Anganwadi 02

భారత్ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న అంగన్‌వాడీలు

Anganwadi2047 నాటి భారతావనిని నేటికీ పాఠశాల మెట్లు ఎక్కని చిన్నారులే నిర్మిస్తారు. వారు ఆరోగ్యకరమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన, సమర్థులైన పౌరులుగా ఎదిగే క్రమం.. వారి జీవితంలోని అత్యంత కీలకమైన తొలి 1,000 రోజులలోనే ప్రారంభమవుతుంది. కోట్ల మంది భారతీయ చిన్నారులకు, వారి తల్లులకు ఆ ప్రయాణంలో తోడుగా నిలుస్తున్నది మనకు ఎంతో సుపరిచితమైన, మన పొరుగునే ఉన్న అంగన్‌వాడీ వ్యవస్థ. బడి వయసు రాకముందే, చిన్నారుల బరువు, ఎత్తు కొలిచేది, పౌష్టికాహారాన్ని అందించేది, ఇల్లు దాటి బయటకు వచ్చి తొలి పాటలు, గేయాలు నేర్పించేది అంగన్‌వాడీలోనే. గర్భిణులు, బాలింతలు కూడా ఇక్కడే తగిన సలహాలు, సూచనలు పొందుతారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 14 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలు 8.9 కోట్లకు పైగా చిన్నారులకు, మహిళలకు, కిశోర బాలికలకు సేవలు అందిస్తూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య తొలి వారధిగా పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాలలో పనిచేసే 25.2 లక్షల మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు స్థానిక కుటుంబాల నుంచి వచ్చినవారే. అందుకే అంగన్‌వాడీలు ఎల్లప్పుడూ స్థానికులతో ముడిపడి ఉన్న సొంత వ్యవస్థలా నిలిచాయి.

మార్చి 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘పోషణ్ అభియాన్’ను ప్రారంభించడంతో ఈ వ్యవస్థ దేశవ్యాప్త కార్యక్రమానికి మూలస్తంభంగా మారింది. ప్రస్తుతం తొమ్మిదో ‘రాష్ట్రీయ పోషణ్ మాహ్’ (పోషణ మాసం) సెప్టెంబర్ 9న ‘హమారీ అంగన్‌వాడీ, హమారీ జిమ్మేదారీ’ (మన అంగన్‌వాడీ, మన బాధ్యత) అనే ఇతివృత్తంతో ప్రారంభమైంది. నాణ్యమైన సేవలను అందించాలనే ప్రభుత్వ నిబద్ధత అచంచలమైనది. అయితే స్థానిక ప్రజలు దాన్ని తమ సొంత వ్యవస్థగా ఆమోదించి ఆదరించినప్పుడే అంగన్‌వాడీ కేంద్రం పూర్తి స్థాయిలో వర్థిల్లుతుంది. వికసిత్ భారత్ నిర్మాణం ‘సబ్‌కా ప్రయాస్’ (అందరి కృషి) ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పౌష్టికాహార పంపిణీని కేవలం ప్రభుత్వ సేవగా మాత్రమే చూడకూడదు. సమాజ భాగస్వామ్యం అనేది చాలా కాలంగా ఒక పిలుపుగానే మిగిలిపోయింది. కానీ, ఈ ఏడాది అది ఒక స్థిరమైన వ్యవస్థగా రూపుదిద్దుకుంటోంది. ప్రతి అర్హుడైన చిన్నారికి సేవలు అందేలా చూడటానికి తల్లిదండ్రులు, పంచాయతీ ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలను అంగన్‌వాడీ నిర్వహణ కమిటీల్లో భాగస్వాములను చేస్తున్నారు. సోషల్ ఆడిట్లు (సామాజిక తనిఖీలు) నిర్వహించడం ద్వారా సమాజమే సేవలను సమీక్షించుకునేలా, హక్కులను సరిచూసుకునేలా, వివరాలను నమోదు చేసే వీలు కలుగుతోంది. జవాబుదారీతనం ఆ సేవలు పొందే కుటుంబాల అంతర్గత తనిఖీగా మారుతోంది.

ఈ ప్రక్రియలో తల్లులే కీలక పాత్ర వహిస్తున్నారు. అనుబంధ పోషకాహార కార్యక్రమం మెనూ బోర్డులు ప్రతిరోజూ అందించే వేడి వంటకాలు, ఇంటికి తీసుకెళ్లే రేషన్ అర్హతలను స్పష్టంగా ప్రదర్శిస్తాయి. తన బిడ్డకు ఏమి అందాలో తల్లికి తెలిసినప్పుడు, పారదర్శకత అలవాటుగా మారుతుంది. నాణ్యతను నిర్ధారించడంలో స్థానిక ప్రజలు భాగస్వాములవుతారు. పోషణ్ మాహ్ 2026 సందర్భంగా కమిటీలు, సామాజిక తనిఖీలు, మెనూ బోర్డుల పునరుద్ధరణతో పాటు తిథి భోజ్, రుచి చూసే కార్యక్రమాలు, వంటకాల తయారీ ప్రదర్శనలను క్రియాశీలకం చేస్తున్నారు. పౌష్టికాహారం కలిగిన భారత్ సాధనకు సమతులాహారం ఎంతో అవసరం. ఇందులో ధాన్యాలు, చిరుధాన్యాలు (మిల్లెట్స్), పప్పుధాన్యాలు, బాదం/జీడిపప్పు వంటి గింజలు, పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, పండ్లు, ఆకుకూరలు ఉండాలి. ఈ జూలైలో విడుదల చేసిన ‘ఎస్ఎన్పీ 2026 సమగ్ర మార్గదర్శకాలు’ వేడి, వండిన ఆహారాన్ని నిర్వచించడమే కాకుండా, జాతీయ ఆహార భద్రతా చట్టం-2013 కింద సూక్ష్మపోషకాల ప్రమాణాలను మరింత బలోపేతం చేశాయి. రెండోది తొలిదశ అభ్యాసనం. ఒక చిన్నారి తినే ఆహారం, నేర్చుకునే విషయాలు పరస్పరం బలంగా ముడిపడి ఉంటాయి. అంగన్‌వాడీ కార్యకర్తలు బిడ్డ తొలి మూడేళ్లలో 34 రకాల అభివృద్ధి మైలురాళ్లను గమనిస్తారు. ‘నవచేతన’, ‘ఆధార్‌శిల’ పాఠ్యప్రణాళికలు పోషణను, సంరక్షణను పిల్లలను బడికి సిద్ధం చేసే క్రమంలోకి తీసుకెళ్తాయి. మూడోది బిడ్డ జన్మించక ముందే ప్రారంభమవుతుంది. గర్భధారణ సమయంలో తల్లి పోషకాహారం బిడ్డ జీవిత ఆరంభాన్ని తీర్చిదిద్దుతుంది. ఈ పోషణ్ మాహ్… ‘ప్రధానమంత్రి మాతృ వందన యోజన’ 10 ఏళ్ల మైలురాయిని సూచిస్తుంది. 

ఏ మహిళా తన సంపాదన, ఆరోగ్యాల్లో ఎదో ఒకదాన్ని ఎంచుకునే పరిస్థితి రాకూడదనే ప్రధానమంత్రి దృఢ సంకల్పానికి ఇది నిదర్శనం. దశాబ్దం కాలంలో 4.65 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.21,511 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి జమయ్యాయి. ‘మిషన్ శక్తి’ కింద మరింత బలోపేతమైన ఈ పథకం, రెండో సంతానంగా ఆడపిల్ల జన్మిస్తే అదనపు ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇలాంటి నగదు బదిలీలు కుటుంబంలో అన్ని విషయాలు తెలుసుకుని నిర్ణయాలు తీసుకునేలా అవగాహన కల్పించే కౌన్సెలింగ్‌ తోడైనప్పుడే వాటి పూర్తి లక్ష్యం నెరవేరుతుందని ‘ఆర్ధిక సర్వే 2025-26’ స్పష్టం చేసింది. రాజస్థాన్ ‘క్యాష్ ప్లస్’ నమూనాను పరిశీలిస్తే ఈ నగదు బదిలీలకు లబ్ధిదారుల ప్రవర్తనలో వచ్చే నిరంతర సమాచారాన్ని జతచేసి విశ్లేషిస్తే ఈ డబ్బును ఆహారంపై ఖర్చు చేసే మహిళల వాటా 30 శాతం నుంచి 89 శాతానికి పెరిగినట్టు వెల్లడైంది. భర్తలను, కుటుంబాలను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయడం వల్ల తల్లుల పోషకాహారానికి సంబంధించి ఉన్న అపోహలు తొలిగిపోయాయి. తల్లి పోషకాహారం ఆమె ఒక్కరి బాధ్యతే కాదు కనుక అంగన్‌వాడీల విషయంలో సమాజ భాగస్వామ్యం పెరుగుతోంది. సామాజిక భాగస్వామ్యం అంటే పౌష్టికాహారం, చిన్ననాటి సంరక్షణ భారాన్నంతటినీ అంగన్‌వాడీ కార్యకర్తపైనే నెట్టడం కాదు. ఆమెను గౌరవించడం, మద్దతుగా నిలవడం, బలోపేతం చేయడం దాని అర్థం. 

ఈ సెప్టెంబర్‌లో ప్రతి పౌరుడూ తమ ప్రాంతంలోని కనీసం ఒక అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించాలని పిలుపునిస్తున్నాను. కార్యకర్తతో మాట్లాడండి, మెనూ బోర్డు చూడండి, వారికి మీరు ఏ విధంగా సహాయపడగలరో అడిగి తెలుసుకోండి. తండ్రులు, తాతయ్యలు/అమ్మమ్మలు, పంచాయతీలు, స్వయం సహాయక సంఘాలు అందరికీ ఇందులో పాత్ర ఉంది. ఈ సెప్టెంబర్‌లో అంగన్‌వాడీల్లో బరువు కొలుచుకుంటున్న చిన్నారులు, భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి ఇరవైలలో ఉంటారు. ఆ సంవత్సరంలోకి వారు తీసుకెళ్లే ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం నేడే రూపుదిద్దుకుంటున్నాయి. ప్రతి సమాజం తన అంగన్‌వాడీ బాధ్యతను స్వీకరించినప్పుడు, భారత్ ప్రతి చిన్నారి భవిష్యత్తు బాధ్యతను స్వీకరిస్తుంది.