Recycling textile wastage

జౌళి రంగంలో స్వచ్ఛతకు ప్రాధాన్యం

2030 నాటికి 350 బిలియన్ డాలర్ల జౌళి, దుస్తుల పరిశ్రమను లక్ష్యంగా నిర్దేశించుకున్న భారత్ తన వ్యూహంలో సుస్థిరతకు కీలక స్థానం కల్పిస్తోంది. ఫైబర్, నూలు, దుస్తుల ప్రాసెసింగ్, సాంకేతిక వస్త్రాల వరకు విస్తరించి ఉన్న ఈ రంగంలో సుస్థిరత ఇప్పుడు కేవలం పర్యావరణ అంశం మాత్రమే కాదు; వ్యాపార పోటీతత్వం, మార్కెట్ లభ్యత, బాధ్యతాయుతమైన వృద్ధికి ప్రాతిపదికగా మారింది. “ప్రపంచం ఇప్పుడు పర్యావరణం, సాధికారతతో కూడిన ఫ్యాషన్ భావనను స్వీకరిస్తోంది. ఈ విషయంలో భారత్ నాయకత్వం వహించగలదు,” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన మాటలు భారత జౌళి రంగంలో వస్తున్న మార్పులకు నిదర్శనం. భారత్ లో జౌళి రంగం అత్యధిక ఉపాధినిచ్చే కీలక రంగాలలో ఒకటి. ఇది ప్రత్యక్షంగా 4.9 కోట్ల మందికి జీవనోపాధి కల్పిస్తోంది. ప్రస్తుతం 196 బిలియన్ డాలర్లుగా ఉన్న దీని దేశీయ మార్కెట్ విలువ 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అలాగే అదే సమయానికి 100 బిలియన్ డాలర్ల జౌళి ఎగుమతులను సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ రూపొందించిన సుస్థిరత ప్రణాళిక ఒక స్పష్టమైన విధానంతో పనిచేస్తోంది: వృద్ధి లేదా సుస్థిరత — ఈ రెండింటిలో భారత్ ఏదో ఒకదానిని మాత్రమే ఎంచుకోవాల్సిన అవసరం లేదు. స్వచ్ఛమైన ఉత్పత్తి, వనరుల సమర్థ వినియోగం, పునర్వినియోగం వంటివి భారత జౌళి రంగ తదుపరి వృద్ధి అధ్యాయానికి పునాదిగా మారనున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్లు తమ సరఫరా గొలుసులలో కఠినమైన సుస్థిరత (పర్యావరణ పరిరక్షణ, వనరుల పునర్వినియోగం) లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నాయి. వినియోగదారులు కూడా పునర్వినియోగం ఉత్పత్తుల పట్ల ఆసక్తి చూపుతున్నారు. ప్రధాన ఎగుమతి మార్కెట్ల విధానకర్తలు పర్యావరణ పనితీరు, రీసైకిల్ చేసిన పదార్థాల వినియోగం, రసాయనాలు, నీరు, విద్యుత్ వినియోగానికి సంబంధించి కొత్త నిబంధనలను తెస్తున్నారు. 500 గిగావాట్ల స్వచ్ఛ ఇంధన సామర్థ్యం 2070 నాటికి ‘నెట్ జీరో’ ఉద్గారాల సాధన వంటి భారత వాతావరణ లక్ష్యాలు కూడా జౌళి రంగాన్ని తక్కువ కర్బన ఉద్గారాల దిశగా నడిపిస్తున్నాయి. భారతీయ ఎగుమతిదారులకు సుస్థిరత కేవలం ఒక నిబంధన మాత్రమే కాదు; పారిశ్రామిక పోటీతత్వంలో అంతర్భాగంగా మారింది. భారీ తయారీ రంగాలు, విభిన్నమైన ముడిసరుకులు, సాంకేతిక సామర్థ్యం, వ్యర్థాల పునర్వినియోగ వ్యవస్థ, స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థల నెట్‌వర్క్‌లతో భారత్ ఇప్పటికే బలమైన స్థానంలో ఉంది. మన దేశంలో రఫూగరి, కాంతా, గొధాడి, ఛిందీ దుర్రీలు, ఖేష్ నేత వంటి సాంప్రదాయ పద్ధతులు వ్యర్థాల పునర్వినియోగాన్ని తరతరాలుగా జీవన విధానంలో భాగంగా మార్చాయి. ప్రపంచ సర్క్యులర్ ఎకానమీ ఫోరమ్ 2026కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం కూడా ఈ మార్పునకు నిదర్శనం.

‌‌వస్త్ర వ్యర్థాల వినియోగం

వస్త్ర వ్యర్థాల నిర్వహణ సుస్థిరతకు కీలక ఉదాహరణ. 2026లో జౌళి మంత్రిత్వ శాఖ 15 రాష్ట్రాలలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం, దేశంలో ఏటా 70.73 లక్షల టన్నుల వస్త్ర వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 70 శాతానికి పైగా రీసైక్లింగ్, ఆప్‌సైక్లింగ్ ప్రక్రియల ద్వారా పునర్వినియోగంలోకి వస్తున్నాయి. ముఖ్యంగా తయారీ దశలోని వ్యర్థాల పునరుద్ధరణ 95 శాతానికి పైగా ఉంది. అయితే వినియోగదారుల వాడకం తర్వాత వచ్చే వ్యర్థాల సేకరణ, వర్గీకరణ వ్యవస్థలు ఇంకా మెరుగుపడాల్సి ఉంది. 2030 నాటికి భారత్‌లో వస్త్ర రీసైక్లింగ్ మార్కెట్ 3.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, దీనివల్ల దాదాపు లక్ష హరిత (కాలుష్య రహిత) ఉద్యోగాలు (గ్రీన్ జాబ్స్) లభిస్తాయని అంచనా. ఈ సమస్య పరిష్కారానికి నగరాల్లో వ్యర్థాల సేకరణ కేంద్రాలు పైలట్ ప్రాజెక్టులుగా ప్రారంభమయ్యాయి. నవీ ముంబైలో నవీ ముంబై మునిసిపల్ కార్పొరేషన్, సాహస్ ఫౌండేషన్, మహిళా స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్ ద్వారా 3,323 కేజీల వస్త్ర వ్యర్థాలు చెత్తకుప్పల్లోకి వెళ్లకుండా నిరోధించారు. అలాగే గవర్నమెంట్ ఈ-మార్కెట్‌ప్లేస్ ద్వారా రీసైకిల్ చేసిన వస్త్ర ఉత్పత్తులను ప్రభుత్వ సేకరణ ప్రక్రియలోకి తెస్తున్నారు.

‌‌స్వచ్ఛమైన ఉత్పత్తి

ఉత్పత్తి ప్రక్రియలో నీరు, విద్యుత్, రసాయనాల వినియోగాన్ని క్రమబద్ధీకరించడం పర్యావరణ పరిరక్షణలో ప్రధాన భాగం. ప్రమాదకర రసాయనాల వినియోగాన్ని తగ్గించేందుకు యునిడో, గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా 10,530 టన్నుల విషపూరిత రసాయనాలను ప్రత్యక్షంగా, 21,000 టన్నులను పరోక్షంగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా 1.47 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. అలాగే 40,000 మందికి లబ్ధి చేకూరుతుంది, వీరిలో 60 శాతం మంది మహిళలు ఉంటారు. మౌలిక సదుపాయాల పరంగా, 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి అంచనాతో ఏర్పాటు చేస్తున్న ఏడు పీఎం మిత్రా పార్కులలో సమీకృత నీటి శుద్ధి వ్యవస్థలను చేర్చుతున్నారు. జౌళి రంగంలో అత్యధిక వాటా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) సంస్థలదే. వీటి వద్ద అవసరమైన సాంకేతికత, నిధులు లేకపోవచ్చు. అందుకే సుస్థిరత విధానాలు క్షేత్రస్థాయి పరిశ్రమలకు చేరాల్సి ఉంది. జౌళి మంత్రిత్వ శాఖ జూలై 2023లో ఈఎస్‌జీ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇది ప్రమాణాల ధృవీకరణ, అవగాహన పెంపొందించడం, కృత్రిమ మేధ వినియోగంపై పనిచేస్తోంది. అలాగే జాతీయ జౌళి సాంకేతికత కార్యక్రమం, ఐఐటీ దిల్లీ పాణిపట్ క్యాంపస్‌లోని ‘అటల్ సెంటర్ ఆఫ్ టెక్స్‌టైల్ రీసైక్లింగ్ అండ్ సస్టైనబిలిటీ’ వంటి సంస్థలు రక్షణ, ఏరోస్పేస్ రంగాలలో ఉపయోగించే అరామిడ్ ఫైబర్ వ్యర్థాల రీసైక్లింగ్‌పై పరిశోధనలు చేస్తున్నాయి. భారత్ టెక్స్ 2026 ప్రదర్శనలోనూ గడ్డి వ్యర్థాల నుంచి ఫైబర్ తయారీ వంటి సరికొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చాయి.

కేంద్ర బడ్జెట్ 2026-27 లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జౌళి రంగానికి కీలక కేటాయింపులు చేశారు. ‘టెక్స్-ఈకో’ పేరుతో ప్రకటించిన సమగ్ర కార్యక్రమం సుస్థిరతను పరిశ్రమ వృద్ధి నమూనాలో అంతర్భాగంగా మార్చింది. ఈ కార్యక్రమంలో వనరుల పునరుద్ధరణ, రీసైక్లింగ్ మౌలిక సదుపాయాలు, నీటి సంరక్షణ, ఉద్గారాల తగ్గింపు, సంస్థాగత సామర్థ్య పెంపు, ఆవిష్కరణలు, డిజిటల్ వ్యవస్థలు ప్రధానాంశాలుగా ఉంటాయి. జౌళి మంత్రిత్వ శాఖలో సుస్థిరత కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇది కేవలం పర్యావరణ అంశాలకే పరిమితం కాకుండా, కార్మికుల సంక్షేమం, హరిత ఉద్యోగాల కల్పన, సమానత్వంతో కూడిన పారిశ్రామిక ప్రగతిని పర్యవేక్షిస్తుంది. పారదర్శకత, ప్రమాణాలు, సర్టిఫికేషన్‌లలో జవాబుదారీతనం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. భారత జౌళి రంగ సుస్థిరతా ప్రయాణం ఒక కీలక దశకు చేరుకుంది. వినియోగం తర్వాత వచ్చే వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ మౌలిక వసతులు, పర్యావరణ అనుకూల సాంకేతికతలను అందుబాటులోకి తేవడం ఇప్పుడు ప్రధాన లక్ష్యాలు. 2030 నాటికి తన మార్కెట్‌ను రెట్టింపు చేయాలని భావిస్తున్న భారతదేశానికి సుస్థిరత వృద్ధిని నెమ్మదింపజేసే అంశం కాదు. పరిశుభ్రమైన, బలమైన, పోటీతత్వంతో కూడిన పారిశ్రామిక వృద్ధి దిశలో సాగే మార్గంలో తదుపరి అధ్యాయానికి ప్రధాన చోదక శక్తి.

గిరిరాజ్ సింగ్,
కేంద్ర జౌళి శాఖ మంత్రి