారా? 2023 మీకు, దేశానికి ఒక మలుపు అని భావిస్తున్నారా?

జ: ఒక్క సంవత్సరంలో నేను చేసిన దాన్ని మదింపు చేయడం ద్వారా సరైన చిత్రాన్ని ఆవిష్కరించలేకపోవచ్చు. ఎందుకంటే నా దార్శనికత, ప్రణాళికలు క్రమంగా అమలు జరుగుతున్నాయి. నేను ఏదైనా ప్రారంభించినప్పుడు, అది ఎక్కడ ముగుస్తుందో నాకు తెలుసు. కానీ నేను ప్రారంభంలో తుది గమ్యాన్ని లేదా బ్లూప్రింట్‌ను ఎప్పుడూ ప్రకటించను. కనుక ఈరోజు మీరు చూస్తున్నది సమగ్ర చిత్రం కాదు. అంతిమంగా చాలా విస్తృతమైన చిత్రం ఆవిష్కృతమవుతుంది. నేను పెద్ద కాన్వాస్‌పై పని చేస్తున్నాను. ఒక కళాకారుడిలా, ఒక చోట నుంచి ప్రారంభిస్తాను, కానీ చిత్రం తుది రూపాన్ని చూడటానికి సమయం పడుతుంది.

ప్ర. మీ ఈ ప్రత్యేకమైన శైలికి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. 

జ: గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉదాహరణను తీసుకోండి. 182 అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తామని నేను ప్రకటించినప్పుడు, గుజరాత్ అసెంబ్లీలో 182 సీట్లకు దీనికి సంబంధం ఉందని చాలా మంది అనుకున్నారు. ఎన్నికల ముందు ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఇలా చేశారని కొన్ని వర్గాలు భావించాయి. అయితే ఈ ప్రాజెక్టు మొత్తం పర్యాటక పర్యావరణ వ్యవస్థను ఎలా అభివృద్ధి చేసిందో చూడండి. అన్ని వయసుల వారిని, భిన్నమైన ఆసక్తులు కలిగిన వారిని అది ఆకర్షిస్తోంది. ఇటీవల ఒక్క రోజులో 80,000 మంది సందర్శకులు ప్రాజెక్టును తిలకించారు. ఇదీ దానికి గల ప్రజాదరణ. నేను ఒక వస్తువునే వాగ్దానం చేశాను, కానీ డజన్ల కొద్దీ వస్తువులను అందించాను. ఇది నేను పని చేసే విధానం. భారత్ మండపం పనులు ప్రారంభమైనప్పుడు ఇక్కడ జీ-20 సదస్సు జరుగుతుందని ఎవరూ అనుకోలేదు. కానీ నేను ఒక ప్రణాళికతో పని చేస్తూ వచ్చాను. నేను కొత్త పార్లమెంటు భవనం కోసం పని చేసినా పేదలకు 4 కోట్ల ఇళ్ళ కోసం పని చేసినా ఒకే రకమైన పట్టుదల, నిబద్ధతలతో చేస్తాను.

ప్ర: 2023లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటిగా నిలిచింది. ఆర్థిక వ్యవస్థతో వ్యవహరించేటప్పుడు మీ విధానాలను నిర్దేశించే మార్గదర్శకాలు ఏమిటి?

జ: అనుభవం పరంగా నా కెరీర్‌లో నాది ప్రత్యేకమైన ప్రయాణం. నేను 23 సంవత్సరాలు (గుజరాత్, కేంద్రంలో) ప్రభుత్వాధినేతగా పని చేశాను, కానీ అంతకు ముందు 30 సంవత్సరాలు దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించి ప్రజల మధ్య జీవించాను. నేను కూడా నన్ను జీవితకాల విద్యార్థిగా పరిగణిస్తాను. ఇతరుల అనుభవాలు, జ్ఞానం నుంచి నేర్చుకోవాలని నమ్ముతాను. ఒక విధంగా క్షేత్రస్థాయిలో ప్రజలతో, పరిస్థితులతో బలమైన సంబంధం ఉండటం నా అదృష్టం.

ప్ర. అయితే మీ నిర్వహణ శైలి ఏమిటి?

