ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన బిజెపి అత్యధిక ఓట్లు సంపాదించుకోవడం ఊరటనిచ్చే అంశం. అధికారం దక్కించుకోవడంలో విఫలమైనా ఓట్ల శాతం పరంగా అగ్రస్థానంలో నిలిచింది. ఝార్ఖండ్ ప్రజల్లో బిజెపి పట్ల ఆదరణ ఉందని స్పస్టమవుతోంది. చిన్నా చితక పార్టీలతో జట్టు కట్టినప్పటికీ పూర్తిగా సొంత బలంపైనే ఆధారపడిన బిజెపి 33.18 శాతం ఓట్లు దక్కించుకుంది. మొత్తం 59,21,474 ఓట్లు కమలం గుర్తుపై పడ్డాయి. దీంతో 81 సీట్ల ఝార్ఖండ్‌లో బిజెపి 21 స్థానాలు కైవసం చేసుకొంది. బిజెపి మిత్రపక్షాలైన ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ), జనతాదళ్ యునైటెడ్ (జేడీ (యూ)), లోక్ జనశక్తి పార్టీ (రాంవిలాస్ పాశ్వాన్) (ఎల్జేపీ (ఆర్వీ)) తలా ఒక్కొక్క సీటు గెలుచుకున్నాయి. దీంతో ఝార్ఖండ్‌లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మొత్తం 24 స్థానాలు దక్కించుకుంది.
ప్రాంతీయ పార్టీ ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేతృత్వంలోని ఇండీ కూటమి 56 స్థానాలతో అధికారాన్ని నిలబెట్టుకుంది. ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన జేఎంఎం 34 సీట్లు దక్కించుకోగా, కాంగ్రెస్ 16 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ కూటమిలోని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) 4, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ (సీపీఐ(ఎంఎల్)) 2 చోట్ల విజయం సాధించాయి. మరో ప్రాంతీయ పార్టీ ఝార్ఖండ్ లోక్‌తాంత్రిక్ క్రాంతికారీ మోర్చా (జేకేఎల్ఎం) 1 సీటు సాధించింది. నవంబర్ 13, 20న రెండు దశల్లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగగా నవంబర్ 23న ఫలితాలు వెలువడ్డాయి.
ఉపఎన్నికల్లో బిజెపికే ఎక్కువ
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 46 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో బిజెపి 20 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 7 స్థానాల్లో గెలుపొందింది. ఇందులో చాలావరకు ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలే దాదాపుగా గెలిచాయి. ఉత్తర్ ప్రదేశ్, బిహార్, రాజస్థాన్, అస్సాంలలో ఎన్డీయే విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్, కర్ణాటకలో కాంగ్రెస్, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ పట్టు నిలుపుకొన్నాయి. మధ్యప్రదేశ్‌లో బిజెపి, కాంగ్రెస్ చెరొకటి గెలుచుకున్నాయి.
కేరళలోని వయనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ సీట్లను కాంగ్రెస్ నిలబెట్టుకుంది. రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్‌లో ఆయన సోదరి ప్రియాంకా గాంధీ గెలిచారు. నాందేడ్‌లో 1,400 స్వల్ప తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర చవాన్ విజయం సాధించారు.