ఇండీ కూటమిలో ఇంటిపోరు
ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ శాసనసభ్యులు తమ పార్టీ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీకి వ్యతిరేకంగా ఓటువేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ మిత్రపక్షం సమాజ్‌వాది పార్టీలో అరడజనుకు పైగా ఎమ్మెల్యేలు తమ అధికార అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసి భారతీయ జనతా పార్టీకి అదనంగా మరొక రాజ్యసభ సీటు కట్టబెట్టారు. మొన్నటిదాకా రాజ్యసభ సభ్యుడిగా ఉండి మళ్ళీ సీటు ఆశించిన ఆనంద్ శర్మ, హిమాచల్‌తో సంబంధం లేని సింఘ్వీని రాజ్యసభకు పోటీ చేయించడంపై నిరసన వ్యక్తం చేశారు. హిమాచల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్ఖూపైనా పార్టీలో అసమ్మతి ఉందన్నది బహిరంగ రహస్యమే.
పద్నాలుగు నెలల క్రితం సుక్ఖూను కాంగ్రెస్ అధిష్ఠానం హిమాచల్ ముఖ్యమంత్రిగా ప్రకటించినప్పుడే కొందరు ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. గతంలో ఆరుసార్లు హిమాచల్ సీఎంగా చేసిన వీరభద్ర సింగ్ భార్య, ప్రస్తుత పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్నుగానీ, ఆమె కుమారుడు విక్రమాదిత్యనుగానీ ముఖ్యమంత్రిగా నియమించాలన్నది వారి అభిమతం. దాన్ని కాదని అధిష్ఠానం సుక్ఖూ వైపు మొగ్గింది. ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచే పార్టీలో అసమ్మతి ఎదుర్కొంటున్నారు. సుక్ఖూ వ్యతిరేకులు రాజ్యసభ ఎన్నికల దాకా ఆగి ఆయన్ను దెబ్బతీశారు. హిమాచల్ అసెంబ్లీలో 68 స్థానాలున్నాయి. కాంగ్రెస్‌కు 40మంది, బిజెపికి 25 మంది సభ్యుల బలం ఉంది. ముగ్గురు ఇండిపెండెంట్లున్నారు. రాజ్యసభ ఎన్నికలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్ల ఓట్లను చేజిక్కించుకోవడం ద్వారా బిజెపి అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు 34 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి మను సింఘ్వీకి సైతం 34 ఓట్లు దక్కాయి. ఎన్నికల సంఘం డ్రా ద్వారా విజేతను ప్రకటించింది. మహాజన్ గెలుపుతో కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి అస్థిరంగా మారింది. రాజ్యసభ ఎన్నిక ముగిసిన మరుసటి రోజు 15 మంది బిజెపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి బడ్జెట్‌ను మూజువాణీ ఓటుతో ఆమోదించారు. తరవాత శాసనసభ వాయిదా పడింది. రాజ్యసభ ఎన్నికలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ విధివిధానాలను స్పీకర్ సరిగ్గా పాటించలేదంటూ వారు కోర్టును ఆశ్రయించారు. ప్రతిభా సింగ్ కుమారుడు, పీడబ్ల్యూడీ మంత్రి విక్రమాదిత్య సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి తనను పని చేయనివ్వడం లేదని ఆయన ఆరోపించారు. హిమాచల్‌లో బయటి వ్యక్తిని రాజ్యసభకు నామినేట్ చేయడం కాంగ్రెస్ అధిష్ఠానం స్వయంకృతాపరాధమే. రాష్ట్ర కాంగ్రెస్‌లో లుకలుకలు తారస్థాయికి చేరినందువల్ల రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ విజయావకాశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో నాలుగు లోక్‌సభ స్థానాలున్నాయి.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్‌లో 63 సీట్లకు సమాజ్‌వాది, 17 సీట్లకు కాంగ్రెస్ పోటీ చేయాలని ఒప్పందం కుదిరింది. రాజ్యసభ ఎన్నికల్లో ఏడుగురు సమాజ్‌వాది సభ్యులు బిజెపికి ఓటు వేయడంతో పొత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ తిరుగుబాటు సభ్యులు సోనియా, రాహుల్ నియోజకవర్గాలైన రాయ్‌బరేలీ-అమేఠీలకు చెందినవారే. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి తాము వ్యక్తిగత హోదాలోనైనా హాజరుకావడానికి సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అనుమతించకపోవడంపై వారు గుర్రుగా ఉన్నారు. అయోధ్య కార్యక్రమంలో పాల్గొంటే ముస్లిం ఓటుబ్యాంకును కోల్పోతానని అఖిలేశ్ భయం. రామమందిర కార్యక్రమానికి ఆయన గైర్హాజరు కావడం యాదవ వర్గానికి రుచించడం లేదు. ఇది రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్-సమాజ్‌వాది పొత్తు విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ గాంధీ గత లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి ఎన్నికయ్యారు. ఈసారి ఇక్కడి నుంచి వామపక్షాలే పోటీ చేయదలచాయి. అందువల్ల రాహుల్ తెలంగాణలో ఏదో ఒక నియోజకవర్గానికి మారవచ్చు. మరోవైపు సోనియా గాంధీ ఇటీవల రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తల్లీ కుమారులు కుటుంబ నియోజకవర్గాలైన రాయ్‌బరేలీ, అమేఠీలను వదలి వేరే స్థానాలను వెతుక్కోవలసి రావడం ప్రతిపక్షాల ఉత్సాహంపై నీళ్లు చల్లే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంతమేర ఓట్లు, సీట్లు రాబడుతుందో వేచి చూడాలి.
వీరేంద్ర కపూర్
సామాజిక, రాజకీయ విశ్లేషకులు