జ: విధాన రూపకల్పనలో నా విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది. నేను ఆర్థికవేత్తలు, నిపుణులందరి మాటలను వింటాను, వారి సలహాలు, నా క్షేత్రస్థాయి అవగాహన, దేశంలో ‘‘జీవిత వాస్తవికత’’ వీటన్నిటినీ కలబోసి నా విధానాలను, వ్యూహాలను రూపొందిస్తాను. నా క్షేత్రస్థాయి అవగాహనా ఫలితంగా నాకు కొన్ని బలమైన అభిప్రాయాలను ఉన్నాయి. నేను ఒక పని బాగా కనిపిస్తుందని ఆ పని చేయను, మంచి చేస్తుందంటేనే ఒక పని చేస్తాను. పేదరికంలో పెరగడం, అట్టడుగు స్థాయి ప్రజలతో కలిసి తిరిగే అదృష్టం కలిగి ఉండటం వల్ల సంస్కరణలు కేవలం ప్రచారం కోసం కాకుండా ప్రజల జీవితాలను మెరుగుపరచడంపై ఎలా దృష్టి పెట్టాలి అనే దానిపై నాకు అవగాహన ఉంది. ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారి జీవన సౌలభ్యం, వ్యాపార సౌలభ్యం వంటి వాటిపై దృష్టి సారించిన డజన్ల కొద్దీ సంస్కరణల ఫలితంగా భారత్ వృద్ధి ప్రయాణం వేగం పుంజుకుంది. మేం వనరుల అభిలషణీయ వినియోగం, ఫలితం-ఆధారిత పర్యవేక్షణను విశ్వసిస్తున్నాం. ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ కార్యక్రమాలను ఒక ఉద్యమంగా నిర్వహించడం ద్వారా జాతీయ లక్ష్యాలను సాధించగలమని మేం భావిస్తున్నాం.

ప్ర. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాల్లో కూడా మీరు పరిశుభ్రత, పారిశుధ్యం వంటి కష్టతరమైన అంశాలను ఎందుకు ఎంచుకుంటారు, వాటి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?

జ: ఇసుకలో గీత గీయడం సులువు. కానీ గీత గీయాల్సి వస్తే రాతిపై గీయాలి. అది కష్టమే అయినా కానీ మొదలుపెడదాం. ఇదీ నేను నమ్మే సూత్రం. ఇది కష్టమైన, అసౌకర్యమైన పనులను చేపట్టడానికి నాకు విశ్వాసాన్నిస్తుంది.

ప్ర. భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకుగాను మీరు ఏం చేస్తున్నారు?

జ: దీనికి మేం చేసిన పనే సమాధానం. 2001లో నేను గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పుడు, దాని ఆర్థిక వ్యవస్థ పరిమాణం దాదాపు 26 బిలియన్ డాలర్లు (రూ. 2.17 లక్షల కోట్లు). నేను ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టే సమయానికి గుజరాత్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 133.5 బిలియన్ డాలర్లు (రూ 11.1 లక్షల కోట్లు). వివిధ విధానాలు, సంస్కరణల ఫలితంగా నేడు గుజరాత్ ఆర్థిక వ్యవస్థ సుమారు $260 బిలియన్లు (రూ.21.6 లక్షల కోట్లు). అదేవిధంగా నేను 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు భారత్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2 ట్రిలియన్ డాలర్లు (రూ.167 లక్షల కోట్లు), 2023-24 చివరి నాటికి దేశ స్థూలజాతీయోత్పత్తి 3.75 ట్రిలియన్ డాలర్ల (రూ. 312 లక్షల కోట్లు) కంటే ఎక్కువగా ఉంటుంది. 23 సంవత్సరాల ఈ పనితీరు 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం సాధించదగిన లక్ష్యమని చెబుతోంది.

ప్ర: ద్రవ్యోల్బణం, ఉద్యోగాల కొరత పేదలను దెబ్బతీస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విమర్శకులకు మీ జవాబు?

జ: ఆరోపణలను పక్కన పెట్టి వాస్తవాలను పరిశీలిద్దాం. శతాబ్దానికి ఒకసారి సంభవించే మహమ్మారి, అంతర్జాతీయ సంఘర్షణలు రెండు సంవత్సరాలుగా ప్రపంచ విలువ గొలుసులకు అంతరాయం కలిగించి, ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ఒత్తిళ్లకు కారణమైనప్పటికీ మన దేశం పరిస్థితులకు స్పందిస్తూ అద్భుతమైన పనితీరు కనబరిచింది. భారీ అసమానతలు, అంతర్జాతీయ సంక్షోభాలు, సరఫరా గొలుసుల విచ్ఛిన్నాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నిత్యావసర వస్తువుల అంతర్జాతీయ ధరలపై ప్రభావం చూపినప్పటికీ 2014-15 నుంచి నుండి 2023-24 వరకు (నవంబర్ వరకు) సగటు ద్రవ్యోల్బణం గత 10 సంవత్సరాల(2004-14) సగటు 8.2 శాతంతో పోలిస్తే 5.1 శాతం మాత్రమే. మరి 5.1 శాతం ఎక్కువా? లేక 8.2 శాతమా?

ప్ర. ఉద్యోగాల సృష్టి గురించి ఏం చెబుతారు?

జ: ఉద్యోగాల కల్పన మాకు అత్యంత ప్రధానం. మా దృష్టి అంతా దీనిపైనే కేంద్రీకరించాం. మౌలిక సదుపాయాలపై ఎక్కువ పెట్టుబడులు పెడితే వృద్ధి, ఉపాధి అంతకంటే ఎన్నో రేట్లు పెరుగుతాయని అందరికీ తెలుసు. అందువల్ల మేం నిరంతరం మూలధన పెట్టుబడి వ్యయాన్ని పెంచుతున్నాం. 2013-14లో రూ.1.9 లక్షల కోట్లుగా ఉన్న మూలధన పెట్టుబడులను 2023-24 బడ్జెట్ లో రూ. 10 లక్షల కోట్లకు పెంచాం. ఈ వ్యయం ఉత్పాదకత, సామాన్యులకు అనేక అవకాశాలను ఎలా సృష్టిస్తుందో మీ పాఠకులకు మీరు తెలియజేస్తారని నేను నమ్ముతున్నాను. అలాగే మన చుట్టూ ఏం జరుగుతుందో చూడండి. మునుపెన్నడూ లేని విధంగా మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. అన్ని రంగాలు 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాయో ఇప్పుడు దాని కంటే మెరుగ్గా పని చేస్తున్నాయి.

ప్ర. ఉపాధిపై మీరు చెప్పిన మౌలిక సదుపాయాల కల్పన ఫలితం ఏమిటి?

జ: భారత్ 10 సంవత్సరాలలోనే మెట్రో లైన్ల పొడవును 248 కి.మీ నుండి 905 కి.మీలకు పెంచినప్పుడు అది మరిన్ని ఉద్యోగాలను సృష్టించలేదా? దేశం 10 సంవత్సరాలలోపు విమానాశ్రయాల సంఖ్యను 74 నుండి 149కి తీసుకువెళ్లినప్పుడు మరిన్ని ఉద్యోగాల కల్పనా జరగలేదా? పదేళ్లలోపు వైద్య కళాశాలల సంఖ్య 387 నుంచి 706కు పెరిగినప్పుడు ఎక్కువ ఉద్యోగాలు రాలేదా? 2014కి ముందు ఉన్న పరిస్థితులతో పోల్చండి. రోడ్ల నిర్మాణం రెట్టింపైతే ఉద్యోగాలు వచ్చేవి కాదా? టూరిస్టుల సంఖ్య పెరుగుతూనే ఉంటే, అది మరిన్ని ఉద్యోగాలు సృష్టించడం లేదా? 2014 తర్వాత వ్యవసాయోత్పత్తి గణనీయంగా పెరగడం వల్ల మరిన్ని జీవనోపాధి అవకాశాలు కలగలేదా? అందుకే, ఇటీవలి సంవత్సరాలలో, కార్మిక మార్కెట్లలో నిరుద్యోగిత రేటు 2018-19లో 5.8 శాతం నుంచి 2022-23లో 3.2 శాతానికి తగ్గింది. 2018-19లో 50.2 శాతం నుంచి 2022-23లో 57.9 శాతానికి పెరిగిన శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు దీంతోపాటు పెరిగింది. భవిష్యనిధిలో మార్చి 31, 2014 నాటి 117.8 మిలియన్ల మంది సభ్యులు ఉండగా వారి సంఖ్య మార్చి 31, 2022 నాటికి 277.4 మిలియన్లకు పెరిగింది.

ప్ర. బిజెపి ఇటీవల గెలిచిన మూడు రాష్ట్రాలకు కొత్త వారిని ముఖ్యమంత్రులుగా ఎంపిక చేసింది. ఇది మీరు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి అనుసరిస్తున్న కొత్త విధానం. దీని వెనుక ఉన్న ఆలోచన ఏమిటి?

జ: ఇది కొత్త ధోరణి ఏమీ కాదు. నిజానికి బిజెపిలో ఈ ధోరణికి నేనే అత్యుత్తమ ఉదాహరణ. నేను గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పుడు, నాకు ముందస్తు పరిపాలన అనుభవం లేదు. అసలు శాసనసభకు కూడా ఎన్నిక కాలేదు. అవును, ఇది తాజా ధోరణిలా కనిపించవచ్చు, ఎందుకంటే ఈరోజు చాలా ఇతర పార్టీలలో వంశపారంపర్య పాలన నడుస్తోంది గనుక అలా కనిపించవచ్చు.

ప్ర: ఈ కుటుంబ పాలన పార్టీల కంటే బిజెపి ఏవిధంగా భిన్నం?

జ: ప్రజాస్వామ్యంలో వస్తున్న పెనుమార్పులు కుటుంబ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఒకే సమయంలో బహుళ తరాల నాయకత్వాన్ని అభివృద్ధి చేయగల సామర్థ్యం బిజెపికి ఉంది. బిజెపి అధ్యక్షులను చూడండి. ప్రతి మూడునాలుగేళ్ళకు కొత్త ముఖాలు కనిపిస్తాయి. మాది స్పష్టమైన లక్ష్యంతో నడిచే క్యాడర్ ఆధారిత పార్టీ. మేమంతా అట్టడుగు స్థాయి కార్యకర్తలుగా కార్యకలాపాలు ప్రారంభించి అంకితభావం, కృషి ద్వారా అంచెలంచెలుగా ఎదిగాం. ఈ నిబద్ధత వల్లనే దేశం, ముఖ్యంగా యువత బిజెపితో బలమైన అనుబంధాన్ని అనుభూతి చెందుతోంది. ప్రజాస్వామ్యంలో కొత్త తరాలకు, కొత్త రక్తానికి అవకాశాలు కల్పించడం చాలా అవసరం. ఈ ప్రజాస్వామ్య మథనమే ప్రజాస్వామ్యాలను చైతన్యవంతం చేస్తుంది. ఈ మథనమే మా పార్టీని శక్తిమంతం చేస్తుంది. పార్టీ శ్రేణుల్లో ఆకాంక్షలు, ఆశలను జ్వలించేలా చేస్తుంది. తమ కష్టార్జితంతో తాము కూడా పార్టీలో ఎదగగలమని కార్యకర్తలు భావిస్తున్నారు. విభిన్న ప్రయోగాలు చేయడం మా పార్టీకి అలవాటు. గుజరాత్‌లో మేం మంత్రులుగా అంతా కొత్తవారినే నియమించాం. దిల్లీలో, స్థానిక కార్పొరేషన్ ఎన్నికలలో మేం అన్నీ కొత్తముఖాలను ఎంపిక చేసాం.

ప్ర: దక్షిణాదిలోను, తూర్పు ప్రాంతంలో పెద్ద రాష్ట్రాల్లోను బిజెపి అధికారంలో లేదు. నిజమైన పాన్-ఇండియన్ పార్టీగా మారడానికి బిజెపి వ్యూహం ఏమిటి?

జ: ఇది తప్పు అంచనా. మీరు విషయాలను నలుపు, తెలుపు రంగుల్లోనే చూస్తున్నారు. బిజెపి ఏర్పడినప్పటి నుంచి మా పార్టీ ఏమిటి, అది ఏ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది అనే దానిపై ఇటువంటి వక్రీకృత అభిప్రాయాలు వింటున్నాం. కొన్నిసార్లు మాది బ్రాహ్మణ-బనియా పార్టీ అని, మరి కొన్ని సమయాల్లో హిందీ ప్రాంతాలకే పరిమితమైన పార్టీ అని ముద్ర వేశారు. మేం నగరాల్లో మాత్రమే మద్దతు ఉన్న పార్టీగా కొన్నాళ్ళు చిత్రీకరించారు. అయితే ఒకదాని తర్వాత మరో ఎన్నికల్లో ఈ ముద్రలు తప్పు అని మేం నిరూపించాం.

ప్ర. ఈ అభిప్రాయం ఏవిధంగా తప్పో వివరిస్తారా?

జ: నేడు దేశంలో మా పార్టీకి ఆదరణ లేని చోటు లేదు. కేరళలోని స్థానిక సంస్థల నుంచి అనేక రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షంగా మా పార్టీ ప్రజల్లో బలంగా పని చేస్తోంది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్‌లలో మేం ప్రధాన ప్రతిపక్షం. నిజానికి బీహార్‌లో ప్రజలు తమ అపారమైన మద్దతును మాకు అందించారు. ఆరు నెలల క్రితం వరకు కర్ణాటకలో మా ప్రభుత్వం అధికారంలో ఉంది. నేటికీ పుదుచ్చేరిలో మా ప్రభుత్వం ఉంది. మేం ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. 2014లో ఈశాన్యంలో అసలు ఉనికిలో లేని బిజెపి నాగాలాండ్, మేఘాలయ వంటి క్రైస్తవ ప్రాబల్యం గల రాష్ట్రాలతో సహా ఇప్పుడు ఆరు ఈశాన్య రాష్ట్రాలలో ప్రభుత్వంలో ఉంది. ఇంకా లోక్‌సభ స్థానాల పరంగా దక్షిణ భారతదేశానికి సంబంధించినంత వరకు మేం ఏకైక అతిపెద్ద పార్టీ. రెండు లోక్‌సభ స్థానాలు (1984లో) నిరాడంబరమైన ప్రారంభం నుండి ఇప్పుడు 303 స్థానాలకు చేరుకున్న మా ప్రయాణాన్ని పరిశీలించండి. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజల మద్దతు, బలం లేకుండా మేం జాతీయ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన శక్తిగా ఎదగగలమా?

ప్ర. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన ప్రచారకర్తగా మీ ర్యాలీలు ఎన్నికల ఫలితాలలో నిర్ణయాత్మకమైన మార్పు తెచ్చాయి కదా? 

జ: మీ అంచనా కొంతవరకే వాస్తవం. బిజెపి కార్యకర్తల ఆధారిత పార్టీ. పోలింగ్ బూత్ వరకు, బిజెపికి నిబద్ధత కలిగిన కార్యకర్తల యంత్రాంగం ఉంది. ప్రతి స్థాయిలో ప్రజలతో మమేకమయ్యే నాయకత్వం ఉంది. అందరి సమష్టి కృషితోనే విజయం లభిస్తుంది. కనుక ఆ ఘనతను నాకు ఆపాదించడం అన్యాయం. ఈ ఘనత కష్టపడి పనిచేసిన కార్యకర్తలదే.

ప్ర. 2024 సార్వత్రిక ఎన్నికలకు ‘మోదీ హామీ’ ఏమిటి?

జ: నాకు హామీ అనేది కేవలం మాటలు లేదా ఎన్నికల వాగ్దానాలు కాదు, ఇది దశాబ్దాల నా కష్టానికి ఫలితం. ఇది సమాజం పట్ల నా సున్నితత్వం వ్యక్తీకరణ. నేను ‘గ్యారంటీ’ గురించి మాట్లాడేటప్పుడు, నేను దానికి కట్టుబడి ఉంటాను. ఇది నన్ను నిద్రపోనివ్వదు, మరింత కష్టపడి పని చేయడానికి నన్ను ప్రోత్సహిస్తుంది, దేశ ప్రజల కోసం నా సర్వస్వం ఇచ్చేలా చేస్తుంది. కనుక దయచేసి గ్యారెంటీ అనే పదానికి నిఘంటువులోని అర్థాన్ని తీసుకోకండి.

ప్ర. అయితే ‘హామీ’కి మీరు ఇచ్చే నిర్వచనం ఏమిటి?

జ: పేదవాడిని జీవితంలో ముందుకు నడిపించే గొప్ప శక్తి వారి నమ్మకం, వారి ఆశ అని పేదరిక జీవితాన్ని అనుభవించిన వ్యక్తి మాత్రమే అర్థం చేసుకోగలడు. పేదల ఈ విశ్వాసమే నన్ను ముందుకు నడిపిస్తోంది. మోదీ తన సర్వశక్తులను ధారపోస్తాడే కాని తన పేద సోదర సోదరీమణుల నమ్మకాన్ని వమ్ము చేయడు. మోదీ హామీ ఎన్నికల్లో గెలుపు కోసం రూపొందించిన చిట్కా కాదు, పేదల విశ్వాసం మోదీ హామీ. మోదీ తన కర్తవ్యం నుంచి నుండి వెనక్కి తగ్గడని నేడు దేశంలోని ప్రతి పేదవాడికి తెలుసు. గతంలో రాజకీయ పార్టీలు తమ నమ్మకాన్ని ఎలా వమ్ము చేశాయో నేడు ప్రతి పేదవాడికి తెలిసినదే. కానీ మోదీ హామీని నమ్మవచ్చని వారికి తెలుసు. ఈ పేదల విశ్వాసం కూడా నాకు శక్తిని ఇస్తుంది. నేను పూర్తిగా అలసిపోయినా లేదా నా శక్తి అంతా హరించుకుపోయినా ఈ నమ్మకాన్ని మాత్రం చెదరనివ్వను.

ప్ర. 2024లో హ్యాట్రిక్ సాధిస్తామన్న నమ్మకం ఉందా? ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలను నిర్ణయించే కీలక అంశాలు ఏమిటి?

జ. 2024 ఫలితాలు నా నమ్మకానికి సంబంధించిన విషయం కాదు. ప్రజల సేవలో నా సర్వస్వం అందించడం ఒక్కటే నా చేతిలో ఉంది. నేను చాలా నిజాయితీగా, నిబద్ధతతో దీన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ నేడు మన దేశానికి అతుకులబొంత ప్రభుత్వం అవసరం లేదని ప్రజలు, నిపుణులు, అభిప్రాయ రూపకర్తలు, మీడియా మిత్రుల మధ్య ఏకాభిప్రాయం ఉంది. అటువంటి పాలన వల్ల ఏర్పడిన అస్థిరత కారణంగా 30 ఏళ్లు కోల్పోయాం. నాటి పాలనాలోపాలను, బుజ్జగింపు రాజకీయాలను, అవినీతిని ప్రజలు చూశారు. దీనివల్ల ప్రజల్లో ఆశావాదం, విశ్వాసం అడుగంటడంతో పాటు ప్రపంచంలో భారత్‌కు కూడా అప్రతిష్ట ఏర్పడింది. అందువల్ల సహజంగానే ప్రజలు బిజెపి వైపే మొగ్గుచూపుతారు.

ప్ర. అధికరణం 370 రద్దును సమర్థించి సుప్రీం కోర్టు దానికి చట్టపరమైన ముగింపు పలికింది. ఎన్నికలు నిర్వహించడం, రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం వంటి రాజకీయ పరిష్కారం కోసం ఇప్పుడు ఏ చర్యలు అవసరమని భావిస్తున్నారు?

