పీఎం ఇంటర్న్‌షిప్ పథకం: భావితరాల ఉపాధి నైపుణ్యాలకు పదును
శరవేగంగా మారిపోతున్న ఆర్థిక వ్యవస్థలో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలతో యువతను సన్నద్ధం చేయవలసిన కీలక అవసరాన్ని భారతదేశం గుర్తించింది. ఈ అవసరానికి అనుగుణంగా ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం అక్టోబర్ 3, 2024న ప్రారంభించింది. ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా అమలు చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం రాబోయే ఐదేళ్లలో కోటి మంది యువకులకు విలువైన ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. విభిన్న వ్యాపార వాతావరణాలు, వివిధ రకాల వృత్తులను పరిశీలించి ఎంచుకునే అవకాశం వారికి కల్పిస్తోంది.
2024-25 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకం 2024-25 ఆర్థిక సంవత్సరానికి 1.25 లక్షల ఇంటర్న్‌షిప్‌లను లక్ష్యంగా చేసుకుని పైలట్ ప్రాజెక్ట్‌తో ప్రారంభమైంది. ఇంటర్న్‌షిప్ అవకాశాలు ఆయిల్, గ్యాస్, ఇంధనం, పర్యాటకం, ఆతిథ్యం, ఆటోమోటివ్, బ్యాంకింగ్, ఆర్థిక సర్వీసులు మొదలైన వాటితో సహా 24 రంగాలలో ఉన్నాయి. ఈ పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన కంపెనీలను గత మూడు సంవత్సరాలలో అవి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఖర్చు చేసిన నిధుల ఆధారంగా గుర్తించారు. అభ్యర్థులు సామాజిక, నైతిక పద్ధతులకు కట్టుబడి ఉండే సంస్థలలో ఇంటర్న్‌షిప్ పొందేటట్లు ఇది చూస్తుంది.
ఈ పథకం విశిష్టత ఏమిటంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రస్తుతం అమలులో ఉన్న నైపుణ్యాభివృద్ధి పథకాలు, అప్రెంటిస్‌షిప్‌లు, విద్యార్థి శిక్షణ కార్యక్రమాలతో దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. కేవలం ఇంటర్న్‌షిప్‌లపై దృష్టి సారించడం ద్వారా, ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం ఉపాధిని మెరుగుపరిచి, యువతకు వాస్తవ ప్రపంచ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ప్రయత్నం ద్వారా భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని పెంపొందించి, ఉద్యోగ విపణిలో అభివృద్ధి చెందడానికి అవసరమైన సాధనాలతో భారతీయ యువతను సన్నద్ధం చేయడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతిమంగా ఈ కార్యక్రమం యువతలో ప్రతిభకు పదునుపెట్టడం, భావితరం సామర్థ్యాన్ని వెలికి తీయడం ద్వారా దేశం సార్వత్రిక అభివృద్ధి, వృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వ నిబద్ధతకు అద్దం పడుతుంది.
పీఎం ఇంటర్న్‌షిప్ పథకం రూపురేఖలు
అర్హత: పైలట్ ప్రాజెక్ట్ 21 నుంచి నుండి 24 సంవత్సరాల వయస్సు గల యువత కోసం రూపొందించిన 12 నెలల ఇంటర్న్‌షిప్ కార్యక్రమం. ప్రత్యేకంగా పూర్తి సమయం ఉద్యోగం చేయని లేదా పూర్తి సమయం విద్యలో నిమగ్నమైన భారతీయ పౌరులు దీనికి అర్హులు. ఆన్‌లైన్ లేదా దూరవిద్య కోర్సుల్లో పేర్లు నమోదు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబర్ 12, 2024 నుండి పీఎం ఇంటర్న్‌షిప్ పోర్టల్ ద్వారా ఇంటర్న్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 1.25 లక్షల ఇంటర్న్‌షిప్‌లను ఈ ప్రాజెక్టు కింద లక్ష్యంగా నిర్ణయించారు.
హైస్కూల్ లేదా హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఉత్తీర్ణులై ఐటిఐ సర్టిఫికేట్, పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ నుంచి డిప్లొమా పొందిన వారు, బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ, బీఫార్మా మొదలైన కోర్సుల్లో పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అనర్హత
ఈ కింది చదువులు చదివిన వారు అనర్హులు:
- ఐఐటీలు, ఐఐఎంలు, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు, ఐఐఎస్ఇఆర్, ఎన్ఐడిలు, ఐఐఐటిలు పట్టభద్రులు;
- సీఏ, సీఎంఏ, సీఎస్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఎంబీఏ లేదా ఏదైనా మాస్టర్స్ లేదా అంతకంటే ఎక్కువ డిగ్రీ వంటి అర్హతలు కలిగి ఉన్నవారు;
- కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద నైపుణ్యం, అప్రెంటిస్‌షిప్‌లు, ఇంటర్న్‌షిప్‌లు లేదా విద్యార్థి శిక్షణ పొందుతున్న వారు;
- జాతీయ అప్రెంటిస్‌షిప్ శిక్షణ పథకం (ఎన్ఏటిఎస్)లేదా జాతీయ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ పథకం కింద అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన వ్యక్తులు;
- 2023-24 ఆర్థిక సంవత్సరానికి అభ్యర్థి కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఆదాయం రూ 8 లక్షలు దాటితే;
- శాశ్వత లేదా రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు;
భాగస్వామ్య కంపెనీలకు ప్రమాణాలు
గత మూడు సంవత్సరాలలో సగటు సీఎస్ఆర్ వ్యయం ఆధారంగా 500 కంపెనీలను మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఇతర కంపెనీలు, బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు కూడా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదంతో పాల్గొనవచ్చు. ముఖ్యంగా అవి తక్కువ ప్రాతినిధ్యం ఉన్న రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తే. యూజర్ నియమావళిని అనుసరించడం ద్వారా కంపెనీలు అధికారిక పోర్టల్ ద్వారా తమ ప్రొఫైల్‌లను పోస్ట్ చేసుకోవచ్చు.
భాగస్వామి కంపెనీ నేరుగా ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించలేకపోతే, అది ఈ కింది మార్గాల్లో సహకారం అందించవచ్చు:
- దాని ముందు ఉండే, లేదా వెనుక ఉండే సరఫరా వ్యవస్థలోని కంపెనీలు (ఉదా. సరఫరాదారులు, వినియోగదారులు, విక్రేతలు).
- దాని సమూహంలోని ఇతర కంపెనీలు లేదా సంస్థలు.
ఆర్థిక సహాయం
ఇంటర్న్‌షిప్ సమయంలో ఇంటర్న్‌లు నెలవారీ రూ.5,000 స్టైపండ్ అందుకుంటారు. ఇందులో భాగస్వామ్య సంస్థలు రూ.500 చెల్లిస్తాయి. హాజరు, ప్రవర్తనపై ఇది ఆధారపడి ఉంటుంది. మిగిలిన రూ.4,500 ప్రభుత్వం ఇంటర్న్ ఆధార్-సీడ్ బ్యాంక్ ఖాతాకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా అందజేస్తుంది. ఇదికాక ఇంటర్న్‌షిప్‌లో చేరిన తర్వాత డీబీటీ ద్వారానే రూ.6,000 ఒకసారి ఇచ్చే గ్రాంట్ పంపిణీ చేస్తారు.
బీమా కవరేజి
ఇంటర్న్‌లందరికీ ప్రభుత్వ బీమా పథకాలైన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన వర్తిస్తాయి. ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. భాగస్వామి కంపెనీలు అదనపు ప్రమాద బీమా కవరేజీని కూడా అందించవచ్చు.
పీఎం ఇంటర్న్‌షిప్ పోర్టల్
ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం కేంద్రీకృత ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా అమలవుతుంది. ఈ పోర్టల్ మొత్తం ఇంటర్న్‌షిప్ దశలను నిర్వహిస్తుంది. ఇంటర్న్‌షిప్ అవకాశాలను పోస్ట్ చేయడానికి భాగస్వామి కంపెనీలకు ప్రత్యేక డాష్‌బోర్డ్‌ను అందిస్తుంది. ప్రతి పోస్టింగ్‌లో స్థానం, ఇంటర్న్‌షిప్ స్వభావం, కనీస విద్యార్హతలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు వంటి వివరాలు ఉంటాయి. అర్హత గల అభ్యర్థులు తప్పనిసరిగా పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి, అక్కడ వారి సమాచారం ఆధారంగా రెజ్యూమే (అర్హతలు, వివరాలు) తయారవుతుంది. వారు ప్రాంతం, రంగం, నిర్వహించగల బాధ్యతలు, అర్హతలు వంటి ప్రాధాన్యాల ఆధారంగా గరిష్టంగా ఐదు ఇంటర్న్‌షిప్‌ల కోసం అన్వేషించి, దరఖాస్తు చేసుకోవచ్చు.
పోర్టల్ వైవిధ్యం, సామాజిక సమ్మిళితత్వానికి ప్రాధాన్యతనిస్తూ, కంపెనీ అవసరాలతో పాటు అభ్యర్థుల ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకుని షార్ట్‌లిస్టింగ్ ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఇది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, వికలాంగుల ప్రాతినిధ్యానికి ప్రాధాన్యమిస్తుంది. ప్రతి ఇంటర్న్‌షిప్ కోసం, ఆఫర్‌ల సంఖ్యకు దాదాపు రెండు నుంచి మూడు రెట్ల అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఎంపిక కోసం కంపెనీకి పంపిస్తారు. కంపెనీలు తమ సొంత ప్రమాణాలు, ప్రక్రియల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసుకోవచ్చు. కంపెనీ ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేసిన తర్వాత, అభ్యర్థులు పోర్టల్ ద్వారా ఆ ఆఫర్‌ను అంగీకరించవచ్చు. దీనివల్ల క్రమబద్ధమైన, సమర్థమైన ఇంటర్న్‌షిప్ ప్రక్రియ అనుభవం సాధ్యమవుతుంది.
యువతకు విలువైన అవకాశం
యువతకు సమగ్రమైన శిక్షణ పొందుతూ, ఆర్థిక సహాయం అందుకుంటూ వాస్తవ ప్రపంచ అనుభవాన్ని పొందేందుకు విలువైన అవకాశాన్ని అందిస్తుంది. విభిన్న రంగాలలోని ప్రముఖ కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా, అభ్యర్థుల ఉపాధి, నైపుణ్యాలను పెంపొందించడం ఈ పథకం లక్ష్యం. స్పష్టమైన అర్హత ప్రమాణాలు, ప్రత్యక్ష నగదు బదిలీల ద్వారా నిర్మాణాత్మక మద్దతుతో ఈ కార్యక్రమం వృత్తిపరమైన వృద్ధికి ఊతమివ్వడమే కాకుండా కార్పొరేట్ సామాజిక బాధ్యతకు కట్టుబడి ఉన్న కంపెనీల క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. పీఎం ఇంటర్న్‌షిప్ పోర్టల్ ప్రారంభం దేశంలో తరువాతి తరం నిపుణులను సాధికారీకరించే దిశలో ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుంది.