Age old agricultre

అప్పట్లోనే వ్యవసాయ సంస్కరణలు

హోల్కర్ రాజవంశ స్థాపకుడు మల్హర్ రావు హోల్కర్ మాల్వా ప్రావిన్స్ సామంత పాలకుడిగా నియమితులైనప్పుడు ఆయన చేసిన మొదటి పని మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలోని దేపాల్‌పూర్ చేరుకుని నాగలితో పొలాన్ని దున్నడం. అంతేకాక పొలంలో విత్తనాలు కూడా నాటాడు. విలాసవంతమైన జీవనానికి నిధులు సమకూర్చుకునేందుకు పాలకులు ప్రజలపై విపరీతమైన పన్నులు వసూలు చేస్తూ, యుద్ధాలు చేస్తూ ప్రజలపై మరింత భారం మోపుతున్న తరుణంలో రైతులకు భరోసానిచ్చే అసాధారణ చర్య ఇది. అహల్యాదేవి హోల్కర్ రాజవంశ పాలకురాలు అయినప్పుడు మల్హర్ రావు వారసత్వాన్ని కొనసాగించడమే కాకుండా ఒక అడుగు ముందుకేసి రైతులలో ఆత్మవిశ్వాసం పెంచి, వారిని మరింత ఉత్పాదకంగా మార్చడానికి వివిధ చర్యలను చేపట్టారు. వ్యవసాయానికి అనుబంధ వ్యాపారంగా పశుపోషణను కొనసాగించడం వల్ల రైతుల ఆదాయం పెరగడమే కాకుండా వ్యవసాయ దిగుబడి కూడా పెరుగుతుందని రైతులను ఒప్పించిన మొదటి వ్యక్తి అహల్యాదేవి. అలాగే మిశ్రమ పంటల సాగు రైతుల లాభాలను రెట్టింపు చేస్తుందని గుర్తించి, తన రాజ్యంలో మిశ్రమ వ్యవసాయాన్ని ప్రోత్సహించిన మొదటి వ్యక్తి కూడా ఆమెనే. అంతటితో ఆగకుండా, వాణిజ్య పంటలుగా సుగంధ ద్రవ్యాల సాగు ప్రాముఖ్యతను గ్రహించి నర్మదా నది ఒడ్డున ఉన్న సారవంతమైన భూముల్లో ఆహార ధాన్యాలతో పాటు సుగంధ ద్రవ్యాల సాగుకు ప్రయత్నించారు. ఈ ప్రయోగం విజయవంతమవడంతో సుగంధ ద్రవ్యాల సాగుకు రైతులను ప్రోత్సహించారు. 

సాగును లాభసాటిగా మార్చేందుకు పండ్ల తోటలను అభివృద్ధి చేయాలని ఆమె రైతులను ప్రోత్సహించారు. ఫలితంగా పండ్ల ఉత్పత్తి ఎన్నో రెట్లు పెరిగి సామాన్యులు పండ్లను ఆహారంలో చేర్చుకోగలిగారు. అంతేకాక, అహల్యాదేవి అటవీ ఉత్పత్తులైన పండ్లు, తేనెలకు మార్కెట్‌ను అభివృద్ధి చేయడానికి చొరవ తీసుకున్నారు. ఈ చొరవ ఫలితంగా తమ రాష్ట్రంలోని ఆదివాసీలకు కొత్త ఉపాధి, ఆదాయ అవకాశాలు లభించాయి. అంతేకాకుండా అడవుల్లోని చెట్ల సంరక్షణను ప్రోత్సహించడం ద్వారా అటవీ దిగుబడులు పెరిగేటట్లు, రాజ్యంలో పచ్చదనం పెరిగేటట్లు చూశారు. ఆదివాసీలకు అడవుల నుంచి లభించే తినదగిన పండ్ల గురించి, తరతరాలుగా అడవుల్లో పెంచే మూలికలు, చెట్లు, తీగల ఔషధ వినియోగం గురించి మంచి పరిజ్ఞానం ఉందని గ్రహించి, వారి సంప్రదాయ జ్ఞానాన్ని వివిధ ఔషధాల తయారీకి ఉపయోగించడానికి కృషి చేశారు. తద్వారా ఆదివాసీలకు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు మధ్య అంతరాన్ని ఆమె తగ్గించారు. సృజనాత్మకత గల వ్యక్తులు రూపొందించిన వివిధ హస్తకళా ఉత్పత్తులు, ఆహార పదార్థాల తయారీ నైపుణ్యాలను గౌరవించి, వాటికి మార్కెట్‌ను అభివృద్ధి చేయడానికి అహల్యాదేవి కృషి చేశారు. కష్టపడే స్వభావం, సృజనాత్మక ఆలోచనలు కలిగిన భూమిలేని నిరుపేదలు, ఆదివాసీలు కళాత్మక వస్తువులు, వర్ణచిత్రాలు తయారు చేసేవారు. ఈ చేతివృత్తుల ఉత్పత్తులను, వస్తువులను తయారు చేయడానికి వారి కృషి సృజనాత్మకమైనది, ఉత్పాదకమైనది మాత్రమే కాదు, దేశీయ సంస్కృతీ సంపదను కాపాడటానికి కూడా సహాయపడిందని ఆమె గ్రహించింది. అందుకే హస్తకళలు, కుటీర పరిశ్రమలు మొదలైనవాటిని ప్రోత్సహించారు. మొక్కజొన్న, నువ్వులు, పెసలు, పొగాకు, నల్లమందు, చిలగడదుంప, తమలపాకులు, పత్తి, చిరుధాన్యాలు, పొద్దుతిరుగుడు, చెరకు, కూరగాయలు, జొన్నలు, గోధుమలు, లిన్ సీడ్, కాయధాన్యాలు, ఉల్లి, ఆవాలు, బార్లీ, దోసకాయ మొదలైనవి అహల్యాదేవి కాలంలో ప్రధాన ఖరీఫ్, రబి పంటలు. అహల్యాదేవి పాలనలో హోల్కర్ రాజవంశం వివిధ పన్నుల రూపంలో రూ.74 లక్షల భారీ ఆదాయాన్ని ఆర్జించింది. ఉత్తర, దక్షిణ, మధ్య డివిజన్లు, ఖండేష్, రాజపుతానా తదితర ప్రాంతాల నుంచి కూడా కప్పాల ద్వారా ఆదాయం సమకూరింది. సుబేదార్ మల్హర్ రావు హోల్కర్ భిల్లు జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో భిల్కావాడి పన్ను వసూలు చేసే హక్కులను ఆ తెగకే కల్పించారు. ఫలితంగా, భిల్లులు తమ ప్రాంతం గుండా వెళ్ళే ప్రయాణీకులను దోచుకోవడం ఆపివేశారు. భిల్కావాడి పన్నును ప్రవేశపెట్టడం వల్ల అడవులు, మారుమూల ప్రాంతాల గుండా వెళ్ళే మార్గాలు ప్రయాణానికి సురక్షితంగా మారాయి. అందువల్ల వ్యాపారులు, యాత్రికుల రద్దీ పెరిగి ప్రజలు నిర్భయంగా ప్రయాణం చేయడం ప్రారంభించారు. భిల్కావాడి పన్ను ఈ ప్రయోజనాన్ని గ్రహించిన అహల్యాదేవి ఈ సంప్రదాయాన్ని కొనసాగించింది, తద్వారా గతంలో భిల్లుల వల్ల ఏర్పడిన సమస్యలను నియంత్రించారు. హోల్కర్ రాజ్యానికి మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్‌లతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. సారంగాపూర్‌లో తయారు చేసిన చందేరి చీరలు, మహేశ్వర్‌లో అల్లిన మహేశ్వరి చీరలు అన్ని చోట్లా ప్రసిద్ధి చెందాయి. సుగంధ ద్రవ్యాలు, ఇతర వస్తువుల రవాణాపై ఎద్దు లోడ్ కు అర్ధ అణా, పంచదార, పొగాకు, నేత వస్త్రం, పత్తి రవాణాపై ఎద్దు లోడ్ కు ఒకటింపావు అణా, ఆహార ధాన్యాల రవాణాపై ఎద్దు లోడ్ కు 1 పైసా, గేదెల రవాణాకు 3.33 పైసలు, మేకలు, గొర్రెల రవాణాకు పావు అణా చొప్పున హోల్కర్లు పన్ను వసూలు చేశారు. వస్తువుల ఒక హెడ్ లోడ్ (ఒక మనిషి మోసే పరిమాణం) కు ఒక అణా, ఇతర రాష్ట్రాల నుండి హోల్కర్ రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు, ప్రజల నుండి పావు అణా ప్రవేశపన్నుగా వసూలు చేశారు.

మాల్వా ప్రాంతం గుండా ప్రవహించే నర్మదా, క్షిప్రా, కన్హ్ నదుల నీటితో సాగుయోగ్యమైన వ్యవసాయ భూములను అభివృద్ధి చేయడానికి, రైతులకు విత్తనాలు, నీరు, పనిముట్లను అందించడానికి అహల్యాదేవి ప్రత్యేక కృషి చేశారు. సంప్రదాయ విత్తనాల మొలకెత్తే సామర్థ్యాన్ని పరీక్షించడానికి మహేశ్వర్‌లోని వ్యవసాయ నిపుణులకు ఆమె ఆర్థిక మద్దతు అందించారు. పరీక్షించిన విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. విత్తనోత్పత్తి, వాతావరణ సూచన, పండ్ల తోటలను ప్రభావితం చేసే వ్యాధులపై చికిత్స, సాగుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో భూసార పరీక్షలు, పంటలకు నీరు పోసే పద్ధతులపై అధ్యయనాలు నిర్వహించడంతో పాటు సజీవ, సారవంతమైన విత్తనాల శాతాన్ని రికార్డు చేశారు. దీంతో వ్యవసాయం చేయడానికి సరైన మార్గాలపై రైతులకు అవగాహన కల్పించారు. వివిధ దేవతలు, పూర్వీకులతో పాటు భూమిని, నీటిని పూజించిన రైతులు అహల్యాదేవి నిర్ణయాలను సంతోషంగా స్వాగతించారు. వ్యవసాయానికి ప్రభుత్వమే నాణ్యమైన విత్తనాలు, పనిముట్లు, పశువులను అందించడం వల్ల సామూహిక వ్యవసాయం ఊపందుకుంది. ప్రభుత్వ పొలాల్లో నిరంతరం జరుగుతున్న ప్రయోగాల వల్ల వ్యవసాయం ఎంతో అభివృద్ధి చెందింది. వర్షపునీటిని పట్టుకుని వివిధ జలాశయాల్లో నిల్వ చేయడం ఎంతో ఉపయోగపడుతుందని అహల్యాదేవికి బాగా అర్థమై, అందుకు ఆమె ఒక విధానాన్ని రూపొందించారు. ఆమె నీటిని నిల్వచేయడానికి త్రయంబకేశ్వర్, అంబాద్, జెజురి, చాంద్వాడ్, వాఫ్గావ్ ఇలా భారతదేశం అంతటా అనేక ప్రదేశాలలో చెరువులను, బావులను తవ్వించారు. ఈ పనులన్నింటికీ తన ప్రివి ఎస్టేటు నిధులను ఉపయోగించారు. గరిష్ఠ పరీవాహక ప్రాంతం, వర్షపు నీటి వినియోగంపై దృష్టి సారించి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా దూరదృష్టితో నిర్ణయాలు తీసుకున్నారు. ఆమె నిర్మించిన నీటి వనరుల పుణ్యమా అని నేటికీ ఆయా ప్రాంతాల్లో ఏడాది పొడవునా నీరు లభ్యమవుతోంది. మహేశ్వర్ నర్మదా నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం. అయితే మహేశ్వర్‌కు మతపరమైన ప్రాముఖ్యత ఉన్నందున పెద్ద సంఖ్యలో పర్యాటకులు, యాత్రికులు, వ్యాపారులు సందర్శించారు. ఈ ధార్మిక భావనను సద్వినియోగం చేసుకున్న అహల్యాదేవి అక్కడ వివిధ మార్కెట్లను ఏర్పాటు చేశారు. నిపుణులైన నేత కార్మికులకు ప్రోత్సాహం అందించి మహేశ్వరి చీరల తయారీని ప్రారంభించారు. మహేశ్వరంలో చేనేత చీరలు, వస్త్రాల తయారీ ప్రారంభమైన తర్వాత అహల్యాదేవి స్థానిక ఆదివాసీ మహిళలకు బట్టలు, చీరలు నేయడంలో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించి స్వయం సమృద్ధి సాధించడం నేర్పించారు. ఆదివాసీ మహిళలకు ఈ ఉపాధి కల్పించడం వల్ల ఆదివాసీ కుటుంబాలు సంచార జీవనం నుంచి బయటపడి స్థిరపడేందుకు దోహదపడింది. ఆదివాసీలు అడవుల్లో నివసిస్తూ అక్కడే జీవనోపాధి పొందుతారు కాబట్టి అటవీ ఉత్పత్తులు, వేట మాత్రమే వారికి లభించే ఆదాయ వనరులు. వీటికి సుస్థిరత లేక దొంగతనాలు, దోపిడీలకు పాల్పడటంతో సమాజం వారిని అసహ్యించుకుంది. అహల్యాదేవి ప్రభుత్వ ఖర్చుతో ఆదివాసీ మహిళలకు ఇళ్లు, ఉపాధి, స్పిన్నింగ్ వీల్స్, పత్తి అందించారు. 

 అహల్యాదేవి వద్ద ప్రజలకు ఉపయోగపడే ధార్మిక గ్రంథాలు, పుస్తకాల విస్తారమైన శ్రేణి ఉండేది. వివిధ రంగాల నిపుణులను తన ఆస్థానానికి ఆహ్వానించి, వారితో చర్చలు జరిపి తగిన విధంగా సన్మానించేవారు. అనుభవజ్ఞులు, జ్ఞానవంతుల అనుభవం అందరికీ మార్గదర్శకంగా నిలుస్తుందని గ్రహించిన అహల్యాదేవి ఎల్లప్పుడూ నిపుణులను ఎంపిక చేసి మహేశ్వర్ వద్ద వారికి ఆశ్రయం కల్పించేవారు. జ్ఞానాన్ని, జ్ఞానవంతులను గౌరవించే సంప్రదాయాన్ని ఆమె ప్రారంభించారు. అహల్యాదేవి ప్రగాఢమైన దైవభక్తి కలిగిన ధార్మిక మహిళ. ఆమె అనేక మత గ్రంథాలు, సంప్రదాయ జ్ఞానంపై చర్చలను నిర్వహించేవారు. ఆమె సేకరించిన పుస్తకాలు, సంపుటాలు నేటికీ ప్రభుత్వ ఆర్కైవ్ లో భద్రపరిచారు.

 రాంభావ్,
హోల్కర్ రాజవంశ పరిశోధకుడు