Emergency Indira

ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు ఎమెర్జెన్సీ

Emergencyమర్జెన్సీ రోజులు (1975-77) భారతీయుల ఆలోచనా ధోరణులను సమూలంగా మార్చేశాయి. ఇప్పటి తరం ఎమర్జెన్సీ గురించి వినడమే తప్ప ఆ పీడకలను ప్రత్యక్షంగా అనుభవించలేదు. వారి దృష్టిలో ఎమర్జెన్సీ అంటే స్వాతంత్య్రంలాగ ఒక పదం మాత్రమే. కానీ ఈ రెండు పదాలూ మన దేశాన్ని నిర్మించాయి, పునర్నిర్మించాయి. వేలాదిమంది బలిదానాల వల్లనే ఇవాళ మనం స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఆస్వాదిస్తున్నాం. ఎమర్జెన్సీని ఎదిరించినందుకు వేలమంది చిత్రహింసలకు గురైనా, చివరకు వారు దాన్ని ఓడించారు. ముందు తరాల బాధలు, త్యాగాల నుంచి మనం లబ్ధి పొందామన్నది చారిత్రక నిజం. 

ఆధునిక భారత చరిత్రను స్వాతంత్య్రానికి ముందు, తరవాత అని విభజించడం సహేతుకమే. స్వాతంత్య్రానికి ముందు మనల్ని శ్వేతజాతి సామ్రాజ్యవాద, వలసవాదులు పాలిస్తే, స్వాతంత్య్ర అనంతరం సొంత నాయకులే పరిపాలించారు. అదే రెండు కాలాలకూ మధ్యనున్న మౌలిక తేడా. అలాగే భారతదేశ చరిత్రను ఎమర్జెన్సీకి ముందూ తరవాత అని కూడా విభజించవచ్చు. అయితే రెండు కాలాల్లో ఒకే వర్గం భారత్‌ను పాలించడంతో ఈ రెండిరటి మధ్య తేడాను స్పష్టంగా గమనించలేకపోతున్నాం. నిజం చెప్పాలంటే ఎమర్జెన్సీకి ముందూ తరవాత కూడా జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభ కొనసాగింది. దానితో స్వాతంత్య్రం అనంతరం మనం ఏర్పరచుకున్న ఆదర్శాలే ఎమర్జెన్సీ తరవాత కూడా కొనసాగుతున్నాయని భావించాం. కానీ అది ఒట్టి భ్రమ. ఎమర్జెన్సీ తరవాత మన విలువల వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. గట్టిగా ఖండించవలసినవే శిరోధార్యంగా మారాయి. అంతా ఏకవ్యక్తి ప్రదర్శనలా మారిపోయింది. బలమైన నాయకులు తెరమరుగైపోయి ఇందిరాగాంధీ ఆదేశాలకు డూడూబసవన్నల్లా తలూపేవాళ్లు ముఖ్యమంత్రులయ్యారు. ఇందిరను కేంద్రంలో ‘ఒకే ఒక్క మగాడు’గా పరిగణించసాగారు. ఎమర్జెన్సీకి ముందు అవినీతిని అందరూ ఏవగించుకునేవారు. తమ శాఖలపై ఏదైనా అవినీతి ఆరోపణ వస్తే నైతిక బాధ్యత వహించి మంత్రులు రాజీనామా చేసేవారు. కానీ, ఎమర్జెన్సీ తరవాత అవినీతిపై సిగ్గుతో తలదించుకునేవాళ్లు కనబడకుండా పోయారు. కాంగ్రెస్‌ నాయకులూ, ప్రభుత్వ సభ్యులూ అవినీతికి పాల్పడటం తమ జన్మహక్కు అన్నట్లుగా ప్రవర్తించసాగారు. అవినీతి మకిలి న్యాయవ్యవస్థకూ, సమాచార సాధనాలకూ అంటుకుంది. దీనివల్ల అవినీతిపై పోరాడటానికి ప్రజలకు దారులు మూసుకుపోసాగాయి. అంతటా నిర్లిప్తత, అవకాశవాదం రాజ్యమేలాయి.

ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధమైన అనువంశిక పాలనకు ఎమర్జెన్సీ పట్టం కట్టింది. ఇది నెహ్రూ కుటుంబానికి మాత్రమే పరిమితం కాలేదు. సంపన్నుల, రాజకీయ కుటుంబాల సంతానం అధికారం తమ గుత్తసొత్తు అన్నట్లు ప్రవర్తించసాగారు. ఇందిరాగాంధీ హత్యను పురస్కరించుకుని దిల్లీలో సిక్కులపై కాంగ్రెస్‌ గూండాల హత్యాచారాలను రాజీవ్‌ గాంధీ వెనకేసుకొచ్చారు. రాజకీయాల్లో శక్తిమంతమైన కుటుంబాల పెత్తనం అప్రతిహతంగా సాగడం మూలానే కాంగ్రెస్‌ క్షీణదశలోకి జారిపోయింది. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటూ నెహ్రూ కుటుంబం చూపిన బాటలో ఇతర రాజకీయ కుటుంబాలూ నడవడం యావత్‌ భారతదేశ రాజకీయాలను దిగజార్చింది. క్రమంగా ఈ జాడ్యం ఇతర పార్టీలకూ అంటుకుంది. అనువంశిక పాలనకు మోకరిల్లే మనస్తత్వం ఇప్పటికీ మనల్ని వదలలేదు. పలువురు ముఖ్యమంత్రులు, మంత్రుల కుమారులు, కుమార్తెలు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆస్తులు పోగేసుకోవడం చూస్తే ఈ దేశాన్ని తమ కుటుంబ ఆస్తిగా పరిగణించే తరం పుట్టుకొచ్చిందని అర్థమవుతుంది. వీరి దారికి అడ్డువచ్చే ప్రజా వేగులు హతమైపోతున్నారు.

ఎమర్జెన్సీ తీసుకొచ్చిన ఈ అవాంఛనీయ మార్పులన్నింటికీ మూలకారకుడు సంజయ్‌ గాంధీయేననడంలో సందేహం లేదు. ఆ రోజుల్లో సంజయ్‌ ఆగడాలకు అంతే లేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఆయన వల్ల కలిగిన నష్టం అంతాఇంతా కాదు. సంజయ్‌ పుణ్యమా అని భజనసరుల గుంపు పార్లమెంటుకు ఎన్నికైంది. ఇందిరను కానీ, కాంగ్రెస్‌ను కానీ విమర్శించినవాళ్లపై నోరువేసుకుపడటమే ఈ భజనపరుల పని. ఇక అప్పటి నుంచి పార్లమెంటరీ కార్యకలాపాలను స్తంభింపజేసే సంప్రదాయం మొదలైంది. ఇతర పార్టీలకూ ఇది ఆనవాయితీ అయిపోయింది. ఎమర్జెన్సీ కాలంలో చొరబడిన మనస్తత్వాలు, పెడధోరణులు ఇప్పటికీ మనల్ని వీడిపోలేదు. ఎమర్జెన్సీ కాలంలో రైళ్లు సమయానికి వచ్చేవని సమర్థించేవాళ్లు ఇప్పటికీ కనిపిస్తారు. పోలీసు రాజ్యం ఉంటే కానీ పనిచేయని పనికిమాలినవాళ్లమా? మనది బాధ్యత తెలియని అస్తవ్యస్త జాతి అని ఒప్పుకొందామా?  ఎమర్జెన్సీ కాలంలో దిల్లీలో పోలీసులు థర్డ్‌ డిగ్రీ పద్ధతులకు పాల్పడిన ఘటనలు జరిగినా, కేరళలో అవి హద్దులు దాటిపోయాయి. అక్కడ అమాయకులను కూడా వేధించారు. రక్తం చిందించకుండా చిత్రహింసలు పెట్టే కొత్త పద్ధతులను కనిపెట్టారు. ఎమెర్జెన్సీలో చోటుచేసుకున్న ఘోర మానవ హక్కుల ఉల్లంఘనపై విచారణకు ఇంతవరకు కమిషన్‌ వేయడం కానీ, ఇతర చర్యలు తీసుకోవడం కానీ జరగలేదు. మున్ముందు ఎమర్జెన్సీ అకృత్యాల వంటివి పునరావృతం కాకుండా మనం జాగ్రత్త వహించాలి.