ఘనంగా వాజ్‌పేయి శతజయంతి వేడుకలు
బిజెపి తెలంగాణ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి. డిసెంబర్ 25న వాజ్‌పేయి జయంతి పురస్కరించుకొని రాష్ట్ర కార్యాలయంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రారంభించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్, కర్ణాటక ఎమ్మెల్యే విశ్వనాధ్, బిజెపి రాష్ట్ర పదాధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా బిజెపి నాయకులు హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్దనున్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుండి బిజెపి రాష్ట్ర కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. సాయంత్రం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సదస్సులో కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు. వాజ్‌పేయి జయంతి పురస్కరించుకొని వారి సేవలను స్మరించుకుంటూ తెలంగాణ వ్యాప్తంగా బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అన్నదానం, రక్తదానం శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆసుపత్రులు, అనాథ, వృద్ధాశ్రమాల్లో పండ్లు, బ్రెడ్యూ, దుప్పట్లు పంపిణీ చేశారు. కొన్ని చోట్ల స్వచ్ఛ భారత్ చేపట్టి అటల్ జీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ముందురోజు డిసెంబర్ 24న రాష్ట్ర కార్యాలయంలో అటల్ జీ జీవితంలోని ముఖ్య ఘట్టాలతో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సుదాన్షు త్రివేది ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజెపి శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించిన ఫోటోలను ఆసక్తిగా వీక్షించారు. డిసెంబర్ 24న హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ఏబీవీ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సుధాన్షు త్రివేది, మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు, ఎంపీలు ఈటల రాజేందర్, ఎం. రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఒక్క ఓటుతో ప్రభుత్వాన్ని వదులుకున్నారు: కిషన్ రెడ్డి
వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా వేరువేరు కార్యక్రమాల్లో కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం, భారతమాత సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు అంటూ అటల్ బిహారీ వాజ్‌పేయిపై ప్రశంసలు గుప్పించారు. ‘‘దేశంలో పాస్ పోర్టు రావాలంటే సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితుల నుంచి… సులభతరంగా ప్రతి ఒక్కరికి పాస్ పోర్టు వచ్చేలా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఐక్యరాజ్యసమితిలో మొదటిసారిగా హిందీలో ప్రసంగించి భారతదేశం ప్రత్యేకతను చాటిచెప్పారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ఇతర దేశాల ప్రతినిధులు ఆ దేశానికి చెందిన జాతీయ, ప్రాంతీయ భాషల్లో మాట్లాడుతుంటే.. తాను కూడా భారతీయ భాష (హిందీ)లో మాట్లాడుతానంటూ మొరార్జీ దేశాయ్ అనుమతితో ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రసంగించారు. ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విషయం.
నేడు లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ మాత్రం విదేశాలకు వెళ్లి భారతదేశంపై విషం కక్కుతూ, రాజ్యాంగబద్ధమైన సంస్థలను అవహేళన చేస్తూ, ప్రపంచ దేశాల్లో భారతదేశానికి చెడ్డపేరు వచ్చేలా ప్రవర్తిస్తున్నాడు. భారతదేశంలోని పార్లమెంటు వ్యవస్థకు వ్యతిరేకంగా, ఎన్నికల కమిషన్ కు, న్యాయస్థానాలు, రక్షణ వ్యవస్థకు వ్యతిరేకంగా, అవహేళన చేస్తూ రాహుల్ మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పాలనలో పీవీ నర్సింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయిని ఐక్యరాజ్యసమితి సదస్సులో పాల్గొనాలని కోరి, భారత ప్రతినిధిగా పంపించారు. వాజ్‌పేయి దేశ గౌరవాన్ని మరింత పెంచేలా ప్రపంచ వేదికపై మాట్లాడారు. ఈనాటి ప్రతిపక్ష నాయకుడికి, ఆనాడు ప్రతిపక్ష నాయకుడికి ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పార్లమెంటులో ఒక్క ఓటుతో ప్రభుత్వం కోల్పోతుందని తెలిసినా, ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు కూడా మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నా.. వాజ్‌పేయి నైతిక విలువలకు కట్టుబడి ప్రభుత్వాన్ని తృణప్రాయంగా వదులుకున్నారు. మళ్లీ ప్రజల్లోకి వెళ్లి ప్రజల మన్ననలతో ప్రధానమంత్రి అయ్యారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నైతిక విలువలతో కూడిన రాజకీయాల్లో భాగంగా వాజ్‌పేయి గారు ఒక్క ఓటుతో ప్రభుత్వాన్ని వదులుకున్నారు. రూ.77 వేల కోట్లతో స్వర్ణచతుర్భుజి ప్రాజెక్టు పేరుతో జాతీయ రహదారులు నిర్మించి అన్ని రాష్ట్రాలను అనుసంధానం చేశారు. అదే స్ఫూర్తితో నరేంద్ర మోదీ అన్ని జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేసేలా పని చేస్తున్నారు. వాజ్‌పేయి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా ప్రత్యేక కార్యాచరణతో ప్రతి గ్రామాల్లో రోడ్లు నిర్మించారు. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టి రైతులను ప్రోత్సహించారు. దేశంలో మౌలిక వసతుల కల్పనతో పాటు పేద ప్రజలకు అనేక ఇండ్లు కట్టించారు. వాజ్‌పేయి హయాంలో దేశంలో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజనకు సంబంధించిన జాతీయ కార్యక్రమాన్ని హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోనే ప్రారంభించారు. వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన కార్యక్రమం తర్వాత కాంగ్రెస్ తెలంగాణలోని పేదలకు ఇండ్లు కట్టివ్వలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఇండ్లకు భూమిపూజ కూడా చేయలేదు. వాజ్‌పేయి స్ఫూర్తితో రానున్న మూడు సంవత్సరాల్లో దేశం కోసం పని చేసే లక్ష మంది యువకులను రాజకీయ నాయకులుగా తయారుచేయాలని మోదీ పిలుపునిచ్చారు.
ఇందిరా గాంధీ నియంతృత్వంతో ఎమర్జెన్సీ విధించడంతో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయింది. పత్రికా స్వేచ్ఛను హరించారు. అప్పుడు జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో జనసంఘ్ నాయకులు పోరాటం చేశారు. లక్షలాది మందిని జైలులో పెట్టారు. అప్పుడు వాజ్‌పేయి 18 నెలల పాటు జైలులో ఉన్నారు. బంగారు లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి లాంటి వేలాది నాయకులు, స్వయం సేవక్ నాయకులు, అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జైలుకెళ్లారు. జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో 1977లో జనసంఘ్ పార్టీని జనతా పార్టీలో విలీనం చేశారు.
నేను విద్యార్థిగా ఉన్నప్పుడు చిన్న బ్యాగ్ తీసుకుని పార్టీ కార్యాలయం చేరాను. ఏ జాతీయ నాయకుడు వచ్చినా వారిని రైల్వేస్టేషన్లో రిసీవ్ చేసుకోవడం, వారికి వీడ్కోలు తెలపడం, వారికి సహాయక్ గా ఉన్నాను. వాజ్‌పేయి ప్రధాని అయ్యేంతవరకు.. వారు వచ్చినప్పటి నుంచి తిరిగి విమానం ఎక్కేంతవరకు చూసుకునే అవకాశం నాకు దొరికేది. ఉదయాన్నే పేపర్లు ఇవ్వడం, వారి భోజన వ్యవస్థ చూసుకోవడం వంటివెన్నో చూశాం. కానీ వారు ఏనాడూ ఎవరినీ విసుక్కోలేదు. చిన్న చిన్న సభల నుంచి మొదలుపెట్టి.. ఏపీ, తెలంగాణలో వాజ్‌పేయి తిరగని జిల్లా లేదు. పెద్ద పట్టణం లేదు. వరంగల్, గుంటూరు, రాజమండ్రి వంటి నగరాలకైతే చాలా సార్లు వచ్చారు. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ సందర్భంగా వారితో తరచూ కలిసే వాడిని. ఉగ్రవాద వ్యతిరేక సదస్సును దిల్లీలో నిర్వహించాలనుకున్నప్పుడు విజ్ఞాన్ భవన్ వేదికగా పార్టీ జెండాతో జరిగే జరిగిన ఏకైక సదస్సుకు ప్రత్యేకంగా జీవో ఇచ్చారు. ఆ తర్వాత ఏనాడూ పార్టీ కార్యక్రమాలు అక్కడ జరగలేదు.
చిన్న రాష్ట్రాల ద్వారా వేగవంతమైన అభివృద్ధి సాధ్యమని నమ్మి మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. ఏ సందర్భంలోనూ ఎక్కడా చిన్న వ్యతిరేకత రాకుండా ఈ మూడు రాష్ట్రాలను విభజించారు. దేశ భద్రత, దేశ సమగ్రత విషయంలో రాజీ పడలేదు. శత్రుదేశమైన పాకిస్తాన్ కు బస్సులో వెళ్లారు. స్నేహపూర్వకంగా ఉండాలని ప్రయత్నించారు. అదే సమయంలో వారు వెన్నుపోటు పొడిచేసేందుకు ప్రయత్నిస్తే.. అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి సైనికుల సహాయంతో కార్గిల్ యుద్ధంతో పాక్ కు బుద్ధి చెప్పారు.’’ అని అన్నారు.
అంబేద్కర్ స్పూర్తితో వాజ్‌పేయి: బండి సంజయ్ కుమార్
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించిన పార్టీ కాంగ్రెస్… నేడు ఆయనపై మొసలి కన్నీరు కార్చడం విడ్డూరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. అబద్దాలను ప్రచారం చేయడంలో కాంగ్రెస్ గోబెల్స్ ను మించి పోయిందని, అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సి వస్తే.. అది కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. నేడు అంబేద్కర్ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ హయాంలో భారతరత్న అవార్డు అంబేద్కర్ కు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలన్నారు. ‘‘పార్టీ 1954 నుండి 1988 వరకు నెహ్రూ, ఇందిరా, కామరాజ్ సహా 21 మందికి భారతరత్న అవార్డును ప్రకటించారు. కానీ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ కు మాత్రం ఇవ్వలేదు. ఆయన ఎందులో తక్కువ. ఆయన చేసిన తప్పేంది?’’ అని ప్రశ్నించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తూ ‘‘దేశ ప్రజలకు స్పూర్తి ప్రదాత వాజ్‌పేయి. పోఖ్రాన్ అణుపరీక్షలు, స్వర్ణ చతుర్భుజి, గ్రామీణ సడక్ యోజన వారి చలువే. పార్లమెంట్ లో బలనిరూపణ విషయంలో అనేక మంది ఇతర పార్టీలో ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, నీతి, నిజాయితీగా వ్యవహరించి పదవిని కోల్పోయిన మహనీయుడు వాజ్‌పేయి. అంబేద్కర్ స్పూర్తితో వాజ్‌పేయి నడిచారు. వాజ్‌పేయి అడుగుజాడల్లో ఆయన ఆశయాలను తూ.చ తప్పకుండా అమలు చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ. అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న నాయకుడు. నాటి కేసీఆర్, నేటి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు 70 ఎంఎం సినిమాలు, గ్రాఫిక్స్ చూపుతూ ప్రజలను మోసం చేస్తోందే తప్ప ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయడం లేదు.’’ అని అన్నారు.
సమర్థవంతమైన నాయకుడు: అనురాగ్ సింగ్
రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ ‘‘వాజ్‌పేయి నిరంతరం ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు పని చేశారు. ఇప్పటికీ అధికార, విపక్షాల సీనియర్ నాయకులు వాజ్‌పేయిని గౌరవించేందుకు కారణం వారి వ్యక్తిత్వం. కార్గిల్ యుద్ధ సమయంలో నరేంద్ర మోదీ కార్గిల్ కు వెళ్లినపుడు సైనికులు ‘భారత్ మాతాకీ జై’, ‘అటల్ బిహారీ వాజ్‌పేయిగారికి జై’ అని నినాదాలు చేసినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. ఇందుకు కారణం యుద్ధాన్ని ఆపాలని అమెరికా అధ్యక్షుడు ఒత్తిడి చేస్తే వాజ్‌పేయి మీరు.. వెనక్కు తగ్గేది లేదని, నా భూభాగాన్ని ఒక్క ఇంచుకూడా వదిలేది లేదని చెప్పారు. ఇది సైనికుల్లోనై స్థైర్యాన్ని నింపింది. సైనికులు యుద్ధానికి వెళ్తే వారి ట్రంకు పెట్టే మాత్రమే వెనక్కు వచ్చేది. కానీ యుద్ధంలో అమరులైన సైనికుల పార్థివదేహాలను గౌరవప్రదంగా వారి కుటుంబాలకు చేర్చారు. వాజ్‌పేయి స్వప్నమైన వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ను మోదీ నెరవేర్చారు. 1997లో భారతదేశం స్వాతంత్ర్య స్వర్ణోత్సవాలు జరుపుకొంటున్న సమయంలో విదేశాల్లో మనల్ని బిచ్చగాళ్లు, పాములు పట్టుకునే వాళ్లని అవహేళన చేశారు. కానీ రెండేళ్లలో ఆ పరిస్థితి పూర్తిగా మారింది. వాజ్‌పేయి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. భారతదేశం అణ్వస్త్ర దేశంగా గుర్తింపు పొంది పంచాన్ని ఆశ్చర్యపరిచింది. మన దేశాన్ని విమర్శించిన అంతర్జాతీయ పత్రికలే గొప్పదనాన్ని కీర్తిస్తూ వ్యాసాలు రాశాయి. అదీ.. సమర్థవంతమైన నాయకుడి నేతృత్వంలో దేశం ఎలా ఉంటుందనడానికి ఉదాహరణ.
సైన్స్ అండ్ టెక్నాలజీలో దేశం ముందుకెళ్లేందుకు.. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదాన్ని వాజ్‌పేయి తీసుకొచ్చారు. 370 ఆర్టికల్ రద్దు చేయాలని, ఒకే దేశంలో ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు ఉండొద్దని మా అగ్రనేతలు శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, వాజ్‌పేయి సంకల్పిస్తే మోదీ దాన్ని పూర్తి చేశారు. అటల్ జీ స్వప్నాన్ని మోదీ ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ విషయంలో మనమంతా కార్యకర్తలుగా కష్టపడి పని చేస్తూ 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే విషయంలో భాగస్వాములమవుదాం.’’ అని అన్నారు.
ప్రజలు కోరుకున్న ప్రధాని: సుధాన్షు త్రివేది
ఏబీవీ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సుధాన్షు త్రివేది ప్రసంగిస్తూ వాజ్‌పేయి పేర్కొన్నట్లు తెలంగాణలో బిజెపి వికాసం మొదలైందన్నారు. ‘‘భారతదేశ చరిత్రలో కేవలం ఇద్దరే నాయకులుగా ఆదరణ పొంది ప్రధానమంత్రి అయ్యారు, అందులో ఒకరు వాజ్‌పేయి, రెండోది నరేంద్ర మోదీ. మిగిలిన వారు పరిస్థితులకు అనుగుణంగా ప్రధానమంత్రి అయ్యారు. మన్మోహన్ సింగ్, పీవీ నర్సింహా రావు, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ అనుకోకుండా ప్రధానమంత్రి అయిన వారే. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు కూడా పార్టీ తరపున ఒక్క ఓటు పొందిన నెహ్రూ కూడా ప్రధానమంత్రి అయ్యారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి నిర్ణయం పోఖ్రాన్ అణు పరీక్షలు. 1974తో పోలిస్తే 1998 పరీక్షలు చాలా భిన్నమైనవి. 1974లో మన పరీక్షలకు ముందే అమెరికాకు తెలిసిపోయి తీవ్ర విమర్శలు చేసింది. కానీ 1998లో చేసిన పరీక్షల విషయం అమెరికా నిఘా సంస్థకు, రష్యా నిఘా సంస్థకు పత్తాలేదు. శాంతియుత అవసరాలకు మనం అణు పరీక్షలు చేశాం. నాడు మన ఆర్థిక పరిస్థితి కూడా అంత బలంగా లేదు. మౌలిక వసతులు కూడా గొప్పగా లేవు. అలాంటప్పుడు అంతర్జాతీయ ఆంక్షలు మరెంత తీవ్రంగా ఉంటాయని భయపడ్డారు. కానీ ధైర్యంగా దేశం కోసం నిర్ణయం తీసుకుంటే ఎవరికీ భయపడాల్సిన పని లేదనేది వాజ్‌పేయి పనితీరు. దేశంలో ఒక్క డాలర్ కూడా పెట్టుబడి రాని పరిస్థితుల్లో ప్రవాసి భారతీయులు 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. 1998 మేలో పోఖ్రాన్ పరీక్షలు చేస్తే మార్చి 2000 నాటికి అంటే 22 నెలల్లో వచ్చిన మార్పు ఏంటంటే.. మొదటిసారి అమెరికా అధ్యక్షుడు (బిల్ క్లింటన్) 5 రోజులు భారత్ లో ఉన్నాడు. విపత్కర పరిస్థితుల్లోనూ దేశాన్ని ఎలా ముందుకు నడపాలో ఆయనకు బాగా తెలుసు.
దేశంలో మౌలికవసతుల కల్పనకు బీజం వేసింది వాజ్‌పేయి.. దాన్ని వటవృక్షం చేసింది మోదీ. సర్వశిక్షా అభియాన్ వాజ్‌పేయి చేస్తే దాన్ని మోదీ మరింత ముందుకు తీసుకెళ్లి.. విద్యతోపాటు, నైపుణ్యం, డిజిటల్ విద్య, డిజిటల్ ఎకానమీని గ్రామాలకు తీసుకెళ్లారు. వాజ్‌పేయి దేశ అణు సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తే.. మోదీ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లి.. న్యూక్లియర్ వార్ హెడ్ ను భూమి నుంచి సబ్ మెరైన్ నుంచి, ఆకాశం నుంచి ప్రయోగించే సామర్థ్యాన్ని అందించారు. రామమందిర విషయంలో 1976లో ASI సర్వేలో దేవాలయ స్తంభాలు బయటపడ్డాయి. దీన్ని ఇందిరా గాంధీ ప్రభుత్వం కమ్యూనిస్టుల ఒత్తిడి మేరకు బయటపెట్టలేదు. తదుపరి తవ్వకాలు లేకుండా ఆదేశాలిచ్చింది. భారతదేశంలో అటల్ జీ ప్రభుత్వంలో వచ్చిన పెద్ద మార్పు అయోధ్యకు సంబంధించి రాడార్ ద్వారా గ్రౌండ్ పెనిట్రేషన్ చేస్తూ మందిరం అక్కడే ఉందన్న ఆధారాలు కోర్టు ముందు పెట్టారు. రామమందిర నిర్మాణం మోదీ హయాంలో వచ్చింది.
1991లో దేశంలో కేవలం ఆరు రోజుల ఫారిన్ రిజర్వ్స్ ఉండేవి. అదే సమయంలో కేవలం 1 బిలియన్ డాలర్ ఫారిన్ ఎక్స్ చేంజ్ రిజర్వ్ ఉండేది. 2004లో వాజ్‌పేయి సమయంలో ఇది 100 బిలియన్ డాలర్లు అయింది. మోదీ దీన్ని 500 బిలియన్ డాలర్లకు తీసుకొచ్చారు. ఇప్పుడు 600 బిలియన్ డాలర్లు దాటింది.
పార్లమెంటులో దాడి సమయంలో ఒక అధికారి వాజ్‌పేయి వద్దకు వచ్చి.. దాడి గురించి టీవీలో వచ్చిన వార్తలను చూపిస్తూ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని సూచించగా.. దీనికి వాజ్‌పేయి సమాధానమిస్తూ ‘‘ఇప్పుడు సిస్టమ్ యాక్టివేట్ అయింది. అధికారులంతా పరిస్థితిని కంట్రోల్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు సమావేశానికి పిలిస్తే నాకు ఏం చెప్పాలనే దానిపైనే వారు పని చేస్తారు.’’ అని సమాధానం ఇచ్చారు. వారు వారి పని చేసిన తర్వాత ఫైనల్ రిపోర్టు తీసుకుందాం అన్నారు. ఇది వాజ్‌పేయి స్థితప్రజ్ఞతకు నిదర్శనం.
ఇవాళ అంతర్జాతీయ దౌత్యం విషయంలోనూ వాజ్‌పేయి ప్రారంభించిన దాన్ని మోదీ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అమెరికా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు ఇద్దరూ మోదీతో కలిసి భోజనం చేశారు. మోదీ ఒక్కరే 15 రోజుల్లో పుతిన్, జెలెన్‌స్కీ ఇద్దరినీ ఆలింగనం చేసుకున్నారు. ఇది దౌత్యం విషయంలో భారతదేశం సాధిస్తున్న విజయాలకు నిదర్శనం.
జన్ ధన్ అకౌంట్లు సాధ్యమా అని అనుమానాలు తలెత్తాయి. ఆర్బీఐ కూడా ఇది సాధ్యం కాదని చెప్పింది. ఇవాళ 54 కోట్ల జన్ ధన్ అకౌంట్లు వచ్చాయి. డీబీటీ ద్వారా ఆ అకౌంట్లలో పంపించారు. నాడు అటల్ జీ ఆలోచించారు. దీన్ని మోదీ ఆచరిస్తున్నారు. ఒకప్పుడు భారతదేశాన్ని అప్పుల కుప్ప అనేవారు. కానీ IMF చీఫ్ ఇటీవల మాట్లాడుతూ వచ్చే ఏడాది ప్రపంచ వృద్ధి రేటులో భారత్ వాటా 15 శాతంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇది వాజ్‌పేయి స్వప్నించిన లక్ష్యాలను చేరుకునే క్రమంలో మోదీ నాయకత్వంలో భారతదేశం ముందుకెళ్తున్న తీరుకు నిదర్శనం.’’ అని అన్నారు.
వాజ్‌పేయి స్థితప్రజ్ఞుడు: సీహెచ్ విద్యాసాగర్ రావు
సీహెచ్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ‘‘పార్లమెంటుపై దాడి జరిగిన సందర్భంలో నేను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న సమయమది. ప్రమోద్ మహాజన్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి చొరవ తీసుకుని పరిస్థితిని ఎలా చక్కబెట్టాలో ఆలోచించాలని సూచించారు. వాజ్‌పేయి వారి ఛాంబర్ లో చాలా ప్రశాంతంగా ఎవరికి ఇవ్వాల్సిన ఆదేశాలను వారికిస్తూ ‘మరుసటి రోజు పార్లమెంటు జరగాలి. మన ప్రజాస్వామ్యం ఓడిపోదు’ అనే విషయాన్ని స్పష్టం చేశారు. కొన్ని గంటల్లోనే పార్లమెంటు మొత్తం సెట్ రైట్ చేసి తర్వాతి రోజు పార్లమెంటు యథావిధిగా జరిగింది. ఇది వాజ్‌పేయి స్థితప్రజ్ఞతకు నిదర్శనం.
1968లో పెద్ద నాయకుడిగా వారు ఎదుగుతున్న సందర్భంలో దీన్ దయాళ్ హత్య తర్వాత భారతీయ జనసంఘ్ పరిస్థితి ఏంటనే పరిస్థితుల్లో అటల్ జీ బాధ్యతలు తీసుకుని, దేశమంతా తిరిగి ప్రజల్లో స్థైర్యాన్ని నింపారు. పదాలకు సుగంధాన్ని పూసినట్లుగా వారు చెప్పే మాటలు మనుషులను కట్టిపడేసేవి.
1948లో ఇజ్రాయిల్ ఏర్పాటైన తర్వాత ఎడారి ప్రాంతాన్ని కూడా యూదులందరూ కలిసి అభివృద్ధి చేసుకుంటున్నారు. వీరంతా ఇజ్రాయిల్ కు వెళ్లిన తర్వాత ఇండియన్ ఇజ్రాయిలీస్ ఓ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఇందులో 104 దేశాల్లో యూదులపై అత్యాచారాలు జరిగాయి. కానీ భారతదేశంలో మాత్రం తమకెంతో గౌరవం దక్కిందని పేర్కొన్నారు. 10వ తరగతిలో అటల్ జీ తన పుస్తకంలో ఈ విషయాలన్నీ రాసుకున్నారు. వారి భావన, వ్యక్తిత్వం, పరిస్థితులను చక్కదిద్దే ఆలోచన చాలా గొప్పది. వారి ప్రసంగాలు, వారి అనుభవాల స్ఫూర్తితో మనం ముందుకెళ్దాం.’’ అని అన్నారు.