Constitution of India

మాటల్లో రాజ్యాంగ పరిరక్షణ.. చేతల్లో రాజ్యాంగ దుర్వినియోగం!

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ఒకే ఎజెండాతో ప్రజల ముందుకు వెళ్ళడం ఆసక్తికరమైన పరిణామం. రాజ్యాంగ పరిషత్‌ 1949లో భారత రాజ్యాంగ ముసాయిదాకు తుది ఆమోదం తెలిపిన నవంబర్‌ 26వ తేదీని పురస్కరించుకుని, 2015 నుంచి బిజెపి ప్రతి ఏటా ‘సంవిధాన్‌ సమ్మాన్‌ దివస్‌’ (రాజ్యాంగ గౌరవ దినోత్సవం) నిర్వహిస్తోంది. ఈ ఏడాది రాజ్యాంగ సంస్థలు, వ్యవస్థలు, ప్రక్రియలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నాయకత్వం నిరంతరం సాగిస్తున్న అసత్య ప్రచారం, నిరాధార ఆరోపణలు, అనుమానాలు రేకెత్తించే వ్యాఖ్యల ద్వారా ప్రోత్సహిస్తున్న అప్రజాస్వామిక, అరాచక ధోరణులను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించాం. ఆసక్తికరమైన విషయమేమిటంటే, భారత ఎన్నికల సంఘం వంటి సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయంటూ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ కూడా ‘సంవిధాన్‌ రక్షా’ (రాజ్యాంగ పరిరక్షణ) పేరుతో ర్యాలీలు నిర్వహించాలని తన పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం.

బూత్‌ స్థాయిలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి, పౌరులకు వారి ఓటు హక్కులను ఎలా హరించివేస్తున్నారో వివరించే ‘ఓటు రక్షకులు’గా వ్యవహరిస్తారని ఆ పార్టీ ప్రకటించింది. ఒకప్పుడు ప్రతి గ్రామంలోనూ అంకితభావంతో పనిచేసే కార్యకర్తలతో, బలమైన క్షేత్రస్థాయి సంస్థాగత వ్యవస్థతో కాంగ్రెస్‌ ఎంతో గర్వపడేది. ఆ కార్యకర్తలు ప్రసిద్ధ గాంధీ టోపీలు ధరించి, కాంగ్రెస్‌ జెండాలను చేతబూని గ్రామగ్రామాన పార్టీ కోసం పనిచేసేవారు. అయితే, నెహ్రూ-గాంధీ కుటుంబం ప్రాబల్యం పెరిగిన కొద్దీ గ్రామాల్లో గాంధేయవాదుల ఉనికి కనుమరుగైంది. రాజ్యాంగాన్ని కాపాడాలన్న ఆకాంక్ష ఎవరిలో ఉన్నా అది ప్రశంసనీయమైనదే. అయితే, ఆ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్న వారి ప్రవర్తనను కూడా నిశితంగా పరిశీలించాలి. భారత రాజ్యాంగంలోని 51ఏ అధికరణం పౌరులందరూ పాటించాల్సిన పది ప్రాథమిక విధులను నిర్దేశిస్తోంది. వాటిలో ఒకటి, ‘భారతదేశంలోని ప్రతి పౌరుడి విధి ఏమిటంటే (ఎ) రాజ్యాంగాన్ని అనుసరించడం, దాని ఆదర్శాలను, సంస్థలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడం.’ 

