రాష్ట్ర ఇన్చార్జ్గా సునీల్ బన్సల్ కొనసాగింపు
తెలంగాణలో బిజెపిని మరింత బలోపేతం చేసి.. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్న పార్టీ జాతీయ నాయకత్వం.. సునీల్ బన్సల్‌ను రాష్ట్ర ఇన్చార్జ్గా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయనతో పాటు అభయ్ పాటిల్, రేఖా శర్మలను రాష్ట్ర కో-ఇన్‌చార్జ్‌లుగా నియమించింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సెప్టెంబర్ 23న ప్రకటించిన సంస్థాగత నియామకాల్లో భాగంగా రాష్ట్రాలకు ఇన్‌చార్జ్‌లు, కో-ఇన్‌చార్జ్‌లను నియమించారు. ఇందులో తెలంగాణకు సునీల్ బన్సల్‌ను ఇన్చార్జ్గా, అభయ్ పాటిల్, రేఖా శర్మలను కో-ఇన్‌చార్జ్‌లుగా ఖరారు చేశారు.
2022 ఆగస్టులో తెలంగాణ బిజెపి ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టిన బన్సల్.. 2023 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించారు. తాజాగా ఆయనకు మరోసారి తెలంగాణ బాధ్యతలు అప్పగించడంతో పాటు పశ్చిమ బెంగాల్ ఇన్చార్జ్గా కూడా కొనసాగించారు. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 294 స్థానాలకు గాను 207 సీట్లు సాధించి మెజారిటీ మార్క్ 148ను దాటింది. తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో బెంగాల్లో బిజెపి సంస్థాగతంగా సాధించిన ఫలితాల అనుభవాన్ని తెలంగాణలోనూ ఉపయోగించుకోవడంపై పార్టీ దృష్టి సారించే అవకాశం ఉంది. గతంలో అభయ్ పాటిల్ తెలంగాణ ఎన్నికల వ్యూహం, క్షేత్రస్థాయి సమీకరణాలపై బాధ్యతలు నిర్వహించారు. ఇటీవలి కాలంలో రేఖా శర్మ కూడా తెలంగాణలో పని చేశారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం, కార్యకర్తల నెట్‌వర్క్‌ను విస్తరించడం, ఎన్నికల సన్నాహాలను సమన్వయం చేయడం వంటి అంశాలు కొత్త టీమ్ ముందున్న బాధ్యతలు. సునీల్ బన్సల్, అభయ్ పాటిల్, రేఖా శర్మ నియామకంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అభినందనలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వారితో కలిసి పని చేస్తామని పేర్కొన్నారు.
మరోవైపు తెలంగాణకు చెందిన సీనియర్ నేతలకు కూడా పార్టీ అధిష్ఠానం ఇతర రాష్ట్రాల్లో కీలక బాధ్యతలు అప్పగించింది. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణను తమిళనాడు రాష్ట్రానికి కో-ఇన్చార్జ్గా నియమించింది. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. కాసం వెంకటేశ్వర్లును కర్ణాటక కో-ఇన్చార్జ్గా నియమించింది. తమిళనాడులో రామ్ మాధవ్ ఇన్చార్జ్గా ఉండగా, డీకే అరుణతో పాటు నిర్మల్ కుమార్ సురానా కో-ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించనున్నారు. కర్ణాటకలో హరీశ్ ద్వివేది ఇన్చార్జ్గా, కాసం వెంకటేశ్వర్లు కో-ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టనున్నారు.
రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా మధుకర్
నితిన్ నబీన్ సంస్థాగత ప్రధాన కార్యదర్శులనూ పునర్వ్యవస్థీకరించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బిజెపి సంస్థాగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న మధుకర్‌కు తెలంగాణ సంస్థాగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలను కూడా అప్పగించారు. ఏపీతో పాటు తెలంగాణ సంస్థాగత వ్యవహారాలను ఆయన పర్యవేక్షించనున్నారు. దశరథ్ను తెలంగాణ సంస్థాగత రాష్ట్ర సహ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం తెలంగాణ సంస్థాగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న చంద్రశేఖర్‌ను మధ్యప్రదేశ్ సంస్థాగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. శివ ప్రకాశ్, సౌదాన్ సింగ్‌లను బిజెపి జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. ఇక రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సోషల్ మీడియా రాష్ట్ర ఇంచార్జ్ గా పోరెడ్డి కిశోర్ రెడ్డి, అన్ని సెల్స్ రాష్ట్ర సమన్వయకర్తగా అమర్ నాథ్ సారంగుల, అన్ని సెల్స్ రాష్ట్ర సహ సమన్వయకర్తలుగా అట్లూరి రామకృష్ణ, పెద్దొళ్ల గంగారెడ్డిలను నియమించారు.