జ: దేశం ముందున్న సమస్య సుప్రీంకోర్టు ఈ అంశానికి చట్టబద్ధంగా ముగింపు పలకడం కాదు.. ప్రజల అసలు సమస్య ఏనాడో తాత్కాలికంగా తెచ్చిన నిబంధనను రద్దు చేయడంలో జరిగిన జాప్యం. “ఘిస్తే ఘిస్తే ఘిస్ జాయేగా (ఇది ఒక రోజు క్షీణించిపోతుంది, అదృశ్యమవుతుంది)”, అని నెహ్రూజీ పార్లమెంటులో చెప్పినప్పటికీ ఏడు దశాబ్దాలుగా, జమ్మూ కశ్మీర్ ప్రజలు, ముఖ్యంగా మహిళలు, అణగారిన వర్గాలవారు హక్కులను కోల్పోయారు. ఇప్పుడు అధికరణం 370 శాశ్వతంగా పోవడంతో జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రజానీకం మొదటిసారిగా సొంతంగా తమ గమ్యాన్ని స్వేచ్ఛగా నిర్దేశించుకుంటున్నారు. సామాజికంగా బలహీనమైన వర్గాల హక్కులను పరిరక్షించే భారత రాజ్యాంగం వారికి పూర్తిగా వర్తిస్తుంది. జమ్మూ కశ్మీర్ మహిళలు నేడు క్రీడల నుంచి వ్యాపారాల వరకు వివిధ రంగాలలో అభివృద్ధి చెందుతున్నారు. కొత్త పరిశ్రమలు ప్రారంభమవుతున్నాయి. టూరిజం రికార్డు స్థాయికి చేరుకుంటుండగా ఉగ్రవాదం రికార్డు స్థాయికి చేరుకుంది. జీ-20 సమావేశాలు వంటి అంతర్జాతీయ కార్యక్రమాలు జరిగాయి. ఈ ప్రాంతం ఆతిథ్యం, ప్రకృతి సౌందర్యాలను ప్రపంచం చూసింది.

ప్ర. జమ్మూ కశ్మీర్‌లో సుస్థిర శాంతికి మీరు ఏం చేస్తున్నారు?

జ: భద్రత, అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, మానవ మూలధనంలో పెట్టుబడులు, సంస్కరణల ద్వారా ప్రభుత్వ ప్రక్రియలను పూర్తిగా పునర్వ్యవస్థీకరించడంపై దృష్టి సారించి ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అనుసరించింది. జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా ఈ ప్రాంతంలోని ప్రజలకు స్థిరమైన శాంతిని, సుస్థిరత, సంక్షేమాలను అందించాలనుకుంటున్నాం. జమ్మూ కశ్మీర్ ఇప్పటికే జాతీయ స్థాయిలో మన పార్లమెంటులో ప్రాతినిధ్యం కలిగి ఉంది. స్థానిక స్థాయిలో తొలిసారిగా ప్రజాస్వామ్యాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లగలిగాం. రాష్ట్రంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి 35,000 మంది నాయకులు అట్టడుగు స్థాయిలో ప్రాతినిధ్యం కల్పించాం. ఈ ఎన్నికల ప్రాధాన్యాన్ని మనం ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నాం? ప్రజాస్వామ్యం, అభివృద్ధి లేదా చైతన్యం ఏదైనా కానివ్వండి, నేడు జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రజలు ప్రతి రంగంలో సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నారు.

ప్ర. అంతరిక్ష పరిశోధనతో పాటు సెమీకండక్టర్ చిప్ తయారీ, ఇతర కీలకమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు మీ ప్రభుత్వం పెద్ద ఊపునిచ్చింది. ఈ రంగాలలో భారత్ ను స్వయంసమృద్ధం చేయడానికి, టెక్నాలజీలో అగ్రరాజ్యంగా మార్చేందుకు మనం ఇంకా ఏం చేయాలి?

ప్ర: ఈ రంగాలలో మా ప్రయత్నాలను మీరు గుర్తించడం సంతోషదాయకం. అధికారంలో ఉన్న వ్యక్తులు 30 ఏళ్లుగా దేశాన్ని కాకుండా కేవలం ప్రభుత్వాలను నడిపించడం దురదృష్టకరం. సెమీకండక్టర్ కార్యక్రమం అనేది మనం 30 ఏళ్ల క్రితమే ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటికే మనం ఆలస్యం చేశాం. వారు మన ప్రజల సామర్థ్యాన్ని, వారి సామర్థ్యాలను అనుమానిస్తూనే వచ్చారు. పరిశోధన లేదా రూపకల్పనలో మన ప్రజలకు అద్భుతమైన సామర్థ్యాలు ఉన్నాయి. అంతరిక్షంతోపాటు అణుశక్తి రంగంలోనూ గొప్ప విజయాన్ని సాధించాం. బ్రహ్మోస్ క్షిపణి వంటి ఉత్పత్తుల ద్వారా రక్షణ ఉత్పత్తుల తయారీలో మన సామర్థ్యాన్ని ప్రపంచం ఇప్పుడు చూస్తోంది. సెమీకండక్టర్ల రంగంలో విజయం సాధించడానికి కావాల్సిన వనరులు, పరిస్థితులు అన్నీ మనకు ఉన్నాయి. దీని కోసం, మేం విధానాలు, ప్రోత్సాహకాలు, నైపుణ్యం వీటి సరైన మిశ్రమంపై దృష్టి సారించాం. సెమీకండక్టర్ తయారీ కార్యక్రమంలో మనం చాలా పురోగతి సాధించాం. మొత్తం విలువ గొలుసును కలిగి ఉన్న ఎలక్ట్రానిక్స్ తయారీకి సంబంధించిన మొత్తం పర్యావరణ వ్యవస్థను భారత్ కు తీసుకురావడంపై ఇప్పుడు దృష్టి కేంద్రీకరించాం. దీనికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే దిశగా మేం కృషి చేస్తున్నాం.

