Nizam Patel

నిజాంను ఎదిరించిన అమర వీరులను స్మరించుకుందాం

భారతదేశానికి ఆగస్టు15, 1947న స్వాతంత్య్రం వచ్చినప్పటికీ మనమున్న తెలంగాణకు (హైదారాబాద్‌ సంస్థానం) మాత్రం స్వేచ్ఛ లభించలేదు. ఇక్కడ ఆగస్టు 15, 1947 తర్వాత కూడా జాతీయ పతాకాన్ని ఎగరనిచ్చే వాడు కాదు నిజాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 13 నెలల 2 రోజులకు అనేక మంది ఉద్యమకారుల ప్రాణత్యాగాలకు తోడు, నాటి భారత హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చొరవతో సాగిన ‘పోలీస్‌ యాక్షన్‌’ కారణంగా సెప్టెంబరు 17, 1948న నిజాం నికృష్టపు పాలన నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగింది.

నిజాం రజాకార్లు తెలంగాణ ప్రజలను అనేక అకృత్యాలకు గురిచేశారు. మహిళలచే నగ్నంగా బతుకమ్మలు ఆడించారు. పన్నులు కట్టలేని పేద రైతులను ఎర్రటెండలో వంగబెట్టి, గుండెలపై బండలెత్తడం, సలసలకాగే నూనెలో చేతులు పెట్టించడం, గోళ్లూడగొట్టడం, బహిరంగంగా ఉరితీయడాలు, సామూహిక హత్యలు, దోపిడీలు, మానభంగాలు, ఊర్లపై పడి దోచుకోవడం, ఆడపిల్లలను ఎత్తుకుపోవడం ఇలా ఎన్నో దురాగతాలకు పాల్పడ్డారు. స్త్రీల మాన ప్రాణాలకు భద్రత లేని దుస్థితి. జైళ్లలో సైతం ఉద్యమకారులకు విషమిచ్చి చంపేవారు. పరకాల తాలూకాలో వంద మంది ఉద్యమకారులను చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు. పెరుమాండ్ల, అంకీసలో పన్నులు కట్టలేదని 21 రైతులను, నిజాం రజాకార్లను మూడుసార్లు ఉరికించిన భైరాన్‌పల్లి వాసులు 92మందిని, కూటిగల్లులో 25 మంది పోరాటయోధులను, ఏరుపాలెంలో మహిళలపై అత్యాచారాలు చేసి 70 మందిని, రజాకార్ల ఆకృత్యాలను ఎదిరించిన నల్గొండ జిల్లాలో మొత్తంలో 2వేల మంది ఇలా ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నారు. బీబీనగర్‌లో ఖాసిం రజ్వి నాయకత్వంలో అకృత్యాలకు పాల్పడుతున్న రజాకార్లను చూసి ‘నవ్విన’ చిన్నపిల్లలను అక్కడికక్కడే నరికేసి, ఆ ఊరిపై పడి బీభత్సాన్ని సృష్టించారు. షోలాపూర్‌ దగ్గరలోని మంగోలు గ్రామంలో 43 మంది స్త్రీ, పురుషులను చెట్లకు కట్టేసి తుపాకి మడమలతో చచ్చేంత వరకు కొడుతూ పైశాచికానందాన్ని పొందారు. సుపరిపాలనాదక్షులైన అక్కన్న, మాదన్నలను నైజాం గుండాలు నడిబజార్లో నరికి చంపారు. పంజాగుట్టలో తల్లీకూతుళ్ళను, సైదాబాద్‌లో స్త్రీలను వాళ్ళ భర్తలు, పిల్లల ముందే చెరిచిన సంఘటనల్లాంటి ఉదాహరణలు వేలాదిగా జరిగాయి. నిర్మల్‌లో వందలాది మంది ఉద్యమకారులను ఉరులమర్రిగా పేరొందిన మర్రిచెట్టు కొమ్మలకు బహిరంగంగా ఉరితీసిన దుర్ఘటన, కొడకండ్లలో బ్రాహ్మణులను చెట్టు కొమ్మలకు తలకిందులుగా వేలాడదీసి కింద మంట పెట్టి సజీవదహనం తరహా దుర్ఘటనలు మచ్చుకు కొన్ని మాత్రమే. కొద్ది హెచ్చుతగ్గులతో తెలంగాణ పల్లెలన్నింటిలోను ఇలాంటి సంఘటనలు వేలల్లో చోటుచేసుకున్నాయి. తెలంగాణ పల్లెల్లో వాటి ఆనవాళ్లు ఇప్పటికీ దర్శనమిస్తాయి.

 1927లో నిజాం మత మార్పిడి కోసమే స్థాపించిన అంజుమన్‌-ఎ-తబ్లిక్‌-ఎ-ఇస్లాం రంగులు మార్చి మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ అయింది. ముస్లిం ఎక్తెదార్‌ (ముస్లిం ఆధిక్యత) దీని నినాదం. తబ్లిక్‌ ఉద్యమం అంటే మత మార్పిడి ఉద్యమం. ఎంతో మంది హిందువులపై అత్యాచారాలు చేసి ప్రలోభాలకు గురిచేసి ముస్లింలుగా మార్చారు. ఈ దౌర్జన్యాన్ని ఎదుర్కోవడానికి ఆర్య సమాజ్‌, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్, ఇతర స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నించాయి.

