NRR Miyapur

మియాపూర్‌ ప్రభుత్వ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తున్నాం

Miyapur Signature Campaigmమియాపూర్‌లోని సర్వే నంబర్ 100, 101 పరిధిలో గల 550 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయాలన్న కాంగ్రెస్ సర్కార్ నిర్ణయాన్ని బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. నవంబర్ 18న మియాపూర్‌లోని ఎం.ఏ. నగర్, ప్రశాంత్ నగర్, స్టాలిన్ నగర్, దీప్తిశ్రీ నగర్ కాలనీలలో ఆయన పర్యటించి, తమ నివాసాలను కోల్పోతామన్న భయాందోళనలో ఉన్న స్థానిక ప్రజలతో మాట్లాడి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ భూముల వేలాన్ని నిరసిస్తూ చేపట్టిన ‘లక్ష సంతకాల సేకరణ’లో మొదటి సంతకం చేశారు. సేకరించిన లక్ష సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రభుత్వానికి అందజేయనున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అనేక ఏళ్లుగా న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న ఈ 550 ఎకరాల భూమిపై సుప్రీంకోర్టు సానుకూల తీర్పు నేపథ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూములను వేలం వేసి అమ్ముకోవాలని చూడటం దారుణమని అన్నారు. ఈ 550 ఎకరాలలో దాదాపు 150 ఎకరాల భూమిలో 1983 నుండే అధికారిక రిజిస్ట్రేషన్లు, హెచ్ఎండీఏ అప్రూవ్డ్ లేఅవుట్లు, బ్యాంకు లోన్ల ద్వారా మధ్యతరగతి ప్రజలు నిర్మించుకున్న ఇళ్లు ఉన్నాయని తెలిపారు. 30 ఏళ్లకు పైగా వారి స్వాధీనంలో ఉన్న ఈ 150 ఎకరాల భూమి, ఇళ్లు కచ్చితంగా ఆయా కుటుంబాలకే చెందాలని, ప్రభుత్వం వాటి జోలికి వెళ్లొద్దని ఆయన డిమాండ్ చేశారు. ఈ భూమిని ప్లాట్లుగా విభజించి బహిరంగ వేలంలో అమ్మాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, భూములను అమ్మి ప్రభుత్వాన్ని నడపాలనుకోవడం అత్యంత ప్రమాదకరమైన ధోరణి అని విమర్శించారు. పెరుగుతున్న కాలుష్యం, పట్టణీకరణ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి ‘లంగ్ స్పేస్’ (స్వచ్ఛమైన గాలినిచ్చే ఖాళీ ప్రదేశాలు) ఎంతో అవసరమని, ఈ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టకుండా పార్కులు, ప్లే గ్రౌండ్స్, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రుల నిర్మాణం వంటి ప్రజా ప్రయోజనాలకు మాత్రమే వినియోగించాలని డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్, ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.