Vandebharat

సికింద్రాబాద్-విశాఖ మధ్య రెండో వందేభారత్

Modi Flag offతెలంగాణలో మరో వందేభారత్ రైలు పరుగులు పెడుతోంది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రెండో వందేభారత్ రైలును మార్చ్ 12న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ నుంచి వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే రోజు నరేంద్ర మోదీ గుజ‌రాత్‌లోని అహ్మదాబాద్‌లోని ప్రత్యేక రవాణా కారిడార్ (డిఎఫ్‌సి) కార్యకలాపాల నియంత్రణ కేంద్రం ప్రాంగణంలో రూ.1,06,000 కోట్లకు పైగా విలువైన ప్రగతి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాపన చేశారు. వీటిలో రైల్వే మౌలిక సదుపాయాలు సహా అనుసంధానం, పెట్రో రసాయనాల రంగానికి సంబంధించిన ప్రాజెక్టులున్నాయి. ఈ కార్యక్రమాలతోపాటు 10 కొత్త వందే భారత్ రైళ్లను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా 200కుపైగా ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమాలతో మమేకమైన ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.

‘‘ఈ ఏడాది (2024) తొలి 75 రోజుల్లోనే రూ.11 లక్షల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయగా, గత 10-12 రోజుల్లోనే రూ.7 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో నేటి కార్యక్రమం వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా కీలక ముందడుగని పేర్కొన్నారు. ఈ మేరకు దాదాపు రూ.1 లక్ష కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం లేదా శంకుస్థాపన చేయగా, వీటిలో రూ.85,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు రైల్వేలకు సంబంధించినవని వివరించారు. రైల్వే బడ్జెట్‌ ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయడాన్ని ప్రస్తావిస్తూ రైల్వేల కోసం నిధుల వ్యయానికి వీలు ఏర్పడిందని పేర్కొన్నారు. 2014 ముందు సమయపాలన, పరిశుభ్రత, ప్రజా సౌకర్యాల కొరతతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని 6 రాజధానులకు రైల్వే అనుసంధానం ఉండేది కాదని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 10,000కుపైగా మానవరహిత రైల్వే క్రాసింగ్‌లు ఉండేవి, రైలు మార్గాల విస్తరణ, విద్యుదీకరణ 35 శాతానికే పరిమితం, రైల్వే రిజర్వేషన్లలో అవినీతి, బారెడు క్యూలైన్లు ఉండేవని గుర్తుచేశారు. 2014 నుంచి రైల్వే బడ్జెట్ 6 రెట్లు పెరిగిందని, రాబోయే ఐదేళ్లలో రైల్వేల పరివర్తన అనూహ్య స్థాయిలో దూసుకెళ్లగలదని దేశప్రజలకు గ్యారంటీ ఇస్తున్నానని చెప్పారు. చాలా రాష్ట్రాలకు ఇప్పుడు వందే భారత్ రైళ్లు వచ్చాయని, వందే భారత్ రైళ్ల శకం ఇప్పటికే అన్నివైపులా విస్తరిస్తున్నదని తెలిపారు. ఈ మేరకు వందే భారత్ నెట్‌వర్క్ దేశంలోని 250 జిల్లాలకు చేరగా, ప్రజాకాంక్షలకు అనుగుణంగా ఈ మార్గాలను పొడిగిస్తున్నట్లు తెలిపారు. రైల్వేల రూపాంతరీకరణ ముఖచిత్రాన్ని వివరిస్తూ.. శరవేగంగా రైలు మార్గాల నిర్మాణం, 1300కుపైగా రైల్వే స్టేషన్ల నవీకరణ, వందే భారత్/నమో భారత్/అమృత్ భారత్ వంటి భవిష్యత్ తరం రైళ్లకు శ్రీకారం, ఆధునికీకరించిన రైల్వే ఇంజిన్ల/కోచ్ ఫ్యాక్టరీల ఆవిష్కరణ తదితరాలను ప్రధాని ఏకరవు పెట్టారు. గ‌తిశ‌క్తి కార్గో టెర్మిన‌ల్ విధానం కింద, భూమి లీజు విధానాన్ని సరళం చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో పారదర్శకతకు పెద్దపీట వేయడంతో సరకు రవాణా టెర్మినళ్ల నిర్మాణం పెరిగిందని ప్రధానమంత్రి అన్నారు. అలాగే గతిశక్తి విశ్వవిద్యాలయం ఏర్పాటు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. రైల్వే రంగంలో 100 శాతం విద్యుదీకరణ దిశగా దేశం నేడు దూసుకెళ్తోందని తెలిపారు. అలాగే స్టేషన్లు సౌరశక్తితో పని చేయడంతోపాటు ప్లాట్ ఫారాలపై జన ఔషధి కేంద్రాలు కూడా కొలువు దీరనున్నాయని చెప్పారు.G. Kishan Reddy Secunderabad

శ్రీలంక, మొజాంబిక్, సెనెగల్, మయన్మార్, సూడాన్ వంటి దేశాలకు నేడు ‘మేడ్ ఇన్ ఇండియా’ ఇంజిన్లు, రైలు పెట్టెలు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. అలాగే ‘మేడ్ ఇన్ ఇండియా’ సెమీ హైస్పీడ్ రైళ్లకు డిమాండ్ పెరగడం వల్ల వీటి తయారీకోసం అనేక కర్మాగారాలు ఆవిర్భవించనున్నట్లు తెలిపారు. దేశంలో గత 10 సంవత్సరాల ప్రగతికి తూర్పు-పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్‌లే ప్రత్యక్ష ఉదాహరణలని ప్రధానమంత్రి వివరించారు. గూడ్స్ రైళ్ల కోసం ఏర్పాటు చేస్తున్న ఈ ప్రత్యేక మార్గం సరకు రవాణా వేగాన్ని మరింత పెంచుతుందన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, <span “=”” style=’box-sizing: border-box;user-select: text !important’>ఎగుమతి వ్యాపారం వగైరాలకు ఇదెంతో కీలకం కాగలదని చెప్పారు.

దేశంలోని విశ్వకర్మలు, చేతివృత్తులవారు, హస్తకళాకారులు, మహిళా స్వయం సహాయ సంఘాలు వంటివి తయారుచేసే ఉత్పత్తులను నేడు రైల్వే స్టేషన్‌లలో విక్రయిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ‘ఒక స్టేషన్-ఒక ఉత్పత్తి’ పథకం కింద ఇప్పటికే 1500 విక్రయ కేంద్రాలు తెరిచామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తదితరులు కూడా పాల్గొన్నారు.