Dharmendra Pradhan

కులగణన, ఉగ్రవాదం.. రెండింటిపై కాంగ్రెస్ చేసిందేమీ లేదు

dharmendra pradhan 2నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని అత్యంత ప్రముఖ వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వర్గానికి చెందిన నాయకుడిగా ధర్మేంద్ర ప్రధాన్ తనను తాను కులగణనకు బలమైన మద్దతుదారుగా చెప్పుకుంటారు. తదుపరి జనగణనతో పాటు కులగణన కూడా నిర్వహిస్తామని కేంద్రం ఏప్రిల్ లో ప్రకటించింది. ఆరెస్సెస్ విద్యార్థి విభాగం ఏబీవీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ఒక జాతీయ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో కుల గణన నిర్ణయం, దాని సమయం, ఈ ప్రక్రియపై కాంగ్రెస్ వైఖరి గురించి మాట్లాడారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:

ప్ర: పహల్గాం దాడి తర్వాత ప్రభుత్వం తీసుకోబోయే చర్య కోసం ప్రజలు ఎదురు చూస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కులగణన ప్రకటన చేసింది. కాంగ్రెస్, రాహుల్ గాంధీ తాము కొంత కాలంగా దీన్ని డిమాండ్ చేస్తున్న విషయాన్ని పేర్కొంటూ ఈ ఘనత తమదే అని చెప్పుకుంటున్నారు.

జ: సామాజిక న్యాయమే మా లక్ష్యం. ఆ దిశలో ఇది సహజమైన ముందడుగు. భారతీయ జనసంఘ్ (బిజెపికి పూర్వరూపం) కాలం నుండి సామాజిక న్యాయం పట్ల మా వైఖరిపై స్పష్టత ఉంది. సామాజిక సమరసత (సామాజిక సామరస్యం) మన సామాజిక న్యాయం భావనలో అంతర్లీనంగా ఉంది. అంత్యోదయ నుంచి సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ వరకు అన్నీ సామాజిక న్యాయంలో భాగమే. మా సామాజిక న్యాయం ప్రభుత్వ విధానం నుంచి పాలన వరకు ప్రతి స్థాయిలోనూ ప్రతిబింబిస్తుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2024 నుంచి కులాన్ని లెక్కిస్తామని సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు జనాభా గణన జరగనుండటంతో కుల గణన కూడా నిర్వహించాలని నిర్ణయించాం. కొందరు కేవలం అవకాశవాదులు. 1955లో కాకా కాలేల్కర్ కమిషన్, 1980లో మండల్ కమిషన్ సిఫారసు చేసినప్పటికీ కాంగ్రెస్ కులగణన నిర్వహించలేదు. హామీలు ఇచ్చినా 2011లో (యూపీఏ ప్రభుత్వ హయాంలో) జనాభా లెక్కలతో పాటు కులాల గణన జరగలేదు. దీన్ని కాంగ్రెస్ నేతలే వ్యతిరేకించారు. కులగణన విషయంలో కాంగ్రెస్ ఏనాడూ నిజాయితీగా వ్యవహరించలేదు.

ప్ర: అంటే 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు నుంచే మోదీ ప్రభుత్వం, బిజెపి కులగణనపై చర్చిస్తున్నాయని చెబుతున్నారా?

జ: ఇలాంటి అంశాలు ఎప్పుడూ చర్చకు వస్తుంటాయి. ఇలాంటి ప్రతి నిర్ణయానికి ఒక పరిణామ క్రమం ఉంటుంది. ప్రతి నిర్ణయం సరైన సమయంలో తీసుకుంటారు. సమాజాన్ని చీల్చి ఇలాంటి నిర్ణయాలు తీసుకోం, సమతూకంతో చేస్తాం. అందుకు ఇదే సరైన సమయం. వారు (కాంగ్రెస్, రాహుల్ గాంధీ, ఇతర పార్టీలు) ఆలోచనల దివాళాకోరుతనం కారణంగా తమను తాము ప్రశంసించుకుంటున్నారు. 2021లోనే కులగణన చేసి ఉండొచ్చు, కానీ అప్పుడు జనాభా లెక్కలే జరగలేదు. అందుకే 2024లో తేల్చలేకపోయాం. అందుకే 2025లో జనాభా లెక్కలకు సన్నాహాలు జరుగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్ర: 2021 జనాభా లెక్కల్లో ఓబీసీల సంఖ్య ఉంటుందని 2018లో అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఇప్పుడు కులగణన జరగబోతోంది. రెండింటికి తేడా ఏమిటి?

జ: 1931 తర్వాత మన దగ్గర కులాల వివరాలు లేవు. ఓబీసీల సమతుల్య అభివృద్ధికి, అన్ని కులాల సమతుల్య అభివృద్ధికి ఈ సమాచారం అవసరం. ఇది (నిర్ణయం) అనుభవం ద్వారా వచ్చింది.

ప్ర: 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం కులగణనను ప్రకటించి ఉంటే ప్రతిపక్షాలు బిజెపిని మెజారిటీని తగ్గించగలిగేవి కావని మీరు భావిస్తున్నారా?

జ: ఏ ఎన్నికలను, రాజకీయాలను పరిగణనలోకి తీసుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకోం. ఇదీ సామాజిక న్యాయం పట్ల మా నిబద్ధత… జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు, ఉజ్వల యోజన, గ్రామీణ గృహనిర్మాణం, ఇతర పథకాల ద్వారా అణగారిన వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో లబ్ధి పొందారు. ఈ ప్రభుత్వం జాతీయ ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇచ్చింది, జనరల్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) కు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాం. ఫ్యూడల్ వ్యవస్థలా పనిచేసే కుటుంబాలు నడిపే పార్టీలు ఉన్నాయి. కానీ సామాజిక న్యాయం మా విధానం, ఇది మాకు రాజకీయ సాధనం కాదు. సమాజం ఎల్లప్పుడూ ప్రభుత్వ విధానాలను నిర్దేశిస్తుంది. కుల గణన చేపట్టాలని పలు వర్గాల నుంచి డిమాండ్లు వచ్చాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం.

ప్ర: కులగణనలో, ముఖ్యంగా ఓబీసీలకు సంబంధించి ఎదురయ్యే ఒక సమస్య వివిధ కేంద్ర, రాష్ట్ర జాబితాల సంక్లిష్టత.

జ: మీరు చెబుతున్నట్టుగా అసాధారణ అంశాలు, తేడాలు ఉంటాయని నాకు తెలుసు. కానీ దాన్ని నిపుణులు, సెన్సస్ అధికారులు పరిష్కరించాల్సి ఉంది.

ప్ర: రిజర్వేషన్ పరిమితిని 50 శాతానికి మించి పెంచాలనే డిమాండ్ కూడా ఉంది?

జ: ఈ రోజు మనం కుల గణన గురించి చర్చిస్తున్నాము… కానీ, ఇతర విషయాలకు వస్తే ఇది ఒక పరిణామ ప్రక్రియ. కాలక్రమంలో నిర్ణయాలు జరుగుతాయి. 

ప్ర: ఉద్యోగాలు, అడ్మిషన్ల విషయంలో రిజర్వేషన్లు తప్ప, ఉన్నత పదవులకు నియామకాల్లో సమ్మిళితత్వాన్ని సాధించేందుకు ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపడం లేదు. ఉదాహరణకు, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు. ఇది మీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే అంశం. 

జ: నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉన్నత స్థానాల్లో సమ్మిళితత్వాన్ని సాధించేందుకు చాలా కృషి చేసిందని నేను చెప్పగలను. అంతకు ముందు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాజ్‌పేయి హయాంలో (ఏ పి జె అబ్దుల్ కలాం) కలాం సాహెబ్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 2014 నుండి ఇద్దరు రాష్ట్రపతులు ఎన్నికయ్యారు, ఒకరు (రాంనాథ్ కోవింద్) షెడ్యూల్డ్ కులానికి చెందినవారు, మరొకరు (ద్రౌపది ముర్ము) షెడ్యూల్డ్ తెగకు చెందినవారు. మోదీజీ స్వయంగా ఓబీసీ. మన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్టీ పదాధికారుల్లో ఎక్కువ మంది అణగారిన వర్గాలకు చెందినవారే. ఓబీసీ అయిన ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ జీని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వీసీగా నియమించాం. ఓబీసీ అయిన ప్రొఫెసర్ శశికళ వంజారిని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వీసీగా నియమించాం. ప్రతిభకు, సామాజిక న్యాయానికి మధ్య సమతుల్యత ఉండేటట్లు మేం ఎల్లప్పుడూ చూస్తాం.

ప్ర: ప్రతి మూడేళ్లకోసారి సవరించాల్సిన ఓబీసీల క్రీమీలేయర్ ప్రమాణాలను 2017 నుంచి సవరించలేదు.

జ: దీనిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సవరిస్తుంది. అది సరైన సమయంలో పూర్తవుతుంది.

ప్ర: ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏం సాధించాం? సరిహద్దులో ఇంతకు ముందు సైనిక చర్యల తర్వాత ఏం మార్పు వచ్చింది?

జ: చర్చలు, ఉగ్రవాదం లేదా చర్చలు, వాణిజ్యం ఏకకాలంలో సాగవని ప్రధాని పునరుద్ఘాటించారు. ఈ ఆపరేషన్‌లో సైన్యం ఎంతో శౌర్యాన్ని ప్రదర్శించింది. 1965, 1971లో పాక్‌తో యుద్ధాలు చేశాం, కార్గిల్లో పోరాడాం, కానీ ఆపరేషన్ సింధూర్‌కు ముందు పాక్‌కు చెందిన 11 వైమానిక స్థావరాలను ధ్వంసం చేశామా? మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను హతమార్చామా? ప్రధాని మన దళాలకు స్వేచ్ఛనిచ్చారు. మన సైన్యం, వైమానిక దళం, నౌకాదళం మనల్ని గర్వపడేలా చేశాయి. ఇది మన దేశానికి కొత్త గుర్తింపును ఇచ్చింది. దేశ గుర్తింపును సోషల్ మీడియాలో నిర్ణయించరు, ప్రపంచ నాయకులు నిర్ణయించరు. పాకిస్తాన్ చేతులెత్తేసింది. శాంతియుత దేశమైనందున మనం కాల్పుల విరమణకు నిర్ణయం తీసుకున్నాం. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై కాంగ్రెస్ ఏనాడూ కఠినంగా వ్యవహరించలేదు. దానిపట్ల ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తున్నాం.

ప్ర: ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)పై మాత్రమే పాక్‌తో చర్చలు జరగవచ్చు అని ప్రధానమంత్రి అన్నారు. పీఓకే ప్రాముఖ్యత ఏమిటి?

జ: సైన్యానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. నేను పౌరుడిని. కొన్ని అంశాలను సైన్యానికి వదిలేయాలి. (పీఓకే) అనేది ఇక్కడ చర్చించాల్సిన విషయం కాదు.