fake news

నిరుద్యోగంపై ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు

భారత్ లాంటి యువజనాభా అధికంగా ఉన్న దేశంలో ఉపాధి అత్యంత సున్నితమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో ఒకటిగా మారింది. గత దశాబ్ద కాలంగా కాంగ్రెస్‌తో సహా ప్రధాన ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగాన్ని ఒక ప్రధాన రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తున్నాయి. ఎన్నికల ప్రచారాల్లో, పార్లమెంటులో, సామాజిక మాధ్యమాల్లో నిరుద్యోగ యువత గురించి పెద్దయెత్తున్న  వాదనలు వినిపించాయి. అయితే, నీతి ఆయోగ్ విడుదల చేసిన ‘వికసిత్ భారత్@2047 కోసం నైపుణ్యాల పునర్నిర్మాణం’  నివేదిక ఈ చర్చకు సంబంధించిన ఒక ముఖ్యమైన కోణాన్ని గణాంకాల ఆధారంగా ముందుకుతెచ్చింది. ఈ నివేదిక ప్రకారం, 15 నుండి 29 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న సుమారు 8.7 కోట్ల మంది యువత ‘నీట్’ (ఎన్ఈఈటీ నాట్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్, ట్రైనింగ్  – చదువుకోకుండా, ఉద్యోగం చేయకుండా, ఎలాంటి శిక్షణ పొందకుండా ఉన్నవారు) కేటగిరీ కిందకు వస్తున్నారు. అనేక సందర్భాల్లో ఈ సంఖ్యను మొత్తం నిరుద్యోగ యువత సంఖ్యగా చిత్రించారు. కానీ ఈ రకమైన విశ్లేషణ తప్పు అని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ‘నీట్’ ఒకానొక సమయంలో విద్య, ఉద్యోగం, శిక్షణకు దూరంగా ఉన్నవారిని మాత్రమే సూచిస్తుంది. అంతమాత్రాన వారంతా ఉద్యోగాల కోసం వెతుకుతూ, అవకాశాలు రాక ఖాళీగా ఉన్నారని భావించడం సరికాదు.

‘నీట్’, ‘ని‌రుద్యోగం’ రెండూ భిన్నం

ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పనిచేయడానికి సిద్ధంగా ఉండి, ఉద్యోగం కోసం చురుగ్గా ప్రయత్నిస్తూ ఉపాధి దొరకని వ్యక్తిని ‘నిరుద్యోగి’ అంటారు. కానీ ‘నీట్’ చాలా విస్తృతమైన వర్గం. ఇందులో కుటుంబ వ్యాపారాల్లో సహాయం చేసేవారు, స్వచ్ఛంద సేవకులు, ఇళ్ళల్లో  బాధ్యతలు చూసుకునేవారు, ఆరోగ్య సమస్యల వల్ల పని చేయలేనివారు, విశ్రాంతి తీసుకుంటున్నవారు, ఇతర వ్యాపకాలతో గడుపుతున్న యువత ఉంటారు. అందువల్ల, కుటుంబ వ్యాపారంలో తోడ్పడుతున్నా లేదా ఇంటి బాధ్యతలు నిర్వహిస్తున్నా… గణాంకాల ప్రకారం వారు ‘నీట్’ పరిధిలోకి వచ్చినప్పటికీ, వారిని నిరుద్యోగులుగా పరిగణించలేం. ‘నీట్’ కేటగిరీలోని 8.7 కోట్ల మందిని నిరుద్యోగులుగా చూపడం అంటే రెండు వేర్వేరు గణాంక అంశాలను కలగాపులగం చేయడమే. దీని అర్థం భారతదేశంలో నిరుద్యోగ సమస్యే లేదని కాదు; ఆ సమస్యను సరైన రీతిలో కొలవాల్సిన అవసరం ఉందనడమే.

ఉపాధి గ‌ణాంకాలు ఏమి చెబుతున్నాయి?

