నిరసనలను రాజకీయం చేశారు
నీట్ నిరసనలను రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యుడు దుష్యంత్ గౌతమ్. నిరసనల్లో పాల్గొన్న వారిలో సగం మందికి పైగా ఈ సమస్యతో ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ నిరసనలో దేశ వ్యతిరేక నినాదాలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం ‘తుక్డే-తుక్డే’ గ్యాంగ్ అక్కడే ఉందని ఆరోపించారు. ఈ నిరసనలో పాల్గొన్న వారి నేపథ్యం, వారికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో పరిశీలించాలన్నారు. నిరసన వెనుక ఉన్న ఇతర శక్తులు దేశంలో అస్థిర వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నించాయని తెలిపారు. దేశ ఐక్యతకు వ్యతిరేకంగా దేశద్రోహ శక్తులు పనిచేశాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఈ నిరసనను హైజాక్ చేయాలని భావించి ఖర్గే పుట్టినరోజు వేడుకల పేరుతో ప్రధాని నివాసానాకి ర్యాలీ చేపట్టారని విమర్శించారు. ఒక జాతీయ ఆంగ్ల వార్తాపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, విద్యార్థుల ఆగ్రహం, మంత్రివర్గ జవాబుదారీతనంపై డిమాండ్లు, ప్రతిపక్షాల ఆరోపణలపై దుష్యంత్ గౌతమ్ స్పందించారు. ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:
ప్ర: ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకోవాలని ఎందుకు నిర్ణయించారు?
జ: దేశ మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యా రంగంలో అనేక ముఖ్యమైన మార్పులకు బాధ్యత వహించారు. విద్యార్థులకు అత్యంత కీలకమైన చట్టాలను ఆయన తెచ్చారు. అయితే, నీట్-యూజీ (NEET-UG) ప్రశ్నాపత్రం లీకేజీ తర్వాత, మళ్ళీ పరీక్ష నిర్వహించిన తర్వాత విద్యార్థులు ఆయన రాజీనామాను డిమాండ్ చేశారు. ఎటువంటి ఆలస్యం లేకుండా, విజయవంతంగా నిర్వహించినప్పటికీ వారు ఈ డిమాండ్ చేశారు. దీనివల్ల విద్యార్థులు మరొక సంవత్సరం వేచి చూడాల్సిన అవసరం రాలేదు. ఇది విద్యార్థుల నిరసన అయినప్పటికీ వారి వెనుక ఉన్న ఇతర శక్తులు దేశంలో అస్థిర వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నించాయి. దేశ ఐక్యతకు వ్యతిరేకంగా దేశద్రోహ శక్తులు పనిచేశాయి. ప్రధానమంత్రి ఒక సానుకూలమైన అడుగు వేశారు. జంతర్ మంతర్ వద్ద యువతను ఏ విధంగా దారి మళ్లిస్తున్నారో చూసిన తర్వాతే తాను పక్కకు తప్పుకున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ జీ కూడా చెప్పారు. ఈ కారణంగానే ఆయన రాజీనామాపై నిర్ణయం జరిగింది. ఆయన రాజీనామా చేశారు. ఆయన దేశానికే తొలి ప్రాధాన్యం ఇచ్చారు.
ప్ర: విద్యా మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను ప్రహ్లాద్ జోషికి ఎందుకు ఇచ్చారు?
జ: ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో నిర్ణయించే హక్కు ప్రధానమంత్రికి ఉంటుంది. అంతిమంగా, ఇది ఒక ముఖ్యమైన మంత్రిత్వ శాఖ. దీన్ని ఖాళీగా ఉంచలేము. జోషి సీనియర్ నాయకుడు, ఆయన ఇప్పటికే మరొక మంత్రిత్వ శాఖను చూస్తున్నారు, కాబట్టి దీన్ని ఎలా నిర్వహించాలో ఆయనకు బాగా తెలుసు.
ప్ర: విద్యా మంత్రిత్వ శాఖను విడిగా వేరే మంత్రి నిర్వహించకూడదా?
జ: ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తే వచ్చిన నష్టమేమిటి? పనులు ఎలా పూర్తి చేయాలో ఆయనకు తెలుసు. పాలనాపరమైన పనులకు ఎటువంటి ఆటంకం కలగకూడదు. దీని గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రికి దీనిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించి ఉన్నారు. ఆయనే దీన్ని చూసుకుంటారు.
ప్ర: ఒక రాజీనామా తర్వాత మరికొందరు మంత్రుల రాజీనామా కోసం డిమాండ్లు పెరుగుతాయని మీరు భావిస్తున్నారా?
జ: లేదు. అలా జరగదు. ఇలాంటి నిర్ణయాలను కేంద్ర మంత్రివర్గం తీసుకుంటుంది. ఈ రాజీనామా జాతీయ ప్రయోజనాల కోసం, దేశం కోసం జరిగింది. దీన్ని మనం వేరే విధంగా చూడకూడదు. ధర్మేంద్ర ప్రధాన్ ఒక ఉన్నతమైన నాయకుడు, ఆయన గౌరవాన్ని మనం తగ్గించకూడదు. ఇది ఎంతో ఆలోచించి, చర్చించిన తర్వాత తీసుకున్న నిర్ణయం.
ప్ర: ఇటీవల జరిగిన నిరసనలను బిజెపి ఎలా చూస్తుంది?
జ: ప్రజాస్వామ్యంలో ప్రజలకు తమ డిమాండ్లను వినిపించే, నిరసన తెలిపే, ఆందోళనలు చేసే హక్కు ఉంది. లోపాల వల్ల పేపర్ లీక్ జరిగి ఉంటే, దానికి బాధ్యులైన వారిని తప్పక శిక్షించాలి. ఇందులో ప్రమేయం ఉన్నవారిపై చర్యలు తీసుకున్నాం. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. అయితే ఈ అంశాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. నిరసనల్లో పాల్గొన్న వారిలో సగానికి పైగా ప్రజలకు ఈ సమస్యతో ఎటువంటి సంబంధం లేదు. నీట్ పరీక్ష గురించి 50 ఏళ్ల వ్యక్తి ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ నిరసనల్లో 10 ఏళ్ల పిల్లాడు లేదా పదో తరగతి విద్యార్థి ఏం చేస్తున్నారు? దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. మొత్తం ‘తుక్డే-తుక్డే’ గ్యాంగ్ అంతా అక్కడ ఉంది. ఈ నిరసనలో పాల్గొన్న వారి నేపథ్యం ఏమిటో, వారికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో మనం పరిశీలించాలి. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి రాజకీయ పార్టీలకు ఈ సమస్యను పరిష్కరించడంలో నిజంగా ఆసక్తి ఉంటే వారు దీనిపై పార్లమెంట్‌లో చర్చించాలి. దేశంలో దాదాపు ప్రతి సంవత్సరం ఎన్నికలు జరుగుతుండటంతో వారు దీనిని మరొక ఎన్నికల అవకాశంగా చూస్తున్నారు. 2004 నుండి 2014 మధ్య కనీసం 12 లేదా 13 పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయి. అప్పుడు వీరంతా ఎందుకు మౌనంగా ఉన్నారు?
ప్ర: పెద్ద సంఖ్యలో విద్యార్థులు నిరసనల్లో చేరిన దృష్ట్యా యువతలో ఆగ్రహం పెరుగుతోందని మీరు భావిస్తున్నారా?
జ: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి భవిష్యత్తు గురించి మేం ఆలోచిస్తాం. మేం అనేక పథకాలను ప్రారంభించాం, విశ్వవిద్యాలయాల సంఖ్యను పెంచాం, మెడికల్ కళాశాలల్లో సీట్లను విస్తరించాం. ప్రధాని క్రమం తప్పకుండా విద్యార్థులతో సంభాషిస్తుంటారు. 2004-2014 మధ్య కాలాన్ని ప్రస్తుత కాలంతో పోల్చి చూడండి. అప్పట్లో విద్యార్థులను, నిరసనకారులను ఎలా చూశారో, ఇప్పుడు ఎలా చూస్తున్నారో గమనించండి. ఆందోళనలు చేసిన వారిపై మేం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విద్యార్థులను రాజకీయం కోణంలో లేదా ఓటు బ్యాంక్‌లా చూడకూడదు.
ప్ర: జూన్ 6 నుంచి విద్యార్థులు నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం వారితో చర్చలు జరపలేదు. ఎందుకని?
జ: నిరసనకారులు ఎప్పుడూ చర్చలకు ముందుకు రాలేదు. చర్చల కోసం ఎవరూ ప్రభుత్వాన్ని సంప్రదించలేదు.
ప్ర: రాహుల్ గాంధీ నిరసన తర్వాతే మీరు స్పందించారా?
జ: వారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే పుట్టినరోజు వేడుకలను జరుపుకొంటూ, అందరినీ ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు, ఆ తర్వాత హఠాత్తుగా ప్రధాని నివాసం వైపు ర్యాలీ చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయి. ప్రతిపక్ష నాయకుడిగా ర్యాలీకి నాయకత్వం వహించాలనుకుంటే అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వడం ఆయన బాధ్యత. కానీ ఆయన తన ఓటు బ్యాంకును కాపాడుకోవడం, తన మద్దతుదారులను సంతోషపెట్టడం పైనే ఎక్కువ శ్రద్ధ చూపినట్లు అనిపించింది. నిరసనను హైజాక్ చేయాలని మాత్రమే ఆయన భావించారు.
ప్ర: ఇంత పెద్ద వివాదం జరుగుతున్నా వారాల తరబడి ఒక మంత్రి రాజీనామా చేయకపోతే, రాజకీయ జవాబుదారీతనం మరి ఏ పరిస్థితిలో వర్తిస్తుంది?
జ: ఎవరు జవాబుదారీయో కచ్చితంగా నిర్ణయిస్తాం. బాధ్యులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి, వారిపై కేసులు నమోదు చేస్తాం. కేవలం ప్రజల అభిప్రాయం ఆధారంగానే ఎవరినీ దోషిగా నిర్ధారించలేం. సరైన విచారణ ద్వారా పేపర్‌ను ఎవరు లీక్ చేశారు, అది ఎలా జరిగింది, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో తేలాలి.
ప్ర: నీట్ పేపర్ లీక్ కుంభకోణం నిందితులకు కఠినమైన శిక్ష విధించాలని ప్రధాని మోదీ అన్నారు. ఈ జవాబుదారీతనంలో మంత్రులు కూడా ఉంటారా?
జ: ఎంతటి సీనియర్ లేదా పలుకుబడిగలవారైనా దోషులుగా తేలితే శిక్ష ఖాయమని మేం మొదటి నుంచి చెబుతున్నాం. పేపర్ లీకేజీలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరూ చట్టాన్ని ఎదుర్కొవాల్సిందే.
ప్ర: దేశంలోని విద్యార్థులకు ఇది నిజమైన సంక్షోభమని, ఇది కేవలం ప్రతిపక్షాల ప్రేరేపితం కాదని మీరు భావిస్తున్నారా?
జ: విద్యార్థులకు ఇది పెద్ద సంక్షోభమని నేను అనుకోను, కానీ పరీక్షకు సిద్ధమై హాజరైన వారు ఎందుకు ఆందోళన చెందుతున్నారో నేను అర్థం చేసుకోగలను. జాప్యం సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. ప్రతి విద్యార్థి ఉన్నత నేపథ్యం నుంచి రారు, చాలామందికి ఇది ఒక్కటే అవకాశం. నీట్ పేపర్ లీక్ సమాజ వ్యతిరేక శక్తుల చర్యల ఫలితం.
ప్ర: దీని వల్ల రాజకీయ పర్యవసానాలు ఉంటాయని బిజెపి భావిస్తోందా?
జ: ఓట్లు, ప్రజాస్వామ్యం, ఎన్నికలకు వాటి స్థానం వాటికి ఉంటుంది, కానీ పరీక్షలు, విద్యార్థుల భవిష్యత్తు వేరే అంశం. ఇది ఎన్నికల అంశంగా మారకూడదు. రాజకీయ పార్టీలు ఈ పరిస్థితిని స్వార్థానికి వాడుకోవాలని చూస్తున్నాయి. అయితే బిజెపి తీవ్రంగా కష్టపడి పనిచేసిందని, ప్రధాని నిజాయితీగా, ప్రజా ప్రయోజనాల కోసమే పరిపాలించారని ప్రజలకు తెలుసు. ఆ నమ్మకం అలాగే ఉంది.
ప్ర: నిరసనలను అణచివేయడానికి పోలీసులు చర్యలు తీసుకోవడం, పెల్లెట్ తుపాకులను ఉపయోగించడం సరైన సందేశాన్ని ప్రజల్లోకి పంపిస్తుందని ప్రభుత్వం భావిస్తోందా?
జ: పోలీసులు తమను తాము రక్షించుకోవాల్సి ఉంటుంది. అధికారులపై దాడులు జరుగుతుంటే, వాహనాలను తగలబెడుతుంటే, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తుంటే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నది ఎవరో మనం ప్రశ్నించుకోవాలి. పోలీసులు గానీ, నిరసనకారులు గానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు.
ప్ర: సోనమ్ వాంగ్‌చుక్‌ను బలవంతంగా ఆస్పత్రికి తరలించడం సరైన నిర్ణయమేనా?
జ: ఆయన ఈ దేశ పౌరుడు, ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందడం ప్రభుత్వ బాధ్యత. వైద్యులు, న్యాయస్థానం కూడా ఆయన పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి, ఆయన అభీష్టానికి అనుగుణంగానే చికిత్స అందించడం జరిగింది.

