J.P. Nadda

2024 ఎన్నికలకు మాకు అంతా సానుకూలమే

JP Nadda at BJP HQ

ఉత్తర-దక్షిణ విభజన వాదాన్ని విశ్వసించమని, ఇది ప్రతిపక్ష ‘ఇండీ’ కూటమి సృష్టి అని బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా అన్నారు. దక్షిణాదిలో బిజెపికి 29 మంది ఎంపీలు ఉంటే, కాంగ్రెస్‌కు 27 మందే ఉన్నారని తెలిపారు. మొదట హిందీ ప్రాంతాలలో వేళ్ళూనుకున్న బిజెపి క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరించిందని, ఇప్పుడు దక్షిణాదిలో మరింత విస్తరించడానికి కృషి చేస్తున్నామన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికలో బిజెపి ఘనవిజయాలు సాధించిన నేపథ్యంలో ఒక ఆంగ్ల వార పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జె.పి. నడ్డా ఈ రాష్ట్రాల్లో భారీ విజయాలకు గల కారణాలు, బిజెపి వ్యూహాలు, నరేంద్ర మోదీ హామీల నుంచి పార్టీకి చేకూరిన లబ్ధి, 2024 సార్వత్రిక ఎన్నికలు తదితర అంశాలపై మాట్లాడారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు: 

ప్ర. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం బిజెపి రూపొందించే ప్రణాళికలలో మూడు రాష్ట్రాల్లో ఇటీవలి విజయాలు ఎటువంటి పాత్ర నిర్వహిస్తాయి?

జ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా విశ్వసనీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. ‘‘మోదీ హామీల’’ ద్వారా సమాజంలోని ప్రతి వర్గాన్ని, సామాన్యులు, మహిళలు, రైతులు, అట్టడుగున ఉన్న వారి అవసరాలను, ఆకాంక్షలను ఆయన స్పృశించారు. మోదీ సమర్థ నాయకత్వంలో దేశం సురక్షితంగా ఉందని దేశవ్యాప్తంగా సామాన్యులు భావిస్తున్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అవినీతి, బంధుప్రీతి, క్షీణిస్తున్న శాంతిభద్రతలు, యువతకు తప్పుడు వాగ్దానాల కారణంగా ప్రభుత్వాలు వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. గతంలో రెడ్ డైరీ కుంభకోణం ఉండగా కొత్తగా మహాదేవ్ యాప్ కుంభకోణం బయటపడింది. రెండు రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలు జరిగాయి. యువత అసంతృప్తితో ఉన్నారు. రైతులు మోసపోయామని భావించారు. కానీ మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న అభివృద్ధి, యువత, మహిళా సాధికారత కారణంగా ప్రభుత్వ అనుకూలత ఉంది. రైతులు, ఇతర వినియోగదారుల కొనుగోలు సామర్థ్యం పెరిగింది. ఎంపీలో కేంద్ర ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులందరికీ చేరుకోగా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలోని కాంగ్రెస్ పాలకులు కేంద్ర అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడానికి నిరాకరించారు. బిజెపి యంత్రాంగం సానుకూలాంశాలతో పాటు ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకునే స్థితిలో ఉంది.

ప్ర: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు స్థానికంగా పలుకుబడిగల ఎంపీలను రంగంలోకి దించడం ద్వారా బిజెపి ఈసారి భిన్నమైన టెక్నిక్‌ని ఉపయోగించింది. ఈ వ్యూహం లక్ష్యం ఏమిటి?

జ: ఇది పరిస్థితుల దృష్ట్యా అవసరమైంది. ఎవరైనా ఎక్కడ అవసరమైతే అక్కడికి వెళ్లాలి. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేకత లేదు. అయితే కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలని మొదటి నుంచీ అనుకున్నాం. ఇది నిరంతర ప్రక్రియ. ఇది శివరాజ్ జీ లేదా మరే ఇతర నాయకుడి మీద వ్యతిరేకతతో కాదు. మా వ్యూహంతో కాంగ్రెస్‌ కంగుతిన్నది. ప్రత్యర్థులు ఆశ్చర్యపోయేలా మేం ఎల్లప్పుడూ మా వ్యూహాలు రచించేందుకు ప్రత్యత్నిస్తాం. వారిని దిక్కుతోచని స్థితిలోకి నెడతాం. అది పని చేసింది.

ప్ర. రాజస్థాన్, ఎంపీ, ఛత్తీస్‌గఢ్‌ లలో మీకు సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ ముగ్గురు కొత్త వారిని ముఖ్యమంత్రులుగా తీసుకురావడం కూడా అదే వ్యూహంలో భాగమా?

జ: మేం నాయకత్వంలో తరాల మార్పును తీసుకురావాలి. మాది కాంగ్రెస్ పార్టీ వంటిది కాదు. అక్కడ ఉన్న పెద్దలు యువ నాయకులను రానివ్వరు. పార్టీ ఎదగాలి. 2009-10లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించినప్పుడు నేను రాష్ట్ర మంత్రిగా ఉన్నాను. మరికొందరు కొత్తవారిని కూడా నియమించారు. మా నియామకంపై చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే మమ్మల్ని కావాలనే నాయకత్వం పార్టీ యంత్రాంగంలోకి తీసుకు వచ్చింది. నేను కూడా యువ నాయకులను తీసుకురావాలని నిర్ణయించుకున్నాను.

ప్ర: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ఎంపికపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పరిపాలనా అనుభవం లేని, మొదటిసారి ఎమ్మెల్యేగాఎన్నికైన వ్యక్తిని ఎంపిక చేయడంలో ఉద్దేశం?

జ: శివరాజ్‌ సింగ్ కి కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు పరిపాలనా అనుభవం లేదు. అలాగే యోగీజీ, ఖట్టర్‌జీ, జైరాంజీ లేదా ధామీజీలకు కూడా ముఖ్యమంత్రులుగా పగ్గాలు చేపట్టినప్పుడు ఎలాంటి పరిపాలనా అనుభవం లేదు. మేమంతా వారికి అండగా నిలబడి, ప్రధాన సమస్యలపై వారికి స్పష్టత కలిగించి, ఆ సమస్యలను పరిష్కరించడంలో వారికి సహాయం చేస్తాం.

ప్ర: ఉదాహరణకు మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రిగా చేసి ఉండొచ్చు. మొదటి నుంచి పార్టీలో ఎదిగిన సభ్యులను ముఖ్యమంత్రులుగా నియమించడం ఉద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయమా?

జ: పరిస్థితులపై ఇది ఆధారపడి ఉంటుంది. మన సొంత వ్యక్తులు ఉన్నప్పుడు వారికే ప్రాధాన్యం ఇస్తాం. మనం బయటి నుంచి మనుషులను తీసుకువస్తే, వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇవ్వాలి. కొత్త వ్యక్తులను తీసుకోవడానికి మాకు విముఖత లేదు, పార్టీలో చరిత్ర ఉన్న వ్యక్తులను ప్రోత్సహించడానికి సమాన ప్రాధాన్యం ఇస్తాం. కేంద్రంలో సింధియాజీకి పాత్ర ఉంది. ఆయనకు చాలా ముఖ్యమైన శాఖ ఇచ్చారు.

ప్ర. శివరాజ్, వసుంధర రాజేలను ఎలా ఉపయోగించుకోవాలని పార్టీ యోచిస్తోంది? లేక వారు పదవీ విరమణ చేసినట్టేనా?

జ: వారి స్థాయి దృష్ట్యా వారు చేయాల్సిన పని చాలా ఉంది. వారికి విశేషమైన అనుభవం ఉంది. వారు రిటైర్ అయ్యే సమస్యే లేదు. 2024 ఎన్నికల్లో వీరిదే కీలక పాత్ర.

ప్ర. కొత్త ముఖ్యమంత్రులను ఎన్నుకునేటప్పుడు కులపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి బిజెపికి కూడా కులం కీలకమైన అంశమేనా?

జ: ‘సబ్కా సాథ్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్’. మాకు అందరూ సమానమే. మేం ఆచరణాత్మక రాజకీయాలను నమ్ముతాం. కుల రాజకీయాలను జెడిలదీ అదే పరిస్థితి. కానీ అందుకు భిన్నంగా బిజెపిలో అందరికీ ప్రాతినిధ్యం లభిస్తుంది. ఇంతకుముందు మాది ‘‘బ్రాహ్మణ- బనియా పార్టీ’’ అని అనేవారు. ఇప్పుడు మేం అందరికీ ప్రాతినిధ్యం వహిస్తాం. అన్ని వర్గాలను జాగ్రత్తగా చూసుకుంటాం. మాకు కులతత్వంపై నమ్మకం లేదు.

ప్ర: ప్రతిపక్షాలు, ముఖ్యంగా ‘ఇండియా’ కూటమిలోని కొన్ని పార్టీలు జాతీయ కుల గణన కోసం ఒత్తిడి తెస్తున్నాయి. నితీష్ కుమార్ బీహార్‌లో కులగణన కూడా నిర్వహించారు. దీనిపై బిజెపి వైఖరి ఏమిటి? 

జ: మేం బీహార్‌లో కుల సర్వేకు మద్దతు ఇచ్చాం, కానీ జాతీయ కులగణనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతిపక్షాలు దీనిపై రాజకీయాలు చేయాలనుకుంటున్నాయి. వారు సమాజంలోని అన్ని వర్గాల వర్గాల అభ్యున్నతిని కోరుకోరు. వారు ఓబిసి ఓట్లను గెలుచుకోవడానికి పనికొచ్చే నినాదాలపై మాత్రమే ఆసక్తి చూపుతారు. ఇటీవలి ఎన్నికలలో కుల గణన అంశాన్ని లేవనెత్తడానికి వారు ప్రయత్నించారు గాని అది ఫలించలేదు. వెనుకబడిన తరగతులపై కాకా కాలేల్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికను జవహర్‌లాల్ నెహ్రూ విస్మరించారు. అటువంటప్పుడు బిసిల గురించి మాట్లాడటానికి కాంగ్రెస్‌కు ఏ నైతిక హక్కు ఉంది? 1980లో సమర్పించిన మండల్ కమిషన్ నివేదికపై ఇందిరా గాంధీ, ఆ తర్వాత రాజీవ్‌ గాంధీ ప్రధాన మంత్రులుగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. లాలూ ప్రసాద్, రబ్రీ దేవి బీహార్‌లో 15 ఏళ్లు ముఖ్యమంత్రులుగా ఉండి ఓబీసీలకు ఏం చేశారు? నితీష్‌ కుమార్ చాలాకాలంగా ముఖ్యమంత్రిగా ఉంటూ ఏం చేశారు? అసలు విషయం పట్ల వారికి నిజాయితీ లేదు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. కానీ ప్రధాని మోదీ నాయకత్వంలో బిజెపి అన్ని వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తోంది. దీని కారణంగా సమాజ వ్యవస్థకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

ప్ర. ఉత్తర-దక్షిణ రాజకీయ విభజన గురించి జరుగుతున్న చర్చపై బిజెపి వైఖరి ఏమిటి? పార్టీ కర్ణాటకలో ఓడిపోయింది, తెలంగాణలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది.

జ: మేం ఈ ఉత్తర-దక్షిణ విభజన వాదాన్ని విశ్వసించం. ఇది ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి సృష్టి. దక్షిణాది నాయకులు, సాహితీవేత్తలు, ఇతర విషయాలతోపాటు వారి సాంస్కృతిక విలువల గురించి ప్రధాని మోదీ అనేకసార్లు మాట్లాడారు. దక్షిణాదిలో బిజెపికి 29 మంది ఎంపీలు ఉన్నారు; కాంగ్రెస్‌కు 27 ఉన్నారు. ప్రతి రాజకీయ పార్టీకి దాని సొంత ఆవిర్భావ గాథ ఉంటుంది. మేం హిందీ ప్రాంతాలలో మొదట వేళ్ళూనుకున్నాం. క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరించాం. ఇప్పుడు, మేం దక్షిణాదిలో మరింత విస్తరించడానికి కృషి చేస్తున్నాం. తెలంగాణలో మా ఓట్ల శాతం 7 నుంచి 14కు పెరిగింది. భవిష్యత్తులో మేం మరింత వేగంగా విస్తరిస్తాం.

ప్ర. 2024లో ఎన్నికలకు వెళ్లనున్న నేపథ్యంలో 2023లో తొమ్మిది రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల నుంచి మీరు ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారు? అకాలీదళ్‌, టీడీపీ వంటి పార్టీలతో సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయా?

