2023లో అద్భుత విజయాలు
31 డిసెంబర్ 2023న ప్రసారమైన ‘‘మన్ కీ బాత్’’లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
2023లో మన దేశం అనేక ప్రత్యేక విజయాలు సాధించడం 140 కోట్ల భారతీయుల బలం అని చెప్పాలి. ఏళ్ల తరబడి ఎదురుచూసిన ‘నారీ శక్తి వందన్ చట్టం’ ఆమోదం పొందింది ఈ సంవత్సరంలోనే. భారతదేశం 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. జి- 20 శిఖరాగ్ర సమావేశం, చంద్రయాన్-3 విజయవంతమైంది. నేడు భారతదేశం మూలమూలన ఆత్మవిశ్వాసంతో నిండిపోయి ఉన్నది. అభివృద్ధి చెందిన భారతదేశం స్ఫూర్తితో, స్వావలంబన భావనతో నిండి ఉంది. అదే స్ఫూర్తిని, ఊపును 2024లోనూ కొనసాగించాలి. దీపావళి రోజు రికార్డు స్థాయి వ్యాపార లావాదేవీలు భారతదేశంలో ప్రతి ఒక్కరూ ‘వోకల్ ఫర్ లోకల్’ (స్థానికంగా తయారైన ఉత్పాదనలనే ఆదరించాలి)కు ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారు అని నిరూపించాయి. ‘నాటు-నాటు’ పాటకు ఆస్కార్ పురస్కారం లభించింది. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు అవార్డు దక్కింది. మన క్రీడాకారులు ఆసియా క్రీడలలో 107 పతకాలను, ఆసియా పేరా గేమ్స్ లో 111 పతకాలను గెలిచారు. క్రికెట్ ప్రపంచ కప్ లో భారతదేశం క్రీడాకారులు వారి ఆటతీరుతో అందరి హృదయాలు గెలుచుకొన్నారు. అండర్-19 టీ-20 ప్రపంచ కప్ లో మన మహిళా క్రికెట్ జట్టు గెలుపు ప్రేరణాత్మకం. క్రీడలలో భారతీయులు సాధించిన విజయాలు దేశానికి పేరు ప్రతిష్టలను పెంచాయి. ఇప్పుడు 2024 ప్యారిస్ ఒలింపిక్స్ కోసం యావత్ దేశం మన ఆటగాళ్లను ప్రోత్సహిస్తోంది.
ఆవిష్కరణలకు ప్రాముఖ్యాన్ని ఇవ్వని దేశం అభివృద్ధి ఆగిపోతుందనేది నా నమ్మకం. భారతదేశం ఇన్నోవేషన్ హబ్ గా మారడం మన ప్రగతి ప్రయాణం ఆగేది కాదు అనే విషయానికి సంకేతం. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో 2015లో మనం 81వ స్థానంలో ఉన్నాం. ప్రస్తుతం ఈ సూచికలో మనది 40వ స్థానం. ఈ సంవత్సరం భారతదేశంలో దాఖలు చేసిన పేటెంట్ ల సంఖ్య ఎక్కువ గా ఉంది. వీటిలో దాదాపు అరవై శాతం దేశీయ నిధులకు సంబంధించినవే. ఈసారి క్యూఎస్ ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో అత్యధిక సంఖ్యలో భారతీయ విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకున్నాయి. భారతదేశం సామర్థ్య ప్రభావానికి ఇది ఒక సంగ్రహావలోకనం మాత్రమే.
భారతదేశం కృషి కారణంగా 2023వ సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ చిరుధాన్యాల (శ్రీ అన్న) సంవత్సరం’గా జరుపుకొన్నాం. ఇది ఈ రంగంలో పని చేస్తున్న స్టార్టప్స్ కు చాలా అవకాశాలు అందించింది. వీటిలో లఖ్నవూలో ప్రారంభమైన ‘కీరోజ్ ఫూడ్స్’, ప్రయాగ్‌రాజ్ కు చెందిన ‘గ్రాండ్-మా మిలిట్స్’, ‘న్యూట్రస్యూటికల్ రిచ్ ఆర్గానిక్ ఇండియా’ వంటి అనేక స్టార్టప్స్ ఉన్నాయి. ఆల్పినో హెల్త్ ఫూడ్స్, అర్బోరియల్, కీరోజ్ ఫూడ్స్ తో ముడిపడ్డ యువతీ యువకులు ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలకు సంబంధించిన కొత్త ఆవిష్కరణలను సృష్టిస్తున్నారు. బెంగళూరులోని అన్‌బాక్స్ హెల్త్ తో జతపడ్డ యువతీ యువకులు వారికి ఇష్టమైన ఆహారాన్ని ఎంచుకోవడంలో ప్రజలకు ఎలా కృషి చేస్తున్నదీ తెలిపారు. శారీరిక స్వస్థతపై ఆసక్తి పెరుగుతూ ఉండడంతో ఆ రంగాని కి సంబంధించిన కోచ్ ల డిమాండు కూడా పెరుగుతున్నది. ‘జోగో టెక్నాలజీస్’ వంటి స్టార్టప్స్ ఈ డిమాండు తీర్చడంలో సహాయ పడుతున్నాయి.
