ముస్లింల క్షేమం పట్టని ఇస్లామిక్ దేశం పాక్
2026 ఫిబ్రవరి 6న ఇస్లామాబాద్‌లోని ‘ఖదీజా తుల్ కుబ్రా’ షియా మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో జరిగిన ఆత్మాహుతి దాడి, పాకిస్థాన్ కల్లోలిత చరిత్రలో కేవలం మరో ఉగ్రవాద ఉదంతం కాదు. కనీసం 36 మందిని బలి తీసుకుని, 160 మందికి పైగా గాయపరిచిన ఈ ఘటన ఒక అసాధారణ విషాదం కూడా కాదు. నిజానికి ఇది ఒక భయంకరమైన రక్తపాత ఘటనల కొనసాగింపు. 2024 నవంబర్‌లో పారాచినార్‌లో షియా ఊరేగింపుపై జరిగిన దాడిలో మహిళలు, పిల్లలతో సహా 44 మంది పౌరులు మరణించారు. 2022 మార్చిలో ఇస్లామిక్ స్టేట్-ఖొరాసాన్ ప్రావిన్స్ అనే సంస్థ పెషావర్ సమీపంలోని కూచా రిసల్దార్ షియా మసీదుపై దాడి చేయగా 60 మందికి పైగా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 2015లో షికార్పూర్లో శుక్రవారం ప్రార్థనల సమయంలో షియా మసీదును లక్ష్యంగా చేసుకున్న దాడిలో 61 మంది చనిపోయారు. అంతకుముందు, క్వెట్టాలోని హజారా షియాలు దాదాపు జాతి నిర్మూలన స్థాయిలో హింసను అనుభవించారు; 2013లో జరిగిన జంట పేలుళ్లలో 200 మందికి పైగా మరణించారు.
నేడు పాకిస్థాన్‌లో 4 కోట్లకు పైగా షియా ముస్లింలు ఉన్నారు — ఇది ఆ దేశ జనాభాలో దాదాపు ఐదవ వంతు. అయినప్పటికీ, గత రెండు దశాబ్దాలలోనే 4,000 మందికి పైగా షియాలు మతపరమైన దాడులలో హత్యకు గురయ్యారు. ఇవి అస్థిరత వల్ల జరిగిన మరణాలు కావు; ఇవి ఒక వ్యవస్థీకృత సైద్ధాంతిక దాడికి బలైన ప్రాణాలు. తన ముస్లిం జనాభాలో ఇంత పెద్ద భాగాన్ని రక్షించలేని — లేదా రక్షించని — దేశం, ఇస్లామిక్ దేశంగా తనను చెప్పుకునే అర్హతను కోల్పోతుంది. మతపరమైన దాడులు పాకిస్థాన్ అంతర్గత జీవనంలో ఒక లక్షణంగా మారిపోయాయి. మరీ ముఖ్యంగా, బాధ్యత నుంచి తప్పించుకోవాలనే ఆ దేశ సహజ సిద్ధమైన ధోరణి మరోసారి బయటపడింది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎటువంటి ఆధారాలు లేదా విచారణ లేకుండానే భారత్, ఆఫ్ఘనిస్థాన్‌లపై నిందలు వేయడానికి తాపత్రయపడ్డారు. కానీ వాస్తవాలు కఠోరంగా ఉంటాయి. పాకిస్థాన్‌లోని ఈ మత హింస బయటి నుంచి దిగుమతి అయినది కాదు, బలవంతంగా రుద్దినదీ కాదు. ఇది దేశీయం, సైద్ధాంతికంగా పెంచి పోషించింది, రాజకీయ మద్దతు కలిగి ఉంది. ఇస్లాం పేరుతో జరుగుతున్న ఈ సామూహిక హత్యలకు కారణాలు కేవలం మత సిద్ధాంతాల్లోనే కాకుండా పాలనా యంత్రాంగంలో కూడా ఉన్నాయి. మతాలకు అతీతంగా భిన్నమతాలకు రక్షణ కల్పించే శక్తిగా వ్యవహరించడంలో పాకిస్థాన్ విఫలమైంది. దానికి బదులుగా ఇది పదేపదే తీవ్రవాద సున్నీ మెజారిటీవాదంతో చేతులు కలిపి, మతపరమైన ద్వేషాన్ని రాజకీయ పెట్టుబడిగా మార్చుకుంది.