ప్ర. కృత్రిమ మేధ (ఏఐ) గురించి ఏమిటి?

జ: కృత్రిమ మేధ రంగంలో కూడా భారత్ ముందుండాలని కోరుకుంటున్నాం. భారతీయ భాషల వైవిధ్యం, మన అవసరాలను దృష్టిలో పెట్టుకుని విస్తృత స్వదేశీ భాషా నమూనాలలో మేం మన సొంత కంప్యూటింగ్ శక్తిపై పని చేస్తాం. టెక్నాలజీలో నాయకత్వ స్థానానికి ఎదగాలంటే మనస్తత్వాల్లో కూడా మార్పు అవసరం. నేడు తరగతి గదుల నుంచి బోర్డ్‌రూమ్‌ల వరకు ప్రగతిశీల, స్థిరమైన విధానాలను అనుసరించడంతో పాటు నవకల్పన, సులభంగా మూలధన లభ్యతపై దృష్టి కేంద్రీకరిస్తున్నాం. గుర్తుంచుకోండి, నేటి ఆవిష్కరణే రేపటి పరిశ్రమ. పెట్టుబడి, ఆదాయ వృద్ధిని తెచ్చే పరిశ్రమ ఇది.

ప్ర. అంతర్జాతీయ సమస్యల విషయానికి వస్తే, విజయవంతంగా జీ-20 అధ్యక్ష పదవి నిర్వహించినందుకు, వర్ధమాన దేశాల (గ్లోబల్ సౌత్) సమస్యలను తెరపైకి తెచ్చినందుకు మీరు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందారు. దిల్లీ 2023 సదస్సు ప్రయోజనాలను నిలబెట్టుకోవడానికి దేశాలు ఇప్పుడు ఏమి చేయాలి?

జ: మన జీ-20 అధ్యక్షత బహుళ, ఒకదానితో ఒకటి ముడిపడిన ప్రపంచ సవాళ్ల నేపథ్యంలో వచ్చింది. ప్రపంచ ఎజెండాలో మానవ-కేంద్రిత అభివృద్ధిపై దృష్టి పెట్టగలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. మేం అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ప్రపంచాల మధ్య ఏకాభిప్రాయానికి కృషి చేశాం. బహుపాక్షికతను పునరుద్ధరించాం. ప్రపంచ వృద్ధి మందగించడం, పెరుగుతున్న అప్పులు, వాతావరణ మార్పు, భౌగోళిక రాజకీయ ఘర్షణలు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలపై గణనీయమైన ప్రతికూల ప్రభావం చూపాయి. ప్రపంచ రాజయకీయాల్లో వర్ధమాన దేశాలకు సరైన స్థానాన్ని కల్పించేందుకు మా జీ-20 అధ్యక్ష పదవి ఒక వేదికగా మారింది. ఆఫ్రికన్ యూనియన్‌ను జీ-20లో శాశ్వత సభ్యదేశంగా చేర్చడం అనేది 55 ఆఫ్రికన్ దేశాలకు గళాన్ని అందించిన ఒక మైలురాయి వంటి నిర్ణయం. భారత్ అధ్యక్షత సమయంలో జీ-20 మరింత బలంగా మారింది. ప్రపంచ ఎజెండాను మరింత ప్రభావవంతంగా రూపొందించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, లైఫ్ (పర్యావరణ విహిత జీవనశైలి), డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల వ్యవస్థలు, ఆహార భద్రత, పోషణ, పునరుత్పాదక శక్తి, కీలకమైన ఖనిజాలు, ప్రపంచ ఆరోగ్యం, నైపుణ్యం కలిగిన వలస మార్గాలు, వాతావరణం, అభివృద్ధి ఆర్థిక వనరులు వంటి ముఖ్యమైన ఫలితాలలో ఇది వ్యక్తమవుతుంది. జీ-20 శిఖరాగ్ర సమావేశంలో మా అనేక నిర్ణయాలు, ప్రతిపాదనలు చురుగ్గా అమలవుతున్నాయని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను.