మానసిక స్వస్థత కోసం ముంబయికి చెందిన ‘ఇన్ఫీ-హీల్’, ‘యువర్‌దోస్త్’ వంటి స్టార్టప్స్ పని చేస్తున్నాయి. నేడు కృత్రిమ మేధ (ఏఐ) వంటి సాంకేతికతను కూడా దీని కోసం ఉపయోగిస్తున్నారు. స్టార్టప్స్ జాబితా చాలా పెద్దది. అందువల్ల కొన్ని స్టార్టప్స్ పేర్లను మాత్రమే చెప్పగలను.
కాశీ-తమిళ సంగమంలో పాల్గొనేందుకు తమిళనాడు నుండి వేలాదీ ప్రజలు కాశీకి చేరుకున్నారు. వారితో సంభాషించేందుకు ఏఐ టూల్ ‘భాషిణి’ని మొదటిసారి ఉపయోగించాను. నేను వేదిక మీద ఉండి హిందీలో ప్రసంగించాను. భాషిణి కారణంగా అక్కడ ఉన్న తమిళులు నా ప్రసంగాన్ని తమిళ భాషలో విన్నారు. కాశీ-తమిళ సంగమానికి వచ్చిన ప్రజలు ఈ ప్రయోగం పట్ల చాలా ఉత్సాహంగా కనిపించారు. ఒక భాషలో మాట్లాడి, అదే ప్రసంగాన్ని ప్రజలు వారి మాతృభాషలో ఏకకాలంలో వినే రోజు ఎంతో దూరంలో లేదు. సినిమాల విషయంలో కూడా అదే జరుగుతుంది. సినిమా హాల్ లో కృత్రిమ మేధ సహాయంతో ఏక కాలంలో అనువాదాన్ని ప్రజలు వినగలుగుతారు. ఈ సాంకేతికతను మన పాఠశాలలు, ఆసుపత్రులు, న్యాయస్థానాలలో విస్తృతంగా ఉపయోగించినప్పుడు ఎంత పెద్ద మార్పు వస్తుందో ఊహించండి. ఏకకాల అనువాదాలకు సంబంధించిన కృత్రిమ మేధ సాధనాలను మరింతగా అన్వేషించాలని, వాటిని వంద శాతం సామర్థ్యంతో తీర్చిదిద్దాలని యువతరాన్ని కోరుతున్నాను.
ఝార్ఖండ్ లోని ఒక ఆదివాసీ గ్రామం అక్కడి పిల్లలకు వారి మాతృభాషలో విద్యను అందించడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొన్నది. గఢ్వా జిల్లా మంగళో గ్రామంలో బాలలకు విద్యను కుడుఖ్ భాషలో అందిస్తున్నారు. ఈ పాఠశాల పేరు ‘కార్తిక్ ఉరావ్ ఆదివాసీ కుడుఖ్ స్కూల్’. ఈ పాఠశాలలో 300 మంది ఆదివాసీ పిల్లలు చదువుతున్నారు. ఉరావ్ ఆదివాసీల మాతృభాష కుడుఖ్. ఈ భాషకు లిపి కూడా ఉంది. దీనిని ‘తోలంగ్ సికీ’ అని పిలుస్తారు. ఈ భాష క్రమంగా అంతరించిపోతోంది. దానిని కాపాడేందుకు ఈ సమాజం వారి పిల్లలకు విద్యను సొంత భాషలో అందించాలని నిర్ణయించుకొంది. ఆదివాసీ బాలలకు ఇంగ్లీషు భాష కష్టమని, అందుకే ఆ ఊరి పిల్లలకు మాతృభాషలో పాఠాలను చెప్పడం మొదలుపెట్టామని ఈ పాఠశాలను ప్రారంభించిన అరవింద్ ఉరావ్ అంటారు. ఆయన కృషి మెరుగైన ఫలితాలను ఇవ్వడం మొదలైనప్పుడు గ్రామస్థులు కూడా ఆయనతో కలిశారు. వారి సొంత భాషలో చదువుకోవడం వల్ల పిల్లల అభ్యసన వేగం కూడా పెరిగింది. మన దేశంలో చాలా మంది పిల్లలు భాషా సమస్యతో చదువును మధ్యలోనే వదలివేసే వారు. నూతన జాతీయ విద్యా విధానం అటువంటి సమస్యలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. పిల్లల చదువుకు, ప్రగతికి భాష ఆటంకం కాకూడదు అనేది మన ప్రయత్నం.
గుజరాత్ లో డాయరా సంప్రదాయం ఉంది. రాత్రంతా వేల కొద్దీ ప్రజలు డాయరాలో చేరి వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా పొందుతున్నారు. ఈ డాయరాలో జానపద సంగీతం, జానపద సాహిత్యం, హాస్యంల త్రివేణీ సంగమం అందరి మదిలో ఆనందాన్ని నింపుతున్నది. డాయరాకు చెందిన ప్రముఖ కళాకారుడు జగదీశ్ త్రివేదీ 30 సంవత్సరాలకు పైగా తన ప్రభావాన్ని కొనసాగించారు. ఇటీవల నాకు ఆయన నుండి ఒక లేఖ వచ్చింది. దాంతో పాటు ఆయన తన గ్రంథమొకటి పంపారు. ఆ గ్రంథం పేరు ‘సోషల్ ఆడిట్ ఆఫ్ సోషల్ సర్వీస్’. ఆ గ్రంథం చాలా విశిష్టమైంది. అందులో అకౌంటింగ్ బుక్ ఉంది. అది ఒక రకమైన బాలెన్స్ షీట్. జగదీశ్ త్రివేదీ గత 6 సంవత్సరాలలో వివిధ కార్యక్రమాల నుండి పొందిన ఆదాయం, ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలు గ్రంథంలో ఇచ్చారు. ఆయన తన మొత్తం ఆదాయాన్ని, ప్రతి ఒక్క రూపాయిని సమాజం కోసం ఖర్చు పెట్టారు. పాఠశాల, ఆసుపత్రి, గ్రంథాలయం, వికలాంగులకు సంబంధించిన సంస్థలు మొదలైన వాటి కోసం సమాజ సేవలో పూర్తి 6 సంవత్సరాల ఆదాయాన్ని ఖర్చు పెట్టారు. గ్రంథంలో ఒక చోట రాసినట్లు 2022లో ఆయన తన కార్యక్రమాల ద్వారా సంపాదించిన రూ.2,35,79,674 మొత్తం పాఠశాల, ఆసుపత్రి, గ్రంథాలయం కోసం ఖర్చు చేశారు. తన దగ్గర ఒక్క రూపాయి కూడా ఉంచుకోలేదు. నిజానికి దీని వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన కూడా ఉంది. తనకు 2017లో 50 ఏళ్లు నిండినప్పుడు తన కార్యక్రమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇంటికి తీసుకుపోకుండా సమాజానికి ఖర్చు చేస్తానని జగదీశ్ త్రివేది ఒక సందర్భంలో ప్రకటించారు. వివిధ సామాజిక కార్యక్రమాల కోసం 2017 నుండి ఆయన సుమారు రూ.8,75,00,000 ఖర్చు చేశారు. ఆయనకు మూడు పీహెచ్‌డీ డిగ్రీలు కూడా ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆయన 75 గ్రంథాలను వ్రాశారు. వాటిలో చాలా గ్రంథాలకు పురస్కారాలు కూడా వచ్చాయి. సామాజిక సేవకు కూడా ఎన్నో పురస్కారాలు స్వీకరించారు.
అయోధ్య రామ మందిరం విషయంలో దేశవ్యాప్తంగా ఆసక్తి, ఉత్సాహం ఉన్నాయి. ప్రజలు వారి భావాలను విధవిధాలుగా వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా శ్రీరాముడు, అయోధ్యకు సంబంధించి అనేక కొత్త పాటలు, కొత్త భజనలు స్వర పరచడం మీరు తప్పక చూసి ఉంటారు. చాలా మంది కొత్త కవితలు కూడా రాస్తున్నారు. ఇందులో చాలా మంది అనుభవజ్ఞులైన కళాకారులు ఉన్నారు. క్రొత్త, వర్ధమాన యువ కళాకారులు కూడా మనసుకు హత్తుకొనే భజనలను స్వర పరిచారు. నా సామాజిక మాధ్యమంలో కొన్ని పాటలను, భజనలను కూడా వెల్లడించాను. ఈ చారిత్రక ఘట్టంలో కళారంగం తనదైన ప్రత్యేక శైలిలో భాగస్వామి అవుతోంది అని తెలుస్తున్నది. అటువంటి మొత్తం రచనలను మనమందరం ఉమ్మడి హ్యాష్‌ట్యాగ్ తో పంచుకోవాలని భావిస్తున్నాను. #shriRamBhajan అనే హ్యాష్‌ట్యాగ్ తో సామాజిక మాధ్యమంలో మీ రచనలను పంచుకోవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. భావోద్వేగాలతో, భక్తితో కూడిన ఈ సమాహారం సర్వం రామమయం అయ్యేలా ఒక ప్రవాహంగా మారుతుంది.