తీవ్రమైన షియా వ్యతిరేక సిద్ధాంతాలకు ప్రపంచవ్యాప్తంగా పేరుమోసిన తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్థాన్ (TLP ) అహ్లే సున్నత్ వల్ జమాత్ వంటి వర్గాలు బహిరంగంగా పని చేయడానికి అనుమతి లభించింది. 2020 సెప్టెంబర్‌లో కరాచీలో 30,000 మందికి పైగా తీవ్రవాదులు ప్రదర్శన నిర్వహించి, షియాలను ‘కాఫిర్లు’ అని పిలుస్తూ వారి తలలు నరకాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. ఇస్లామాబాద్‌లోనూ ఇటువంటి ర్యాలీలు జరిగాయి. ఇవి రహస్య సమావేశాలు కావు; స్వేచ్ఛగా జరిగిన బహిరంగ ప్రదర్శనలు. పంజాబ్ ‘తహాఫుజ్-ఎ-బున్యాద్-ఎ-ఇస్లాం బిల్లు’ (2020) వంటి శాసనపరమైన చర్యలు ఇస్లాంకు సున్నీలు ఇచ్చే వ్యాఖ్యానానికే ప్రాధాన్యమిస్తూ షియాలను మరింత అట్టడుగుకు నెట్టాయి. రాజ్యాంగబద్ధమైన బాధ్యత కంటే ఎన్నికల ప్రయోజనాలే పైచేయి సాధించాయి. తీవ్రవాదులను అడ్డుకోరు; వారిని ఆదరిస్తారు, ఎందుకంటే వారు వీధుల్లో బలాన్ని, ఓట్లను పార్టీలకు అందిస్తారు. ఇక్కడ అసలైన ప్రశ్న ఇటువంటి భావజాలానికి పాకిస్థాన్ సారవంతమైన నేలగా ఎలా మారింది? దీనికి సమాధానం ఆ దేశం పుట్టుకకు దారితీసిన పరిస్థితులు, దశాబ్దాల ప్రభుత్వ విధానాల్లో ఉంది. ఒకప్పుడు ఉగ్రవాదులను ‘మంచివారు’, ‘చెడ్డవారు’ అని విభజించిన దేశం, ఇప్పుడు ఆ హింస తన వరకు వచ్చినప్పుడు ఆశ్చర్యపోయినట్లు నటించకూడదు. ఇస్లాంను అధికార సాధనంగా మార్చినప్పుడు, అది అనివార్యంగా తన సొంత ప్రజలనే బలి తీసుకుంటుంది.
భారత్‌ను సహజంగానే ముస్లిం వ్యతిరేకిగా, ఇస్లాం వ్యతిరేకిగా చిత్రీకరించే పాకిస్థాన్ కథనం వాస్తవాల ముందు పటాపంచలవుతుంది. విభజన సమయంలో భారత్‌లో సుమారు 3 కోట్ల మంది ముస్లింలు ఉండేవారు. నేడు ఆ సంఖ్య 22 – 24 కోట్లు దాటింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశాలలో భారత్ ఒకటిగా నిలిచింది. ఎనభై ఏళ్ళుగా భారతీయ ముస్లింలు జనాభా పరంగా వృద్ధి చెందారు, రాజకీయంగా భాగస్వాములయ్యారు. మత స్వేచ్ఛకు హామీ ఇచ్చే లౌకిక రాజ్యాంగ చట్రంలో జీవిస్తున్నారు. సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాన్, ఇతర ఇస్లామిక్ దేశాలతో భారత్ బలమైన సంబంధాలను కొనసాగిస్తోంది. పాకిస్థాన్ నిరంతరం బురదజల్లే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో కూడా ఇస్లామిక్ ప్రపంచంతో భారత్ సంబంధాలు మరింత లోతుగా మారాయి. దీనికి భిన్నంగా పాకిస్థాన్‌లో అహ్మదీయాలతో సహా ముస్లిమేతరులు, సున్నీయేతర ముస్లింల సంఖ్య నామమాత్రంగా మారింది. వారు ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించబడుతూ, బహిరంగ ప్రదేశాలలో దాదాపు అదృశ్యమయ్యారు.
భారత్ పట్ల పాకిస్థాన్ శత్రుత్వం మతపరమైన దానికంటే నాగరికతా పరమైనది. ఉపఖండపు ఇస్లాం పూర్వ చరిత్రను తిరస్కరించడం ద్వారా పాకిస్థాన్ ఏర్పడింది. అధికారిక పాకిస్థానీ చరిత్రకారులు ఆ దేశ మూలాలను క్రీశ 712లో మొహమ్మద్ బిన్ ఖాసిం సింధ్ దండయాత్ర నుంచి వెతుకుతారు. దేవాలయాలను ధ్వంసం చేసి, స్వదేశీ సంప్రదాయాలను తుడిచిపెట్టిన ఇస్లామిక్ ఆక్రమణదారులను వారు తమ సైద్ధాంతిక పూర్వీకులుగా కీర్తిస్తారు. పాకిస్థాన్‌కు ఇస్లాంపై నిజమైన ప్రేమ ఉంటే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమస్యలపై గట్టిగా నిలబడేది. కానీ పాకిస్థాన్ అలా చేయడం లేదు. గాజా తగలబడుతున్నప్పుడు, ఇరాన్ నిరంతరం ఇజ్రాయెల్-అమెరికా దాడులను ఎదుర్కొంటున్నప్పుడు, పాకిస్థాన్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోంది. నిజానికి అంతకంటే దారుణంగా అమెరికా, ఇజ్రాయెల్ లకు వ్యూహాత్మక సహకారాన్ని అందిస్తోంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా దళాలు పాకిస్థాన్ స్థావరాలను పరోక్షంగా వాడుకుంటున్నాయనే వార్తలు, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ వాషింగ్టన్లో జరిపే చర్చలు వారి ‘ఉమ్మా’ (ముస్లిం సోదరభావం) నినాదాల్లోని డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి.
పాకిస్థాన్ నైతిక పతనం చైనాతో దాని స్నేహంలో స్పష్టంగా కనిపిస్తుంది. బీజింగ్ ప్రభుత్వం ఉయ్ఘర్ ముస్లింల ఇస్లామిక్ అస్తిత్వాన్ని వ్యవస్థీకృతంగా తుడిచివేస్తోంది — మసీదులను కూల్చివేయడం, ఖురాన్ ఆచారాలను నిషేధించడం, పది లక్షల మందికి పైగా ముస్లింలను ‘పునఃవిద్యా శిబిరాల్లో’ బంధించడం వంటివి చేస్తున్నా, పాకిస్థాన్ మాత్రం మౌనంగా ఉంటోంది. ముస్లింలపై సాంస్కృతిక మారణహోమానికి పాల్పడుతున్న సామ్రాజ్యానికి బంటుగా మారిన ఒక స్వయం ప్రకటిత ఇస్లామిక్ దేశపు ఈ వైరుధ్యం విస్మరించలేనిది. రుణాలు, కారిడార్లు, వ్యూహాత్మక ప్రయోజనాలకు పాకిస్థాన్ అమ్ముడుపోయింది. బహుశా అత్యంత తీవ్రమైన విమర్శ కాశ్మీర్‌లోని షియా నిరసనకారుల నుంచి వచ్చింది. భారత త్రివర్ణ పతాకంతో కవాతు చేస్తూ వారు సూటిగా ఇలా ప్రశ్నించారు: “పాకిస్థాన్‌లో షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. మసీదుల లోపల ప్రార్థనల సమయంలో ముస్లింలను చంపడం బాధాకరం. ఇది ఎలాంటి జిహాద్?”
పాకిస్థాన్ అంటేనే ఒక వైరుధ్యాల పుట్ట. అది ఒక ఇస్లామిక్ దేశమని చెప్పుకుంటూనే ఇతర ముస్లిమేతర దేశాల కంటే ఎక్కువ మంది ముస్లింలను చంపుతోంది. ఎక్కడో ముస్లింలను బాంబులతో చంపే లేదా అణచివేసే శక్తులతో అది పొత్తు పెట్టుకుంటుంది. తన ఇస్లాం పూర్వపు వారసత్వం, చరిత్ర, బహుళత్వం వంటి నాగరికతా లక్షణాల పట్ల ద్వేషంతో రగిలిపోయే ఒక సైద్ధాంతిక వ్యవస్థ అది.
బల్బీర్ పుంజ్,
బిజెపి మాజీ ఎంపీ

