Kaleshwaram CAG

కాళేశ్వరంలో దండుగమారి వ్యయం…. నిగ్గు తేల్చిన కాగ్

Kaleshwaram CAG

అవసరానికి మించి రేట్లు ఇష్టం వచ్చినట్లు పెంచుకొంటూ సుమారు రూ. లక్ష కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఒక వంక భారీ అవినీతి నెలకొన్నదని, నిర్మాణపు నాణ్యత నాసిరకంగా ఉందని స్పష్టం అవుతుంటే, మరోవంక పెట్టిన ఖర్చు దండుగగా మారిందని కాగ్ నివేదిక వెల్లడి చేసింది. రూపాయి ఖర్చుతో 52పైసల ప్రయోజనం జరిగినట్లు నిగ్గు తేల్చింది. తెలంగాణ ప్రభుత్వం కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశ పెట్టగా డీపీఆర్‌లో రూ.63,352 కోట్లు చూపెట్టగా రూ.1,06,000 కోట్లకు అంచనా వ్యయం పెంచారని, ప్రస్తుత నిర్మాణం వరకు 14 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉందని కాగ్ నివేదిక పేర్కొంది.  మొత్తం ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు రూ.1,47,427 కోట్లు ఖర్చు అవుతుందని, ప్రాజెక్టు నుంచి ఊహించిన ప్రయోజనాలను ఎక్కువ చూపెట్టారని తెలిపింది.

ప్రాజెక్టు వార్షిక ఖర్చులు తక్కువ చూపారని వెల్లడించింది. కాళేశ్వరం నీటి అమ్మకం ద్వారా రూ.1019కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారని… ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు తీసుకున్నట్లు కాగ్ రిపోర్టులో పేర్కొంది. కాళేశ్వరం రీ ఇంజినీరింగ్‌, మార్పుల కారణంగా అప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్ధకమయ్యాయని, దీంతో రూ.765కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్‌ తెలిపింది. ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్ పేరుతో ముందే ప్రారంభించిన ప్రాజెక్టుల్ని ఆపేయడం వల్ల భారీగా నష్టం వాటిల్లిందని కాగ్ పేర్కొంది. సాగునీటి ప్రాజెక్టు పనుల అప్పగింతలో తెలంగాణ నీటిపారుదల శాఖ అనుచిత తొందరపాటు ప్రదర్శించిందని కాగ్ అభిప్రాయ పడింది. డీపీఆర్‌ ఆమోదానికి ముందే రూ.25వేల కోట్ల విలువైన 17 పనులు అప్పగించారని అవసరం లేకున్నా కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు చేపట్టారు. దీనివల్ల రూ.25వేల కోట్లు అదనంగా ఖర్చయిందని పేర్కొన్నారు.

15 బ్యాంకులతో రూ. 87 వేల కోట్లు సమకూర్చుకోవాలని ఒప్పందం చేసుకున్నారని… బడ్జెటేతర రుణాలపై ప్రభుత్వం ఎక్కువ ఆధారపడి ఉందని తెలిపింది. రుణాలు చెల్లించడంలో కాలయాపన చేసిందని పేర్కొంది. ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రతి సంవత్సరం రూ.700 కోట్ల నుంచి రూ.14,500 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, రుణాలు కట్టడం కోసం మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రిపోర్టులో వెల్లడించింది. కాళేశ్వరం అప్పు కట్టుకుంటూ పోతే 2036 లో పూర్తవుతుందని కాగ్ నివేదికలో పేర్కొంది. విద్యుత్ వినియోగానికి ఏటా రూ.3555 అదనపు వ్యయం పెరిగిందని, డిపిఆర్ ఆమోదం తరువాత కూడా ప్రాజెక్టు పనుల్లో మార్పులు చేశారని, అవసరం లేకున్నా కాళేశ్వరం మూడో టిఎంసి పనులు చేపట్టారని, అదనపు టీఎంసి వల్ల రూ.25 వేల కోట్ల అదనపు వ్యయం గుర్తించామని కాగ్ ప్రకటించింది.

సాగునీటి మూలధనం వ్యయం ఒక్కో ఎకరానికి రూ.6.42 లక్షలు అవుతుందని, ప్రాజెక్టు ప్రయోజన, వ్యయ నిష్పత్తి 1:51గా అంచనా వేశామని, ప్రాజెక్టు ప్రయోజన వ్యయ నిష్పతి 0.75గా తేలుతోందని, మరింత తగ్గే అవకాశం ఉందని, లోతైన భూకంప సంబంధిత అధ్యయనాలు చేయకుండానే మల్లన్న సాగర్ నిర్మించారని కాగ్ తప్పుపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కో ఎకరం సాగు చేయడానికి రూ.6 లక్షలు ఖర్చవుతుందని, వాన కాలంలో 150 టీఎంసీలు నిల్వ చేసినా, యాసంగి పంటలకు నీటి కొరత ఏర్పడుతుందని వివరించారు. ఏటా విద్యుత్ చార్జీల కోసం రూ.10వేల 374 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రాజెక్టు నిర్వహణ ఖర్చు ఏడాదికి రూ.10వేల 647 కోట్లు అవుతుందని, కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.81,911 కోట్లు అయితే అది భారీగా పెరిగిందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ అంచనాలన్నిటికీ కలిపి ప్రభుత్వం ఒకేసారి అనుమతి ఇవ్వలేదని, విడతల వారీగా ఒక్కో పనికీ విడివిడిగా అనుమతులు జారీ చేశారని కాగ్ పేర్కొంది.

కృష్ణ చైతన్య