జ: మేం ప్రతి ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంటాం. కానీ ప్రతి రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. మేం పరిస్థితులకు అనుగుణంగా వేగంగా స్పందిస్తూ ఆచరణాత్మకంగా ఉండాలి. ప్రధానమంత్రి మోదీ నాయకత్వం మొదలుకుని ఎన్నికల ఫలితాలను నిర్ణయించే ప్రతి అంశం 2024కు సంబంధించి మాకు అనుకూలంగా ఉంది. వాటిని పూర్తిగా ఉపయోగించుకోవడం మాపై ఆధారపడి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నికలకు తేడా ఉంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఏడాది నుంచి జరుగుతోంది. మా బలం పెరుగుతోంది. మేం గెలవని 150 లోక్ సభ సీట్లను ఎంపిక చేసి వాటిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తున్నాం. కొన్ని రాష్ట్రాల్లో మాకు నాయకత్వ సమస్యలు ఉన్నాయి. కానీ లోక్‌సభ ఎన్నికల విషయానికి వస్తే మాకు ప్రధాని మోదీ ఉన్నారు. టీడీపీ లేదా అకాలీదళ్‌కు సంబంధించినంత వరకు మేం వారితో దీనిపై మాట్లాడలేదు.

ప్ర. ప్రాంతీయ నాయకులు తమ సొంత గడ్డపైనే ఎన్నికల్లో పోటీ చేయాలని ఇండియా కూటమి యోచిస్తున్నట్లు కనిపిస్తోంది. బలమైన అభ్యర్థులకు టిక్కెట్లు వచ్చేలా సీట్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని వారు భావిస్తున్నారు. కొత్త కూటమిని బిజెపికి సవాలుగా భావిస్తున్నారా?

జ: ఓట్లపరంగా అఖిలేష్‌కు మమత ఎన్ని ఓట్లు ఇస్తారో చెప్పండి? బెంగాల్‌లో అఖిలేష్, లేదా ఛత్తీస్‌గఢ్‌లో శరద్ పవార్ ఏమి సాధిస్తారు? గోవాలో మమత, లేదా హిమాచల్‌లో (అరవింద్) కేజ్రీవాల్ ఏం సాధించారు? ఈ పార్టీలు వేరేచోట ప్రభావం చూపలేవు. ఇండియా కూటమిలో ఓట్ల బదిలీ జరగదు. వారికి పొత్తులు ఉన్నాయి, కానీ అవి ఓట్లుగా మారే అవకాశం లేదు.

ప్ర. కొవిడ్ మహమ్మారి తర్వాత దేశ ఆర్థిక వృద్ధి కె-ఆకారంలో ఉందని, ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారని, పేదల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయం?

జ: ఇది రాజకీయ దురుద్దేశంతో చెప్పే మాట. మోదీ సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ నుంచి స్థూల ఆర్థిక వ్యవస్థ వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 13.5 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువ నుంచి పైకి వచ్చారు. ఆర్థికంగా అది ముఖ్యం కాదా? రెండవది, వినియోగం విస్తరించింది. ఇంతకుముందు సామాన్యులు రోటీ-కపడా-మకాన్ (ఆహారం, దుస్తులు, నివాసం), మందుల గురించి ఆలోచించేవారు. కానీ ప్రధానమంత్రి మోదీ పాలనలో ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి అన్న యోజన, ఆవాస్ యోజన, సబ్సిడీ గ్యాస్ మొదలైన పథకాల ద్వారా ఈ సమస్యల్లో ప్రతి ఒక్కటీ పరిష్కారమయ్యాయి. సామాన్యుల దగ్గర ఇప్పుడు ఖర్చు చేయడానికి డబ్బు మిగులుతోంది. అందువల్ల ‘ధనికులు మరింత ధనికులు అవుతున్నారు’ అనేది తప్పుడు కథనం. ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటోంది. మా ప్రభుత్వాలు ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు ఉద్దేశించినవి. అవి ప్రజలను సాధికారీకరిస్తాయి. 

ప్ర: బిజెపి ఎప్పుడూ ఎన్నికలకు ఒక ప్రధాన అంశాన్ని నిర్ణయిస్తుంది. ఉదాహరణకు 2014లో ప్రధానమంత్రిని దేశ ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు ప్రతీకగా చూపారు. 2019లో ఆయన జాతీయ భద్రతా రక్షకుడు, కార్యదక్షుడు. 2024 ఎన్నికలకు బిజెపి ప్రధానాంశం ఏమిటి? 

జ: దేశానికి సుస్థిరత అవసరం. మోదీలో, బిజెపిలో ఈ సుస్థిరత ఉంది. ఆయన అన్ని రంగాలలో లక్ష్యాలు సాధించారు. కనుక ప్రజలు ఆయనతో కలిసి ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. ఇప్పుడు లక్ష్యం ‘2047లో వికసిత్ భారత్‌’. ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని సామాన్యులు విశ్వసిస్తున్నారు.

Tags: