దేవి అహల్యాబాయి: ఎల్లలు దాటిన సంక్షేమం
దేవి అహల్యాను లోకమాత అని పిలుస్తారు. ఇది ఆమెకు సరిగ్గా సరిపోతుంది. అహల్యా దేవి వ్యక్తిత్వం, దార్శనికత, కృషి చరిత్రలో సాటిలేనివి, అసమానమైనవి, నమ్మశక్యం కానివి. నేటికీ ఆమెను పాలకులు, ప్రజలు ఆదర్శంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది.
అహల్యాబాయి హోల్కర్ రాజ్యం ఒక ఆదర్శ సంక్షేమ రాజ్యం. ఆమె పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఆమె పాలన ప్రజాహితంగా సాగింది. సామాన్య ప్రజల దృష్టిలో ఆదర్శ పాలన అంటే అహల్యాదేవి పాలనే. భారతదేశపు రాజులు, చక్రవర్తులు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉన్న సమయం అది. అనేక అప్రాముఖ్య విషయాలపై యుద్ధాలు జరిగే సమయం అది. ఆ రోజుల్లో పెద్ద, శక్తివంతమైన సామ్రాజ్యాలు చిన్న రాజ్యాలను కబళించేవి. తదనంతరం చిన్నదేశాలు మళ్లీ ఆవిర్భవించి ఆక్రమణదారులపై పోరాడి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకునేవి. ఈ విషవలయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఇటువంటి కల్లోల కాలంలో అహల్యాదేవి తన పౌరులను పరిపాలనకు పునాదిగా భావించి, ప్రజల సంతృప్తి, ఆనందం కోసం తన శక్తినంతా వెచ్చించారు.
అహల్యాదేవి వ్యక్తిత్వం, సచ్ఛీలత, పాలనా కాలం భారతదేశ చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిపోయాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్, తరువాతి సంవత్సరాలలో అహల్యాదేవి హోల్కర్ భారతదేశం మధ్యయుగ చరిత్రలో ఇద్దరు మహోన్నత వ్యక్తులు. ఆ రోజుల్లో రాచరికం ఉన్నప్పటికీ, ఛత్రపతి శివాజీ మహారాజ్, అహల్యాదేవి హోల్కర్ ఇద్దరూ వాస్తవానికి ప్రజాస్వామ్యానికి, ముఖ్యంగా భారత రాజ్యాంగానికి పునాది అయిన సంక్షేమ రాజ్య భావనను వారి పాలన ద్వారా అమలు చేశారు. వారిద్దరికీ ఆధునిక యుగపు ప్రజాపాలన గురించి బాగా తెలుసు. ఈ ఇద్దరూ తమ రాజ్యాల పరిపాలనలో వివిధ స్థాయిల్లో హేతుబద్ధమైన, ప్రజాకేంద్రిత పద్ధతులను అమలు చేశారు. ఈ విధంగా, వారిద్దరూ తమ సాటిలేని మేధో సామర్థ్యాలను ఉత్తమంగా ఉపయోగించడం ద్వారా తమ కాలాన్ని దాటి ఆలోచించేంత దూరదృష్టిని కలిగి ఉన్నారని వారి గొప్ప దార్శనికత, విజయాల ద్వారా సమర్థవంతంగా నిరూపించారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజకీయ, మేధో వారసత్వాన్ని అహల్యాదేవి సమర్థంగా ముందుకు తీసుకెళ్లారు. శివాజీ మహారాజ్ మహారాష్ట్రలో హైందవ స్వరాజ్యాన్ని స్థాపించాడు. అహల్యాదేవి తన మాల్వ రాజ్యాన్ని బలమైన, శక్తివంతమైన, సురక్షితమైన రాజ్యంగా మార్చడమే కాకుండా, దేశం అంతటా న్యాయమైన, సాంస్కృతిక పాలనను స్థాపించింది. వాస్తవానికి, మల్హర్ రావు హోల్కర్ అందించిన అమూల్యమైన మార్గదర్శకత్వం అహల్యాదేవి విజయాలలో కీలక పాత్ర పోషించింది. మాధవరావు పీష్వాకు అహల్యాదేవి సమకాలికురాలు, ఉత్తర భారతదేశంలో మహారాష్ట్ర వెలుపల మాల్వా ప్రాంతంలోని ఇండోర్ రాజ్యం నుండి ఆమె తనదైన ముద్ర వేశారు. మల్హర్ రావు స్థాపించిన హోల్కర్ రాజ్యాన్ని సంతోషకరమైన, సంపన్న రాజ్యంగా మార్చడానికి ఆమె తన వంతు కృషి చేశారు.
అహల్యాదేవి తన రాజ్యంలోనే కాకుండా ఇతర రాజ్యాల్లో కూడా అనేక ధార్మిక, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించారు. చాలా మంది చరిత్రకారులు అహల్యాదేవి ధార్మికత, దాతృత్వంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రాంట్ డఫ్, రియాసత్కర్ జీఎస్ సర్దేశాయ్, సర్ జాదూనాథ్ సర్కార్ వంటి చరిత్రకారులు అహల్యాదేవి ధార్మిక కార్యకలాపాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అహల్యాదేవి మతపరమైన పనులకు డబ్బు ఖర్చు చేసే బదులు సైన్యాన్ని పెంచి తన రాజ్యాన్ని విస్తరించాల్సిందని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అహల్యాదేవి జీవితచరిత్ర రాసిన తొలి చరిత్రకారుడు, అప్పటి సెంట్రల్ ప్రావిన్స్ గవర్నర్ సర్ జాన్ మాల్కమ్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అయితే, సమకాలీన మేధావులతో చర్చించిన తరువాత మాల్కమ్ తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నాడు. తరువాత ఆమె చేసిన మతపరమైన, సంక్షేమ కార్యక్రమాల కారణంగానే అహల్యాదేవి పూజ్యనీయురాలు అయిందని నిర్ధారణకు వచ్చాడు. అయితే, విశ్వనాథ్ నారాయణ్ దేవ్, డబ్ల్యు డబ్ల్యు ఠాకూర్ వంటి అనేక మంది చరిత్రకారులు, రచయితలు అహల్యాదేవి మత, సంక్షేమ విధానానికి బలమైన మద్దతు ఇచ్చారు. అహల్యాదేవి 30 సంవత్సరాల పాలనలో ప్రజలకు లభించిన శాంతి, ఆనందం.. దానధర్మాలకు, రాజ్యాన్ని విస్తరించడానికి ఖర్చు చేసిన దానికంటే రెట్టింపు మొత్తాన్ని వెచ్చించి మంచి పనులు చేసినా కూడా లభించేది కాదని గట్టిగా చెప్పవచ్చు.
అహల్యాదేవి మత పునరుద్ధరణ, పునర్నిర్మాణ ప్రయత్నాలకు చరిత్రకారులు లేవనెత్తిన అభ్యంతరం సరైనది కాదని ఆధారాలతో నిరూపించవచ్చు. ఆమె సైనిక శక్తిని విస్మరించిందనే అభ్యంతరం కూడా సరైనది కాదని అందుబాటులో ఉన్న చారిత్రక సాక్ష్యాలు స్పష్టం చేస్తున్నాయి. అహల్యాదేవి సైనిక వ్యవహారాల గురించి పీష్వాకు పలుసార్లు సూచనలు చేసినట్లు మహేశ్వర్ ఆస్థానం నుంచి వచ్చిన పలు సందేశాలు వెల్లడించాయి. మరాఠా రాజ్యాన్ని కాలక్రమేణా చేజిక్కించుకోవాలనే బ్రిటిష్ వారి కుతంత్రాలు, దూకుడు అహల్యాదేవికి బాగా అర్థమయ్యాయి. బ్రిటీష్ వారి మోసపూరిత దురాక్రమణ గురించి అహల్యాదేవికి పూర్తిగా తెలుసు కాబట్టి, ఆమె బ్రిటిష్ వారి వ్యూహాలను వివరిస్తూ పీష్వాకు ఒక సందేశంలో ఇలా రాశారు “క్రూరమైన జంతువులను చాకచక్యంగా చంపవచ్చు. అయితే, ఎలుగుబంటిని చంపడం చాలా కష్టం. ఎలుగుబంటిని పట్టుకుని చంపితేనే చనిపోతుంది. లేకపోతే అది ఒకరిని పట్టుకుంటే చంపేస్తుంది, బ్రిటీష్ వారితో యుద్ధం కూడా అంతే.” నిజానికి అహల్యాదేవి శత్రువుతో స్నేహం చేసే విధానంలో ప్రావీణ్యం సంపాదించింది. అంతేకాకుండా, అహల్యాదేవి 1792-93 సంవత్సరంలో బోయ్డ్ అనే అమెరికన్ జనరల్‌ను నియమించి బ్రిటిష్ శైలి దళాన్ని ఏర్పాటు చేసింది. అందువలన అహల్యాదేవి కేవలం ధార్మిక కార్యకలాపాలు, దానధర్మాలపై మాత్రమే దృష్టి సారించిందనే ఆరోపణలో వాస్తవం లేదు. అహల్యాదేవి ధార్మికతకు ధర్మమే ఆధారం. నైతికత, మానవత్వం, శాశ్వత మానవీయ విలువలు, మంచి పనులు చేయాలనే నిరంతర తపన ఆమె విలువల్లో భాగం. అహల్యాదేవి ఈ విధంగా నీతిమంతురాలు కాబట్టి, ఆమె 30 సంవత్సరాల పాలనను ప్రజల సంక్షేమం, ప్రజల సంతోషం అనే ఏకైక ప్రమాణాల ఆధారంగా పరిపూర్ణంగా అంచనా వేయవచ్చు. ప్రజల సంతోషం, తృప్తి సంక్షేమ రాజ్యం అత్యంత ముఖ్యమైన లక్షణం.
అహల్యాదేవి కులం, వర్ణం, మతం మొదలైన వాటి ఆధారంగా భేదం చూపలేదు. బ్రాహ్మణ, మరాఠా, బహుజన, ముస్లింలను సమానంగా చూశారు. ఆమె లౌకికవాదం సమతుల్యంగా, సంపూర్ణంగా ఉండేది. నిజాం వంటి ఇతర రాజ్యాలకు చెందిన ముస్లింలు కూడా ఆమె రాజ్యంలో ఆశ్రయం పొందేవారు. టిప్పు సుల్తాన్ రాజ్యానికి చెందిన బ్రాహ్మణులు మహేశ్వర్‌లో ఆశ్రయం పొందారని మహేశ్వర్ ఆస్థాన చరిత్రలు పేర్కొన్నాయి. ఆమె పాలనలో ఇండోర్ సంస్థానంలో శాంతి భద్రతలు నెలకొన్నాయి. నాటి రాచరిక సంస్థానాల పాలకులు, పౌరులు నిష్కళంకురాలిగా, ప్రజాసంక్షేమం పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తిగా ఆమెను గౌరవించారు. అహల్యాదేవి 13 వేర్వేరు సంస్థానాలలో తన రాజప్రతినిధులను నియమించింది, ఆ రాజ్యాలు కూడా తమ రాజప్రతినిధులను ఆమె ఆస్థానానికి పంపాయి. ఇతర రాష్ట్రాలతో ఆమె సంబంధాలు ఆచితూచి, కచ్చితత్వంతో ఉండేవి. అందువల్ల, విదేశీ దురాక్రమణకు భయపడలేదు. తన రాజ్యంలో విజ్ఞులైన వ్యక్తులను, కళాకారులను గౌరవించేవారు. ప్రముఖ సాహితీవేత్త ప్రొఫెసర్ అనిల్ సహస్రబుద్ధే అహల్యాదేవి రచనలపై విమర్శనాత్మక విశ్లేషణ చేశారు. “ఆహారం, దుస్తులు, ఆశ్రయం వంటి పౌరుల ప్రాథమిక అవసరాలను తీర్చడం పాలకుడి బాధ్యత. ఆకలితో ఉన్న బిడ్డకు ఆహారాన్ని అందించడానికి తల్లి ఎంత తపిస్తుందో, దానిని తన అత్యున్నత కర్తవ్యంగా భావిస్తుందో ప్రజలకు సేవ చేయాల్సిన రాజు లేదా పాలకుడి కర్తవ్యం కూడా అటువంటిదే. అహల్యాదేవి మాతృత్వం అపారం. అందువలన ఆమె ప్రజల తల్లిగా, జాతికి తల్లిగా మారింది. ఎంతో డబ్బును, తన ఆస్తిని ఉదారంగా ఖర్చు చేసి, ఆ బాధ్యతను భుజాన వేసుకుంటూ అందరిపై ఆప్యాయతలు కురిపించింది.” రాజ్య హద్దులు, అధికార పరిమితులు ఆమెను తన పని చేయకుండా అడ్డుకోలేకపోయాయని సహస్రబుద్దే అన్నారు. “అహల్యాదేవి సాధు జీవితం వంటి జీవితాన్ని గడిపింది. ప్రజల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పనిచేసింది. నిజానికి ఆమె కావాలనే తన కోసం అలాంటి జీవితాన్ని ఎంచుకుంది. తాను అనుభవించాల్సిన బాధను, వేదనను తన పౌరులు అనుభవించకుండా ఉండటానికి ఆమె తన వంతు ప్రయత్నం చేసింది. అయితే, ఇది ఒక వ్యక్తి పని కాదు. ప్రజల్లో జాతీయత, మతచైతన్యం, పురుషత్వం అనే భావాలను మేల్కొల్పడం అవసరం. అహల్యాదేవి హేతుబద్ధమైన మనస్సు ఈ విషయాన్ని గ్రహించింది. ఆమె గుడ్డిగా ధార్మికతను అనుసరించలేదు. ఆమె నీతిమంతురాలు, దౌత్యవేత్త. దేశానికి మంచి చేయడానికి ఆమె దాతృత్వాన్ని ఉపయోగించారు,” అని ఆయన వివరించారు.
ప్రముఖ చరిత్రకారుడు సర్ జాదూనాథ్ సర్కార్ అహల్యాదేవి గురించి ఒక ముఖ్యమైన, అర్థవంతమైన వ్యాఖ్య చేశారు. “అహల్యాదేవి ఉన్నత స్థాయి దౌత్యవేత్త అని ఇప్పుడు అసలైన సాక్ష్యాధారాలతో రుజువు చేయవచ్చు. ఆమె దాతృత్వం అమాయకమైన మతతత్వం నుంచి వచ్చింది కాదు; ఈ కోణం నుంచి చూస్తే అవి విలువలను పెంపొందించడానికి ఉద్దేశించిన శాశ్వత కేంద్రాలు, జాతీయ పాఠశాలలు.” అసలు ప్రజలకు ఏం కావాలి? వారికి ఆహారం, బట్టలు, ఆశ్రయం, సమానత్వం, శాంతి, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం, ఆలోచించే, వ్యక్తీకరించే స్వేచ్ఛ, సమాజంలోని ప్రతి వర్గం ఆత్మగౌరవాన్ని పరిరక్షించడానికి చట్టపరమైన హామీ వంటి ప్రాథమిక అవసరాలను తీర్చాలి. ఈ విలువలను పరిరక్షించే రాజ్యం దానంతట అదే సంక్షేమ రాజ్యం అనే బిరుదుకు అర్హమవుతుంది. అహల్యాదేవి 30 సంవత్సరాల పాలన భిన్నంగా, వినూత్నంగా నిలుస్తుంది, ఎందుకంటే ఆమె తన జీవితాంతం సామాన్య ప్రజలను సంతోషంగా ఉంచడానికి తన జీవితాన్ని, తన సంపదను అంకితం చేసింది.
ఇండోర్ సంస్థాన ఆదాయాలను ‘దౌలత్’ (ట్రెజరీ), ‘ఖజ్గి’ (ప్రివీ) అని రెండు భాగాలుగా విభజించారు. ఇలాంటి ఏర్పాట్లు ఉన్న ఏకైక సంస్థానం ఇండోర్. అహల్యాదేవి అత్త గౌతమ బాయ్ కు మహేశ్వర్, చాంద్వాడ్ ప్రాంతాలను ఇచ్చారు. గౌతమబాయి స్వతంత్రంగా వాటి కార్యకలాపాలను నిర్వహించింది. అక్కడి నుంచి వచ్చే ఆదాయాన్ని స్త్రీ ధన్గా పరిగణించి ప్రివీ ఎస్టేట్‌కు బదిలీ చేస్తారు. గౌతమబాయ్ మరణానంతరం ఆస్తి ఆర్థిక అధికారాలు అహల్యాదేవికి వచ్చాయి. అహల్యాదేవి భారతదేశం అంతటా దేవాలయాలు, ఆశ్రయాలు, రోడ్లు, బావులు, ఆహార పంపిణీ కేంద్రాలు మొదలైన ప్రజా సంక్షేమ పనులకు ప్రివీ ఎస్టేట్‌లోని తన స్త్రీ ధన్ నుండి ఆర్థిక సహాయం చేశారు. ఇది మునుపెన్నడూ లేనటువంటి అంశం. అంతేకాక, ఆమె రోజువారీ జీవనోపాధికి కూడా ప్రివీ ఎస్టేట్ నుండి ఆర్థిక సహాయం వచ్చేది.
తాను ప్రజాసంక్షేమం కోసమే పుట్టానని, ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడం తన సర్వోన్నత కర్తవ్యమని అహల్యాదేవి గట్టిగా విశ్వసించారు. ఆమె ఆస్థానంలో న్యాయ శాఖ ప్రజలకు ఉచితంగా న్యాయం అందించేది. అహల్యాదేవి న్యాయబద్ధతపై ప్రజలకు నమ్మకం ఉంది. రాజ్యం, ధనం, సైన్యం, అన్ని వైభోగాలు, అధికారాలు ఉన్నప్పటికీ అహల్యాదేవి తన అంతఃశ్శక్తి ఆధారంగా నిష్కళంక జీవితాన్ని గడిపింది. ఏ ప్రాపంచిక ఆకర్షణ కూడా ఆమెను ప్రలోభపెట్టలేదు. ఆమె తన ఆదర్శాల నుండి ఎప్పుడూ వైదొలగలేదు. గాంధీజీ శిష్యుడు వినోభా భావే ఇలా అన్నారు, “అహల్యాదేవి గురించి మోరోపంత్, అనంత పాండి వంటి కవులు చేసిన వర్ణనలు అతిశయోక్తి కాదు. అహల్యాదేవి పాలన భారత చరిత్రలో ఒక వినూత్న ప్రయోగం. రాజ్య పగ్గాలు నిబద్ధత కలిగిన, ధార్మిక చింతన కలిగిన మహిళ చేతిలో ఉండేవి. అహల్యాదేవి వివేకవంతురాలు. ఆమె పాలన భారతదేశ చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచ చరిత్రలో సాటిలేనిది. ఆప్యాయత, మత బలం, వివేకం ఆధారంగా కలిగిన సంక్షేమ రాజ్యానికి అహల్యాదేవి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. నేను భారతదేశంలో ఎక్కడ ఉన్నా ఇతర రాష్ట్రాల ప్రజల నుంచి అహల్యాదేవి గురించిన ప్రశంశలను విన్నాను. భారతదేశ చరిత్రలో అహల్యాదేవి సాటిలేనిదని నేను నమ్ముతున్నాను.”
అనేక మంది రాజులు, చక్రవర్తులు ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించారని చరిత్రను పరిశీలిస్తే తెలుస్తుంది. ప్రజలను సంతోషపెట్టి, సంతృప్తి పరిచారు. అయితే అవన్నీ తమ రాజ్య పరిధులకే పరిమితమయ్యాయి. తన రాజ్య సరిహద్దులు దాటి, మతం ద్వారా తన రాష్ట్రం వెలుపల సంక్షేమ కార్యక్రమాలు చేసి, భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలను ఏకతాటిపైకి తెచ్చిన ఏకైక పాలకురాలు అహల్యాదేవి. ఆ విధంగా అహల్యాదేవి జాతీయ సమగ్రతకు అత్యంత ప్రాముఖ్యమిచ్చారు. ఆ రోజుల్లో ప్రజల జీవనశైలిలో మతతత్వం ఆధిపత్యం వహించింది. అందువలన అహల్యాదేవి ఆలోచనాత్మకంగా మత మాధ్యమాన్ని ఎంచుకున్నారు. దాని వెనుక నిస్వార్థమైన, విస్తారమైన మానవతా దృక్పథం ఉంది. ఆమె చేసిన ఈ పని మన గొప్ప సంప్రదాయపు ప్రాపంచిక దృక్పథాన్ని చాటిచెప్పడంతో పాటు దేశాన్ని ఏకీకృతం చేసింది.
భారతీయ సంప్రదాయపు విశాల దృక్పథం, సంఘటిత విధానాలకు సంత్‌ల తత్వశాస్త్రం మూలం. మహారాష్ట్రలో జన్మించిన అహల్యాదేవిపై రామాయణం, మహాభారతం, చరిత్ర మాత్రమే కాకుండా మరాఠీ సంతుల బోధనలు కూడా లోతైన ప్రభావాన్ని చూపాయి. ప్రఖ్యాత సంత్ జ్ఞానేశ్వర్ మహారాష్ట్ర గడ్డపై ఉన్న తన పసైదాన్లో సర్వవ్యాపి అయిన భగవంతుడిని యావత్తు ప్రపంచ శ్రేయస్సు కోసం ప్రార్థించాడు. అది దేవునికి చేసిన అత్యంత ఉదాత్తమైన ప్రార్థన. సంత్ జ్ఞానేశ్వర్ ఒక సంత్, యోగి. అతనికి సంపద, అధికారం వంటి ప్రాపంచిక ఆస్తులు లేవు. తాను భగవంతుని పరమ భక్తుడు కాబట్టి అందరి క్షేమం కోసం సర్వవ్యాపకుడిని ప్రార్థించాడు. మరోవైపు అహల్యాదేవికి ఆర్థిక, రాజ్యాధికారాలు, ప్రజాసంక్షేమం కోసం పనిచేయాలనే అపరిమిత ఆరాటం కూడా ఉంది. అందువలన, సంత్ జ్ఞానేశ్వరుడు సర్వవ్యాపి అయిన దేవుడికి చేసిన ప్రార్థనను అహల్యాదేవి తన సంక్షేమ కార్యక్రమాల ద్వారా సాకారం చేసిందని కచ్చితంగా చెప్పవచ్చు.
పరస్పర విశ్వాసం, ఆప్యాయత, అంకితభావం వంటి మానవీయ విలువల ఆధారంగా ఏ రాజ్యంలోనైనా శాంతి, సౌభాగ్యాలను సాధించవచ్చు. చట్టం శక్తి కంటే సహకారం, వివేకం, సమతుల్య ఆలోచనలతో రాజ్యం అభివృద్ధి చెందుతుంది. అహల్యాదేవి నిస్వార్థంగా తన సంపాదనలోని ప్రతి రూపాయిని, జీవించి ఉన్న ప్రతి క్షణాన్ని తనరాజ్యం, దేశ సంక్షేమం కోసం వెచ్చించింది. ఆదర్శవంతమైన, మహిమాన్వితమైన దేశాన్ని నిర్మించే ప్రయత్నమిది. ఈ ఆలోచన నేటికీ దేశ నిర్మాణానికి స్ఫూర్తినిస్తుంది. అందువలన అహల్యాదేవి ప్రజల తల్లి, జాతిమాత. ఆమె బలమైన మచ్చలేని వ్యక్తిత్వం, నిస్వార్థ కృషి కారణంగా ఆమెకు పుణ్యశ్లోక అనే బిరుదు లభించింది. దక్షిణాన రామేశ్వరం నుంచి ఉత్తరాన కేదార్ మఠ్ వరకు, తూర్పున పూరి జగన్నాథ్ నుంచి పశ్చిమాన సోమనాథ్ వరకు అహల్యాదేవి భారతదేశమంతటా చేపట్టిన వివిధ సంక్షేమ పథకాల నిర్మాణాలు నేటికీ నిలిచి ఉన్నాయి, జాతీయవాద భావజాలానికి ప్రేరణగా నిలుస్తున్నాయి. అహల్యాదేవి నిర్దేశించిన ఆదర్శాలను తెలుసుకోవడం, వాటిని నిబద్ధతతో అనుసరించడం నేటి అశాంతి, ఘర్షణాత్మక యుగంలో మానవాళి సంక్షేమాన్ని సాధించడానికి ఏకైక మార్గం.
డా. దేవిదాస్,
మహారాష్ట్ర మాజీ ప్రభుత్వాధికారి

