modi in meditation

25 ఏళ్లలో అసాధ్యాలను సుసాధ్యాలుగా చేసిన ‘రాజర్షి’

సెప్టెంబరు 17న నరేంద్ర మోదీ 76వ ఏట అడుగుపెట్టారు. సరిగ్గా మూడు వారాల తరువాత, అక్టోబరు 7 నాటికి ఆయన తొలుత గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తరువాత భారత ప్రధానిగా ఒక ప్రభుత్వ అధిపతిగా వరుసగా 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. భారత రిపబ్లిక్ చరిత్రలో కేంద్రంలోగానీ, ఏ రాష్ట్రంలోగానీ ఏ ప్రజాస్వామ్య నాయకుడూ పావు శతాబ్దం పాటు ఇటువంటి మహత్తర బాధ్యతను నిర్వర్తించిన దాఖలాలు లేవు. ఇలాంటి వార్షికోత్సవ మైలురాళ్లు రెండు రకాల కథనాలకు దారితీస్తాయి: ఒకటి ప్రశంసలు, రెండోది నిశితమైన సమీక్ష లేదా తనిఖీ. అయితే ఇక్కడ మూడోమార్గాన్ని ఎంచుకుని ‘అసాధ్యాల జాబితా’ను విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే, పరిష్కారమైన సమస్యలు కాలక్రమేణా మరుగునపడిపోతాయి; వాటిని ఎవరూ గుర్తుంచుకోరు, అందుకు తగిన గుర్తింపును ఇవ్వరు.

తొలుత అక్టోబరు 2001 నాటి గుజరాత్‌ను పరిశీలిద్దాం. సౌరాష్ట్ర, కచ్, ఉత్తర గుజరాత్‌ ప్రాంతాలు వరుస కరువులతో అల్లాడేవి. నీళ్ల కోసం నీటి ట్యాంకర్లు, తీవ్రమైన కరువు సంవత్సరాల్లో ఏకంగా నీటి రైళ్లపైనే ఆయా ప్రాంతాలు ఆధారపడేవి. దానికి మోదీ కనుగొన్న పరిష్కారం వేలాది చిన్నపాటి మౌలిక పనులు, ఒకే ఒక్క భారీ ప్రాజెక్టు: 1.5 లక్షలకు పైగా చెక్ డ్యామ్‌ల నిర్మాణం, కాలువల ద్వారా సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలకు నర్మదా జలాల తరలింపు, ప్రతి గ్రామానికి 24 గంటల విద్యుత్‌ను అందించిన ‘జ్యోతిగ్రామ్’ పథకం. ఆ దశాబ్దంలో గుజరాత్ వ్యవసాయ రంగం ఏడాదికి దాదాపు 10 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. ఇది జాతీయ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ. నేడు రాజ్‌కోట్‌లో ఎవరూ నీటి రైళ్ల గురించి మాట్లాడుకోరు.

2001 నాటికి గుజరాత్‌లో ఐదో వంతు మంది పిల్లలు ప్రాథమిక విద్య పూర్తి చేయకుండానే బడి మానేసేవారు, ఇందులో బాలికలే ఎక్కువ. 2003 నుంచి ప్రతి ఏటా జూన్ నెలలో, భానుడి ప్రతాపం తీవ్రంగా ఉండే కాలంలో ముఖ్యమంత్రితో పాటు ఆయన మంత్రివర్గం మొత్తం గాంధీనగర్‌ను విడిచి మూడు రోజుల పాటు గ్రామాల్లో పర్యటిస్తూ పిల్లలను బడుల్లో చేర్పించేది. ‘కన్యా కేలవణి’, ‘శాలా ప్రవేశోత్సవ్’లను మొదట్లో ‘ప్రచార గిమ్మిక్కులు’ కొట్టిపారేశారు. కానీ 2012 నాటికి బడి మానేసే వారి శాతం దాదాపు 2 శాతానికి పడిపోయింది. పదేళ్ల పాటు నిరంతరాయంగా ఒక ప్రక్రియను కొనసాగిస్తే లభించేది కేవలం ఫోటోల హడావుడి మాత్రమే కాదు. గుజరాత్ అంటే వ్యాపారులు, వజ్రాల పాలిషింగ్ చేసేవారి రాష్ట్రం మాత్రమేనని, అక్కడ తయారీ రంగం నిలబడదనే వాదన ఉండేది. 2003లో ప్రారంభమైన ‘వైబ్రెంట్ గుజరాత్’ కార్యక్రమాన్ని మొదట్లో పలువురు ఎగతాళి చేశారు. అయితే 2008లో సింగూర్ నుంచి ‘నానో’ ప్రాజెక్టును బయటికి వెళ్ళగొట్టిన కొద్ది రోజుల్లోనే అది సానంద్ ప్రాంతంలో ఏర్పాటయింది. ఆ వెనుకే ఫోర్డ్, సుజుకి, హోండా కంపెనీలు క్యూ కట్టాయి. భారత జనాభాలో కేవలం 5 శాతం మాత్రమే ఉన్న గుజరాత్, నేడు జీడీపీలో 8 శాతానికి పైగా, అలాగే వస్తువుల ఎగుమతుల్లో నాలుగో వంతు కంటే ఎక్కువ వాటాను అందిస్తోంది.

ఒకప్పుడు గుజరాత్ అల్లర్లతో అట్టుడుకుతుండేది. అహ్మదాబాద్ నగరం 1969, 1985, 1992, 2002లలో హింసాకాండతో రగిలిపోయింది. ఆ రోజుల్లో కర్ఫ్యూ ఒక రుతువులా మారింది. కానీ గత 24 ఏళ్లలో అక్కడ ఎలాంటి పెద్ద పెద్ద మతపరమైన అల్లర్లు జరగలేదు. నేటి తరం అక్కడ కర్ఫ్యూ అంటే కేవలం తమ తల్లిదండ్రులు చెప్పే కథల ద్వారా మాత్రమే తెలుసుకునేలా పరిస్థితులు మారాయి. ‘గుజరాతీలు వ్యాపారం మాత్రమే చేయగలరు, క్రీడాకారులు కాలేరు’ అనే అభిప్రాయం ఒకప్పుడు ఉండేది. 2010లో ప్రారంభమైన ‘ఖేల్ మహాకుంభ్’ నేడు లక్షల మంది పిల్లలను పోటీ క్రీడల వైపు నడిపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్‌లో నిర్మితమైంది; క్రికెట్, చెస్ సహా వివిధ రంగాల్లో ఆ రాష్ట్రం నిరంతరం అత్యుత్తమ క్రీడాకారులను అందిస్తోంది; 2022లో జాతీయ క్రీడలకు ఆతిథ్యమిచ్చిన గుజరాత్, గతేడాది నవంబరులో 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ హక్కులను గెలుచుకుంది. అంతేకాక, 2036 ఒలింపిక్స్ సాధించడమే తదుపరి లక్ష్యంగా నిర్దేశించుకుంది.

ఇప్పుడు ఈ దృక్కోణాన్ని 2014 నాటి భారతదేశానికి విస్తరిద్దాం. భారతదేశం ఎప్పటికైనా ఐఫోన్ వంటి హై-టెక్నాలజీ ఉత్పత్తులను తయారు చేయగలుగుతుందా? 2014-15లో భారత ఎగుమతుల్లో మొబైల్ ఫోన్లు 167వ స్థానంలో ఉండేవి. కానీ 2025-26 నాటికి అవి రూ. 2.6 లక్షల కోట్ల విలువతో ప్రథమ స్థానానికి చేరుకున్నాయి. అందులో ఒక్క ఐఫోన్ మాత్రమే భారతదేశపు అత్యంత పెద్ద సింగిల్ బ్రాండెడ్ ఎగుమతిగా నిలిచింది. భారత్ ఎప్పటికైనా రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తుందా? 2013-14లో భారత్ రూ.686 కోట్ల విలువైన ఆయుధాలను ఎగుమతి చేసింది. 2025-26 నాటికి ఆ సంఖ్య ఏకంగా 80కి పైగా దేశాలకు రూ.38,424 కోట్లకు చేరింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి భారత్ ఎప్పటికైనా దానికి అర్థమయ్యే భాషలోనే సమాధానం ఇస్తుందా? 2016లో ఉరీ దాడికి నియంత్రణ రేఖకు ఆవల మెరుపు దాడులతో (సర్జికల్ స్ట్రైక్స్), 2019లో పుల్వామా దాడికి బాలాకోట్ వైమానిక దాడులతో, గతేడాది పహల్గామ్ దాడికి ‘ఆపరేషన్ సింధూర్’తో భారత్ సమాధానమిచ్చింది. పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను, ఆపై వారి వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఉగ్రవాదానికి రక్షణగా వారు భావించిన అణు ఆయుధాల ముసుగు నేడు పూర్తిగా తొలిగిపోయింది.

రాజ్యాంగ అధికరణం 370 ఎప్పటికైనా రద్దవుతుందా? 2019 ఆగస్టు 5న అది రద్దయింది, డిసెంబరు 2023లో సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని సమర్థించింది. మూడు దశాబ్దాల తీవ్రవాదం, హింస తర్వాత జమ్మూ కాశ్మీర్ నేడు రికార్డు స్థాయి పర్యాటకంతో, సాధారణ పరిస్థితులతో విలసిల్లుతోంది. అయోధ్యలో రాముడి ఆలయం ఎప్పటికైనా నిర్మితమవుతుందా? ఐదు శతాబ్దాల వివాదానికి అత్యున్నత నాయస్థానం ఏకగ్రీవ తీర్పుతో తెరపడింది, జనవరి 22, 2024న అయోధ్యలో శ్రీరామలల్లా ప్రాణప్రతిష్ఠ వైభవంగా జరిగింది. భారతదేశం ఎప్పటికైనా సెమీకండక్టర్ చిప్‌లను తయారు చేస్తుందా? సానంద్‌లోని మైక్రాన్ ప్లాంట్ నుంచి ఈ ఏడాది మార్చి నుంచి ‘మేడ్ ఇన్ ఇండియా’ మెమరీ సరఫరా అవుతున్నాయి, ధోలేరాలోని టాటా ఫ్యాబ్ ప్లాంట్ ఈ ఏడాది డిసెంబరు నాటికి తన మొదటి చిప్‌లను ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉంది. భారత్ ఎప్పటికైనా ఒక వ్యవస్థాపక సమాజంగా మారుతుందా? 2016లో కేవలం కొన్ని వందల గుర్తింపు పొందిన స్టార్టప్‌ల నుంచి నేడు ఆ సంఖ్య 1.5 లక్షలు దాటింది, అందులో వందకు పైగా యూనికార్న్ లుగా (1,000 మిలియన్ డాలర్లు లేదా దాదాపు 97,000 వేల కోట్ల రూపాయలు మార్కెట్ విలువగల కంపెనీలు) అవతరించి, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా నిలిచింది. ఇది ఉన్నత స్థాయిలో ఉన్న దృశ్యమైతే; దీనికి కింద కోట్ల మంది ముద్రా రుణాలు పొందిన చిన్న తరహా వ్యవస్థాపకులు దేశవ్యాప్తంగా వ్యాపార విప్లవాన్ని నడిపిస్తున్నారు.

నక్సలిజం ఎప్పటికైనా అంతమవుతుందా? ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన, ఒకప్పుడు దేశ అంతర్గత భద్రతకు అత్యంత తీవ్రమైన ముప్పుగా మాజీ ప్రధాని అభివర్ణించిన మావోయిస్ట్ హింస అంతిమ దశకు వచ్చింది. 2014లో 126గా ఉన్న ప్రభావిత జిల్లాలు నేడు దాదాపు సున్నాకు పడిపోయాయి. ఇక నిశ్శబ్దంగా సాగిన విప్లవాత్మక మార్పుల జాబితా: ప్రతి గ్రామానికి, ఇంటింటికీ విద్యుద్దీపాలు, 12 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం, 59 కోట్ల బ్యాంకు ఖాతాల ప్రారంభం, 2019లో ఆరింటిలో ఒక ఇంటికే ఉన్న నల్లా నీటి సదుపాయం నేడు గ్రామీణ ప్రాంతాల్లో ఐదింటిలో నాలుగు ఇళ్లకు విస్తరణ, 50 కోట్లకు పైగా ప్రజలకు ఆరోగ్య బీమా; ప్రపంచ అత్యుత్తమ వ్యవస్థలతో పోటీపడే మౌలిక సదుపాయాల అనుసంధానం; నెలకు 2,400 కోట్ల యూపీఐ లావాదేవీలు, 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులు కావడం, అలాగే 2014లో 10వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ నేడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం. ఒక్క వ్యక్తి జీవిత కాలంలో ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? దానికి అసలైన సమాధానం — ఆ జీవితం దేనికోసం అంకితమైందనే దానిలోనే ఉంది.

చాలామంది రాజకీయ ప్రయాణం మూడు పదాల చుట్టూ తిరుగుతుంది: నేను, నా కుటుంబం, నా పార్టీ. కానీ మోదీ శైలి, నడవడిక దానికి భిన్నం. అధికారంలోకి తెచ్చేందుకు కుటుంబం లేదు, విస్తరించుకోవడానికి సొంత వ్యాపారాలు లేవు, వారసత్వంగా పీఠమెక్కించే వారసులు లేరు. ఆయన ప్రతి పదవినీ ఒక ఆస్తిగా కాక ఒక బాధ్యతగా భావించారు. పాతికేళ్ళలో శతాబ్దంలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. ప్రజల నమ్మకం తప్ప ఆయనకు ఎలాంటి ఆస్తులు లేవు. మన ప్రజలు, మన దేశం, మన ఆకాంక్షలు-ఇవే ఆయన మూడు పదాలు. ఒక వ్యక్తి జీవితంలో ఈ పదాలు ఆచరణాత్మకంగా మారినప్పుడు, అవి కొండలను సైతం కదిలించగలవు. ఇప్పుడు జరిగింది కూడా అదే. భారతీయ నాగరికతలో ఇటువంటి పాలకుడిని ఒక ప్రత్యేకమైన పేరుతో పిలిచేవారు: ఆ పదమే ‘రాజర్షి’. ఇది ఏ ప్రభుత్వమూ ఇవ్వలేని, ఏ ఎన్నికలూ ప్రసాదించలేని, లేదా తొలగించలేని అత్యున్నత స్థానం.

అఖిలేష్ మిశ్రా,
బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సీఈఓ