నెహ్రూ కాలం నుంచి లేటరల్ ఎంట్రీ
లేటరల్ ఎంట్రీ విధానంలో 45 మంది మధ్యస్థాయి నిపుణులను ఉద్యోగాల్లోకి తీసుకోవడంపై రాజకీయ వివాదం చెలరేగడంతో ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రిజర్వేషన్లను, సామాజిక న్యాయ సూత్రాలను నీరుగార్చేందుకు లేటరల్ ఎంట్రీ ఒక కుట్ర అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రాద్ధాంతం చేశారు. అయితే 1950వ దశకంలో నెహ్రూ పారిశ్రామిక నిర్వహణ పూల్ ప్రయోగం నుంచి ఐజి పటేల్, మన్మోహన్ సింగ్, వి కృష్ణమూర్తి, మాంటెక్ సింగ్ అహ్లువాలియా, ఆర్‌వి షాహి వంటి నిపుణులను నియమించడం వరకు ప్రభుత్వం మొదటి నుంచి లేటరల్ ఎంట్రీ విధానాన్ని అనుసరిస్తూనే ఉంది. అయితే చాలావరకు ఇది సీనియర్ పోస్టులకు మాత్రమే పరిమితమై ఉంది. ఆనాడు ప్రభుత్వం బిమల్ జలాన్, విజయ్ కేల్కర్, రాకేష్ మోహన్‌లను నియమించుకోడానికి ఆర్థికవేత్తల లేమి కారణమైతే, ఇప్పుడు ప్రభుత్వం జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్ల నియామకానికి ఉపక్రమించడానికి సాంకేతికత, పర్యావరణం వంటి రంగాలకు సంబంధించిన నిపుణుల కొరత కారణమని తాజా యూపీఎస్సీ ప్రకటన సూచిస్తోంది. సివిల్ సర్వీస్ వ్యవస్థలో అవసరమైన రంగాలలో నిష్ణాతులైన వారినే ఎంపిక చేసుకునే అవకాశం లేదు.
1959లో నాటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పారిశ్రామిక నిర్వహణ పూల్ ను ప్రారంభించారు. మంతోష్ సోధి వంటివారు ప్రభుత్వంలో చేరడానికి ఇది అవకాశం కల్పించింది. ఆయన తర్వాత భారీ పరిశ్రమల కార్యదర్శి అయ్యారు. బీహెచ్ఇఎల్, సెయిల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను విజయవంతంగా నడిపించిన వి కృష్ణమూర్తి, భారీ పరిశ్రమల కార్యదర్శిగా లేటరల్ ఎంట్రీ ద్వారానే నియమితులయ్యారు. అదేవిధంగా డివి కపూర్ మూడు మంత్రిత్వ శాఖలకు, విద్యుత్, భారీ పరిశ్రమలు, రసాయనాలు & పెట్రోకెమికల్స్ కు సారథ్యం వహించారు. అంతకుముందు, 1954లో ఐజి పటేల్ ఐఎంఎఫ్ నుంచి డిప్యూటీ ఎకనామిక్ అడ్వైజర్‌గా చేరారు. తరువాత ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి, ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేశారు. 1971లో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరి ఆ తర్వాత అనేక ఇతర బాధ్యతలు నిర్వర్తించారు. జనతా ప్రభుత్వ హయాంలో రైల్వే ఇంజనీర్ అయిన ఎం మెనెజెస్ రక్షణ ఉత్పత్తి కార్యదర్శిగా చేరారు.
రాజీవ్ గాంధీ కేరళ ఎలక్ట్రానిక్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కెపిపి నంబియార్‌ను ఎలక్ట్రానిక్స్ కార్యదర్శిగా నియమించారు. సామ్ పిట్రోడా సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సి-డాట్)కి సారథ్యం వహించారు. 2002లో వాజ్‌పేయి ప్రభుత్వం ఆర్‌వి షాహీని ప్రైవేట్ రంగం నుంచి విద్యుత్ శాఖ కార్యదర్శిగా తీసుకుంది. 1980లు, 1990లలో ప్రభుత్వంలో చేరిన పలువురు ఆర్థికవేత్తలు అదనపు కార్యదర్శి స్థాయిలో నియమితులై ఆ తర్వాత కార్యదర్శి స్థాయి పదవులను చేపట్టారు.