భారత్ యువశక్తికి అండదండలు
2001 అక్టోబర్ 7న గుజరాత్ రాష్ట్రాన్ని విషాదంలో ముంచిన విధ్వంసకరమైన భూకంపం, వరుస కరవులు, రాజకీయ అనిశ్చితి ఛాయలు ఇంకా తొలగిపోని వేళ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సాంప్రదాయక పరిపాలనా అనుభవంతో కాకుండా, సుదీర్ఘ సంస్థాగత, ప్రజాసేవ జీవితం నుంచి ఆయన ప్రభుత్వంలోకి అడుగుపెట్టారు. “ఎల్లప్పుడూ పేదల కోసం పనిచేయాలి, ఎన్నడూ లంచం తీసుకోకూడదు,” అని తన తల్లి తనకు రెండు సరళమైన సూచనలు చేశారని ఆయన తరచూ గుర్తుచేసుకుంటుంటారు. పాతికేళ్ల తర్వాత, నేడు ఆ ఘట్టం – భారతదేశ పాలనా స్థాయిని, భాషను సమూలంగా మార్చివేసిన ఒక రాజకీయ ప్రస్థానాన్ని అర్థం చేసుకోవడానికి సరైన ప్రతీకగా నిలుస్తుంది. ఆ ప్రయాణంలో అత్యంత ప్రభావవంతమైన అంశం ఏంటంటే జాతీయ ప్రాజెక్టుల నిర్మాణంలో భారతీయ యువతను నిరంతరం కేంద్ర బిందువుగా నిలబెట్టడమే.
జనాభా ప్రాతిపదికన భారత్ ఎల్లప్పుడూ యువదేశమే. అయితే మోదీ పరిపాలనా కాలంలో మారిన ప్రధాన అంశం ఏంటంటే ఆ జనాభా ప్రయోజనాన్ని కార్యాచరణ శక్తిగా మలిచే ప్రయత్నం జరగడం. గుజరాత్‌లో విద్యుత్, రహదారులు, పారిశ్రామిక పెట్టుబడులు, విద్య, పరిపాలనా యంత్రాంగ పనితీరుకు ప్రారంభంలో ఇచ్చిన ప్రాధాన్యం– సాంప్రదాయక హద్దులను దాటి అవకాశాలను సృష్టించే ఒక సరికొత్త తరానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించింది. ఇది చెప్పిన ఒక ముఖ్యమైన పాఠం ఏమిటంటే ప్రభుత్వం నేరుగా ఆశలను, ఆకాంక్షలను తయారు చేయలేదు, కానీ వాటిని ఫలవంతం కావడానికి కావలసిన పరిస్థితులను సృష్టించగలదు. 2014లో మోదీ దిల్లీకి మారినప్పుడు ఆ స్ఫూర్తి జాతీయ స్థాయికి విస్తరించింది. ఆ కాలంలో వచ్చిచేరిన సరికొత్త పరిభాష ఇక్కడ అత్యంత ముఖ్యం. స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, ముద్రా పథకాలు ఏవీ విడివిడిగా వచ్చిన పథకాలు కావు. అవన్నీ కలిసి రాజ్యం (ప్రభుత్వం), యువ పౌరుడికి మధ్య ఉన్న సంబంధంలో వచ్చిన స్పష్టమైన మార్పును ప్రతిబింబించాయి. భారతీయ యువకుడు లేదా యువతి ఇక ఎంతమాత్రమూ ప్రభుత్వ ఉద్యోగాల జాబితా చివరి వరుసలో నిలబడే ఉద్యోగార్థి మాత్రమే కాదు. వారిని ఒక సృష్టికర్తలుగా, పారిశ్రామికవేత్తలుగా, ఆవిష్కర్తలుగా, ఉద్యోగదాతలుగా ఊహించడం పెరిగింది.
మార్చి 2026 నాటికి 2.23 లక్షలకు పైగా స్టార్టప్‌లు గుర్తింపు పొంది, 23 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించాయి. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద 1.64 కోట్లకు పైగా అభ్యర్థులు శిక్షణ పొందారు లేదా అవగాహన సాధించారు. ముద్రా పథకం ఒకప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉండిపోయిన లక్షల మందికి అధికారిక సంస్థల ద్వారా రుణ సదుపాయాన్ని కల్పించింది. ఈ గణాంకాలు ముఖ్యమైనవే, కానీ అంతకంటే లోతైన మార్పు సాంస్కృతికమైనది. ప్రమాదాలను లేదా రిస్క్ తీసుకోవడాన్ని ఒక వినూత్న అంశంగా కాకుండా సాధారణ విషయంగా భావించే వాతావరణం వచ్చింది. ఒకప్పుడు జాతీయ ఆవిష్కరణల పటంలో లేని ద్వితీయశ్రేణి నగరాలు, చిన్న పట్టణాలు, జిల్లాలకు వ్యాపార నైపుణ్య వాతావరణం వ్యాపించింది. ఈ గణాంకాల వెనుక ఒక వాస్తవిక దృశ్యం దాగి ఉంది. నేడు ఒక చిన్న పట్టణంలోని యువకుడు క్లౌడ్ మౌలిక సదుపాయాలపై ఒక ఉత్పత్తిని తయారు చేయగలడు, యూపీఐ ద్వారా చెల్లింపులు పొందగలడు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మార్కెటింగ్ చేయగలడు, ఆన్‌లైన్‌లో తన సంస్థను నమోదు చేసుకోగలడు, తాను పుట్టిన ప్రాంతం సరిహద్దులకు చాలా దూరంలో ఉన్న వినియోగదారులకు వస్తువులను అమ్మాలని చూడగలడు. ఇది అవకాశాల ప్రజాస్వామ్యీకరణ. డిజిటల్ మౌలిక సదుపాయాలు ఆకాంక్షకు, ఆచరణకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాయి. ఇది ఒక తరం మానసిక ధోరణిని కూడా మార్చివేసింది. ఆధునిక ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశించడానికి యువత ఇకపై కేవలం కొన్ని నిర్దిష్ట నగరాలకు మాత్రమే వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. క్రమంగా ఆ ఆధునిక ఆర్థిక వ్యవస్థ వారి వద్దకే చేరుకుంటోంది.
ఇదే రకమైన పరివర్తన జీవితంలో చాలా ముందస్తు దశలోనే స్పష్టంగా కనిపిస్తోంది. 10,000 కంటే ఎక్కువ అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు ఇప్పుడు వందల జిల్లాల్లో 1.1 కోట్లకు పైగా విద్యార్థుల మేధకు పదును పెడుతున్నాయి. ఒకప్పుడు సైన్స్‌ను కేవలం పాఠ్యపుస్తకాల ద్వారా మాత్రమే చూసిన పిల్లలు ఇప్పుడు రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్, కృత్రిమ మేధ, డిజైనింగ్‌లతో ప్రయోగాలు చేస్తున్నారు. ప్రతీ చిన్నారీ ఇంజనీరో లేదా వ్యవస్థాపకుడో అవుతారన్నది ఇక్కడ విషయం కాదు. ఉత్సుకతనే ఒక జాతీయ సంపదగా పరిగణించడమే అసలైన విషయం. సెమీకండక్టర్లు, అంతరిక్షం, కృత్రిమ మేధ (ఏఐ), అధునాతన తయారీ రంగం, స్వచ్ఛ ఇంధన టెక్నాలజీలలో నాయకత్వం వహించాలనుకునే ఒక దేశం, శాస్త్రీయ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి విశ్వవిద్యాలయ స్థాయి వరకు వేచి ఉండలేదు. మోదీ పరిపాలనా కాలపు మార్గదర్శకతకు ఇదే నిదర్శనం. చంద్రయాన్, అంతరిక్ష వ్యవస్థ విస్తరణ, సెమీకండక్టర్ మిషన్, రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పాదకత పెరుగుదల, డిజిటల్ చెల్లింపుల విస్తరణ, కృత్రిమ మేధలోకి చొచ్చుకెళ్లడం వంటివి యువ భారతీయులకు తమ సొంత ఆకాంక్షలను ప్రతిబింబించే స్పష్టమైన జాతీయ లక్ష్యాలను అందించాయి. అభివృద్ధి కేవలం ఊహాజనిత భావనగా కాకుండా ప్రత్యక్ష అనుభవంగా మారినప్పుడే అది అత్యంత శక్తిమంతంగా మారుతుంది. భారత్ చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద ల్యాండింగ్ చేయడాన్ని చూసే ఒక పాఠశాల విద్యార్థి, చిప్ డిజైన్‌పై పనిచేస్తున్న ఒక ఇంజనీరింగ్ పట్టభద్రుడు, తదుపరి వంద కోట్ల మంది వినియోగదారుల కోసం సంస్థను నిర్మిస్తున్న ఒక వ్యవస్థాపకుడు లేదా ఒక ఆధునిక తయారీ కర్మాగారంలోకి ప్రవేశిస్తున్న ఒక యువ సాంకేతిక నిపుణుడు తన వ్యక్తిగత పురోగతి కంటే పెద్దదైన గాథలో భాగస్వాములవుతున్నారు. జాతీయ సామర్థ్యం, వ్యక్తిగత ఆకాంక్షలు ఒకదానినొకటి బలోపేతం చేసుకోవడం ప్రారంభిస్తాయి.
