Komaravelli station

తెలంగాణలో రైల్వేలపై చారిత్రాత్మక పెట్టుబడులు

Komaravelli station prarambamతెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక స్థాయిలో పెట్టుబడులు పెట్టిందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త రైల్వే మార్గాల నిర్మాణం, ట్రాక్ డబ్లింగ్, విద్యుదీకరణ, స్టేషన్ల ఆధునీకరణ, భద్రతా చర్యలు, హైస్పీడ్ రైలు కారిడార్ల ప్రణాళికలతో రైల్వే రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన తెలిపారు. జూలై 26న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో కలిసి ఆయన కొమురవెల్లి స్టేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ”​గొల్ల, కురుమల ఆరాధ్య దైవమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి సన్నిధిలో నూతన రైల్వే స్టేషన్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. 2024లో శంకుస్థాపన జరుపుకొన్న ఈ ప్రాజెక్ట్, మల్లన్న దయతో ఇవాళ సాకారమై లక్షలాది మంది భక్తుల కలను నెరవేర్చింది. ​మనోహరాబాద్-కొత్తపల్లి నూతన రైల్వే మార్గం ద్వారా కరీంనగర్‌కు కనెక్టివిటీ ఏర్పడింది. ఇప్పటికే మనోహరాబాద్-సిద్దిపేట మధ్య 76 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. ప్రాథమిక ప్రతిపాదనల్లో కొమురవెల్లి లేనప్పటికీ, భక్తుల సౌకర్యార్థం రూ.6 కోట్లతో ఆలయ వైభవం ప్రతిబింబించేలా ఆధునిక హంగులతో ఈ రైల్వే స్టేషన్ భవన నిర్మాణం జరిగింది. ​సికింద్రాబాద్ – సిద్దిపేట మధ్య నడిచే డెమూ రైళ్లు ఇకపై కొమురవెల్లిలో ఆగుతాయి. ఇవన్నీ అన్-రిజర్వ్‌డ్ కోచ్‌లే కావడం వల్ల చాలా తక్కువ చార్జీలతో ప్రయాణం చేయవచ్చు. ఇది భక్తులు, విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటూ, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని, స్థానిక వ్యాపారాన్ని పెంచుతుంది.”

రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి

2014 తర్వాత తెలంగాణలో 340 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే మార్గాల నిర్మాణం పూర్తయిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. పెద్దపల్లి–నిజామాబాద్, జగ్గయ్యపేట–విష్ణుపురం, భద్రాచలం–సత్తుపల్లి, దేవరకద్ర–కృష్ణ, అక్కన్నపేట–మెదక్ వంటి కీలక రైల్వే మార్గాలు పూర్తయ్యాయని చెప్పారు. అదే విధంగా 576 కిలోమీటర్ల మేర ట్రాక్ డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ పనులు పూర్తి కాగా, 2,034 కిలోమీటర్ల మేర ట్రాక్ విద్యుదీకరణ రికార్డు స్థాయిలో జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రూ.47,984 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో అమలులో ఉన్నాయని వివరించారు. హైదరాబాద్ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా రూ.412 కోట్లతో ఎంఎంటీఎస్ ఫేజ్-2ను 35 కిలోమీటర్ల మేర యాదాద్రి వరకు విస్తరిస్తున్నట్లు తెలిపారు. అలాగే రూ.3,591 కోట్లతో 173 కిలోమీటర్ల పాండురంగాపురం–భద్రాచలం–మల్కన్‌గిరి కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. కాజీపేట–విజయవాడ ట్రిప్లింగ్ పనులు తుది దశకు చేరుకున్నాయని, బీబీనగర్–గుంటూరు, ముద్‌ఖేడ్–డోన్, భద్రాచలం–దోర్నకల్, మోతుమరి–విష్ణుపురం మార్గాల్లో డబ్లింగ్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. నిజామాబాద్, నష్కల్–హసన్‌పర్తి రోడ్, విష్ణుపురం, పెద్దపల్లి, వికారాబాద్, పగిడిపల్లి ప్రాంతాల్లో బైపాస్‌లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం కొనసాగుతోందన్నారు.

చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ పూర్తయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే స్వదేశీ రైల్వే భద్రతా వ్యవస్థ ‘కవచ్’ను తెలంగాణలో 63 స్టేషన్లు, 627 కిలోమీటర్ల పరిధిలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైల్వే భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ 2014లో ఉన్న 121 అన్‌మ్యాన్డ్ లెవల్ క్రాసింగ్‌లను 2018 నాటికే పూర్తిగా తొలగించామని, అదేవిధంగా 249 మ్యాన్డ్ లెవల్ క్రాసింగ్‌లను కూడా దశలవారీగా తొలగించినట్లు చెప్పారు. ప్రజల సౌకర్యార్థం 329 రోడ్ అండర్ బ్రిడ్జిలు (RUBలు), 59 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు (ROBలు), 58 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించామని వెల్లడించారు. స్థానిక కళాకారులు, చేనేత కార్మికులు, గిరిజనుల ఉత్పత్తులకు ప్రోత్సాహంగా 73 స్టేషన్లలో ‘వన్ స్టేషన్ – వన్ ప్రొడక్ట్’ స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు, నాగ్‌పూర్ నగరాలకు ఐదు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తుండగా, తక్కువ ఖర్చుతో ప్రయాణాల కోసం ఆరు అమృత్ భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు 100కు పైగా కొత్త రైలు సర్వీసులు మంజూరయ్యాయని వెల్లడించారు.

రూ.521 కోట్ల వ్యయంతో కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో రూ.2 వేల కోట్లకు పైగా వ్యయంతో 40 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు జరుగుతుండగా, ఇప్పటికే నాలుగు స్టేషన్ల పనులు పూర్తయి ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారని పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడిచే హైస్పీడ్ రైలు కారిడార్లను కూడా ప్రతిపాదించినట్లు తెలిపారు. హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–పుణే మార్గాల్లో ఎలివేటెడ్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఉత్తర తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాలను అనుసంధానించే దాదాపు 400 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రైల్ (RRR) ప్రాజెక్టుకు 2023లో ఫైనల్ లొకేషన్ సర్వేకు ఆమోదం లభించిందని వివరించారు. తెలంగాణలో రైల్వే రంగాన్ని ఆధునికీకరించడం, భద్రతను బలోపేతం చేయడం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, భవిష్యత్ రవాణా అవసరాలకు అనుగుణంగా హైస్పీడ్ కారిడార్లను అభివృద్ధి చేయడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

మల్లన్న భక్తుల కల సాకారం‌‌

కొమురవెల్లి పుణ్యక్షేత్రానికి రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడం లక్షలాది మంది మల్లన్న భక్తుల ఎన్నో ఏళ్ల కల నెరవేరినట్లేనని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. చిన్నతనంలో ఎడ్లబండిపై కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయని, నేడు అదే క్షేత్రానికి ఆధునిక రైల్వే స్టేషన్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. సుమారు రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించిన కొమురవెల్లి రైల్వే స్టేషన్ ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దినట్లు తెలిపారు. రైల్వే ఎక్కడికి వెళ్తే అక్కడ అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్న ఆయన, ఈ స్టేషన్‌తో భక్తులకు మాత్రమే కాకుండా స్థానిక రైతులు, వ్యాపారులు, యువతకు కూడా ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఆధ్యాత్మిక పర్యాటక రంగానికి ఇది మరింత ఊతమిస్తుందని, రవాణా సౌకర్యాలు మెరుగుపడిన ప్రాంతాలే వేగంగా అభివృద్ధి చెందుతాయని వ్యాఖ్యానించారు.

రోడ్డు, రైల్వే, విమానయాన కనెక్టివిటీకి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని బండి సంజయ్ అన్నారు. గత 12 ఏళ్లలో తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి, రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టుతో సహా రూ.1.74 లక్షల కోట్లకు పైగా కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధి కోసం కూడా రూ.1,073 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో భారతీయ రైల్వేల్లో నూతన శకం ప్రారంభమైందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా రైల్వే అభివృద్ధికి గత 12 ఏళ్లలో భారీగా పెట్టుబడులు పెట్టామని పేర్కొంటూ, యూపీఏ ప్రభుత్వ హయాంలో 2014 చివరి రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు కేవలం రూ.258 కోట్లు మాత్రమే కేటాయించగా, మోదీ ప్రభుత్వంలో ఈ ఏడాది ఒక్కటే రూ.5,454 కోట్లు కేటాయించామని చెప్పారు. దీంతో తెలంగాణకు రైల్వే బడ్జెట్ దాదాపు 20 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో తెలంగాణలో రైల్వే అభివృద్ధికి రూ.36,286 కోట్లు ఖర్చు చేశామని, ప్రస్తుతం రూ.47,984 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లలో హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–పుణే మార్గాలను తెలంగాణకు కేటాయించడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ఈ ప్రాజెక్టుల కోసం లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఎంఎంటీఎస్ ఫేజ్-2, ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుతో పాటు మరో 30 కొత్త రైల్వే ప్రాజెక్టులకు ఫైనల్ లొకేషన్ సర్వే జరుగుతోందని తెలిపారు. వీటి కోసం రూ.84,492 కోట్ల వ్యయం అంచనా వేసినట్లు చెప్పారు. రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ చేపట్టామని, తెలంగాణలో రూ.2 వేల కోట్ల వ్యయంతో 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గత 12 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.14 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించిందని బండి సంజయ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానేసి అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని సూచించారు. కేంద్రం అందిస్తున్న నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన మ్యాచింగ్ గ్రాంట్లు విడుదల చేసి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఆయన కోరారు.

రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ పాల్గొన్నారు. సికింద్రాబాద్ వెళుతున్న రైలులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు గజ్వేల్ వరకు ప్రయాణించారు.