Indi Alleance

ఇండీ కూటమి ఐక్యత నేతి బీరకాయ చందమే

కాంగ్రెస్ సమావేశంలో ఖర్గే, రాహుల్

Kharge Rahul Gandhi

దేశ రాజధానిలో డిసెంబర్ 3వ వారంలో 28 ప్రతిపక్ష పార్టీలు నాలుగోసారి సమావేశమయ్యాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పరాజయంపాలైన తరవాత జరిగిన సమావేశం కావడంతో ఊపు, ఉత్సాహం అంతగా కనిపించలేదు. ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహిస్తుందని అనుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఈ ఓటమితో డీలా పడిందని చెప్పాలి. దానివల్ల ఇతర ప్రతిపక్షాలు ఐక్య కూటమి నిర్మాణానికి తమవైన షరతులను విధించే పరిస్థితి ఏర్పడింది.

గత జూన్‌లో పట్నాలో బిహార్‌ ముఖ్యమంత్రి, జనతాదళ్‌ (యునైటెడ్‌) పార్టీ అధినేత నీతీశ్‌ కుమార్‌ నాయకత్వంలో మొదటిసారి అఖిలపక్ష సమావేశం జరిగింది. రెండో, మూడో ‘ఇండియా’ కూటమి సమావేశాలను బెంగళూరు, ముంబయిలలో నిర్వహించారు. వీటిలో దేనిలోనూ బిజెపికి వ్యతిరేకంగా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపుదిద్దుకోలేదు. ప్రధాని నరేంద్ర మోదీని ఓడించాలన్న ఉపన్యాసాలే తప్ప ఆ లక్ష్య సాధనకు అనుసరించాల్సిన వ్యూహంపై స్పష్టత ఏర్పడలేదు.

‘ఇండియా’ కూటమి నాలుగో సమావేశం ఇటీవల దిల్లీలో జరిగింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆహ్వానంపై జరిగిన ఈ సమావేశానికి పత్రికల్లో, టీవీ ఛానళ్లలో తగినంత ప్రచారం లభించలేదు. పార్లమెంటు ఉభయ సభల నుంచి రికార్డు స్థాయిలో ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేసిన సందర్భంలో జరిగిన సమావేశం కావడమే దీనికి కారణం. ఎంపీల సస్పెన్షన్‌ వార్తే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇంత జరిగినా ప్రతిపక్షాలు బిజెపిపై కలిసికట్టుగా పోరాటానికి ప్రభావశీలమైన కార్యాచరణ, ఉమ్మడి అజెండాలను ప్రజల ముందు ఉంచలేకపోయాయి. ప్రతి పార్టీ సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేయాలనుకొంటోంది. ఇప్పటికిప్పుడు గెలవలేకపోయినా భవిష్యత్తులో పునాది ఏర్పడుతుందనే భావనతోనే రాజకీయ పార్టీలు ఎక్కువ సీట్లలో పోటీకి దిగాలనుకుంటాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ వివిధ రాష్ట్రాల్లో రెండు వందలకు పైగా సీట్లలో పోటీచేసి, మూడు స్థానాల్లో తప్పించి, మిగతా అన్ని చోట్లా ధరావతు కోల్పోయింది. అయినా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేసింది. కాబట్టి లోక్‌సభ ఎన్నికలకు సీట్ల సర్దుబాటు అంత తేలిగ్గా తేలే వ్యవహారం కాదు. ఖర్గే నాయకత్వంలోని కాంగ్రెస్‌ గతానుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఏది ఏమైనా బిజెపిని కలిసికట్టుగా ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు ఏకమవడం అంత తేలిక కాదని పశ్చిమ్‌ బెంగాల్‌ పరిణామాలు సూచిస్తున్నాయి. సీట్ల సర్దుబాటు గురించి దిల్లీలో నాలుగో అఖిల పక్ష సమావేశం జరిగిన మరుసటి రోజే పశ్చిమ్‌ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌తో ఏ విధంగానూ రాజీపడే ప్రసక్తి లేదని సీపీఐ(ఎం) నాయకుడు మహమ్మద్‌ సలీం ప్రకటించారు. బెంగాల్‌లో కనీసం తొమ్మిది లోక్‌సభా స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నామని, దీనిపై రాజీ పడేది లేదని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, లోక్‌సభలో కాంగ్రెస్‌ నాయకుడైన అధీర్‌ రంజన్‌ చౌధరి ప్రకటించారు. ఏతావతా తృణమూల్‌తో సీట్ల సర్దుబాటుకు సీపీఐ(ఎం), కాంగ్రెస్‌లు రెండూ సుముఖంగా లేవని తేలుతోంది. మరోవైపు పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభా స్థానాలకు తామే పోటీ చేస్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టగలవనే నమ్మకం కుదరడం లేదు.

ప్రతిపక్షాల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేదీ తేలవలసి ఉంది. ప్రధాని పదవికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించడం చిక్కు పరిస్థితిని ఏర్పరచింది. దీనికి ఒకరోజు ముందు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మమతను కలిసి ఖర్గే పేరును సూచించారు. ఇది ఖర్గేకూ ఇబ్బందికర పరిణామమే. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి మెజారిటీ సాధించిన తరవాతే ప్రధానమంత్రి ఎవరనేది నిర్ణయం అవుతుందని ఖర్గే వివరించారు. ఏది ఏమైనా మమత ప్రతిపాదన ఇతర ప్రాంతీయ పార్టీలకూ రుచించలేదు. సోనియా గాంధీ కుటుంబం సహజంగానే రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనుకొంటుంది. వారిని ఇబ్బంది పెట్టడానికే ఖర్గే పేరును మమత ప్రతిపాదించారని భావిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా నీతీశ్‌ కుమార్‌ను ప్రతిపాదించాలని బిహార్‌కు చెందిన జేడీయూ నాయకుడు దిల్లీ భేటీ జరిగిన మరుసటి రోజే సూచించారు. అప్పటికే ఖర్గే పేరుకు మమత, కేజ్రీవాల్‌ మద్దతు ప్రకటించి ఉన్నారు. దిల్లీలో నాలుగో ఇండియా కూటమి సమావేశంలో ఉమ్మడి అజెండాగాని, కార్యాచరణ ప్రణాళికగాని రూపుదిద్దుకోలేదు. ప్రతిపక్షాలు ఉమ్మడి నాయకుడు లేకుండా ప్రధాని మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడం తేలిక కాదు.

ఒకసారి గత చరిత్రను పరిశీలిస్తే 1977లో అత్యవసర పరిస్థితి తరవాత పశ్చిమ్‌ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు సీపీఐ(ఎం), మొరార్జీ దేశాయ్‌ నాయకత్వంలోని కాంగ్రెస్‌(ఓ) మధ్య సీట్ల సర్దుబాటు ప్రయత్నం విఫలమైంది. మూడింట రెండు వంతుల అసెంబ్లీ సీట్లకు తానే పోటీ చేస్తానని కాంగ్రెస్‌(ఓ) పట్టుబట్టగా, సీపీఐ(ఎం) 60శాతం సీట్లనే ఇస్తామని చెప్పింది. చర్చలు విఫలమై ఇందిరాగాంధీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రెండు పార్టీలు విడివిడిగా అన్ని సీట్లకు పోటీ చేశాయి. చివరికి ఓటర్లు జ్యోతి బసు నాయకత్వంలోని సీపీఐ(ఎం)కు అఖండ విజయం కట్టబెట్టారు. ఆపైన 30 ఏళ్లకుపైగా పశ్చిమ్‌ బెంగాల్‌ను సీపీఐ(ఎం) ఏలింది. కాంగ్రెస్‌(ఓ) అదృశ్యమైంది. ఆ పార్టీ సీపీఐ(ఎం)తో చెరిసగం సీట్లు పంచుకోవడానికి సిద్ధపడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది.