students

భారతదేశంలో విద్యా విప్లవం

త పదకొండేళ్ల మోదీ పాలనలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందంటూ దురుద్దేశంతో, రాజకీయ పక్షపాతంతో కూడిన దుష్ప్రచారం జరుగుతోంది. నిజానికి ఇంతకు మించిన విడ్డూరం, సత్యదూరం మరొకటి ఉండదు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యావ్యవస్థను ఘోరంగా నిర్లక్ష్యం చేసిన చేదునిజం దేశానికి బాగా తెలుసు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచం కోసం అనేక దేశాలు విద్యావ్యవస్థను పునర్వ్యవస్థీకరించినప్పటికీ, భారతదేశ విద్య పాతకాలంలోనే చిక్కుకుంది. చివరి ప్రధాన విధాన నవీకరణ 1986లో వచ్చింది. 1992లో స్వల్పంగా దీన్ని సవరించారు. ప్రపంచ సాంకేతిక మార్పుల ప్రభావం భారత్‌పై పడకుండా అడ్డుకోవడంతో పాటు దేశ గొప్ప జ్ఞాన సంప్రదాయాలను బలహీనపరిచే వలసవాద మనస్తత్వాలను ఉద్దేశపూర్వకంగా కొనసాగించడమే దీని ఉద్దేశం.

అవినీతి, పాలనాపరమైన అసమర్థతలు దేశ విద్యావిధానంలో ప్రధాన రుగ్మతలుగా ఉన్నాయి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ఒక క్రమపద్ధతిలో నిధుల కొరతను సృష్టించారు. డిగ్రీ కార్ఖానాలుగా నియంత్రణ లేని ప్రైవేటు సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. సరైన మూల్యాంకనం లేకుండా 44 ప్రైవేటు సంస్థలకు విశ్వవిద్యాలయ హోదా ఎలా ఇచ్చారో బయట పెట్టిన 2009 నాటి డీమ్డ్ యూనివర్శిటీ కుంభకోణం గురించి సెలక్టివ్ అమ్నీషియాతో బాధపడుతున్న వారికి గుర్తు చేయాలి. విద్యలో రాజకీయ జోక్యం విచ్చలవిడిగా ఉండేది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌లు నాణ్యతకు సాధనాలుగా కాకుండా, నియంత్రణ సాధనాలుగా మారాయి. విశ్వవిద్యాలయ నియామకాలు రాజకీయ విధేయతపై ఆధారపడి ఉండేవి. విదేశీ దండయాత్రల అసౌకర్యమైన చరిత్రకు ప్రాధాన్యమిస్తూ షహీద్ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, వీర్ సావర్కర్ వంటి విప్లవకారుల రచనలను పాఠ్యపుస్తకాల్లో ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపాయి. రాజకీయ ప్రయోజనాల కోసం చారిత్రక కథనాలను జాగ్రత్తగా రూపొందించారు. భారతదేశంలోని విభిన్న సాంస్కృతిక, మేధో సంప్రదాయాలను క్రమపద్ధతిలో పక్కన పెట్టారు. ఇవన్నీ మన ఘనమైన గతానికి దూరంగా, నాగరికత లేని విద్యావ్యవస్థను సృష్టించడానికి దోహదపడ్డాయి.

భారత విధాన చరిత్రలో అత్యంత విస్తృతమైన ప్రజాస్వామిక సంప్రదింపుల ఫలితంగా 2020 నాటి జాతీయ విద్యావిధానం ఈ దుర్భర గతం నుంచి బయటపడింది. ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె. కస్తూరి రంగన్ సంప్రదింపుల ప్రక్రియకు నాయకత్వం వహించారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపి) 2020ను రూపొందించిన కమిటీకి చైర్ పర్సన్‌గా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని లక్షలాది మందిని ఈ ప్రక్రియలో భాగస్వాములను చేశారు. లభ్యత, సమానత్వం, నాణ్యత, తక్కువ వ్యయం, జవాబుదారీతనం అనే ఐదు స్తంభాలపై నిలిచిన ఎన్ఈపి 2020 ప్రజలు తమ భవిష్యత్తు కోసం రూపొందించుకున్న ఒక విధానం. కేంద్రీకృతమైన, జడమైన, ఉన్నతవర్గ చట్రాల నుంచి వారసత్వంగా వచ్చిన వ్యవస్థాగత అసమానతలను సరిచేయడం ఎన్ఈపి 2020 ప్రాథమిక లక్ష్యాలలో ఒకటి. ఈ పరివర్తనాత్మక విధానం ఫలితంగా 2014-15 నుంచి ఉన్నత విద్యలో ఎస్సీల నమోదు 50శాతం, ఎస్టీల నమోదు 75 శాతం, ఓబీసీల నమోదు 54 శాతం పెరిగింది. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు అక్షరాస్యత రేటును పెంచాయి. గిరిజన విద్యార్థులకు ప్రత్యేక ఉపకార వేతనాలు ఉన్నత విద్యలో వారు కొనసాగేటట్టు చూశాయి.

విద్యారంగంలో లింగ సమానత్వంలో అపూర్వ ప్రగతి సాధించింది. మహిళా సాధికారత ఈ సంస్కరణలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది. 2022-23లో అన్ని కేటగిరీల్లో మహిళల నమోదు 38.8 శాతం పెరిగి 2.18 కోట్లు దాటింది. ముస్లిం మైనారిటీ విద్యార్థుల్లో మహిళల నమోదు 57.5 శాతం పెరిగింది. బోర్డు పరీక్షల్లో 10, 12వ తరగతుల్లో 60 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన బాలికల సంఖ్య వరుసగా 72 శాతం, 77 శాతం పెరిగింది. ఉన్నత విద్యలో మహిళల్లో పీహెచ్ డీ నమోదు భారీగా 135 శాతం పెరిగింది. మరీ ముఖ్యంగా ఉన్నత విద్య స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్) రంగాల్లో మహిళలు ఇప్పుడు 43 శాతం ఉన్నారు, తద్వారా గతంలో పురుషుల ఆధిపత్యం ఉన్న రంగాల్లోని అదృశ్య అవరోధాలను విచ్ఛిన్నం చేశారు. 2014లో 38.6 శాతంగా ఉన్న మహిళా టీచర్లు ఇప్పుడు 44.23 శాతానికి చేరుకోవడంతో విద్యారంగంలో నాయకత్వ రూపురేఖలు మారిపోయాయి. ఇవి భారతదేశ విద్యా పర్యావరణ వ్యవస్థలో ఒక మౌలిక మార్పును సూచిస్తాయి. మన దేశ మేధో ప్రయాణంలో మహిళలు సముచిత స్థానాన్ని తిరిగి పొందుతున్నారు.

ఈ విజయాలు ప్రభుత్వ ప్రాధాన్యతలలో మౌలిక మార్పును ప్రతిబింబిస్తాయి. ఒక్కొక్క బాలుడు/బాలికపై 2013-14లో రూ.10,780గా ఉన్న తలసరి ప్రభుత్వ వ్యయం 2021-22 నాటికి రూ.25,043కు 130 శాతం పెరిగింది. పిల్లల సమగ్ర అభివృద్ధి, సంగ్రహణ ఎదుగుదల, భవిష్యత్తు అభ్యసన కోసం ప్రారంభ బాల్య విద్య, పునాది విద్య, సంఖ్యా శాస్త్రానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక మౌలిక సదుపాయాలు, సమగ్ర బోధన, ఇతర సహాయక వ్యవస్థతో ఆధునికీకరిస్తున్నాం. సమష్టి కృషి ఫలితంగా చదువుకోని పిల్లల సంఖ్య, మధ్యలో బడి మానేసేవారి (డ్రాపవుట్) రేట్లు తగ్గాయి. విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి మెరుగుపడింది. అన్నింటికంటే ముఖ్యంగా అభ్యాస ఫలితాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. సెకండరీ స్కూల్ నుంచి కోడింగ్, సమస్య పరిష్కారానికి మల్టీ డిసిప్లినరీ విధానాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇన్నోవేషన్ హబ్స్ వంటి అధునాతన అంశాలను ఎన్ఈపీ 2020 ప్రవేశపెట్టింది. 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు క్షేత్రస్థాయిలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నాయి. 3,000కు పైగా నైపుణ్య కేంద్రాలు విద్య, ఉపాధి మధ్య అంతరాన్ని తగ్గిస్తున్నాయి. ఈ కార్యక్రమాలు కాలం చెల్లిన వ్యవస్థకు కేవలం మరమ్మతులు చేయడం కాక భారతదేశం భవిష్యత్తు కోసం విద్య ప్రాథమిక పునర్నిర్మాణానికి ఉద్దేశించినవి. కొత్త అట్ట వేసిన మేనిఫెస్టో, కాలం చెల్లిన నినాదాల కంటే దార్శనికత, ధైర్యసాహసాలు, కార్యాచరణ భారత యువతకు ఆవశ్యకం. వచ్చే ఐదేళ్లలో పాఠశాలల్లో బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీతో మరో 50,000 ఏటీఎల్ లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 

ఉన్నత విద్య విషయంలో సుస్థిర ఆదాయ నమూనాలు విశ్వవిద్యాలయాలు బయటి వనరులపై ఆధారపడనవసరం లేని పరిస్థితి కల్పించాయి. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ టాప్ 500లో 11 భారత యూనివర్సిటీలు ఉన్నాయి. పరిశోధన ప్రచురణలు 2015 నుండి 88 శాతం పెరిగాయి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారతదేశం 2014లో 76వ స్థానం నుంచి 39వ స్థానానికి చేరుకుంది. అనుసంధాన్-నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పరిశ్రమ-విద్యా రంగాల సహకారాన్ని పెంపొందిస్తోంది. భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా, విద్యకు ప్రపంచ గమ్యస్థానంగా చేస్తోంది. మరీ ముఖ్యంగా దశాబ్దాల ‘ఇంగ్లిష్ కు ప్రాధాన్యం’ విధానాలతో ఒక క్రమపద్ధతిలో దెబ్బతిన్న అన్ని భారతీయ భాషలకు, విజ్ఞాన సంప్రదాయాలకు ఈ నూతన విద్యా విధానం గౌరవాన్ని పునరుద్ధరించింది. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ (ఐకేఎస్) చొరవ ద్వారా 8,000కు పైగా ఉన్నత విద్యాసంస్థలు ఐకేఎస్ పాఠ్యాంశాలను స్వీకరించాయి. భారతీయ భాషా పుస్తక్ యోజన ద్వారా 22 భారతీయ భాషల్లో 15,000 మూల, అనువాద పాఠ్యపుస్తకాలు ప్రచురితమవుతాయి.

కేంద్ర విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు, ఇతరులకు ఉపాధ్యాయ ఉద్యోగాలను కేటాయించడానికి కేంద్ర విద్యా సంస్థల (టీచర్స్ కేడర్‌లో రిజర్వేషన్) చట్టం-2019ను తీసుకురావడం ద్వారా సామాజిక న్యాయం పట్ల మోదీ ప్రభుత్వం నిబద్ధతను చాటుకుంది. దీని కింద అత్యంత లోపభూయిష్టమైన ‘ఒక డిపార్ట్‌మెంట్ ఒక యూనిట్’ అనే పద్ధతికి స్వస్తి చెప్పి విద్యాసంస్థను ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. అదేవిధంగా రిజర్వేషన్లను అర్థవంతంగా మార్చేందుకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులను తిరస్కరించి, యూనివర్సిటీ రిక్రూట్‌మెంట్లలో ‘ఎవరూ సరిపోరు’ అని ప్రకటించే దుర్మార్గపు పద్ధతిని ప్రభుత్వం రద్దుచేసింది. ఈ విజయాలు లక్షల మంది సాధికారత, అవకాశాల వ్యక్తిగత గాథలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. నాణ్యమైన డిజిటల్ విద్యను అందిపుచ్చుకుంటున్న ఒడిశాకు చెందిన గిరిజన బాలిక, రాజస్థాన్ లో అడ్వాన్స్డ్ రీసెర్చ్ చేస్తున్న మొదటి తరం విద్యార్థిని, మాతృభాషలో ఇంజినీరింగ్ చదువుతున్న తమిళనాడులో ఒక విద్యార్థిని- వీరంతా విద్యను జాతీయ పరివర్తనకు ఒక శక్తిగా చేసే విధానపు నిజమైన లబ్ధిదారులు. 

సాధికారతను అందించే వికసిత్ భారత్ నిర్మాణంపై మా ప్రభుత్వం దృష్టి సారించింది. రాబోయే దశాబ్దం మన గతాన్ని గౌరవించే, నిర్భయంగా భవిష్యత్తును స్వీకరించే విద్యా పునరుజ్జీవనానికి సాక్ష్యంగా నిలుస్తుంది. వలసవాద ఛాయలు, సైద్ధాంతిక శృంఖలాల నుంచి భారత విద్యావ్యవస్థ ఎట్టకేలకు బయటపడింది. కోట్ల మంది భారతీయుల కలలను సాకారం చేయడమే కాకుండా, సంప్రదాయాన్ని సృజనాత్మకతతో సమన్వయం చేసే, సమ్మిళితత్వాన్ని ప్రతిభతో, జాతీయ ఔన్నత్యాన్ని ప్రపంచ పరిస్థితులతో సమన్వయం చేసే నమూనాను ప్రపంచానికి అందించడానికి సిద్ధంగా ఉంది. కేవలం విద్యాసంస్కరణ మాత్రమే కాదు, చాలాకాలంగా ఎదురుచూసిన వలస వారసత్వ నిర్మూలనే భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన చేర్చుతుంది.

ధర్మేంద్ర ప్రధాన్,
కేంద్ర విద్యా శాఖ మంత్రి