Hamara Sankalp Vikasit Bharat

బిజెపి తెలంగాణ అధ్యక్షుల వారి సందేశం

G Kishan Reddyజనసందేశ్ పాఠకులకు నమస్కారం…

ముగ్గురు ఎంపీలతో జనసంఘ్ రూపంలో మొదలైన ప్రస్థానం కాలక్రమంలో భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. ఈ పురోగతిలో పార్టీకి చెందిన ప్రచార సాధనాలు మరియు పత్రికలు పోషించిన పాత్రను విస్మరించలేం. పార్టీ సిద్ధాంతాలను, పార్టీ నాయకుల ఆలోచన విధానాలను పార్టీ కార్యకర్తలకు చేరవేసి దేశం కోసం ధర్మం కోసం ప్రజల కోసం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల నిర్మాణంలో పార్టీ పత్రికల పాత్ర కూడా విశేషమైనది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలను, విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలపై ధర్నాలు, ఆందోళనల రూపంలో నిరసన తెలపడం…. ఇందుకు నిత్యం విభిన్న రూపాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం ఒక రాజకీయ పార్టీగా మా బాధ్యత. అంతేకాదు, స్థానికం నుంచి అంతర్జాతీయాంశాల వరకు పార్టీ విధానాలు అభిప్రాయాలు వెల్లడిస్తూ ఉంటాం. ఇవన్నీ సరైన సమయంలో, సరైన రూపంలో, సరైన దృక్పథంతో ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. నేడు జర్నలిజం వ్యాపారమయంగా మారిన దురదృష్టకర పరిస్థితుల్లో వక్రీకరణలు, దురుద్దేశ్యాలు ఆపాదించడం, ఉన్నది తొక్కిపెట్టడం, లేనిది ఉన్నట్టు చూపెట్టడం, గోరంతలు కొండంతలు చేయడం వంటి వికృత పోకడలు పత్రికారంగంలో ప్రవేశించాయనడం ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా గందరగోళానికి గురవుతున్న నేపథ్యంలో వాస్తవాలను వారికి చేరవేసేందుకు, సరైన సమయంలో సరైన సందేశాన్ని అందించేందుకు జాతీయ స్థాయిలో బిజెపి ‘‘కమల్ సందేశ్’’ రూపంలో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పత్రికలను తీసుకొచ్చింది. తెలుగు పాఠకులకు, ఇక్కడి కార్యకర్తలకు పార్టీ సందేశాన్ని మరింత చేరువ చేయాలన్న ఉద్దేశ్యంతో నాడు ఉమ్మడి రాష్ట్రంలో బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తెలుగులో “జనసందేశ్” పక్ష పత్రికను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. 1991 నవంబర్ 25న ప్రారంభమై, అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, బిజెపి కార్యకర్తల కృషితో పాఠకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంటూ మూడున్నర దశాబ్దాలుగా తన ప్రస్థానాన్ని నిరాటంకంగా కొనసాగించింది ‘‘జనసందేశ్’’. ఈ క్రమంలో, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, నేను మొదటిసారి పార్టీ అధ్యక్షుడైనప్పుడు బ్లాక్ అండ్ వైట్ టాబ్లాయిడ్ నుంచి కలర్ పేజీల మ్యాగజైన్ గా రూపాంతరం చేశాము. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చొరవతో దేశంలో డిజిటల్ విప్లవం తాలూకూ ఫలితాలు మూరుమూల పల్లెలకు సైతం చేరుతున్న ప్రస్తుత తరుణంలో ‘‘జనసందేశ్’’ పత్రికను కూడా డిజిటల్ రూపంలో తీసుకొస్తున్నాం. ఇకపై www.bjpjanasandesh.org వెబ్ సైట్ లో జనసందేశ్ సంచికలను డిజిటల్ రూపంలో ప్రచురించనున్నాం. ప్రజలకు మరింత చేరువ కావాలన్న సదుద్దేశ్యంతో జనసందేశ్ డిజిటల్ ఎడిషన్ మీ ముందుకు వస్తుంది. ఇప్పుడు పత్రిక అందలేదన్న బాధ ఉండదు, మరచిపోయామన్న సమస్య ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు…. మీ కంప్యూటర్ లో, లేదా మీ మొబైల్ ఫోన్ లో, ట్యాబ్ లో జనసందేశ్ డిజిటల్ ఎడిషన్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందులానే పార్టీకి సంబంధించిన సమస్త సమాచారం, సమకాలీన రాజకీయాంశాలపై విశ్లేషణలు, నాయకుల ఇంటర్వ్యూలు, సైద్ధాంతిక విషయాలు, మహనీయుల జీవితగాథలపై ఆసక్తికర కథనాలను సరళమైన భాషలో చదువుకోవచ్చు. మార్పును అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే బిజెపి కార్యకర్తలు మా ఈ ప్రయత్నాన్ని హృదయపూర్వకంగా స్వాగతించి, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ విషయాన్ని మన పార్టీ కార్యకర్తలతో పాటు పార్టీ అభిమానులు, మద్దతుదారులు, మిత్రులు, బంధువులు మరియు ప్రతి ఒక్కరికీ తెలియజేసి పెద్ద ఎత్తున జనసందేశ్ డిజిటల్ పత్రికను తమ తమ సెల్ ఫోన్ లలో డౌన్ లోడ్ చేసుకోని చదివేవిధంగా ఒక ఉద్యమంలా విసృత స్థాయిలో ప్రతి కార్యకర్తా కృషి చేయాలని కోరుకుంటూ…

   మీ

కిషన్ రెడ్డి

జనసందేశ్ గురించి

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రచురితమవుతున్న తెలుగు సామాజిక, రాజకీయ పక్షపత్రిక జనసందేశ్. 25 నవంబర్ 1991న ప్రారంభమైన ఈ పత్రిక నిరాటంకంగా కొనసాగుతోంది. పార్టీకి సంబంధించిన సమస్త సమాచారంతో పాటు, సమకాలీన రాజకీయాంశాలపై విశ్లేషణలు, నాయకుల ఇంటర్వ్యూలు, సైద్ధాంతిక విషయాలు, మహనీయుల జీవితగాథలపై ఆసక్తికర కథనాలను సరళమైన భాషలో ప్రచురిస్తూ పాఠకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంటూ వస్తుంది. మూడున్నర దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఈ పత్రిక ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ బిజెపి కార్యకర్తలకు హస్తభూషణంగా మారింది. ఈ క్రమంలో మరింత ఆధునికంగా, మరింత ఆకర్షణీయంగా, మరింత సమాచారంతో ‘‘జనసందేశ్’’ డిజిటల్ రూపంలో పాఠకుల ముందుకు వచ్చింది. బిజెపి కార్యకర్తలు, జనసందేశ్ పాఠకులు ఇప్పుడు ఎక్కడ ఉన్నా తమ మొబైల్ ఫోన్ లో, ల్యాప్ టాప్ లో, కంప్యూటర్ లో క్షణాల్లో పత్రికను చదవవచ్చు, అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. మా ఈ ప్రయత్నాన్ని నిండుమనసుతో ఆదరిస్తారని విశ్వసిస్తున్నాం.