యువతను పౌరసత్వంతో అనుసంధానించేందుకు కూడా అవగాహనతో కూడిన ప్రయత్నం జరిగింది. 2023లో ప్రారంభించబడిన మేరా యువ భారత్, 2.46 కోట్లకు పైగా పేర్లు నమోదు చేసుకున్న యువతతో ఒక భారీ వేదికగా ఎదిగింది, ఇది వారిని స్వచ్ఛంద సేవ, ఆచరణాత్మక అభ్యసన, ఇంటర్న్‌షిప్‌లు, నైపుణ్యాభివృద్ధి, సమాజ సేవా కార్యక్రమాలతో అనుసంధానిస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే యువజన సాధికారత అనే ఆలోచన కేవలం ఉపాధికి మాత్రమే పరిమితం కాకూడదు. ఆత్మవిశ్వాసంతో కూడిన ఒక గణతంత్ర దేశానికి జాతీయ నిర్మాణాన్ని కేవలం ప్రేక్షకులుగా కాకుండా భాగస్వాములుగా చూసే పౌరులు అవసరం. మోదీ ‘యువశక్తి’ని ఆకట్టుకోవాల్సిన ఒక ఓటు బ్యాంకుగా కాకుండా, విశ్వసనీయమైన ఒక గొప్ప శక్తిగా పదేపదే ప్రస్తావించారు. వికసిత భారత్ 2047 ఆలోచనకు ఆ నమ్మకమే కేంద్రబిందువు. నేడు వయోజన దశలోకి ప్రవేశిస్తున్న తరం భారతదేశం తన వంద సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకొనే సమయానికి నలభై ఏళ్ల వయస్సులోకి చేరుకుంటుంది. భారత్ కేవలం ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందా లేదా లోతైన సాంకేతికత, సామాజిక చైతన్యం, సంస్థాగత ఆత్మవిశ్వాసం, అంతర్జాతీయ ప్రభావంతో నిజమైన అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందా అనే దానికి ఈ తరమే ప్రధాన బాధ్యత వహిస్తుంది. అందువల్ల తదుపరి దశ కేవలం అవకాశాల లభ్యత దశను దాటి ముందడుగు వేయాలి. భారతదేశం విద్య నాణ్యతను నిరంతరం మెరుగుపరచాలి, పరిశోధనలను వేగవంతం చేయాలి, అప్రెంటిస్‌షిప్‌లను విస్తరించాలి, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలను నిర్మించాలి, నైపుణ్య శిక్షణను పరిశ్రమలతో మరింత దగ్గరగా అనుసంధానించాలి, ఆర్థిక పరివర్తనలో యువతులు పూర్తిగా భాగస్వాములయ్యేలా చూడాలి. జనాభా ప్రయోజనం దానంతట అదే రాదు, అది కొంత కాలమే అందుబాటులో ఉండే ఒక గొప్ప అవకాశం.
నరేంద్ర మోదీ పాతికేళ్ల పాలనను మౌలిక సదుపాయాలు, సంక్షేమం, జాతీయ భద్రత, సాంకేతికత, దౌత్యం లేదా రాజకీయ సమాచార వ్యవస్థ వంటి అనేక కోణాల ద్వారా విశ్లేషించవచ్చు. అయితే యువత కోణం నుంచి చూస్తే అత్యంత ముఖ్యమైన విషయం తెలుస్తుంది. పావు శతాబ్దం క్రితం ఒక విపత్తు నుంచి అప్పుడప్పుడే బయటపడుతున్న రాష్ట్రంలో, మోదీ ప్రభుత్వంలో తన మొదటి రోజును ప్రారంభించారు. నేడు అసాధారణ సాంకేతిక, భౌగోళిక రాజకీయ మార్పుల యుగంలోకి ప్రవేశిస్తున్న యువతను కలిగిన దేశానికి ఆయన సారథ్యం వహిస్తున్నారు. ఈ పాతికేళ్ల కాలంలో ఆయన భారతీయ యువత తన సొంత శక్తిసామర్థ్యాలన్నిటినీ సంపూర్ణంగా వినియోగించుకోడానికి చేయవలసినదంతా చేశారు.
అనిల్ కె ఆంటోనీ,
బిజెపి జాతీయ కార్యదర్శి

