Medical Student

2014 తర్వాత మారిపోయిన వైద్య విద్య రూపురేఖలు

140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ప్రతి ఏటా ఎంతమంది వైద్యులు తయారవుతున్నారనేది కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు. ఎంతమంది కుటుంబాలకు నిపుణులైన (స్పెషలిస్ట్) వైద్యులు అందుబాటులోకి వస్తారు, ఎంతమంది ప్రతిభావంతులైన విద్యార్థులు వైద్య విద్య కోసం ఉక్రెయిన్, జార్జియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు వెళ్లకుండా స్వదేశంలోనే చదువుకుంటారు, అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రతి 1,000 మందికి ఒక వైద్యుడు అనే నిష్పత్తికి భారత్ ఎంత సమీపంలో ఉందో చెప్పే ప్రత్యక్ష కొలమానం అది. యూపీఏ పాలన ముగిసే సమయానికి భారతదేశంలో వైద్యులు-జనాభా నిష్పత్తి 1:1,456 గా ఉండేది. 2026 జూలై 24న లోక్‌సభలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఇచ్చిన తాజా సమాధానం, అలాగే అదే రోజున మరో సహాయ మంత్రి అనుప్రియా పటేల్ సమర్పించిన రాతపూర్వక సమాధానం ఈ మార్పును మరోసారి స్పష్టంగా తెలియజేస్తుంది. 2023 నుంచి 2026 వరకు గత దశాబ్ద కాలంలో పార్లమెంటులో ఇచ్చిన సమాధానాలు భారతీయ వైద్య విద్యా రంగ విస్తరణ ఎంత వేగంగా, వాస్తవంగా జరిగిందో వివరిస్తున్నాయి.

‌‌యూపీఏ వారసత్వం: మందగమనం, తీవ్ర నిర్లక్ష్యం

మే 2014లో యూపీఏ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయే సమయానికి భారత్ లో 387 వైద్య కళాశాలలు, 51,348 ఎంబీబీఎస్ సీట్లు, 31,185 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు ఉన్నాయి. యూపీఏ తన నివేదికలో పేర్కొన్న అధికారిక గణాంకాలే ఆ ప్రభుత్వ రెండో విడత పాలనలో వృద్ధి ఎంత నెమ్మదిగా సాగిందో తెలియజేస్తున్నాయి. మే 2009 నుండి 2013 మధ్య కాలంలో (యూపీఏ-2 లో దాదాపు నాలుగేళ్ల కాలంలో) కేవలం 72 కొత్త వైద్య కళాశాలలు (6 కొత్త ఎయిమ్స్‌తో కలిపి) మాత్రమే ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా 12,062 ఎంబీబీఎస్ సీట్లు, 9,925 పీజీ సీట్లు మాత్రమే పెరిగాయి. 2013 నాటికి దేశంలో 362 వైద్య కళాశాలలు, 45,629 ఎంబీబీఎస్ సీట్లు, 23,763 పీజీ సీట్లు ఉన్నాయి. అయితే ఆ ఏడాది 1,300 సీట్లు ఉన్న 12 కళాశాలల అనుమతిని పునరుద్దరించక పోవడంతో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 44,329కి పడిపోయింది. అంటే దాదాపు పదేళ్ల యూపీఏ పాలనలో (2004–2014) వైద్య కళాశాలల విస్తరణ ఎంత నెమ్మదిగా జరిగిందంటే డాక్టర్-జనాభా నిష్పత్తి 1:1,456 గా మిగిలిపోయింది. ఇది డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసిన 1:1,000 నిష్పత్తి కంటే చాలా తక్కువ. ఈ కొరత కారణంగానే ‘నీట్’ అర్హత సాధించిన వేల మంది విద్యార్థులు ఏటా లక్షలు ఖర్చు చేసి విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. యూపీఏ ప్రభుత్వం అత్యంత నెమ్మదిగా వ్యవహరించింది. ఈ కొరతను ఇలాగే కొనసాగించడం వెనుక కొందరు స్వార్థపరుల ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

‌‌వైద్య విద్యార్థుల విదేశీ చదువులు 

వైద్య సీట్ల కొరత వల్ల దేశం చెల్లించిన అతిపెద్ద మూల్యం భారతీయ విద్యార్థులు పెద్ద ఎత్తున విదేశాలకు వలస వెళ్లడం. స్వదేశంలో అందుబాటు ధరల్లో సీట్లు లభించకపోవడం, ప్రైవేట్ మార్కెట్‌లో పెరిగిన క్యాపిటేషన్ రుసుములు భరించలేకపోవడంతో వేల మంది యువతీ యువకులు వైద్య విద్య కోసం ఉక్రెయిన్, రష్యా, చైనా, ఫిలిప్పీన్స్, జార్జియా, కిర్గిజిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలకు విమానమెక్కారు. వారు విదేశీ మారకద్రవ్యాన్ని చెల్లించి, కుటుంబాలకు దూరంగా ఉంటూ, నాణ్యత లేని చదువుతో పాటు తిరిగి వచ్చాక లైసెన్సింగ్ పరీక్షల కోసం ఇబ్బందులు పడ్డారు. ఈ విధానపరమైన వైఫల్యం ఎంత ప్రమాదకరమైందో 2022 ప్రారంభంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలో స్పష్టమైంది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వేలమంది భారతీయ వైద్య విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ చేపట్టాల్సి వచ్చింది. తమ కాబోయే వైద్యులను ఎంత పెద్ద సంఖ్యలో వేరే దేశానికి అప్పగించారో చూసి దేశం దిగ్భ్రాంతి చెందింది. అది కేవలం భౌగోళిక రాజకీయ పరిణామం మాత్రమే కాదు; స్వదేశంలో తగినన్ని సీట్లు అందుబాటులో ఉంచకపోవడం వల్ల తలెత్తిన ప్రత్యక్ష పరిణామం. కాంగ్రెస్ హయాంలో ఏర్పడిన కొరతే వారి చేతికి విమానం టిక్కెట్లు ఇచ్చింది.

‌‌ప్రాంతీయ అసమానతలు

పాత గణాంకాలను పరిశీలిస్తే మరొక తీవ్రమైన అన్యాయం కనిపిస్తుంది. దశాబ్దాలుగా వైద్య విద్య కేవలం దక్షిణాది, పశ్చిమ రాష్ట్రాలకే పరిమితమైంది. ఉత్తర, తూర్పు, ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఈ అసమానతను సరిదిద్దడానికి యూపీఏ ప్రభుత్వం పెద్దగా చేసిందేమీ లేదు. 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధుల పథకం ద్వారా జిల్లా, రెఫరల్ ఆస్పత్రులకు అనుబంధంగా కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేశారు. మంజూరైన 157 కళాశాలల్లో 130 కి పైగా అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా ఉత్తరప్రదేశ్, ఒడిశాలోని అభివృద్ధి చెందుతున్న జిల్లాలు, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ, కాశ్మీర్‌లలో వైద్య విద్య అందుబాటులోకి వచ్చింది. ప్రణాళికాబద్ధమైన కృషి అంటే ఇది; దశాబ్ద కాలం పాటు దాని రాహిత్యమే నిర్లక్ష్యానికి నిదర్శనం.

‌‌బిజెపి దశాబ్దం: నిరంతర విస్తరణ

2014 నుంచి పార్లమెంటులో సమర్పించిన ప్రభుత్వ నివేదికలు వైద్య విద్యా రంగంలో చోటుచేసుకున్న క్రమబద్ధమైన వృద్ధిని స్పష్టం చేస్తున్నాయి. ఇది ఒకేసారి జరిగిన మార్పు కాదు, మూడేళ్ల కాలపరిమితిలో స్థిరంగా సాగిన విస్తరణ:

  • వైద్య కళాశాలలు: 387 నుండి 844 కి పెరిగాయి (118% పెరుగుదల).
  • ఎంబీబీఎస్ సీట్లు: 51,348 నుండి 1,39,489 కి పెరిగాయి (171% పెరుగుదల).
  • పీజీ సీట్లు: 31,185 నుండి 86,360 కి పెరిగాయి (177% పెరుగుదల – దాదాపు ముమ్మడి).

2026 జూలై 24న లోక్‌సభలో జగత్ ప్రకాష్ నడ్డా ఇచ్చిన రాతపూర్వక సమాధానం ప్రకారం నేషనల్ మెడికల్ కమిషన్ వెల్లడించిన తాజా సీట్ల విశ్లేషణ:

  • ఎంబీబీఎస్ సీట్లు విద్యా సంవత్సరం 2023–24లోని 1,09,115 నుండి 2025–26 నాటికి 1,28,976కి పెరిగాయి.
  • పీజీ సీట్లు 2025–26 నాటికి 86,360కి చేరాయి.
  • ఇండియన్ మెడికల్ రిజిస్టర్ ప్రకారం, భారతదేశంలో ప్రస్తుతం 15,35,155 మంది రిజిస్టర్డ్ అల్లోపతి వైద్యులు, 7,51,768 మంది రిజిస్టర్డ్ ఆయుష్ ప్రాక్టీషనర్లు ఉన్నారు.
  • ఈ రెండు రంగాలలోని ప్రాక్టీషనర్లలో 80% మంది అందుబాటులో ఉన్నారనుకున్నా, ప్రస్తుతం డాక్టర్-జనాభా నిష్పత్తి 1:778గా ఉంది. ఇది WHO నిర్దేశించిన 1:1,000 ప్రమాణం కంటే మెరుగైనది. యూపీఏ పాలన ముగింపులో ఉన్న 1:1,456 నిష్పత్తితో పోలిస్తే గొప్ప పురోగతి.

గత కొన్నేళ్లుగా పార్లమెంటులో ఇచ్చిన సమాధానాలు ఈ వృద్ధి వెనుక ఉన్న వ్యూహాత్మక విధానాలను స్పష్టం చేస్తున్నాయి:

  • జిల్లా ఆసుపత్రులకు అనుబంధంగా కళాశాలలు: మంజూరైన 157 కళాశాలల్లో 130కి పైగా ప్రస్తుతం నడుస్తున్నాయి. ఇవి ముఖ్యంగా వైద్య సదుపాయాలు లేని వెనుకబడిన జిల్లాలను లక్ష్యంగా చేసుకున్నాయి.
  • ఎయిమ్స్ విస్తరణ: ఒకప్పుడు కేవలం దిల్లీకే పరిమితమైన ఎయిమ్స్, ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన కింద 22 కొత్త ఎయిమ్స్‌ల మంజూరుతో విస్తరించింది. వాటిలో మెజారిటీ సంస్థల్లో కోర్సులు ప్రారంభమయ్యాయి.
  • సీట్ల సామర్థ్యం పెంపు: ప్రతి కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల గరిష్ట పరిమితిని పెంచారు. అంతేకాకుండా కంపెనీల చట్టం కింద నమోదు చేసుకున్న సంస్థలు కూడా వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడానికి అనుమతించడం ద్వారా ప్రైవేట్ భాగస్వామ్యానికి మార్గం సుగమం చేశారు.
  • ఏకీకృత ‘నీట్’ పరీక్ష: వివిధ రకాల ప్రవేశ పరీక్షల స్థానంలో జాతీయ స్థాయిలో ‘నీట్-యూజీ’ని ప్రవేశపెట్టడం ద్వారా అడ్మిషన్ ప్రక్రియను సులభతరం చేసి, అందరికీ సమాన అవకాశాలు కల్పించారు.
  • సూపర్-స్పెషాలిటీ మౌలిక సదుపాయాలు: PMSSY కింద ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 75 సూపర్-స్పెషాలిటీ బ్లాకుల ఆధునికీకరణ ప్రాజెక్టులు చేపట్టారు. వీటి ద్వారా పీజీ శిక్షణ సామర్థ్యంతో పాటు అత్యవసర వైద్య సేవలు మెరుగయ్యాయి.

‌‌కళాశాలల సంఖ్య మాత్రమే కాదు…

సీట్ల పెంపుతో పాటు ప్రాంతీయ అసమానతలు కూడా తొలగిపోయాయి. 2025 నాటికి తమిళనాడు, మహారాష్ట్రలతో పాటు అత్యధిక వైద్య కళాశాలలు ఉన్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ చేరింది. ఒడిశాలోని ఆకాంక్షిత జిల్లాలు, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్‌లలో కూడా కొత్త కళాశాలలు వచ్చాయి.

ప్రభుత్వ గణాంకాల ఆధారంగా రెండు ప్రభుత్వాలను పోల్చి చూద్దాం:

  • వైద్య కళాశాలలు: యూపీఏ తన చివరి విడతలో ఏడాదికి సగటున 25 కళాశాలలను మాత్రమే పెంచగా (4 ఏళ్లలో 72 కళాశాలలు), 2014 తర్వాతి కాలంలో ఆ వేగం ఎన్నో రేట్లు పెరిగి నేడు మొత్తం కళాశాలల సంఖ్య 844కు చేరింది.
  • ఎంబీబీఎస్ సీట్లు: యూపీఏ-2 కాలంలో ఏడాదికి సగటున 3,000 సీట్లు పెరగ్గా, 2014 తర్వాత ఏటా సగటున 8,000 కంటే ఎక్కువ సీట్లు పెరిగాయి. ఒక్క 2024-25 విద్యా సంవత్సరంలోనే 13,436 కొత్త సీట్లు వచ్చాయి.
  • పీజీ సీట్లు: 2014 నుండి దాదాపు మూడు రెట్లు పెరిగాయి.
  • వైద్యులు-జనాభా నిష్పత్తి: 1:1,456 నుండి 1:778కి మెరుగుపడింది.

యూపీఏ-2 హయాంలో నాలుగేళ్లలో కేవలం 72 కొత్త కళాశాలలు మాత్రమే రాగా, 2014 తర్వాత 450 కంటే ఎక్కువ కొత్త వైద్య కళాశాలలు వచ్చాయి. ఇది భారత ఉన్నత విద్య, ప్రజారోగ్య చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఎంతమంది వైద్యులను తయారు చేస్తున్నామనేది ప్రజా ఆరోగ్యం పట్ల ఉన్న అంకితభావానికి ప్రతీక. ఒక దశాబ్దం పాటు నెమ్మదిగా సాగిన విస్తరణ, అవినీతిమయమైన వ్యవస్థ, సీట్లు లేక విదేశాలకు వలస వెళ్లిన విద్యార్థుల దుస్థితి చూశాం. ఇప్పుడు ఆ కొరత నుంచి అపారమైన విస్తరణ వైపు సాధించిన మార్పు నిజమైనది, ఆహ్వానించదగినది. కానీ సరైన సమయానికి వైద్యం అందక ఇబ్బంది పడిన ప్రతి కుటుంబం, చదువు కోసం కీవ్‌కో లేదా మనీలాకో వెళ్లిన ప్రతి విద్యార్థి మనకు గుర్తుచేసేది ఒక్కటే, ఆ కొరత సహజమైనది కాదు, మానవ నిర్లక్ష్యం వల్ల ఏర్పడింది. దానికి చరమగీతం పాడేందుకు పదేళ్ల నిరంతర కృషి అవసరమైంది.

వివేక్ కుమార్