దేశంలో ఉన్న అధిక యువ జనాభా కారణంగా ప్రతి ఉపాధి గణాంకం తక్షణ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ప్రతిపక్షాలు ప్రభుత్వ ఆర్థిక విధానాలను ప్రశ్నించడానికి నిరుద్యోగాన్ని వాడుకుంటుంటే, ప్రభుత్వం మాత్రం ఉపాధి, స్వయం ఉపాధి, పారిశ్రామికులకు  ప్రోత్సాహం, నైపుణ్యాభివృద్ధి, శ్రామిక శక్తి భాగస్వామ్యంపై దృష్టి సారిస్తోంది. నివేదికలో పేర్కొన్న పీఎల్ఎఫ్ఎస్  గణాంకాలు మరొక కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో, శ్రామిక-జనాభా నిష్పత్తి  2017-18లోని 46.8 శాతం నుంచి 2023-24 నాటికి 58.2 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో నిరుద్యోగిత రేటు 6 శాతం నుండి 3.2 శాతానికి తగ్గింది.

‌47.15 కోట్ల నుంచి 64.33 కోట్లకు పెరిగిన ఉపాధి

నీతి  ఆయోగ్ నివేదికలోని ఆర్‌బీఐ కెఎల్ఈఎమ్‌ఎస్  డేటాబేస్ ప్రకారం, మొత్తం ఉపాధి 2014-15లోని 47.15 కోట్ల నుంచి 2023-24 నాటికి 64.33 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు 17.18 కోట్ల పెరుగుదల నమోదైంది. ఈ విస్తృత ఉపాధి చిత్రంలో సంప్రదాయ ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి, స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలు, తయారీ రంగం, డిజిటల్ ఆర్ధిక వ్యవస్థ, వ్యవస్థాపకత, నైపుణ్యాభివృద్ధి, అప్రెంటిస్‌షిప్‌లు కలసి ఉన్నాయి. ఈ 17.18 కోట్ల సంఖ్య ఆర్థిక వ్యవస్థలో పెరిగిన మొత్తం ఉపాధికి సంకేతం తప్ప, కేవలం కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య మాత్రమే కాదు.  

‌కోవిడ్ నాటి గణాంకాలను ఆ కోణంలోనే చూడాలి

‘నీట్’ సమాచారాన్ని సంబంధించి నీతి ఆయోగ్ నివేదిక మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా ఎత్తిచూపింది. ఈ విశ్లేషణ 2020-21 ఆర్థిక సంవత్సరంలో సేకరించిన జాతీయ నమూనా సర్వే  (ఎన్ఎస్ఎస్) 78వ విడత ఆధారంగా జరిగింది. ఆ సమయంలో కోవిడ్-19 మహమ్మారి వల్ల సాధారణ ఆర్థిక, సామాజిక కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి, ఆర్థిక లావాదేవీలు పరిమితమయ్యాయి, ఉపాధి అవకాశాలు ప్రభావితమయ్యాయి, పరిశ్రమలు, సేవా రంగాలు స్తంభించి పోయాయి. శ్రామిక విపణి తీవ్ర అల్లకల్లోలానికి గురైంది. కాబట్టి, 8.7 కోట్ల ‘నీట్’ సంఖ్యను అర్థం చేసుకునేటప్పుడు ఆ నాటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలి. ఇది ఒక పెను సవాలును సూచిస్తున్నప్పటికీ, ప్రస్తుత నిరుద్యోగానికి ప్రత్యక్ష కొలమానంగా పరిగణించలేం.

‌సక్రమమైన సమాచారాన్ని అందిస్తున్న పిఎల్ఎఫ్ఎస్ (PLFS)

భారత్ తన ఉపాధి సమాచార సేకరణ వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. 2017-18లో ప్రారంభమైన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) ఉపాధి, నిరుద్యోగంపై క్రమం తప్పకుండా సమాచారాన్ని అందిస్తోంది. అంతకుముందు ఐదేళ్లకోసారి మాత్రమే సమగ్ర సర్వేలు జరిగేవి, దీనివల్ల శ్రామిక విపణిలో వచ్చే వేగవంతమైన మార్పులను అంచనా వేయడం కష్టమయ్యేది. పిఎల్ఎఫ్ఎస్ ద్వారా క్రమబద్ధమైన సమాచారం అందుబాటులోకి వచ్చింది. జనవరి 2025 నుండి మరింత పురోగతి సాధిస్తూ, సర్వే క్యాలెండర్‌ను జనవరి-డిసెంబర్ విలయానికి మార్చారు. ఇది మారుతున్న పరిస్థితులను అంచనా వేయడానికి విధాన నిర్ణేతలకు తోడ్పడుతుంది. దీనివల్ల ఉపాధి, శ్రామిక శక్తి భాగస్వామ్యం, నిరుద్యోగిత పరిస్థితుల్లో వేగంగా మెరుగుదల సాధించవచ్చు.

‌’స్కిల్ ఇండియా’ నుంచి ‘నైపుణ్యాల ద్వారా ఉపాధి’ వైపు…

ఉపాధి విధానంలో నైపుణ్యాభివృద్ధి ఒక ప్రధాన భాగమైంది. నీతి ఆయోగ్ ప్రకారం, 2014-15 నుండి 7.67 కోట్లకు పైగా ప్రజలు ప్రామాణిక నైపుణ్య శిక్షణ పొందారు. 2025-26 కేంద్ర బడ్జెట్‌లో నైపుణ్యాభివృద్ధి కోసం రూ 34,000 కోట్లు కేటాయించారు. కేవలం శిక్షణ పొందిన వారి సంఖ్య ఆధారంగానే విజయాన్ని అంచనా వేయకూడదని నివేదిక స్పష్టం చేస్తోంది. శిక్షణ పొందిన వారిలో ఎంతమందికి ఉపాధి లభించింది, వారి ఆదాయాలు పెరిగాయా, స్థిరమైన కెరీర్ లభించిందా అనేది అత్యంత ప్రధానమైన ప్రశ్న. ఇది కేవలం శిక్షణ సంఖ్యలను లెక్కించడం నుంచి  ఫలితాలను కొలవడం వైపు సాధించిన పురోగతి.

‌విద్యను, ఉపాధిని అనుసంధానించే అప్రెంటిస్‌షిప్

అప్రెంటిస్‌షిప్‌లు విద్యకు, ఉపాధికి మధ్య ఒక ఆచరణాత్మక వారధిగా పనిచేస్తాయి. నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రోత్సాహక పథకం (ఎన్ఏపీఎస్), నేషనల్ అప్రెంటిస్‌షిప్ శిక్షణ పథకం (ఎన్ఏటీఎస్), రాష్ట్ర స్థాయి పథకాల మధ్య మరింత మెరుగైన సమన్వయం ఉండాలని నీతి ఆయోగ్ పిలుపునిచ్చింది. ప్రత్యక్ష పని అనుభవం ద్వారా యువత పారిశ్రామిక విధానాలు, వృత్తిపరమైన క్రమశిక్షణ, సాంకేతిక అవసరాలను అర్థం చేసుకుంటారు. దీనివల్ల యజమానులకు కూడా పని వాతావరణంపై అవగాహన ఉన్న నైపుణ్యమున్న అభ్యర్థులు లభిస్తారు.

‌శ్రామికశక్తిలో కీలక భాగస్వాములుగా మహిళలు

మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగింది. పిఎల్ఎఫ్ఎస్ ప్రకారం, 15 ఏళ్లు పైబడిన మహిళల్లో శ్రామిక-జనాభా నిష్పత్తి  2017-18లోని 22 శాతం నుంచి 2023-24 నాటికి 40.3 శాతానికి పెరిగింది. మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 23.3 శాతం నుంచి 41.7 శాతానికి పెరిగింది. సురక్షితమైన రవాణా, సౌకర్యవంతమైన పనివేళలు, నైపుణ్య శిక్షణ, ఆర్థిక సహాయం వంటివి మహిళల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి. భారతదేశ యువజనాభా ప్రయోజనాన్ని (డెమోగ్రాఫిక్ డివిడెండ్) పూర్తిస్థాయిలో అందుకోవాలంటే ఎక్కువ మంది మహిళలు ఉత్పత్తి రంగంలోకి రావడం అత్యంత అవసరం.

ఉద్యోగార్థుల‌ నుంచి ఉద్యోగాలు  ఇచ్చేవారుగా..

ఉపాధి విధానం కేవలం సంప్రదాయ వేతన ఉద్యోగాలకే పరిమితం కాకుండా ముందుకుసాగుతోంది. స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం, స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలు, సులభతర రుణాలు యువత జీవనోపాధి పొందే మార్గాలను విస్తరించాయి. భారతదేశంలో 1.60 లక్షలకు పైగా గుర్తింపు పొందిన స్టార్టప్‌లు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. యువత కేవలం ఉద్యోగాల కోసం వెతకడమే కాకుండా, ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదిగే కొత్త ఉపాధి నమూనాకు ఇది సంకేతం. ప్రధానమంత్రి ముద్రా యోజన, స్టార్టప్ వ్యవస్థ, సూక్ష్మ పరిశ్రమలకు ఆర్థిక బాసట, పారిశ్రామిక వేత్తల ప్రోత్సాహక కార్యక్రమాలు ఈ పెనుమార్పులో భాగాలు.

‌ఉపాధి అనుసంధాన ప్రోత్సాహకాలు 

ఉపాధి కల్పనను ప్రోత్సహించడానికి ‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ పేరుతో ఉపాధి అనుసంధాన ప్రోత్సాహకాల (ఇఎల్ఐ)  చట్రాన్ని అమలు చేస్తున్నారు. రెండేళ్లలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలను సృష్టించాలనే లక్ష్యంతో రూ 99,446 కోట్ల కేటాయింపులు చేశారు. సుమారు 1.92 కోట్ల మంది తొలిసారి ఉద్యోగంలో చేరే వారికి దీనివల్ల ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. మొదటిసారి ఉద్యోగంలో చేరేవారికి ఒక నెలకు సరిపడా ఈపీఎఫ్ పరిమితి జీతం (గరిష్టంగా రూ. 15,000 వరకు) ప్రోత్సాహకంగా లభిస్తుంది. అదే సమయంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే యజమానులకు కూడా ప్రోత్సాహకాలు అందజేస్తారు. తయారీ రంగానికి ఇందులో ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. భారతదేశ ఉపాధి ప్రస్తానం ప్రధానంగా మూడు ప్రధాన మార్పులలో ప్రతిబింబిస్తోంది: మొత్తం ఉపాధి 47.15 కోట్ల నుంచి 64.33 కోట్లకు పెరగడం, నిరుద్యోగిత రేటు 6 శాతం నుంచి 3.2 శాతానికి తగ్గడం, శ్రామిక-జనాభా నిష్పత్తి 46.8 శాతం నుంచి 58.2 శాతానికి పెరగడం. ఈ విస్తరణను మెరుగైన ఉపాధిగా, అధిక ఆదాయాలుగా, మెరుగైన ఉత్పాదకతగా, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలుగా మలచడమే తదుపరి ప్రధాన సవాలు. దీని ద్వారా మాత్రమే దేశ పనివయస్సు ‘జనాభా ప్రయోజనం’  దేశానికి స్థిరమైన సుస్థిర ఆర్థిక శక్తిని అందించగలదు.

డాక్టర్ మయాంక్ చతుర్వేది