BJYM National President

దృఢమైన యువతే దేశ ఉజ్వల భవిష్యత్తుకు పునాది!

BJYM Rallyయువతే ఈ దేశానికి అతిపెద్ద మానవవనరని, యువతరం ఆరోగ్యంగా, శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే దేశ భవిష్యత్​ ఉజ్వలంగా ఉంటుందని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, వడోదర ఎంపీ హేమంగ్ జోషి స్పష్టం చేశారు. తెలంగాణలో యువతను సంఘటితం చేయడం, యువత సమస్యలపై పోరాటానికి దిశానిర్దేశం చేయడమే లక్ష్యంగా డా. హేమంగ్ జోషి రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించారు. నవంబర్ 11న శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న డా. హేమంగ్ జోషికి రాష్ట్ర యువ మోర్చా నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఓ బీజేవైఎం కార్యకర్త నివాసానికి వెళ్లిన డా. హేమంగ్ జోషి రాత్రి భోజనం అక్కడే చేశారు. మరునాడు నవంబర్ 12న ‘నషా ముక్త్ భారత్’లో భాగంగా గండిపేట చౌరస్తా నుంచి పీఐఎస్ గండిపేట వరకు ఎంపీలు డా. కె.లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, యువతతో కలిసి సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. యువత ఎలాంటి మత్తు పదార్థాల బారిన పడకుండా జాగ్రత్త పడాలని, డ్రగ్స్ సంస్కృతిని ప్రోత్సహించే ధోరణులపై తిరగబడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ యువతలో అపారమైన ప్రతిభ, శక్తిసామర్థ్యాలు ఉన్నాయని, ఆ శక్తిని క్రీడలు, సాంకేతిక పరిజ్ఞానం వైపు మళ్లించి దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. అనంతరం తెలంగాణ యువ అథ్లెట్లతో కలిసి పలు క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన యువ క్రీడాకారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ‘యువ సంవాద్’ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, ఎంపీ ఈటల రాజేందర్ తో పాటు పాల్గొని తెలంగాణ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పమైన వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలక పాత్ర వహించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన వైనాన్ని, నిరుద్యోగ సమస్యలను ఎత్తిచూపారు. బీజేవైఎం రాష్ట్ర పదాధికారులతో సమావేశమై తెలంగాణలో యువ మోర్చా బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించి, యువ నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగం, నోటిఫికేషన్లు, యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై సమగ్రంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో యువత గొంతుకగా మారి బీజేవైఎం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. యువత హక్కుల సాధన కోసం నిరంతరం ప్రజల్లో ఉండాలని, గ్రామస్థాయి నుంచి పార్టీ యువ విభాగాన్ని పటిష్టం చేయాలని నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు. అదే రోజు టీహబ్ వేదికగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యువ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆలోచనలు, అభిప్రాయాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ కార్యక్రమాల్లో బీజైవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్ కుండే, ఇతర మోర్చా నాయకులు పాల్గొన్నారు. బీజేవైఎం రాష్ట్ర గణేష్ కుండే అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించి పర్యటనను విజయవంతం చేశారు.