అణచివేతకు గురైన హిందువులకు ఆశ్రయం
పాకిస్తాన్ నిర్మాతలలో జోగేంద్రనాథ్ మండల్ ఒకరు. ఆయన పాకిస్తాన్ మొదటి న్యాయ, కార్మిక శాఖా మంత్రిగా పని చేశారు. తన పదవికి రాజీనామా చేస్తూ రాసిన లేఖలో ఆయన తూర్పు పాకిస్తాన్ లో షెడ్యూల్డు కులాల వారిపై ప్రభుత్వం మద్దతు, ప్రోత్సాహంతో జరిగిన అనేక దాడులు, దౌర్జన్యాలను వివరించారు. “సాయుధ పోలీసులు వచ్చారు. స్థానిక ముస్లింలు కూడా వారితో చేరారు. వారు నామశూద్రుల ఇళ్లపై దాడి చేయడమే కాకుండా స్త్రీ పురుషులను నిర్దాక్షిణ్యంగా కొట్టి, వారి ఆస్తులను ధ్వంసం చేసి, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. గర్భిణి అన్న కనికరం లేకుండా విచక్షణారహితంగా కొట్టడంతో ఒక మహిళకు అక్కడికక్కడే గర్భస్రావం అయింది. స్థానిక అధికార యంత్రాంగపు ఈ క్రూరమైన చర్య ఆ ప్రాంతం అంతటా ప్రజలను భయాందోళనలకు గురిచేసింది,” అని ఆయన పేర్కొన్నారు. ఆ తరువాత 1979లో మరిచ్‌ఝాపి, సుందర్‌బన్స్‌లో దళితులపై జరిగిన ఊచకోతలు, 2024లో సందేశ్‌ఖాలీలో దళితులపై జరిగిన హత్యాకాండలు ఈ ప్రాంతంలోని సామాజికంగా బలహీనమైన వర్గాలపై జరిగే వ్యవస్థాగత దౌర్జన్యాలకు నిదర్శనం. సందేశ్‌ఖాలీలో దౌర్జన్యకాండ నిందితుల్లో ఒకరైన షాజహాన్ షేక్ కూడా రాష్ట్రంలోని అధికార పార్టీ ఆధ్వర్యంలో ఎస్సి/ఎస్టి వర్గాలకు చెందిన మహిళలపై హింసకు పాల్పడ్డారు. అందువల్ల, అధికార సాధన కోసం కొందరు రాజకీయ బేహారులు తరచుగా ప్రవచించే దళిత-ముస్లిం ఐక్యతకు చారిత్రక నేపథ్యం ఏమీ లేదు. భారత ఉపఖండంలో దళితులు, ఇతర అట్టడుగు వర్గాలను ఎలా చూశారన్న దానిపై అధ్యయనం అవసరం.
‘పౌరసత్వ (సవరణ) చట్టం 2019’ అమలుకు విధివిధానాలను ప్రకటించాలన్న కేంద్ర హోంశాఖ నిర్ణయాన్ని చారిత్రక దృక్పథంతో చూడాలి. 1947లో భారతదేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్‌లో హిందువుల జనాభా దాదాపు 24 శాతం. నేడు అది 1 శాతం కూడా లేదు. 1947లో తూర్పు పాకిస్థాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) లో హిందువుల జనాభా 30 శాతం. ఇప్పుడది దాదాపు 7 శాతం. వారు ఎలా అదృశ్యమయ్యారు? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో హింసకు గురైన మైనారిటీల గురించి ఎటువంటి మానవ హక్కుల చర్చ అంతర్జాతీయంగా గాని, దేశంలో గాని అసలు లేకపోవడం ఒక కఠోర వాస్తవం. హిందూ అమెరికన్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం, “పాకిస్తాన్ లో హిందూ బాలికలను అపహరించడం, బలవంతంగా మతమార్పిడి చేయడం ప్రబలంగా ఉంది. (పాకిస్తాన్‌లో ఏటా దాదాపు 1,000 మంది హిందూ, క్రైస్తవ బాలికలను కిడ్నాప్ చేసి, ఇస్లాంలోకి మార్చారు). 2004-18 మధ్యకాలంలో ఒక్క సింధ్ రాష్ట్రంలోనే 7,430 హిందూ బాలికల కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. నిజానికి అసలు సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.” దళితులు, గిరిజన వర్గాలకు సముచితంగానే ఇప్పుడు దేశ రాజకీయాల్లో తగిన ప్రాధాన్యం లభిస్తోంది. అయితే వారి పట్ల రాజకీయ పార్టీలు గతంలో అనుసరించిన వైఖరిపై మరింత విస్తృతమైన చర్చ అవసరం.
ప్రధానంగా ఇస్లామిక్ ఛాందసవాదం, మతపరమైన హింస కారణంగా, ప్రాణాలు అరచేత పట్టుకుని సరిహద్దులు దాటి దేశంలోకి వచ్చి మాతృదేశం అంటూ ఒకటి లేకుండా దుర్భర జీవితం గడుపుతున్న ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు ప్రభుత్వం సీఏఏ నిబంధనలు ప్రకటించింది. ఒక ప్రముఖ భారతీయ వార్తాపత్రిక, “పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న 5,764 అర్హత గల కుటుంబాలలో 70 శాతం మంది దళితులే,” అని వెల్లడించింది. మన రాజ్యాంగ బాధ్యతను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ, దాని సీనియర్ నాయకత్వం వ్యతిరేకించడం చాలా దిగ్భ్రాంతి కలిగించే విషయం. దళిత సమస్యలపై సీనియర్ న్యాయవాది నితిన్ మెష్రామ్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు: “బాబాసాహెబ్ అంబేద్కర్‌ను ఎన్నుకుని, అణగారిన వర్గాలను ఉద్ధరించడానికి రాజ్యాంగ సభకు పంపిన బెంగాల్ ప్రజలు దాదాపు 75 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు భారత పౌరసత్వాన్ని పొందుతారు. భారతదేశంలోని బహుజన సమాజానికి ఇంతకంటే మంచి వార్త మరొకటి ఉండదు.” అమెరికా, బ్రిటన్ వంటి పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాలలో ఇటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఇక్కడ హింసకు గురైన మైనారిటీలకు పౌరసత్వం ఇచ్చే విషయంలో ప్రాధాన్యత ఇస్తారు. అమెరికా సెనేటర్ ఫ్రాంక్ లాటెన్‌బర్గ్ 1989-90లో సోవియట్ యూనియన్, ఇరాన్‌లలో అణచివేతకు గురైన మైనారిటీలకు పౌరసత్వం ఇవ్వాలన్న ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన తెచ్చిన సవరణ ప్రకారం, ఇరాన్ నుంచి వలస వచ్చిన క్రైస్తవులు, బహాయిలు, యూదుల వంటి మైనారిటీ వర్గాలకు చెందిన వ్యక్తులకు, ప్రధానంగా అణచివేతకు గురవుతున్నారన్న కారణంతో ముందు ఆశ్రయం, ఆ తర్వాత పౌరసత్వం కల్పిస్తున్నారు.
బ్రిటన్ లో ‘జాతీయత, సరిహద్దుల చట్టం’ బానిసత్వం, మానవ అక్రమ రవాణా బాధితులతో సహా అణచివేతకు గురైన వ్యక్తులకు జాతీయతను, ఆశ్రయాన్ని, వలస హక్కులను కల్పిస్తుంది. ప్రభుత్వం మద్దతుతో జరిగే అణచివేతకు గురైన హిందువులు రక్షణ కోసం ఎక్కడికి వెళతారు? భారతదేశం హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, అనేక ఇతర విశ్వాసాలను అనుసరించే ప్రజలకు సహజ నివాసం. ఈ సకారాత్మక చట్టంపై ప్రతిపక్ష పార్టీల తప్పుడు ప్రచారం, వ్యతిరేకతకు అర్ధమే లేదు. న్యాయ విద్యార్థిగా, పరిశోధకుడిగా ఒక ముస్లిం వలసదారుడు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడాన్ని నిరోధించే నిబంధన ఒక్కటీ ఇంతవరకు నాకు ఈ చట్టంలో కనిపించలేదు.
డిసెంబర్ 31, 2014 తేదీ తర్వాత భారతదేశానికి వచ్చిన ఎవరైనా, వారి మత విశ్వాసాలతో సంబంధం లేకుండా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారి పట్ల మన చట్టాల్లో ఎక్కడా వివక్ష లేదు. రాహుల్ గాంధీ బహిరంగ విలేకరుల సమావేశాల్లో విలేకరులను వారి కులం గురించి అడుగుతారు. కానీ పాకిస్తాన్‌లో అణచివేతకు గురవుతున్న మైనారిటీ మతాలకు చెందిన ప్రజల కులాన్ని పట్టించుకోరు. ఇది పేరుకే ప్రతిపక్షం. లాలూ ప్రసాద్, అఖిలేష్ యాదవ్ వెనకబడిన వర్గాల గురించి మాట్లాడతారు. కానీ వారి కుటుంబాల రాజకీయ స్వప్రయోజనాలను దాటి ఎప్పుడోగాని ముందుకు వెళ్ళరు.
గురు ప్రకాష్,
బిజెపి జాతీయ అధికార ప్రతినిథి