RSS

వందేళ్ల ఆర్ఎస్ఎస్: దేశభక్తికి పునరుజ్జీవం

వేల సంవత్సరాల నాగరికత భారతదేశానికి ప్రధానమైన గుర్తింపు. ఒక జాతికి ఎప్పుడూ సంస్కృతి అనేది పునాది. భారత జాతీయవాదం కూడా మౌలికంగా సాంస్కృతికమైనది. దురదృష్టవశాత్తు స్వాతంత్ర్యానికి ముందు, స్వాతంత్య్ర సమరం సమయంలోను, స్వాతంత్య్రం అనంతరం జరిగిన పరిణామాల ఫలితంగా సంస్కృతి ప్రాశస్త్యాన్ని తిరస్కరించటం ఒక అలవాటుగా మారింది. ఈ నిరాకరణ ప్రమాదకరమైన పర్యవసానాల్లో చరిత్ర వక్రీకరణ, సంప్రదాయాలకు తప్పుడు భాష్యాలు చెప్పడం, భారతదేశ సంస్కృతిలో భాగంగా చేయడానికి సాధ్యం కాని అంశాలను అందులో భాగం చేయాలని చూడటం ఉన్నాయి. జాతీయవాదాన్ని విస్మరించడంతో లేదా ఒక అప్రధానమైనదిగా చిత్రీకరించడంతో కొన్ని వర్గాలు దేశభక్తిని ఒక చాదస్తంగా, సంకుచిత ధోరణిగా, కాలం చెల్లిన భావనగా, రాజకీయ అపభ్రంశంగా చూస్తున్నాయి. దీనివల్ల మన అందరిని మానసికంగా ఒకటి చేసే భావోద్వేగాలు ఆవిరయిపోతున్నాయి. భారత్ మొదటి నుంచి ఒక సమైక్య దేశం కాదని, వివిధ ప్రాంతాలు వర్గాల ప్రజల సమ్మేళనం మాత్రమేనని మనల్ని నమ్మించాలని అనేకమంది ప్రయత్నించారు. అనేక ముక్కలను కలిపి కుట్టిన వస్త్రంగా భారతదేశం మ్యాప్ కనిపిస్తుందని వారు చెబుతారు. అయితే ఏటికి ఎదురీది ఒక సంస్థ మాత్రం దేశభక్తి పతాకాన్ని చేతబట్టి అచంచలంగా, దృఢంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది- అదే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్.

ఈ దసరా ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రత్యేకమైనది, ఎందుకంటే ఈ ఏడాది ఆర్ఎస్ఎస్ 100వ సంవత్సరంలోకి ప్రవేశించింది. భారత్‌కు పునాది అయినా సంస్కృతీ సంప్రదాయాలను ప్రజలకు గుర్తు చేస్తూ జాతీయ సమగ్రత సామాజిక సామరస్యానికి సంబంధించిన అంశాలపై నిరంతరం పనిచేస్తూ ప్రజలను జాగృతం చేసే ఆర్ఎస్ఎస్ వందేళ్లు పూర్తి చేసుకోవడం నిజంగా గొప్ప చారిత్రక సందర్భం. ఆర్ఎస్ఎస్ విజయం అసాధారణమైనది. మొదటిగా, ఆర్ఎస్ఎస్ కారణంగా దేశభక్తి ఒక మౌలిక విలువగా మారింది. లక్షలాది ప్రజలు చేయిచేయి కలిపి సమైక్యంగా ముందుకు సాగటానికి ఈ భావన దోహదం చేసింది. దేశభక్తి అంటే జెండా ఎగరవేయడం, దేశభక్తి గీతాలను ఆలపించడం లేదా జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞలు చేయడం కాక దైనందిన జీవితంలో దేశభక్తి ప్రతిబింబించాలన్న చైతన్యాన్ని ఆర్ఎస్ఎస్ ప్రజల్లో నింపింది. సామాజిక, సాంస్కృతిక, ప్రవర్తనాత్మక, ఆర్థిక దేశభక్తి ద్వారా ఆర్ఎస్ఎస్ బహుముఖ దేశభక్తి భావనను పెంపొందించింది. రెండవది, ప్రజలను కలిపి ఉంచే శక్తి సాంస్కృతిక దేశభక్తికి ఉందని ప్రజలు గ్రహించేటట్లు ఆర్ఎస్ఎస్ చేసింది. భారత్ భిన్నత్వంలో ఏకత్వానికి నిలయమైనప్పటికీ అనేకమంది దీనిని మొదట అసలు ఒకే దేశం కాదని భిన్న రాజ్యాల సమాహారం అని చెప్పడానికి ఉపయోగించుకున్నారు. వాస్తవ చరిత్రను తలకిందులు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆర్ఎస్ఎస్, జాతీయ సమగ్రత కోసం పాటుపడే ఇంకా అనేక ఇతర సంస్థల కృషి ఫలితంగా నేడు దేశ ప్రజలు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద బాధితుల గురించి లేదా బీహార్లో వరద బాధితుల గురించి సమానంగా సహానుభూతి చెందుతున్నారు.

సాంస్కృతిక దేశభక్తి ఒక వ్యక్తి తన సొంత అస్తిత్వం లేదా గుర్తింపు పట్ల గర్వించేటట్లు చేస్తుంది. సామాజిక శాస్త్రవేత్తలు నేడు గుర్తింపును ఒక ఆదిమ భావనగా పరిగణించడం లేదు. ప్రజలను ఏకం చేసే శక్తిగా దాని ప్రాధాన్యాన్ని వారు గుర్తిస్తున్నారు. ప్రపంచంలో అనేక సంస్కృతులు పాశ్చాత్య సంస్కృతి వెల్లువలో కొట్టుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ప్రబోధించే సాంస్కృతిక దేశభక్తి భిన్న సాంస్కృతిక గుర్తింపులను పరిరక్షించి, వైవిధ్యంలోని సౌందర్యాన్ని కాపాడుతుంది. భాష నుంచి వంటల వరకు, ఫ్యాషన్ నుంచి వాస్తుకళ వరకూ ప్రపంచ దేశాలు పాశ్చాత్య దేశాలను అనుసరిస్తూ పోతే తప్పకుండా ప్రపంచం తన ఆకర్షణీయతను కోల్పోతుంది. ఆర్ఎస్ఎస్ ప్రోత్సహించే మూడో రకం దేశభక్తి పౌరుల్లో దేశభక్తి. దీనికి రెండు కోణాలు ఉన్నాయి. మొదటిది ఆర్ఎస్ఎస్ పౌరుల సామాజిక బాధ్యత గురించి బోధిస్తుంది. సమాజానికి తాము రుణపడి ఉన్నాము అనే భావనను వారిలో పెంపొందిస్తుంది. రెండోది, పౌరుల్లో చట్టం పట్ల గౌరవాన్ని, విలువల గురించి స్పృహను పెంపొందిస్తుంది. వారు నైతిక విలువలకు కట్టుబడి జీవించేటట్లు చేస్తుంది. ఆర్ఎస్ఎస్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో సంస్థలు పని చేస్తున్నాయి. కానీ వాటిలో ఎక్కడా ఆశ్రితపక్షపాతం కనిపించదు. పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందన్న ఆరోపణలు మనకు వినిపించవు. సామాన్య ప్రజల్లో బలమైన నైతిక స్పృహను పెంపొందించేందుకు ఆర్ఎస్ఎస్ తన సొంత పద్ధతిలో కృషి చేస్తుంది. తద్వారా వారి జీవితాలకు అర్థం కల్పిస్తుంది.

ఇక్కడే ఆర్ఎస్ఎస్ ప్రవచించే నాలుగో రకం దేశభక్తి ప్రాధాన్యం స్పష్టమవుతుంది. ఇది నిర్వహణాత్మక లేదా సంస్థాగత దేశభక్తి. గత అనేక దశాబ్దాలలో సంఘ్ సంస్థాగత నిర్వహణకు సంబంధించి తన సొంత శాస్త్రాన్ని అభివృద్ధి చేసుకుంది. ‘ప్రాథమికంగా అందరూ సమానమే, ఎవరు సంస్థ కంటే గొప్పవారు కాదు’ అనేది దీని మౌలిక సిద్ధాంతం. వ్యక్తులు ఎలాంటి వారైనా వారిని స్వీకరించి వారు ఎలా ఉండాలో ఆ విధంగా వారిని తీర్చిదిద్దాలి అన్నది సంఘ్ సూత్రం. చారిత్రకంగా సంఘ్ లో అభివృద్ధి చెందిన ‘కార్య పద్ధతి’ లేదా నిర్వహణశైలి విశిష్టమైనది. పరిస్థితులకు అనుగుణంగా కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోగల, కొత్త తరాల వారిని మిత్రులుగా చేసుకోగల, తన మౌలిక భావజాలం విషయంలో ఎటువంటి రాజీ లేకుండా కొత్త వ్యవస్థలను అభివృద్ధి చేసుకునే స్థితిస్థాపకతను ఆర్ఎస్ఎస్ సాధించింది.

భరతమాత మాదిరిగా ఆర్‌ఎస్‌ఎస్‌కు వయసు పెరిగినప్పటికీ వృద్ధాప్యం రాదు. నామమాత్రపు సమానత్వం కంటే ఎన్నో రెట్లు ఉన్నతమైన సామాజిక సామరస్యత ఆర్ఎస్ఎస్ ప్రబోధించే సామాజిక దేశభక్తి. ఆర్ఎస్ఎస్ మూడవ సర్ సంఘ్ చాలక్ బాలా సాహెబ్ దేవరస్ కుల వివక్ష పూర్తిగా అంతం కావాల్సిందేనని నిర్మొహమాటంగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన ఆర్ఎస్ఎస్ గురించి కొద్ది మందిలో ఉన్న అపోహలను సమూలంగా తొలగించే ప్రయత్నం చేశారు. ఇక ఆర్ఎస్ఎస్ ప్రోత్సహించే చివరి, బహుశా ముఖ్యమైన దేశభక్తిని ‘సేవా దేశభక్తి’ లేదా ‘మానవతా దేశభక్తి’గా అభివర్ణించవచ్చు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రేయింబవళ్ళు సహాయ, పునరావాస కార్యకలాపాలలో పాల్గొనని విపత్తు ఒకటి కూడా స్వాతంత్య్ర అనంతరం భారత దేశంలో జరగలేదు. హిమాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు, అస్సాం నుంచి కేరళ వరకు ఎక్కడ వరదలు వచ్చినా, కరువులు వచ్చినా, భూకంపాలు వచ్చినా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సహాయ, పునరావాస కార్యక్రమాలలో ముందు వరుసలో ఉంటారు.

అనేక సందర్భాల్లో ప్రజలు హిందుత్వ గురించి సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. కానీ ఇక్కడ కూడా ఆర్ఎస్ఎస్ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. హిందుత్వ హిందూ భావన. ప్రజాస్వామ్యం ప్రతి హిందువు రక్తం లోనే ఉంది. నా ఉద్దేశంలో హిందుత్వ విశాల హృదయానికి పర్యాయపదం. ఉదాహరణకు సంఘ్ ను నిషేధించిన వారి విషయంలో ఆర్ఎస్ఎస్ వ్యవహరించిన తీరును గమనించండి. ఇందిరా గాంధీ ప్రభుత్వం చేతిలో అణిచివేతకు గురై నిర్బంధాన్ని అనుభవించిన బాలా సాహెబ్ దేవరస్ జైలు నుంచి విడుదలైన తర్వాత ‘కంటికి కన్ను’ సిద్ధాంతం ఎవరికీ మేలు చేయదని స్పష్టంగా ప్రకటించారు. “మన పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వారి హృదయాలలో మనం మార్పు తీసుకురావాలి,” అని 1977 మార్చిలో నాగపూర్ లో బాలాసాహెబ్ పేర్కొన్నారు. ఇవన్నీ ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలను జాతీయ పునర్నిర్మాణ పర్వదినంగా జరుపుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తాయి. లక్షల మంది కార్యకర్తల దేశభక్తి స్ఫూర్తితో తన బహుముఖ సేవల ద్వారా ఆర్ఎస్ఎస్ దేశభక్తిని విజయవంతంగా ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చింది.

వినయ్ సహస్రబుద్దే