అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ చరిత్ర రాహుల్ తెలుసుకోవాలి!
అంబేద్కర్ రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తిరగడం కాదు.. మనసులో పెట్టుకొని ఆచరించాలని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సూచించారు. ముందుగా అంబేద్కర్‌ను అవమానాలకు గురి చేసిన కాంగ్రెస్ చరిత్ర తెలుసుకోవాలని చురకలంటించారు. బిజెపి తెలంగాణ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని రాష్ట్ర కార్యాలయంలో వారి చిత్రపటానికి ఎన్. రాంచందర్ రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని రాంచందర్ రావుతో పాటు బిజెపి నేతలు ప్రతిజ్ఞ చేశారు. ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికీ పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతి కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నేనావత్, సీనియర్ నాయకులు డా. మనోహర్ రెడ్డి, పోతుగంటి రాములు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. ”అంబేద్కర్ కేవలం రాజ్యాంగ రచయిత మాత్రమే కాదు.. సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల సాధికారత కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు. ఆయన కృషి వల్లే ఈరోజు రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయి. సమాజంలో ఉన్న అసమానతలను తగ్గించే మార్గాన్ని ఆయన చూపించారు. అయితే ఈరోజు రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు. ముందుగా అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ ఎలా వ్యవహరించిందో ఆయన తెలుసుకోవాలి. స్వాతంత్ర్యానికి ముందు బాంబే ప్రెసిడెన్సీలో అంబేద్కర్‌ను పోటీ చేయకుండా అడ్డుకోవడం, ఆయనకు వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టి ఓడించడం, రాజ్యాంగ సభలో ఆయనకు అవకాశం ఇవ్వకపోవడం వంటివన్నీ కాంగ్రెస్ నిర్వాకమే. చివరికి ముస్లిం లీగ్ మద్దతుతోనే ఆయన రాజ్యాంగ సభలోకి ప్రవేశించాల్సి వచ్చింది.
స్వాతంత్ర్యం తర్వాత కూడా పరిస్థితి మారలేదు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్‌గా అంబేద్కర్‌ను అంగీకరించడంలో కూడా కాంగ్రెస్ నాయకత్వం తొలుత వెనుకంజ వేసింది. ముఖ్యంగా జవహర్‌లాల్ నెహ్రూ ఆయన అనేక ప్రతిపాదనలను వ్యతిరేకించారు. 1953లో నెహ్రూ ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో రిజర్వేషన్లు ప్రమాదకరమని పేర్కొన్నారు. 1961లో “నేను ఏ రూపంలోనైనా రిజర్వేషన్లను ఇష్టపడను, ముఖ్యంగా ఉద్యోగాల్లో” అని స్పష్టం చేశారు. ఇవన్నీ రికార్డుల్లో ఉన్న విషయాలే. అంబేద్కర్ రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పదేపదే దెబ్బతీసింది. ఆయన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ ప్రత్యర్థులను నిలబెట్టి రెండు సార్లు ఓడించింది. హరిజన్ సేవక్ సంఘ్ వంటి సంస్థలను ఏర్పాటు చేసి ఆయన ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది. ఆయనకు భారతరత్న కూడా కాంగ్రెసేతర ప్రభుత్వ కాలంలోనే లభించింది. మవు వద్ద ఆయన జన్మస్థలంలో స్మారక నిర్మాణం విషయంలో కూడా ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం లేదని అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేర్కొన్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్‌కు తగిన గౌరవం లభించింది. ఆయన జీవితానికి సంబంధించిన ఐదు ముఖ్య ప్రదేశాలను “పంచతీర్థాలు”గా అభివృద్ధి చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గాల సాధికారత కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ సమాజంలో సమానత్వాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.

