atal

నవ భారత నిర్మాణంలో నిరంతర స్ఫూర్తి వాజ్‌పేయి

ల్లోలాలు, అలజడుల సమయాల్లో ఒక దేశం నైతిక దిక్సూచిగా, మార్గదర్శక స్ఫూర్తిగా ఎదగడానికి, ప్రజలకు దార్శనికతను, ఐక్యతను, దిశను అందించే నాయకుడిని కలిగి ఉండటం అదృష్టం. ఈ శతాబ్దం ప్రారంభంలో అటల్ బిహారీ వాజ్‌పేయి రూపంలో అటువంటి నాయకుడిని పొందే అదృష్టానికి భారతదేశం నోచుకుంది. ఆత్మ, హృదయం, మనస్సు విషయంలో సైతం ప్రతిభావంతుడైన వ్యక్తి ఆయన. భారతదేశం గురించి తెలిసిన వారికి, అన్నిటికంటే మొదటిగా తనను కలిసిన ప్రతి ఒక్కరినీ స్పృశించి, స్ఫూర్తినిచ్చిన అత్యంత అరుదైన వ్యక్తుల్లో ఒకరు. ఆయన కరుణామయుడు, ఉదార స్వభావం కలవాడు, ఆప్యాయతకు మారుపేరు, అవసరానికి మించి దయ చూపించే వ్యక్తి. ఆయన ఇతరులను గౌరవించేవాడు, అరుదైన హాస్యచతురత ఆయన సొంతం, దాన్ని తనపైనే ప్రయోగించుకునే నిరాడంబరుడు. అసమాన వక్త అయిన వాజ్‌పేయి అవతలి వారిని నిరాయుధం చేసే హాస్యం నుంచి ఒక్కసారిగా ఉదాత్తమైన దార్శనికతకు సులభంగా మారగల సమర్థులు. సహజంగా ప్రజలతో మమేకమయ్యే అరుదైన సామర్థ్యంతో వారిని ఆత్మవిశ్వాసం వైపు, ఉన్నత లక్ష్యం వైపు ప్రేరేపించగలరు. అత్యంత సంక్లిష్టమైన అంశాలను, చర్చలను ఒకే వాక్యంలో లేదా ప్రశ్నలో సంక్షిప్తీకరించగలరు.

నిరాడంబరమైన, ఉన్నత ఆదర్శాలు కలిగిన కుటుంబంలో జన్మించిన ఆయన మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న పట్టణం నుంచి వచ్చారు. స్వాతంత్రోద్యమ సమయంలో విద్యా నైపుణ్యం, ప్రజాసేవ చేయాలనే తపన ఆయన యవ్వనాన్ని నిర్దేశించింది. జనసంఘ్ లో ఒక సాధారణ కార్యకర్తగా ప్రజా జీవితాన్ని ప్రారంభించి, స్వతంత్ర భారతదేశంలో ఏర్పడిన ఏకైక నిజమైన జాతీయ స్థాయి పార్టీ – బిజెపిని నిర్మించారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణం తరువాత దాని సంస్థాగత కార్యకలాపాలకు నాయకత్వం వహించారు. పార్లమెంటులో నాలుగు దశాబ్దాల నాయకత్వం, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం (దిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఆయన ప్రసంగం దేశగర్జనగా మారినప్పుడు ఆ చిరస్మరణీయ ర్యాలీని ఎవరు మరచిపోగలరు), తన పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూనే నిరంతరం దేశం కోసం భావోద్వేగంతో మాట్లాడటం ద్వారా ఆయన భారత ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రత్యేకంగా నిలిచారు. తన రాజకీయ విశ్వాసాల విషయంలో దృఢంగా ఉన్నప్పటికీ, ఎల్లప్పుడూ ఇతర దృక్పథాలను గౌరవిస్తూ, పార్లమెంటులో చర్చల సందర్భంగా ఉన్నత ప్రమాణాలను నిర్దేశించారు. నిరాడంబరత, చిత్తశుద్ధి, హుందాతనం, సహానుభూతి, పదవి పట్ల వ్యక్తిగత వ్యామోహం లేని మనస్తత్వంతో ఆయన యువతకు స్ఫూర్తిగా నిలిచారు.

స్వదేశంలో రాజకీయ అస్థిరత, అనిశ్చిత ప్రపంచ వాతావరణం ఆర్థిక సంస్కరణల ప్రక్రియను పక్కదారి పట్టించే ప్రమాదం ఉన్న 1990వ దశకం మధ్యలో ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి ఆయన కాపాడారు. గత రెండు దశాబ్దాలుగా మనం అనుభవించిన ఆర్థిక విజయానికి ఆయన బీజం వేశారు. బలహీనులకు సాధికారత కల్పించడానికి, అణగారిన వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి వృద్ధి ఒక సాధనం. ఆ దార్శనికతే మన ప్రభుత్వ విధానాన్ని నడిపిస్తోంది. 21వ శతాబ్దంలో ప్రపంచ నాయకత్వ పగ్గాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్న భారతదేశానికి పునాదులు వేసింది అటల్ జీయే. ఆయన ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక విధానాలు, సంస్కరణలు ఎంతో మంది భారతీయులకు సౌభాగ్యాన్ని చేకూర్చాయి. తరువాతి తరం మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా రోడ్లు, టెలికాం రంగాలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యమే మన దేశ ఆర్థిక, సామాజిక సాధికారతకు దోహదం చేసింది. అటల్ జీ ప్రపంచంలో భారతదేశ స్థాయిని ఊహించనంతగా పెంచారు. మన దేశ సంకోచాన్ని, ప్రపంచ ప్రతిఘటనను, ఒంటరితనాన్ని అధిగమించి భారత్‌ను అణ్వాయుధ శక్తిగా తీర్చిదిద్దారు. ఇది తేలిగ్గా తీసుకునే నిర్ణయం కాదని, భారత భద్రతకు పెను సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయమని ఆయనకు తెలుసు. ఇకపై భారత భద్రతకు భంగం వాటిల్లదు. దేశ ప్రతిష్ట పెరిగిన ఆ క్షణంలో సంయమనం, బాధ్యతతో కూడిన ఆయన స్వరం భారత్ ప్రతిష్టను పెంచింది. ప్రపంచం ఒక శాంతిప్రియుడి విజ్ఞతను గౌరవించింది. అంతే ముఖ్యమైన మరో విషయం ఏమిటంటే ప్రపంచ వ్యవహారాలపై తన అపూర్వమైన అవగాహన, దౌత్య నైపుణ్యాలను ఉపయోగించి కొత్త వాస్తవాలను ప్రపంచం ఆమోదించేటట్లు చేశారు. నిజానికి వ్యూహాత్మక సామర్థ్యాలను సృష్టించడం, బలమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, బహుముఖ దౌత్యాన్ని చేపట్టడం, ప్రవాస భారతీయుల శక్తియుక్తులను ఉపయోగించుకోవడం వంటి ఆయన వారసత్వాల సమ్మేళనమే నేడు ప్రపంచవ్యాప్తంగా మనకు లభిస్తున్న గౌరవానికి ప్రాతిపదిక.

అమెరికాతో ఐదు దశాబ్దాల ఎడబాటును ఐదేళ్ల కాలంలో శాశ్వత వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చారు. 2000లో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా సోవియట్ అనంతర రష్యాతో భారత్‌ను గాఢమైన స్నేహం వైపు నడిపించారు. 2001 నవంబరులో గుజరాత్, ఆస్ట్రాఖాన్ ల మధ్య సిస్టర్ ప్రావిన్స్ (సోదర రాష్ట్రాల) ఒప్పందం కుదిరినప్పుడు ఆయన రష్యా పర్యటనకు వెళ్లిన సమయంలో ఆయనతో కలిసి వెళ్లే భాగ్యం నాకు కలిగింది. సరిహద్దు చర్చల కోసం ప్రత్యేక ప్రతినిధుల యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా క్లిష్టమైన చారిత్రక వారసత్వాలను అధిగమించే ప్రయత్నంలో చైనాతో శాంతి కోసం సాహసోపేతమైన చర్య తీసుకున్నారు. ఈ రెండు ప్రాచీన నాగరికతలు, ఎదుగుతున్న శక్తులు, ప్రపంచ భవిష్యత్తును నిర్దేశించేందుకు కలిసి పనిచేయగలవన్న అటల్ జీ నమ్మకం నా ఆలోచనలకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంది.

అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి అయిన వాజ్‌పేయి పొరుగు దేశాలతో సత్సంబంధాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అనేక విధాలుగా మనం అనుసరిస్తున్న ‘పొరుగువారికే ప్రథమ ప్రాధాన్యం’ విధానానికి ఆయన ప్రేరణ, మార్గదర్శకుడు కూడా. బంగ్లాదేశ్ విముక్తికి ప్రతిపక్ష నేతగా ఆయన అలుపెరగని మద్దతు పలికారు. శాంతిని అన్వేషిస్తూ లాహోర్ వెళ్లారు. తనకు స్వాభావికమైన పట్టుదలతో, ఆశావాదంతో ఆయన శాంతి కోసం అన్వేషణ కొనసాగించారు. జమ్మూ కాశ్మీర్లో గాయాలను నయం చేశారు. కానీ, కార్గిల్ యుద్ధంలో పట్టుదలతో విజయం సాధించారు. మన పార్లమెంటుపై దాడి జరిగినప్పుడు, భారతదేశానికి వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదం నిజమైన స్వభావాన్ని, మూలాన్ని ప్రపంచం గుర్తించేలా చేశారు. వ్యక్తిగతంగా అటల్ జీ ఆదర్శంగా, గురువుగా, మార్గదర్శిగా నిలిచి నాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఆయనే నాకు గుజరాత్‌తో పాటు జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగించారు. ఆయనే 2001 అక్టోబర్‌లో ఒక రోజు సాయంత్రం నాకు ఫోన్ చేసి గుజరాత్ ముఖ్యమంత్రిగా వెళ్లమని చెప్పారు. నేను ఎల్లప్పుడూ సంస్థాగత బాధ్యతలే నిర్వహించానని ఆయనకు చెప్పినప్పుడు, ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాననే నమ్మకం ఉందని ఆయన అన్నారు. నాపై ఆయనకున్న నమ్మకం అమోఘం.

ఈ రోజు యువత శక్తి సామర్థ్యాలు, ప్రజల సంకల్పంతో మార్పు కోసం ఎదురుచూస్తున్న, ఆత్మవిశ్వాసంతో నిండిన దేశం మనది. మనం కోరుకునే మార్పును సాధించగలమనే విశ్వాసం ఉంది. స్వచ్ఛమైన, ప్రజల అవసరాలకు ప్రతిస్పందించే పాలన కోసం కృషి చేస్తున్నాం. సమ్మిళితత్వం, భారతీయులందరికీ ఉజ్జ్వల అవకాశాలతో కూడిన భవిష్యత్తును నిర్మించడం మన లక్ష్యం. ప్రపంచంలోని ఇతరదేశాలతో సమాన హోదాతో వ్యవహరిస్తాం, శాంతిని ఆకాంక్షిస్తాం, సిద్ధాంతాల ప్రకారం నడచుకుంటాం, ఇతరుల ఆకాంక్షలకు మద్దతు ఇస్తాం. అటల్ జీ కోరుకున్న మార్గంలోనే మనం నడుస్తున్నాం. చరిత్ర పట్ల లోతైన అవగాహన ఉన్నందున, మన నాగరికతా విలువలపై తనకున్న పట్టుతో భారతదేశ ఆత్మను పరిశీలించగలిగినందువల్ల ఆయన కాలం కంటే ముందున్నారు. ఒక జీవితాన్ని దాని వెలుగు ఆరిపోయినప్పుడు కలిగే దుఃఖాన్ని బట్టి మాత్రమే అంచనా వేయకూడదు. ప్రజల జీవితాలపై, కాల గమనంపై శాశ్వత ప్రభావాన్ని కూడా కొలమానంగా తీసుకోవాలి. ఆ కారణంగానే అటల్ జీ నిజమైన భారతరత్న. ఆయన కలలుగన్న నవభారతాన్ని నిర్మిస్తున్న మనకు ఆయన స్ఫూర్తి మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుంది.

నరేంద్ర మోదీ,
ప్రధాన మంత్రి