ప్ర. ఇది యుద్ధాలకు సమయం కాదని మీరు చేసిన ప్రకటన ప్రశంసలు అందుకుంది. ఉక్రెయిన్ తో పాటు గాజా యుద్ధం, ఇతర చిన్న సంఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సంక్షోభాల సమయంలో భారత్ తెలివిగా మధ్యే మార్గాన్ని అనుసరిస్తోంది. ఈ అంతర్జాతీయ అశాంతిని పరిష్కరించేందుకు ‘మోదీ మార్గం’ ఉందా?

జ: భయం, దౌర్జన్యాలు లేని వాతావరణంలో నిజాయితీతో కూడిన చర్చలు దౌత్య విభేదాలను పరిష్కరించడానికి సరైన మార్గం అని నేను ఎప్పుడూ నమ్ముతాను. అది ఉక్రెయిన్ కావచ్చు లేదా గాజా కావచ్చు. మా విధానానికి ఇదే దిక్సూచి. తీవ్రవాదులు, లేదా హింస ఎజెండాను నిర్దేశించడానికి మేం అనుమతించం. సంఘర్షణలతో ఎటువంటి పాత్ర లేని వారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వాటివల్ల వల్ల ఎక్కువగా నష్టపోతారు, ప్రభావితమవుతారు. దౌత్యానికి ప్రాధాన్యం ఇవ్వడం అంటే ఉగ్రవాదం, ప్రాదేశిక సార్వభౌమాధికారం విషయంలో మనం రాజీ పడతామని కాదు.

ప్ర. మన పొరుగు దేశాలతో, ముఖ్యంగా పాకిస్థాన్, చైనాలతో వ్యవహరించడం గురించి మీ వైఖరి ఏమిటి?

జ: అవసరమైనప్పుడు నిర్మాణాత్మకంగా, సహకారంతో, సమాన హోదాతో వ్యవహరించడం, పరిస్థితులను బట్టి దృఢంగా ఉండటం పొరుగు దేశాలతో వ్యవహరించడంలో నేను అభిలషించే వైఖరి.

ప్ర. 2047 నాటికి భారతదేశం వికసిత్ (అభివృద్ధి చెందిన) భారత్‌గా మారేందుకు మీ ప్రభుత్వం దృష్టి సారించే కీలకాంశాలు ఏమిటి?

జ: మీరు నిశితంగా గమనిస్తే మన ప్రస్తుత కాలానికి చరిత్రలో పోల్చదగిన కాలం ఉంది. వంద సంవత్సరాల క్రితం స్వాతంత్ర్యం గురించి ఆశావాదం ఉండేది. 1922 నుంచి 1947 వరకు ప్రతి ఒక్కరూ స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకోవాలనుకున్నారు. కొందరు ఖాదీ వడకడం ద్వారా, మరికొందరు వివిధ ఉద్యమాల్లో పాల్గొనడం ద్వారా ఇలా ప్రజలు తమకు తోచిన విధంగా సహకరించారు. రాబోయే 25 ఏళ్లు దేశానికి అత్యంత కీలకం. మనం వందేళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకొనే నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ఆశావాదం ప్రజలలో నేను చూస్తున్నాను. ఈ శక్తే నా చోదక శక్తి. మనం జ్ఞాన్ పై దృష్టి పెట్టి దానిని గౌరవిస్తే అభివృద్ధి చెందిన దేశంగా మారతాం. ఇక్కడ జ్ఞాన్ అంటే జీవైఏఎన్ (GYAN). జి అంటే గరీబ్, వై అంటే యువత, ఏ అంటే అన్నదాత, ఎన్ అంటే నారీశక్తి. భారతదేశానికి జనాభాపరమైన ప్రయోజనం ఉంది. ఈ ప్రయోజనాన్ని ఉత్పాదకత, ఆర్థిక వృద్ధిగా మార్చుకోవాలి.

ప్ర. మీరు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రధానమంత్రిగా 22 ఏళ్లుగా కీలక నాయకత్వ పదవుల్లో ఉన్నారు. మీరు నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలు, మీ విజయానికి సూత్రాలు చెబుతారా?

జ: నా విజయాలు బహిరంగ రహస్యమే. అలాగే నా ప్రయత్నాలు కూడా అందరికీ అందుబాటులోనే ఉన్నాయి. కనుక వీటి ఆధారంగా ప్రజలు విజయ సూత్రాలపై నిర్ధారణలకు రావచ్చు. నా సూత్రం ఒక్కటే: దేశం ముందు. కార్యకర్తగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా నేను చేసిన ప్రతిదానిలోనూ దేశానికి మొదటి స్థానం ఇచ్చాను. నేను తీసుకున్న ప్రతి నిర్ణయం దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నదే. నేను కష్టమైన నిర్ణయం ఎలా తీసుకున్నానని తరచుగా ప్రజలు నన్ను అడుగుతారు. నా నిర్ణయాలన్నీ ‘దేశం ముందు’ అనే దృక్కోణంతో తీసుకోవడం వల్ల నాకు ఇది కష్టంగా అనిపించదు.