ఇటీవల మనీలాలో ‘క్వాడ్‌’ దేశాల నేతల ఫొటోల కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవర్తన ఈ విషయంలో ప్రస్తావించదగినది. అక్కడ నేలపై ఒక ప్రదేశాన్ని గుర్తించేందుకు భారత జాతీయ పతాకం ముద్రించిన చిన్న కార్డును ఉంచారు. దాన్ని ప్రధాని మోదీ స్వయంగా తీసి పక్కకు పెట్టారు. ఆ కార్డును అక్కడే నేలపై ఉండనివ్వలేనని జపాన్‌ ప్రధానితో ఆయన చెప్పడం వినిపించింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో కొందరు చిల్లర వ్యాఖ్యలు చేసినప్పటికీ, రాజ్యాంగంలోని 51ఏ అధికరణంతో పాటు 2002లో జారీ చేసిన జాతీయ పతాక నియమావళి కూడా ఈ అంశంలో స్పష్టమైన నిబంధనలను కలిగి ఉంది. ‘జాతీయ పతాకాన్ని అవమానించడం, దాని రూపాన్ని చెడగొట్టడం లేదా దాని పట్ల అగౌరవంగా వ్యవహరించడం 1971 నాటి జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం’ అని ఆ నియమావళి స్పష్టంగా పేర్కొంటోంది. దీనికి భిన్నంగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సోనియా గాంధీ వ్యవహరించిన తీరును గమనించాలి. జాతీయ గీతంతో సమానమైన హోదా కలిగిన జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలాపనను ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తూ, దాన్ని ఆపాలంటూ సైగలు చేయడం కనిపించింది. జాతీయ చిహ్నాల పట్ల చూపిన ఈ అగౌరవాన్ని సమర్థించుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నించారు. మల్లికార్జున ఖర్గేకు కుర్చీ ఏర్పాటు చేయాలని మాత్రమే ఆమె సూచించారని వివరణ ఇచ్చారు. అదే సమయంలో రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని గౌరవించడం లేదంటూ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)పై విమర్శలు గుప్పించారు.

వాస్తవానికి, 1950 జనవరి 26న భారత తొలి గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘ్‌చాలక్‌ ఎం ఎస్‌ గోల్వాల్కర్‌ దేశవ్యాప్తంగా ఉన్న సంఘ్‌ శాఖలకు ఆదేశాలు పంపారు. అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌కు కూడా ఆయన ఒక సందేశం పంపారు. ‘భారత గణతంత్రానికి అధ్యక్షుడిగా మీరు ఎన్నికైనందుకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అనుభవం, విజ్ఞానం గణతంత్రానికి ప్రయోజనకరమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తాయని, ప్రజలు చిరకాలంగా ఆకాంక్షిస్తున్న ఆశయాలు నెరవేరేందుకు దోహదపడతాయని ఆశిస్తున్నాను’ అని ఆ సందేశంలో పేర్కొన్నారు. తొలి గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాగ్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో గోల్వాల్కర్‌ ప్రసంగించారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న అనేకమంది యోధులకు ఘనంగా నివాళులర్పించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, నెహ్రూ-గాంధీ కుటుంబ పాలనలో రాజ్యాంగం అనేక సందర్భాల్లో తీవ్రమైన దుర్వినియోగానికి గురైంది. వాటిలో మూడు ఉదంతాలు ప్రత్యేకంగా ప్రస్తావించదగినవి. మొదటిది, 1959లో కేరళలో ఈ.ఎం.ఎస్‌ నంబూద్రిపాద్‌ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయడంతో ప్రారంభమైన 356వ అధికరణం దుర్వినియోగం. రెండోది, ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) విధించిన సమయంలో రాజ్యాంగ వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేయడం. మూడోది, 1986లో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం తీసుకొచ్చిన, వివాదాస్పదమైన షా బానో కేసు సంబంధిత రాజ్యాంగ సవరణ.

రాజ్యాంగం ఒక పవిత్రమైన పత్రం. మన దేశ ఔన్నత్యం, ప్రజాస్వామ్య సంస్థల గౌరవం, జాతీయ చిహ్నాల పవిత్రతకు అది ఇచ్చిన ప్రాధాన్యంలోనే దాని పవిత్రత ఇమిడి ఉంది. వాటిని గౌరవించని వారే రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడటం ఒక విచిత్రమైన వైరుధ్యం. రాజ్యాంగాన్ని కాపాడుతున్నామని చెప్పుకునే వారి మాటలకు, వారి చేతలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలి.

రామ్ మాధవ్,
బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు