న్యాయ వ్యవస్థపై బురద జల్లుతున్న ప్రతిపక్షాలు
ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ చట్టం, పరిపాలనకు రక్షణ కవచంగా పని చేస్తుంది. ప్రతి పౌరుడిని అతని స్థాయితో నిమిత్తం లేకుండా చట్టం సమానంగా పరిగణిస్తుంది. ఇటీవలి రాజకీయ వివాదాలు, ముఖ్యంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవితలకు సంబంధించిన మద్యం కుంభకోణం, న్యాయవ్యవస్థను ప్రభావితం చేయడానికి కపిల్ సిబల్ వంటి రాజకీయ ప్రముఖుల సాహసోపేతమైన దుష్ప్రయత్నాల కారణంగా మన ప్రజాస్వామ్య స్వరూపానికి పునాది అయిన ఈ సూత్రం చర్చనీయాంశంగా మారుతోంది.
ప్రతాప్ భాను మెహతా అనే రాజకీయ పరిశీలకుడు ఇటీవలి తన కథనంలో న్యాయవ్యవస్థ వైఖరిని విమర్శిస్తూ న్యాయ పోరాటాలలో పాల్గొనే రాజకీయ ప్రముఖుల పట్ల ప్రత్యేకంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ దృక్పథం న్యాయ ప్రక్రియ పవిత్రతను దెబ్బతీయడమే కాకుండా, కొద్దిమంది పట్ల ప్రత్యేకంగా వ్యవహరించాలనే ప్రమాదకరమైన సంప్రదాయానికి ప్రచారం కల్పించడం ద్వారా ప్రజాస్వామ్య సూత్రాలకే హాని కలిగిస్తుంది. మనీష్ సిసోడియాపై కేసులో ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ పాత్ర కూడా బయటపడింది. ఈ కేసుపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. బెయిల్ కోసం సిసోడియా చేసుకున్న అభ్యర్థనను తిరస్కరిస్తూ సుప్రీం కోర్టు మద్యం కుంభకోణాన్ని ఎంత పకడ్బందీగా రూపొందించారో వివరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ, దాని మద్దతుదారులు వినిపిస్తున్న కథనాలకు విరుద్ధంగా ఇది ఒక పథకం ప్రకారం జరిగిన మోసం, అవినీతి అని కోర్టు ప్రస్తావించిన సాక్ష్యాలు స్పష్టం చేస్తున్నాయి.
రాజ్యాంగంలోని అధికరణం 32 కింద దాఖలైన కొన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు స్వీకరించకపోతే దాని ఘనమైన వారసత్వం ‘ప్రమాదంలో పడుతుంద’ని కపిల్ సిబల్ కోర్టును హెచ్చరించడం సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకు రావడమే. న్యాయవ్యవస్థను తమకు అనుకూలంగా మలచుకోడానికి కొంతమంది రాజకీయ ప్రముఖులు ఉపయోగించే సుపరిచితమైన వ్యూహంలో ఇది భాగమే. ఈ విధానం న్యాయస్థానం చారిత్రక ఖ్యాతి గురించి ఆందోళన కలిగించడం ద్వారా న్యాయపరమైన ఫలితాలను మార్చడానికి ప్రయత్నిస్తుంది, న్యాయవ్యవస్థ నిష్పాక్షికతను బలహీనపరుస్తుంది. అంతేకాకుండా, కేజ్రీవాల్‌కు మద్దతివ్వడానికి న్యాయవ్యవస్థ తన చట్టపరమైన అధికారాన్ని దాటి ముందుకు వెళ్లాలని కోరుతూ మెహతాతో సహా కొందరు చేస్తున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది, ప్రమాదకరమైనది కూడా. రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాలు పక్కదారి పట్టాలన్న అధికార దాష్టీకాన్ని ఇది సూచిస్తుంది. దీనివల్ల న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది. ఇటువంటి వైఖరి దుష్ట సంప్రదాయాన్ని నెలకొల్పడమే కాకుండా న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తుంది, రాజకీయ అధికారానికి న్యాయవ్యవస్థ పెద్దపీట వేయాలని చెబుతుంది.
ఈ ఉదంతం ప్రతిపక్ష వైఖరి గురించి, ముఖ్యంగా ‘ఇండి’ కూటమి వంచన గురించి కూడా ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. మద్యం కుంభకోణం సూత్రధారి కేజ్రీవాలేనని మొదట ఆరోపణ చేసింది ఈ కూటమిలోని భాగస్వామ్య పార్టీలే. ఇప్పుడు ఆయన్ని అరెస్టు చేస్తే ఇది ‘కక్షపూరిత’ రాజకీయం అని గగ్గోలు పెడుతున్నదీ అవే పార్టీలు. రాజకీయ ప్రయోజనాల కోసం చట్టబద్ధ పరిపాలనకు తిలోదకాలు వదిలే ప్రతిపక్ష కూటమి అవకాశవాద ధోరణులకు ఇంతకంటే మరే నిదర్శనం కావాలి? న్యాయవ్యవస్థ తన బాధ్యతల నుంచి తప్పుకోవాలన్న పిలుపు చట్టం ముందు సమానత్వం అనే సూత్రాన్ని అవమానించడమే కాకుండా ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ పాత్రను తప్పుగా అర్థం చేసుకోవడమే. న్యాయవ్యవస్థ సమగ్రత దాని నిష్పాక్షికత, న్యాయం పట్ల దాని నిబద్ధతపై ఆధారపడి ఉంటుంది. దీనికి వ్యక్తులతో ఎటువంటి సంబంధం ఉండదు. న్యాయవ్యవస్థ చట్టాన్ని పరిరక్షించే వ్యవస్థగా కాకుండా రాజకీయ పోరాటాలలో మధ్యవర్తిగా వ్యవహరించాలని సూచించడం, దాని ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం, ప్రజాస్వామ్య ప్రక్రియకు ముప్పు కలిగించడమే అవుతుంది.
ఆప్, దాని మిత్రపక్షాలు దర్యాప్తు సంస్థలు, న్యాయవ్యవస్థపై ఒక పథకం ప్రకారం దుష్ప్రచారానికి ఒడిగట్టడం ద్వారా న్యాయ ప్రక్రియను అణగదొక్కే దుష్ట వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ప్రతిపక్ష రాజకీయ ప్రముఖుల దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలపై నిరంతరం విషం చిమ్ముతున్నారు. వాటి చట్టబద్ధతను, నిష్పాక్షికతను ప్రజల దృష్టిలో సందేహాస్పదం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారు శాంతి కాకుండా అశాంతి, అరాచకం, గందరగోళంతో కూడిన పాలనను కోరుకుంటున్నట్టు ఇది వెల్లడిస్తుంది.
రాజకీయ సంబంధ బాంధవ్యాల ద్వారా కలుషితం కాకుండా, నాయకుల హోదాలకు అతీతమైన చట్టబద్ధమైన పాలన తప్పనిసరిగా ఉండాలి. రాజకీయ ప్రయోజనాల కోసం చట్టపరమైన ప్రక్రియను వక్రీకరించడానికి ప్రయత్నించే ఒత్తిళ్లకు అతీతంగా న్యాయవ్యవస్థ నిజమైన సమవర్తిగా తన పాత్రను పోషించాలి. ఈ కేసులన్నీ బయటకు వస్తున్న నేపథ్యంలో న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యం ఎంత ముఖ్యమో, రాజకీయ లబ్ధి కోసం దానిని అణగదొక్కడం వల్ల కలిగే ప్రమాదాలేమిటో మరింత స్పష్టమవుతోంది. న్యాయబద్ధత, న్యాయం, చట్టం ముందు సమానత్వం అనే సూత్రాలపై ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఈ సిద్ధాంతాలను నీరుగార్చే ఏ ప్రయత్నమైనా న్యాయవ్యవస్థ సమగ్రతను మాత్రమే కాకుండా మన దేశ ప్రజాస్వామ్య నిర్మాణానికి ముప్పు కలిగిస్తుంది.
హితేష్ జైన్
బిజెపి ముంబై ఉపాధ్యక్షుడు