భారత రక్షణ సామర్థ్యంపై పెరిగిన విశ్వాసం
(జూలై 26న ప్రసారమైన మన్ కీ బాత్ (మనసులో మాట)లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు)
జూలై 26 అంటే మనందరికీ గర్వకారణమైన కార్గిల్ విజయ్ దివస్. ఈ రోజు మన వీర జవాన్ల అసమాన ధైర్యం, త్యాగాన్ని స్మరించుకునే రోజు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ మన సైనికులు దేశాన్ని రక్షించి చరిత్ర సృష్టించారు. అమరవీరులందరికీ, ధైర్యవంతులైన మన సైనికులందరికీ నా హృదయపూర్వక నివాళులు. ఈ రోజు భారతదేశం తన వీరులను గౌరవించడమే కాదు, వారి స్ఫూర్తిని కొత్త తరాలకు చేరవేస్తోంది. ఈ స్ఫూర్తితో ఈ సంవత్సరం ఒక ప్రత్యేక ‘శౌర్య విజయ యాత్ర’ జరిగింది. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం నుండి జూలై 14న ప్రారంభమైన ఈ మోటార్ సైకిల్ యాత్ర ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వరకు చేరుకుంటుంది. దీని సందేశం “ఒకే ప్రయాణం, ఒకే దేశం, ఒకే వందనం.” దేశం కోసం చేసిన త్యాగాలను ఎన్నటికీ మరచిపోలేమని ఈ యాత్ర మనకు గుర్తు చేస్తుంది.
నేడు భారతదేశం సాంకేతిక సామర్థ్యాలను నిరంతరం బలోపేతం చేసుకుంటోంది. కొన్ని రోజుల కిందట ఐఎన్ఎస్ మహేంద్రగిరిని భారత నౌకాదళంలోకి చేర్చారు. ఈ ఆధునిక యుద్ధనౌకను భారతదేశంలోనే రూపకల్పన చేసి, నిర్మించారు. దీనిలోని 75 శాతానికి పైగా సామగ్రి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ఇది ఆత్మనిర్భర భారతదేశం విషయంలో పెరుగుతున్న శక్తికి ప్రతీక. పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్‌ను, కుశ క్షిపణిని డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయం మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సామూహిక కృషి ఫలితం. స్వదేశీ యుద్ధనౌకలు, అధునాతన క్షిపణులు, ఆధునిక సాంకేతికతతో భారత్ ఆత్మనిర్భరత వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ప్రపంచం భారత రక్షణ సామర్థ్యంపై విశ్వాసం పెంచుకుంటోంది.
ప్రతి వర్షపు చుక్కను సంరక్షించడం మన బాధ్యత. దేశవ్యాప్తంగా వర్షపు నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపు, మొక్కల నాటకం వంటి కార్యక్రమాల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రతి నీటి చుక్క భవిష్యత్ తరాలకు అమూల్యమైన సంపద. మన పరిసరాల్లోని నీటి వనరులను కాపాడటం మనందరి బాధ్యత. మధ్యప్రదేశ్‌లోని సీధీ జిల్లాలో దాదాపు 1,500 చెరువులను నిర్మించారు. నరసింగ్‌పూర్‌లో అమృత్ సరోవర్లను పునరుద్ధరించారు. మహారాష్ట్రలోని నాసిక్ లో పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారంలో చేరాయి. పాత చెరువులు తిరిగి ఉపయోగపడేలా చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా, ఒడిశాలోని భువనేశ్వర్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో ఈ ప్రచారం ద్వారా ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మన పరిసరాల్లోని చెరువు, బావి లేదా మెట్ల బావి బాధ్యతను మనమే తీసుకుందాం. ప్రతి నీటి చుక్కను ఆదా చేద్దాం. ఈ రోజు ఆదా చేసిన ప్రతి నీటి చుక్క రాబోయే తరాల భవిష్యత్తుకు గొప్ప ఆస్తి.
ఇటీవలి కాలంలో మన యువత క్రీడలలో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. బ్యాడ్మింటన్‌లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా పీవీ సింధు నిలిచారు. ఆమె సాధించిన ఈ ఘనతకు యావత్ దేశం గర్విస్తోంది. భారత మహిళల క్రికెట్ జట్టు కూడా లండన్‌లోని లార్డ్స్ స్టేడియంలో తన తొలి టెస్ట్ మ్యాచ్‌ను గెలుచుకుంది. ఇది ఒక చారిత్రాత్మక విజయం. లార్డ్స్ సుదీర్ఘ చరిత్రలో మహిళల జట్టు ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్ ఇది. 1983లో ఇదే మైదానంలో భారతజట్టు తన తొలి క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఇప్పుడు అదే ప్రదేశంలో మన మహిళా శక్తి దేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది.
కేరళంలోని ఎర్నాకులం ప్రాంతంలో ఉన్న దక్షిణ చిత్తూరులోని ఒక పాఠశాలలో సంస్కృత క్లబ్ ఉంది. ఉపాధ్యాయుడు అభిలాష్ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సంస్కృతాన్ని ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టును ‘అక్షరకందుక్’ అని పిలుస్తారు. ఫుట్‌బాల్‌లో ఉపయోగించే పదాలతో సంస్కృత అక్షరాలను అనుసంధానించి సులభంగా సంస్కృతాన్ని ఈ ప్రాజెక్టులో వివరిస్తారు. ఇది అభ్యసనను ఆనందదాయకంగా మార్చడమే కాకుండా క్రీడలలో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా పెంచుతుంది.
భారత అంతరిక్ష రంగం కూడా కొత్త చరిత్ర సృష్టిస్తోంది. ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన రాకెట్ విజయవంతంగా ప్రయోగం కావడం దేశానికి గర్వకారణం. యువ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు అవకాశాలు కల్పిస్తే వారు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విజయాలు సాధించగలరని మరోసారి నిరూపితమైంది. సైన్స్ ఒలింపియాడ్లలో కూడా మన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాలు సాధించారు. భారత యువత ప్రతిభ ప్రపంచ వేదికలపై వెలుగొందుతోంది. విజ్ఞానం, ఆవిష్కరణ, పరిశోధనల వైపు మరింత ముందుకు సాగాలని నేను యువతను కోరుతున్నాను.
‘ఏక్ పేడ్ మా కే నామ్’ ఉద్యమానికి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ప్రజలు ప్రకృతి పరిరక్షణను తమ బాధ్యతగా స్వీకరిస్తున్నారు. అహ్మదాబాద్‌లో గంటలోనే లక్షలాది మొక్కలు నాటి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఉత్తరప్రదేశ్‌లో కూడా ఒక్క రోజులో కోట్లాది మొక్కలు నాటారు. ఇలాంటి ప్రజా భాగస్వామ్యమే పచ్చని భారత నిర్మాణానికి బలమైన పునాది. చెట్లు కేవలం మనుషుల కోసమే కాదు, అనేక జీవరాశులకు ఆశ్రయం. గిర్ అడవుల్లో దశాబ్దాల తర్వాత ఇండియన్ గ్రే హార్న్‌బిల్ పక్షి తిరిగి గూడు కట్టడం ప్రకృతి పరిరక్షణ విజయానికి నిదర్శనం. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని ప్రకృతితో ముడిపెట్టండి. మీ అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటండి. ఈ రోజు నాటిన మొక్క రాబోయే తరాలకు పచ్చదనాన్ని, స్వచ్ఛమైన గాలిని అందించే అమూల్యమైన కానుకగా నిలుస్తుంది.
ప్లాస్టిక్ కాలుష్యం మనందరికీ పెద్ద సవాలు. ఒక్కసారి ఉపయోగించే ప్లాస్టిక్‌ను సరైన విధంగా పునర్వినియోగం చేయడం చాలా అవసరం. బీహార్‌లో వ్యర్థ ప్లాస్టిక్‌తో బెంచీలు తయారు చేసి పాఠశాలలు, పార్కుల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణతో పాటు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తోంది. Reduce, Reuse, Recycle అనేవి కేవలం నినాదాలు కాదు, మన జీవన విధానంలో భాగం కావాలి.
‘వోకల్ ఫర్ లోకల్’ ఉద్యమం మన దేశానికి కొత్త శక్తినిస్తోంది. సంప్రదాయ కళలు, హస్తకళలు, స్థానిక ఉత్పత్తులు మళ్లీ ప్రజాదరణ పొందుతున్నాయి. మహిళా స్వయం సహాయక సంఘాలు, చిన్న వ్యాపారులు, కళాకారులు తమ ప్రతిభతో ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారు. మనం స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తే వేలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది.
రాబోయే వినాయక చవితి సందర్భంగా మన దేశ మట్టితో తయారైన గణేశ విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులుగా స్వదేశీ మట్టి గణేశుడిని పూజించడం ద్వారా పర్యావరణాన్ని కూడా కాపాడిన వారమవుతాం. రాబోయే పండుగల సందర్భంగా ఖాదీ, చేనేత వస్త్రాలు, హస్తకళల ఉత్పత్తులను కొనుగోలు చేసి వారికి ప్రోత్సాహం ఇవ్వాలని నేను కోరుతున్నాను.
మన దేశ యువత విజ్ఞానశాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి గౌరవం తీసుకొస్తోంది. మణిపూర్‌కు చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ రోనాల్డో లెష్రమ్ తన శాస్త్రీయ ఆవిష్కరణకు స్వస్థలమైన లోక్తక్ సరస్సు పేరును పెట్టడం ఎంతో గర్వకారణం. ప్రపంచ వేదికపై విజయాలు సాధించినా, తమ మూలాలను గౌరవించడం భారతీయుల గొప్ప సంస్కృతికి నిదర్శనం.
మన దేశానికి గొప్ప సంగీత వారసత్వం ఉంది. త్రిపురకు చెందిన సంప్రదాయ చౌంగ్ ప్రెంగ్ వాయిద్యాన్ని తిరిగి ప్రజల్లోకి తీసుకువచ్చేందుకు కొందరు కళాకారులు విశేష కృషి చేస్తున్నారు. మన సంప్రదాయ కళలు, సంగీతాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత. మీ ప్రాంతంలోని సంప్రదాయ కళలు, వాయిద్యాల గురించి తెలుసుకోండి, వాటిని ప్రోత్సహించండి, ప్రపంచానికి పరిచయం చేయండి. అదే మన సాంస్కృతిక వారసత్వానికి నిజమైన గౌరవం.
మరికొన్ని రోజుల్లో మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. మన స్వేచ్ఛ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకునే సందర్భం ఇది. ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమాన్ని ఈ సంవత్సరం కూడా అదే ఉత్సాహంతో కొనసాగిద్దాం. ప్రతి ఇంటిపై గౌరవంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేద్దాం. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగానికి సంబంధించిన మీ ఆలోచనలు, సూచనలను MyGov ద్వారా తప్పకుండా పంపండి. మీ అభిప్రాయాల కోసం నేను ఎదురుచూస్తుంటాను.