ప్రజల ముక్కు పిండి బలవంతంగా వసూలు చేసిన పన్నులతో నిజాం ధనవంతుడయ్యాడు కానీ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేదు. మాతృభాషలను తొక్కి బలవంతంగా ఉర్దూ భాషను ప్రజలనెత్తిన రుద్దిన నిజాం జాగీరు ఆదాయమంతా తన కుటుంబ ఖర్చులకేనని పాఠశాలలు ఏర్పరచడానికి వీల్లేదని ఫర్మానా (ఉత్తరువు) జారీ చేశాడు. సేవా దృక్పథంతో ఆర్య సమాజ్‌ ఏర్పాటు చేసిన పాఠశాలలనెన్నింటినో నిజాం మూయించాడు. తెలంగాణ ప్రజల ముక్కుపిండి వసూలు చేసిన పన్నులతో ఆలీఘడ్‌ ముస్లిం యూనివర్సిటీకి, జామా మసీదులో బండలు వేయడానికి, అంబాల, కాన్పూర్‌ లాంటి చోట్ల ముస్లిం హై స్కూళ్ళు ఏర్పాటు చేసేందుకు పంపేవారు.

నిజాం పాలనను అంతమొందించడానికి ప్రజలు త్యాగాలకు వెనుకాడలేదు. వృద్ధులు, పిల్లలు, చంటిపిల్లల తల్లులతో సహా ప్రతి పల్లె కదనరంగంలోకి దూకింది. ఒడిశలలో రాళ్లతో, ఒడిలో కారంపొడితో ప్రారంభమైన ఉద్యమం రణరంగంగా మారింది. ‘బండెనక బండికట్టి, పదహారు బండ్లు గట్టి, ఏ బండ్లె వస్తవు కొడుకో! నైజామ్‌ సర్కరోడా….’ లాంటి పల్లెపదాలతో ప్రజలు ఎదురుతిరిగారు. తెలంగాణ ప్రజల వీరత్వానికి సర్దార్‌ పటేల్‌ ధీరత్వం తోడుకావడంతో సెప్టెంబర్‌ 17, 1948 న తెలంగాణ విముక్తమైంది. భారత ప్రభుత్వానికి సెప్టెంబర్‌ 17, 1948 న నిజాం లొంగిపోయాడు.

మేమే నిజాం మెడలు వంచామని గొప్పలు చెప్పుకునే కమ్యునిస్టులు, 1946లో తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రారంభించినప్పటికీ 1948లో నిజాంతో కుమ్మక్కై, భారత ప్రభుత్వ సైనిక దళాలకు వ్యతిరేకంగా పని చేశారనేది చారిత్రక సత్యం. 1948 సెప్టెంబర్‌ 17న నిజాం లొంగిపోవటంతో ఆపాల్సిన సాయుధ పోరాటాన్ని 1951 వరకు సాగించటంతో, సాయుధ పోరాటం నిజాంకు వ్యతిరేకంగా జరగలేదనేది స్పష్టమవుతుంది. ఇది కమ్యూనిస్టులు సైతం ఒప్పుకోక తప్పని చారిత్రక తప్పిదం.

భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో హైదరాబాద్‌ రాష్ట్రం నుండి విడిపోయి కర్నాటక, మహారాష్ట్రలలో చేరిన నాటి నైజాం జిల్లాలలో సైతం అక్కడున్న ప్రభుత్వాలు అధికారికంగా సెప్టెంబరు 17న జాతీయ జెండా పండగ జరుపుతుంటే ఇక్కడి పాలకులు మాత్రం ససేమిరా అన్నారు. బిజెపి ఉద్యమాలతో తలొగ్గి గత ఏడాది అధికారికంగా వేడుకలు నిర్వహించేందుకు అప్పటి ప్రభుత్వం ముందుకు వచ్చినా మన ఉద్యమకారుల చరిత్ర ఈ తరానికి తెలియకుండా కుట్రలు పన్నుతూ ‘విమోచన దినం’ అనకుండా వక్రభాష్యాలు పలికింది. విమోచన అనగానే కొందరికి శరీరం మీద జెర్లు పాకినట్లు వంకర్లు పోతారు. ఎందుకంటే దేని నుండి విమోచన జరిగిందో ఆ కథ మొత్తం తవ్వితే చాలా అస్తిపంజరాలు బయటికి వస్తాయని భయపడుతారు. విమోచన అనగానే భుజాలు తడుముకునే వాళ్లుంటారు. అందుకని సింపుల్‌ గా విలీనం అంటే సరిపోతుంది లెమ్మంటారు కొందరు. ఇంకా కొందరు ఇప్పటికీ అది విద్రోహమే అంటారు. భారతదేశంలో కలుపటం విద్రోహమన్న మాట!! ప్రజలకు సంబంధించి 17 సెప్టెంబర్‌ విమోచన దినమే.. విలీన దినమే.. రండి అందరం కలసి వాడవాడలా జాతీయ జెండాను ఎగురవేద్దాం.. స్వతంత్ర వేడుకలు జరుపుదాం! అమర వీరులకు అంజలి ఘటిద్దాం!!