కార్యకర్తల పునాదులపై ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా బిజెపి నిర్మాణం
కార్యకర్తల త్యాగాల పునాదిపైనే నేడు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలిచిందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వరకు బిజెపిలో ప్రతి ఎన్నిక, ప్రతి ప్రక్రియ పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరుగుతుందని వివరించారు. ఇతర పార్టీల్లో చాలా వరకు కుటుంబ పార్టీలే అని, వాటికి స్పష్టమైన సిద్ధాంతాలు ఉండవని, అధికారం సాధించడమే వారి ఏకైక ధ్యేయమని అన్నారు. బిజెపి ప్రతి మూడేళ్లకు ఒకసారి సభ్యత్వ ప్రక్రియ పూర్తయ్యాక కార్యకర్తలకు సంస్థాగతంగా శిక్షణ ఇస్తుంది. జాతీయ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి, ప్రతి కార్యకర్తను సిద్ధాంతపరంగా, రాజకీయంగా, సంస్థాగతంగా బలోపేతం చేస్తుంది. ఇందులో భాగంగా ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన ఫిబ్రవరి 17న రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026 రాష్ట్రస్థాయి కార్యశాల ఉత్సాహంగా సాగింది. ఈ శిబిరంలో పార్టీ సిద్ధాంతాలపై నాయకులు, కార్యకర్తలకు లోతైన అవగాహన కల్పించడంతో పాటు, దేశంలోని తాజా రాజకీయ పరిణామాలు, సమకాలీన అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. సైద్ధాంతిక సాధికారతను పెంపొందిస్తూ, సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికలను సవివరంగా వివరించారు.
ఈ కార్యశాలలో రాంచందర్ రావు ప్రసంగిస్తూ ప్రతి కార్యకర్తను సిద్ధాంతపరంగా దృఢంగా తయారు చేయడం, రాబోయే ఎన్నికలకు సంస్థాగతంగా సిద్ధం కావడం, అలాగే తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఈ ప్రశిక్షణా అభియాన్ ఉద్దేశ్యమన్నారు.”బిజెపి ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా ఎదిగింది. దాదాపు 14 కోట్ల సభ్యత్వంతో పార్టీ విస్తృతమైన బలాన్ని సంపాదించింది. స్వాతంత్ర్యం తర్వాత భారతీయ జనసంఘ్ గా ప్రారంభమైన ప్రయాణం, ఎన్నో అవరోధాలను దాటుతూ, త్యాగాలతో ముందుకు సాగింది. కేరళ వంటి రాష్ట్రాల్లో మన పరిస్థితి అత్యంత కఠినంగా ఉండేది. కమ్యూనిస్టులు పాలించిన కొన్ని రాష్ట్రాల్లో బిజెపి కార్యకర్తలపై దాడులు, హత్యలు జరిగినా కూడా, పార్టీ తన సిద్ధాంతాన్ని, దేశభక్తిని ఎప్పటికీ వదల్లేదు.” అని రాంచందర్ రావు అన్నారు.
ఈ కార్యశాలలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్.గౌతం రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు అమర్‌నాథ్ సారంగుల, రాష్ట్ర పదాధికారులు, బిజెపి జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రభారీలు, తదితులు పాల్గొన్నారు.
బీ.ఎల్. సంతోష్ దిశానిర్దేశం

ఫిబ్రవరి 18న హైదరాబాద్‌లో ప్రశిక్షణ అభియాన్‌కు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలకు కార్యశాల నిర్వహించారు. ఆ కార్యశాలలో బిజెపి జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్ జీ, బిజెపి జాతీయ సహ సంస్థాగత ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ పాల్గొని శ్రేణులకు మార్గదర్శనం చేశారు. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల బిజెపి నాయకులు పాల్గొన్నారు. వేదిక వద్ద బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు బిజెపి జెండా ఎగురవేశారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్, బిజెపి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ అభయ్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, బిజెపి దక్షిణాది రాష్ట్రాల మహా ప్రశిక్షణ అభియాన్ ఇంచార్జ్ డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, బిజెపి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ తదితరులు పాల్గొన్నారు.