అధికారాన్ని సేవా సాధనంగా మలచిన నాయకుడు
“దాదాపు మనుషులందరూ కష్టాలను తట్టుకోగలరు. కానీ, ఒక వ్యక్తి గుణగణాలను, శీలాన్ని పరీక్షించాలనుకుంటే అతనికి అధికారాన్ని ఇవ్వండి,” అని అబ్రహాం లింకన్ అన్నారు. అధికారాన్ని చెలాయించే క్రమంలో చాలామంది తడబడతారు. కానీ నరేంద్ర మోదీ మాత్రం వీరందరికి భిన్నంగా నిలిచారు. “పథ్ కా అంతిమ్ లక్ష్య నహీ హై సింహాసన్ చఢ్తే జానా” (సింహాసనాన్ని లేదా అధికారాన్ని అధిష్టించడమే మన ప్రయాణానికి ఆఖరి గమ్యం కాదు) అని బోధించిన సైద్ధాంతిక పాఠశాల నుంచే మోదీ వచ్చారు. ఆ పాట ఆ తర్వాత ఈ ప్రయాణ లక్ష్యాన్ని మరింత వివరంగా స్పష్టం చేస్తుంది: “సమగ్ర సమాజాన్ని తనతో పాటు కలుపుకొని ముందుకు సాగిపోవాలి”, “అన్ని విధాలా విజయవంతమైన దేశం అసమాన వైభవాన్ని, ఉన్నతిని తీసుకురావాలి”. గాంధీనగర్లో మొదలై, ఆ తర్వాత దిల్లీ వరకు ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో—మోదీ రాజకీయ ప్రయాణానికి మార్గదర్శనం వహించింది ఈ దూరదృష్టి, లక్ష్యసాధనా సంకల్పమే.
మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించాం. “మనం ఇక్కడికి వచ్చింది కేవలం సంస్కరణల కోసం మాత్రమే కాదు. సంస్కరణలు మంచివే, కానీ అవి చాలావరకు ఉన్న వ్యవస్థనే కాస్త అటుఇటుగా బాగుచేయడానికే పరిమితమవుతాయి. కానీ ప్రధానమంత్రి మోదీ దూరదృష్టి మాత్రం సమూలమైన గుణాత్మక మార్పు కోసం ఉద్దేశించినది,” అని ఆ తీర్మానం స్పష్టం చేసింది. పాశ్చాత్య దేశాల్లో “ఒక సమాజానికి ఎలాంటి ప్రభుత్వం తగునో, అలాంటి ప్రభుత్వమే లభిస్తుంది” అనే నానుడి ఉంది. కానీ మహాభారతంలోని శాంతిపర్వంలో యుధిష్ఠిరుడికి భీష్ముడు “రాజా కాలస్య కారణమ్” (రాజు లేదా పాలకుడే యుగానికి/కాలానికి కారకుడు) అని చెబుతాడు. మోదీ ఆ విధమైన సమూల మార్పును రగిలించే పాత్రను పోషించారు. దీనిని అమలు చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి — ఒకటి 15వ-16వ శతాబ్దానికి చెందిన ఇటాలియన్ రాజనీతిజ్ఞుడు మాకియవెల్లీ ప్రతిపాదించినది కాగా, మరొకటి క్రీస్తు పూర్వం 3వ-4వ శతాబ్దానికి చెందిన భారతీయ పండితుడు, మంత్రి అయిన కౌటిల్యుడు ఉద్బోధించినది. ‘ది ప్రిన్స్’ గ్రంథంలో మాకియవెల్లీ “తన అధికారాన్ని కాపాడుకోవాలనుకునే పాలకుడు, మంచివాడిగా ఎలా ఉండకూడదో కూడా తెలుసుకోవాలి” అని పేర్కొన్నాడు. దీనికి భిన్నంగా, కౌటిల్యుడు ప్రజా శ్రేయస్సు, ప్రయోజనాల్లోనే పాలకుడి ఆనందం ఉంటుందని వాదించాడు. పాలకుడు క్రమశిక్షణ కలిగి, కరుణాత్ముడై ఉండాలని ఆయన నొక్కి చెప్పారు.
ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’కు పిలుపునివ్వడం ద్వారా కౌటిల్యుని సూత్రాల పట్ల తనకున్న అంకితభావాన్ని మోదీ నిరూపించుకున్నారు. ‘సేవ’ విశిష్టమైన భారతీయ భావన. ఆంగ్లంలో ‘సర్వీస్’ అనే పదం దానికి సంపూర్ణ న్యాయం చేయలేదు. అందుకే 2024లో ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ‘సేవ’ అనే పదానికి ప్రత్యేక గుర్తింపునిస్తూ నిఘంటువులో చేర్చింది. దానికి ‘స్వార్థరహిత సేవ; ఇతరులకు సేవ అందించే చర్య లేదా ఆచరణ..’ అని నిర్వచనం ఇచ్చింది. ‘సర్వీస్’ అనే పదం ఇచ్చే వ్యక్తి పౌర బాధ్యత లేదా మానవతా దృక్పథంగా మాత్రమే కనిపిస్తే, ‘సేవ’ అనేది ఆత్మశుద్ధికి, అహంకార నిర్మూలనకు తోడ్పడే ఒక ఆధ్యాత్మిక భావన. ఇందులో సేవను చేసే వ్యక్తి కేవలం ఒక మానవుడు మాత్రమే కాగా, స్వీకరించే వ్యక్తి దైవస్వరూపంగా భావించబడతాడు. ‘మానవ సేవయే మాధవ సేవ’ అనే భావన భారతీయ ఆలోచనా విధానంలో అంతర్భాగం.
మోదీ పాలనా విధానం సమాజానికి నిష్ఠతో సేవ చేయాలనే ఆ ఆధ్యాత్మిక ఆలోచనపైనే ఆధారపడింది. భీష్ముడి రాజధర్మం ఒక మార్పును తెచ్చే పాలకుడికి ఉండాల్సిన మూడు ముఖ్య గుణాలను పేర్కొంటుంది — సాహసం, సంవేదన (కరుణ), సమదృష్టి (సమాన భావం). మోదీ తన పాలనలో ఈ మూడు గుణాలను ప్రదర్శించారు. దేశం ఆయన సాహసాన్ని, కరుణను అనేక సందర్భాల్లో — ముఖ్యంగా కోవిడ్ సంక్షోభాన్ని ఆయన ఎదుర్కొన్న తీరులో ప్రత్యక్షంగా చూసింది. ఇక తనపై వచ్చే విపరీతమైన దూషణలు, విమర్శలు తన పాలనపై ప్రభావం చూపకుండా చూసుకోవడంలో ఆయన సమదృష్టి స్పష్టంగా వ్యక్తమవుతుంది. చైనా తత్వవేత్త కన్ఫ్యూషియస్ను ఒకసారి ఒక చిక్కు ప్రశ్న అడిగారు: “కొందరు చెబుతున్నట్లు మిమ్మల్ని ఒక చెంపపై కొడితే రెండో చెంప చూపించాలా? లేక ఒక పంటికి బదులుగా మొత్తం దవడనే ఊడగొట్టేలా ప్రతిస్పందించాలా? తనకు హాని చేసిన వారికి కూడా మేలు చేయాలా, లేక చెడు చేసిన వారికి అదే బెత్తంతో సమాధానం చెప్పాలా?” అని. దానికి కన్ఫ్యూషియస్ ఎదురుప్రశ్న వేశారు: “నీకు చెడు చేసిన వారికి కూడా నువ్వు మేలు చేస్తే, మరి నీకు మేలు చేసిన వారికి నువ్వు ఏం చేస్తావు?”. ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే: “మీకు మేలు చేసిన వారికి మీరు ఎల్లప్పుడూ మేలే చేయాలి; కానీ మీకు చెడు చేసిన వారికి తిరిగి చెడు చేయకండి; వారికి న్యాయం చేయండి.” న్యాయం అనేది గొప్ప ధర్మనిష్ఠను, సమదృష్టిని కోరుకునే ఉన్నతమైన భావన. మోదీ పాలన ఆ న్యాయానికి మూర్తీభవించిన రూపంగా నిలిచింది.
కొద్దికాలం క్రితం ‘ఫోర్బ్స్’ పత్రికలోని ఒక వ్యాసం విజేత అయిన నాయకుడికి ఉండాల్సిన ఎనిమిది గుణాలను పేర్కొంది: నిజాయితీ, సమాచార నైపుణ్యాలు (కమ్యూనికేషన్ స్కిల్స్), ఆత్మవిశ్వాసం, అంకితభావం, సానుకూల వైఖరి, నూతన ఆవిష్కరణల దృక్పథం, అంతర్దృష్టి, స్ఫూర్తిదాయకత. ఒక నాయకుడిలో ఈ గుణాలలో చాలావరకు ఉంటే, అతను మంచి నాయకుడు అవుతాడు. కానీ ఈ గుణాలన్నీ పుష్కలంగా ఉన్న ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ.
రామ్ మాధవ్,
బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు

