ambedkar nehru

అంబేద్కర్‌ను ‘రద్దు’ చేయాలని చూసిన నెహ్రూ రాజ్యం

భారత గణతంత్రం, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ప్రారంభంలో మనం ఉత్సవాలను నిర్వహించుకున్నాం. ముఖ్యంగా మన రాజ్యాంగ నిర్మాతల్లో దిగ్గజం అయినా బాబాసాహెబ్ డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్, ఆయన జీవితం, కృషిని మనం సంస్మరించుకున్నాం. నెహ్రూ ప్రభుత్వ యంత్రాంగం అంబేద్కర్ పట్ల వ్యవహరించిన తీరును తలుచుకుంటే నిజంగా నెహ్రూ అసలు స్వభావం గురించి మన కళ్ళు తెరుచుకుంటాయి. నెహ్రూ రాజ్యం ‘రద్దు సంస్కృతి’ (తమకు నచ్చని వ్యక్తులను ప్రజలు మరిచిపోయేలా చేయడం)ని అమలు చేసిందా? అన్న సందేహం చరిత్రను చదివే ఏ విద్యార్థికైనా కలుగుతుంది. డాక్టర్ అంబేద్కర్ తదితరుల విషయానికి వస్తే అదే జరిగింది. అంబేద్కర్ గురించి రాసిన పుస్తకాలు, ముఖ్యంగా సవితా అంబేద్కర్ ఆత్మకథ ‘బాబాసాహెబ్: మై లైఫ్ విత్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్’ చదివినప్పుడు నెహ్రూ ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై అనేక సందేహాలు తలెత్తుతాయి. 

1952 లోక్‌సభ ఎన్నికలలో ఉత్తర బొంబాయి స్థానంలో బాబాసాహెబ్ ఓడిపోయేటట్లు చేయడానికి కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఎలా ఏకమయ్యారో చదివితే గుండె తరుక్కుపోతుంది. బాబాసాహెబ్‌కు 1990లో ఏడో ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ భారతరత్న ప్రకటించారు. అప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ పని చేయకపోవడం సిగ్గుచేటు. స్వాతంత్య్రం వచ్చిన 43 సంవత్సరాలకు, భారత గణతంత్రం అమల్లోకి వచ్చిన నాలుగు దశాబ్దాలకు గాని దేశానికి రాజ్యాంగాన్ని ఇవ్వడంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తిని భారత్ గౌరవించలేదు. ఇది నిజంగా నెహ్రూవాద రాజ్యం అనుసరించిన ‘రద్దు సంస్కృతి’ ఫలితమే. లౌకికవాదానికి కాంగ్రెస్-వామపక్షాలు ఇచ్చుకున్న నిర్వచనానికి డాక్టర్ అంబేద్కర్ సరిపోకపోవడమే దీనికి కారణం. వారికి, ద్రవిడ పార్టీలకు హిందువులను విమర్శించేవారే లౌకికవాదులు. లౌకికవాదులకు వారు ఇచ్చుకున్న పెత్తందారీ నిర్వచనానికి బాబాసాహెబ్ సరిపోలేదు. 

బాబాసాహెబ్ తన రచనలలో హిందువులను మాత్రమే కాకుండా అన్ని మతాలను, ముఖ్యంగా ముస్లింలను కూడా సమానంగా విమర్శించారు. “ఒక ముస్లిం విధేయత అతను నివసించే దేశంపై ఆధారపడి ఉండదు, అతను ఆచరించే మతంపై ఆధారపడి ఉంటుంది. నిజమైన ముస్లిం భారతదేశాన్ని తన మాతృభూమిగా స్వీకరించడానికి, హిందువును తన బంధువుగా భావించడానికి ఇస్లాం ఎన్నటికీ అనుమతించదు,” అని ఆయన పేర్కొన్నారు. ఇది నెహ్రూవాద రాజ్యానికి ఆమోదయోగ్యం కాదు. అయన నిజమైన లౌకికవాది, అపార మేధో సంపన్నుడు కాబట్టి ఆయన్ని నెహ్రూవాదులు ‘రద్దు’ చేయవలసి వచ్చింది. బాబాసాహెబ్ విమర్శించిన మరో అంశం కాంగ్రెస్, దళితుల అభ్యున్నతిలో దాని పాత్ర. ‘అస్పృశ్యులకు కాంగ్రెస్, గాంధీలు ఏమి చేశారు’ అనే పుస్తకం భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయాలపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన సుదీర్ఘ అధ్యయనం. 1945లో ఇది ప్రచురితమైంది. భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం 1937 ఫిబ్రవరిలో జరిగిన ప్రావిన్షియల్ శాసనసభల ఎన్నికల ఫలితాలను ఈ పుస్తకం సవివరంగా పరిశీలిస్తుంది. 

శక్తివంతమైన, బూర్జువా ఆధిపత్యం కలిగిన కాంగ్రెస్ పార్టీకి రాజకీయ హోదాలు, వనరులు దండిగా ఉండగా అందుకు భిన్నంగా షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు (ఎన్నికల సమయంలో) అటువంటివి ఏమీ లేకపోవడం గురించి డాక్టర్ అంబేద్కర్ ఈ పుస్తకంలో విపులంగా వివరించారు. 1937 ఎన్నికల ఫలితాలను ఉటంకిస్తూ ఆయన అన్ని కులాలకు సమాన గౌరవం ఇచ్చే సమైక్య భారతానికి కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తోందన్న కథనాన్ని కూడా సవాలు చేశారు. అణగారిన వర్గాల పక్షాన పోరాడే రాజకీయ కార్యకర్తగా అంబేద్కర్ తన జీవితమంతా స్వచ్ఛమైన హేతుబద్దతను సమర్థించారు. మానవాళిని దుర్భర స్థితి నుంచి విముక్తం చేసి, జీవితంలో ఎక్కువ భాగం అంధకారంలో, నిరాదరణలో నివసిస్తున్న వారికి అవకాశాల ప్రపంచాన్ని తెరిచే సాధనాలుగా ఆధునిక యంత్రాల ఆవిర్భావాన్ని ఆయన గట్టిగా సమర్థించారు.

బాబాసాహెబ్ 1951 సెప్టెంబరు 27న ప్రధానమంత్రి నెహ్రూ మంత్రివర్గం నుంచి రాజీనామా చేయడానికి ఐదు కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రధానమంత్రి నెహ్రూ ఆయనకు న్యాయ మంత్రి బాధ్యతలను అప్పగిస్తూ ప్రణాళికా శాఖ కూడా ఇస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవడం. అంతేకాక అంబేద్కర్‌ను నెహ్రూ ఏ మంత్రివర్గ కమిటీలోనూ సభ్యుడిగా నియమించలేదు. రెండు, దళితుల సమస్యలు లేదా వారి హోదా విషయంలో ప్రభుత్వం ఉదాసీనత. మూడవది, కాశ్మీర్ సమస్యపై నెహ్రూ వ్యవహరించిన తీరును ఆయన వ్యతిరేకించడం. నాలుగవది, నెహ్రూ విదేశాంగ విధానాన్ని ఆయన వ్యతిరేకించారు. లోపభూయిష్టమైన ఈ విదేశాంగ విధానం వల్ల భారతదేశానికి మిత్రుల కంటే శత్రువులు ఎక్కువగా తయారవుతారని అంబేద్కర్ వాదించారు. అయిదవది, హిందూ స్మృతి బిల్లుపై నెహ్రూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. దాన్ని ఆమోదీంచే విషయంలో ఉత్సాహాన్ని, దృఢ సంకల్పాన్ని నెహ్రూ ప్రదర్శించక పోవడంతో బాబాసాహెబ్ నిరుత్సాహానికి గురయ్యారు.

గొప్ప మేధావి అయిన ఒక బలమైన నాయకుడిని ‘రద్దు’ చేయడానికి నెహ్రూ ఎంచుకున్న అధ్వానమైన మార్గం 1952 లోక్‌సభ ఎన్నికలలో రిజర్వుడు నియోజకవర్గం ఉత్తర బొంబాయిలో కుతంత్రాలతో ఆయనను ఓడించడం. కాంగ్రెస్ దీనిని ప్రతిష్ఠాత్మక అంశంగా మార్చింది. బాబాసాహెబ్‌ను అనామకుడైన నారాయణరావు కజ్రోల్కర్ అనే అభ్యర్థి చేతిలో ఓడిపోయేలా చేయడానికి ఎస్.కె. పాటిల్, కమ్యూనిస్టు నాయకుడు శ్రీపాద అమృత్ డాంగే ద్వారా ప్రధాని నెహ్రూ స్వయంగా చర్యలు తీసుకున్నారు. కాంగ్రెస్ తన ప్రతిష్ఠను పణంగా పెట్టి మరీ రాజ్యాంగ నిర్మాతను ఓడించడానికి, ఆయన వారసత్వాన్ని రద్దు చేయడానికి కమ్యూనిస్టులతో కలిసి చేయవలసిన కుతంత్రాలన్నీ చేసింది. బలంలోనూ, సామర్థ్యంలోనూ భారత రాజ్యాంగ నిర్మాతతో సాటిరాని వ్యక్తి ఆయనను స్వల్ప తేడాతో ఓడించగలిగాడు. (బాబాసాహెబ్‌కు 1,23,576 ఓట్లు రాగా, కజ్రోల్కర్‌కు 1,37,950 ఓట్లు వచ్చాయి). విమర్శించే వారిని, అసమాన పాండిత్యాన్ని, దక్షత, సమర్థత కలిగిన వారిని తాము సహించేది లేదని నెహ్రూవాద పెత్తందారీ రాజ్యం అంబేద్కర్‌ను ఓడించడం ద్వారా నిర్మొహమాటంగా చెప్పింది. 

ఆధునిక భారతదేశంలో అంబేద్కర్ పాత్ర అసమానమైనది, అయినప్పటికీ నెహ్రూవాద పెత్తందారీ రాజ్యం ఆయనను ‘రద్దు’ చేసింది. నెహ్రూవాద రాజ్యం, దాని రద్దు సంస్కృతి తమ అధిపత్యానికి సవాలుగా నిలిచిన వారందరినీ ‘రద్దు’ చేయడానికి ప్రయత్నించాయి. అటువంటి నాయకులలో బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ ఒకరు. ఆయన ఒక అపార మేధావి, లబ్ధప్రతిష్టుడు. ఆయనను ఎవరూ రద్దు చేయలేరు. ఆయన నెహ్రూవాద రాజ్యపు బూడిద నుండి ఫీనిక్స్ పక్షిలా తిరిగి లేచారు. 2047లో నిజమైన సమ్మిళిత, సృజనాత్మక వికసిత్ భారత్ కోసం మన రాజ్యాంగంలో పొందుపరిచిన కులరహిత, సమసమాజం అనే ఆయన కలలను సాకారం చేయడానికి ప్రతి భారతీయుడు కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైంది.

శాంతిశ్రీ ధూళిపూడి పండిట్