అమల్లోకి వచ్చిన పౌరసత్వ (సవరణ) చట్టం
‘పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ), 2019’ను దేశమంతటా అమలు చేయడానికి చట్టాన్ని తెచ్చిన నాలుగేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం విధివిధానాలను మార్చి 12న ప్రకటించింది. తొమ్మిది రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఇది ఇప్పటికే అమల్లో ఉంది. నిబంధనల ప్రకటన ఫలితంగా దేశంలోని మిగిలిన ప్రాంతాలలోని పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం ఇచ్చే ప్రక్రియ వేగవంతం అవుతుంది.
ఇప్పటికే ఎక్కడెక్కడ అమల్లో ఉంది?
పౌరసత్వ చట్టం, 1955 ప్రకారం ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం మంజూరు చేయడానికి తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 31 జిల్లా మేజిస్ట్రేట్లు, హోంశాఖ కార్యదర్శులకు ప్రభుత్వం 2022 నుంచి అనుమతి ఇచ్చింది. ఈ తొమ్మిది రాష్ట్రాలు గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, దిల్లీ, మహారాష్ట్ర. కేంద్ర హోంశాఖ 2021-22 వార్షిక నివేదిక ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ల నుంచి ఈ ముస్లిమేతర మైనారిటీ మతాలకు చెందిన కనీసం 1,414 మంది విదేశీయులకు సవరించిన పౌరసత్వ చట్టం, 1955 ప్రకారం రిజిస్ట్రేషన్ లేదా సహజీకరణ ద్వారా భారత పౌరసత్వం ఇచ్చారు.
అమలు ఎందుకు ఆలస్యమైంది?
దేశవ్యాప్తంగా చట్టం అమలు ప్రధానంగా రెండు కారణాల వల్ల ఆలస్యమైంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో సామూహిక నిరసనలు చెలరేగడం, ఆందోళనకారులు, అధికారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడం, మార్చి 2020లో భారతదేశాన్ని తాకిన కోవిడ్-19 మహమ్మారి ప్రభావం దీనికి కారణాలు. రాష్ట్రపతి ఆమోదం పొందిన ఆరు నెలలలోపు ఏదైనా చట్టానికి సంబంధించిన నియమనిబంధనలను రూపొందించాలని లేదా లోక్‌సభ, రాజ్యసభలోని సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీల నుంచి పొడిగింపు కోరాలని పార్లమెంటరీ కార్యకలాపాల నియమావళి చెబుతోంది. 2020 నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు దీనికోసం గడువు పొడిగింపును కోరుతూ వస్తోంది.
ఇప్పుడు ఏం జరుగుతుంది?
మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి దరఖాస్తుదారుల సౌలభ్యం కోసం కేంద్ర హోంశాఖ ఒక పోర్టల్‌ను రూపొందించింది. దరఖాస్తుదారులు తాము ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించిన సంవత్సరాన్ని ప్రకటించవలసి ఉంటుంది. మూడు పొరుగు దేశాలకు చెందిన పత్రాలు లేని మైనార్టీలకు సీఏఏ కింద ప్రయోజనాలు కల్పిస్తామని చట్టం చెబుతోంది.
సీఏఏ వర్తించని ప్రాంతాలు
సీఏఏ ద్వారా సవరణలు రాజ్యాంగం ఆరవ షెడ్యూల్ పరిధిలో ఉన్న ప్రాంతాలకు వర్తించవు. ఇవి అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరంలలోని స్వయంప్రతిపత్తిగల గిరిజన-ప్రాబల్య ప్రాంతాలు. అంటే మతం ఆధారంగా ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ల నుంచి గుర్తించబడిన మతాలకు చెందిన వలసదారులు ఈ ప్రాంతాలలో నివసిస్తున్నట్లయితే వారికి భారత పౌరసత్వం ఇవ్వబడదు. అంతర్గత-హద్దు అనుమతి (ఇన్నర్ లైన్ పర్మిట్ లేదా ఐఎల్పి) వ్యవస్థ అమల్లో ఉన్న రాష్ట్రాలకు కూడా సీఏఏ వర్తించదు. ఇది ప్రధానంగా ఈశాన్య భారతదేశంలో అమల్లో ఉంది. ఐఎల్పి అనేది స్థానికేతరులు ఈ రాష్ట్రాల్లోకి ప్రవేశించడానికి, పరిమిత కాలం పాటు ఉండడానికి అవసరమైన ప్రత్యేక అనుమతి. ఐఎల్పి వ్యవస్థ అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్, మణిపూర్, లక్షద్వీప్, హిమాచల్ ప్రదేశ్లలో ఉంది.
సీఏఏతో వచ్చే మార్పులేమిటి?
పౌరసత్వ చట్టం, 1955, లోని నిబంధనలు భారతదేశంలో అక్రమ వలసదారులను నిరోధించాయి. చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించిన లేదా చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రంతో ప్రవేశించి, ఇచ్చిన గడువుకు మించి ఇక్కడే ఉన్న వ్యక్తులను ఈ చట్టం విదేశీయులుగా నిర్వచిస్తోంది. వీరిని గుర్తించి ప్రభుత్వం దేశం నుంచి పంపించాలి. ఇంతకుముందు ఉన్న నిబంధనల ప్రకారం వారు భారత పౌరసత్వం పొందడానికి అనర్హులు. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు లేదా క్రిస్టియన్లు – అంటే మైనారిటీలకు – పౌరసత్వాన్ని ఇవ్వడానికి వీలు కల్పించే చట్టంగా ప్రభుత్వం సీఏఏని తీసుకువచ్చింది. మతపరమైన వేధింపుల కారణంగా ఈ ‘ఇస్లామిక్ రిపబ్లిక్ ల’ ను విడిచిపెట్టి 2014 డిసెంబర్ 31 లేదా అంతకుముందు భారతదేశానికి వచ్చిన వలసదారులకు ఈ చట్టం వర్తిస్తుంది.
అటువంటి వలసదారులు చట్టవిరుద్ధంగా భారతదేశంలోకి ప్రవేశించినందుకు లేదా భారతదేశంలో గడువుకు మించి ఉండిపోయినందుకు ఎటువంటి చట్టపరమైన చర్యలు ఎదుర్కోకుండా ఈ వలసదారులకు సీఏఏ మినహాయింపు ఇస్తుంది. పాత చట్టం ప్రకారం ఒక వలసదారుడు పౌరసత్వానికి అర్హత పొందాలంటే “11 సంవత్సరాలకు తగ్గకుండా” భారతదేశంలో నివసించాలి. సీఏఏ దానిని అర్హత కలిగిన మైనారిటీల కోసం ‘ఐదేళ్లకు తక్కువ కాకుండా’ అని సవరించింది.
చట్టాన్ని కొందరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
ప్రధానంగా ఈ చట్టం ముస్లింల పట్ల వివక్ష చూపుతోందన్న ఆరోపణతో కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని వర్గాలు దీన్ని వ్యతిరేకించాయి. బిజెపి ప్రభుత్వం తన హిందూత్వ ఎజెండాను మరింత ముందుకు తీసుకువెళుతోందని ప్రతిపక్ష పార్టీలు అర్థంలేని విమర్శలు చేశాయి. అస్సాంలో జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్నార్సీ) ప్రక్రియ నేపథ్యంలో ప్రభుత్వం సీఏఏను తీసుకురావడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. జూన్ 2018లో ఆ రాష్ట్రంలో అసలు నివాసానికి సంబంధించిన పత్రాలను సమర్పించకపోవడం వల్ల ఎన్నార్సీ ముసాయిదా జాబితాలో సుమారు 20 లక్షల మంది పేర్లు లేకుండా పోయాయి. ఆరు కాంగ్రెస్, వామపక్ష పాలిత రాష్ట్రాల అసెంబ్లీలు సీఏఏ అమలుకు వ్యతిరేకంగా తీర్మానాలను ఆమోదించాయి. సవరణలను రీకాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.
అస్సాంలో వివాదం
అస్సాంలో సీఏఏపై వ్యతిరేకతకు ప్రధానంగా 1985 అస్సాం ఒప్పందం, ఎన్నార్సీ ప్రక్రియపై అది చూపగల ప్రభావంపై భయాలు కారణం. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలకు వ్యతిరేకంగా ఆరేళ్లపాటు సాగిన ఆందోళనల అనంతరం అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం, అస్సాం ఉద్యమకారులకు మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం 24 మార్చి 1971 తర్వాత బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి ప్రవేశించిన వ్యక్తులను గుర్తించి దేశం నుంచి పంపించి వేయాలి. అయితే ఈ కొత్త చట్టం అస్సాం ఒప్పందం స్ఫూర్తిని నీరుగారుస్తుందని, కొంతమంది వలసదారులకు పౌరసత్వం కల్పించేందుకు మార్గాన్ని సుగమం చేస్తుందని సీఏఏ వ్యతిరేకులు వాదించారు.
అభ్యంతరాలకు ప్రభుత్వం దీటైన సమాధానం
ఈ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ప్రభుత్వం హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో మతపరమైన హింసను ఎదుర్కొన్నారని, వారికి రక్షణ అవసరమని పేర్కొంది. చట్టానికి మద్దతుగా ప్రభుత్వం మూడు ప్రధాన కారణాలను చూపింది. అవి:
చారిత్రక బాధ్యత: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో హింస, అణచివేతలకు గురై శరణార్థులుగా భారత గడ్డపై అడుగిడిన మైనారిటీల పట్ల భారతదేశానికి చారిత్రక, నైతిక బాధ్యత ఉంది. .
మానవతా కారణాలు: మూడు పొరుగు దేశాలలో హింసను ఎదుర్కొంటున్న మతపరమైన మైనారిటీల దుస్థితికి ప్రతిస్పందనగా సీఏఏను రూపొందించారు. ఈ మైనారిటీలు తమ దేశాల్లో ఎదుర్కొన్న కష్టాల కారణంగా ప్రత్యేక మినహాయింపులు, సహాయానికి అర్హులు.
మతపరమైన మైనారిటీల రక్షణ: సీఏఏ తమ స్వదేశాలలో హింసకు భయపడి భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన లేదా వారి వీసాల గడువు కంటే ఎక్కువ కాలం గడిపిన మతపరమైన మైనారిటీలకు చట్టబద్ధంగా పౌరసత్వం కల్పించే మార్గాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. వారికి పౌరసత్వం ఇవ్వడం వల్ల వారికి దీర్ఘకాలిక భద్రత, హింస నుంచి రక్షణ లభిస్తుంది.