ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు క్షణక్షణానికి మారుస్తున్న రంగులు చూసి ఊసరవెల్లిలు సైతం నివ్వెరపోతున్నాయి. తెలంగాణలో అధికారంలో బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఎంఐఎందే పెత్తనం అని తెలంగాణ ప్రజలందరికీ ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. పరోక్ష అధికారానికి రుచి మరిగిన ఎంఐఎం.. బిజెపిని ఎదగకుండా చేయడానికి, ఈ రెండు పార్టీల ద్వారా నిరంతరం కుట్రలకు తెరతీస్తున్నది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆపడం అసాధ్యం అని గ్రహించిన కాంగ్రెస్, హైదరాబాద్ లోని కీలక ప్రాంతాన్ని ఎంఐఎంకు కట్టబెట్టడానికి, జీహెచ్ఎంసీని మూడు భాగాలుగా చేసింది. కీలకమైన కోఠి, ఆబిడ్స్, నాంపల్లి లాంటి అత్యధిక ఆదాయం గల ప్రాంతాలతో పాటు అంబర్ పేట్, ముషీరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ అసెంబ్లీలను కూడా ఎంఐఎం అడ్డా అయిన చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్ పురతో జత కట్టించి హైదరాబాద్ మొత్తాన్ని ఓవైసీ కుటుంబం చేతిలో పెట్టడానికి 300 డివిజన్లు, 3 ముక్కలు చేసింది. 

ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కానీ, ఎంఐఎం కానీ పోటీ బిజెపితోనే అనేది రాజకీయ పండితుల విశ్లేషణ. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే, తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ అధికారంలోకి రావడం పక్కా అని గ్రహించిన ఈ మూడు పార్టీలు (ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్) లోపాయికారీ ఒప్పందాలతో నిరంతరం బిజెపిని, తద్వారా హిందువులను దెబ్బతీసే కుట్రలు చేస్తూనే ఉన్నాయి. ఎంఐఎం పార్టీకి ఊడిగం చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ లు బయటకు రాజకీయ శత్రువుల్లా నటిస్తూ లోపల ఎంఐఎం ఎజెండాలో రహస్యంగా కలిసి పని చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా బోగస్ సర్వేల పేరుతో మైండ్ గేమ్ ఆడించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ లు, ఓటరు బిజెపి వైపు వెళ్లకుండా తప్పుడు భావన కల్పించి, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్థి గెలుపు కోసం ఈ మూడు పార్టీలు రహస్య ఎజెండాతో పని చేసిన విషయం విదితమే.

గత రెండు సంవత్సరాలుగా హర్యానా, మహారాష్ట్ర, దిల్లీ, బీహార్, అస్సాం, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అఖండ విజయాలతో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో బిజెపి సానుకూల వాతావరణం రావడంతో ఎట్టి పరిస్థితుల్లో బిజెపిని అడ్డుకోవాలని ఈ మూడు పార్టీలు రహస్యంగా పని చేస్తున్నాయి. బిజెపికి ఆయువుపట్టుగా ఉన్న హిందూ ఓటుబ్యాకు చీల్చడానికి ఓవైసీ మార్గదర్శనంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ హిందూ డ్రామాలకు కొత్తగా తెరతీయడం ఊసరవెల్లిని మించిన రంగుల మార్పుగా అపార అనుభవం ఉన్న రాజకీయ పండితులే ఆశ్చర్యపోతున్నారు. హిందూగాళ్లు బొందుగాళ్లు అంటూ ఎగతాళి చేసి, ముస్లింల ఖబ్రస్తాన్ లకు వందల ఎకరాలు ఇచ్చిన బీఆర్ఎస్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసం పెద్దమ్మ గుడినే కూలగొట్టిన కాంగ్రెస్, ఇప్పుడు దేవాలయ దర్శనాలు, వరుణ యాగాలతో హిందువుల ఓట్లను చీల్చే భయంకర కుట్రలకు తెరతీస్తున్నాయి. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి ఒకవైపు, ఆర్ఎస్ఎస్ మార్గదర్శనంలో నడుస్తున్న హిందూ సంస్థలు మరోవైపు, హిందూ చైతన్యం కోసం నిరంతరం కృషి చేస్తుండగా వస్తున్న ఆ ఫలితాలను చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీఆర్ఎస్ జీహెచ్ఎంసీలో చైతన్యంగా ఉన్న హిందూ ఓట్లను చీల్చడానికి, కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు ఈ కుట్రలు నడపాలని, ఎంఐఎం ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ, హిందువులకు ఏమాత్రం అనుమానం కలగని రీతిలో బహు జాగ్రత్తగా పని చేస్తున్నాయి.

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు జీహెచ్ఎంసీలో ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 30 వేలకు ఒక డివిజన్, హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో 80-90 వేలకు ఒక డివిజన్ ఏర్పాటు చేసి, హిందూ ఎన్నికల శక్తిని దెబ్బతీసిన విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కేసీఆర్ బాటలోనే నడిచి ఎంఐఎంకు జీహెచ్ఎంసీ అప్పచెప్పే లక్ష్యంతో డివిజన్ల పునర్విభజన పేరిట మార్పులు చేర్పులు చేసింది. విద్యాధికులు ఎక్కువగా ఉన్న జీహెచ్ఎంసీ ఓటర్లును జాగ్రత పరిచే విధంగా బిజెపి కూడా తన ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నప్పటికీ డబ్బులకు, అధికారానికి ఊడిగం చేసే కొన్ని మీడియా సంస్థల హిందూ వ్యతిరేక విష ప్రచారం కూడా ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు కలిసొచ్చేవిధంగా ఉంది. డబుల్ డిజిట్ రాకపోయిన పర్వాలేదు, బిజెపి ఓడిపోతే చాలు అన్నవిధంగా బీఆర్ఎస్.. కాంగ్రెస్, ఎంఐఎంతో రహస్యంగా కలిసి పని చేయడం జీహెచ్ఎంసీ ఓటర్లకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. బీఆర్ఎస్ కుట్రలను తెలంగాణ ప్రజలు గ్రహిస్తే, కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ ను బొంద పెట్టడం ఖాయం అని ఎంఐఎం పార్టీ చాలా జాగ్రత్త పడుతుంది.

ఆలస్యంగా అయినా కృష్ణానదిలో నీటి ప్రవాహం వచ్చి ఆలమట్టి, నారాయణపూర్, భీమా ప్రాజెక్టులతో పాటు శ్రీశైలం కూడా దాదాపు నిండు దశకు వచ్చాక కాంగ్రెస్ వరుణయాగం ఎంత దగాకోరుదో కొంచెం ఆలోచిస్తే తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ నాయకులు గుళ్ల యాత్ర చేపట్టడం, కాంగ్రెస్ తో పనిగట్టుకొని విమర్శలు చేయించుకోవడం ఈ రెండు పార్టీల హిందూ ఓట్లను చీల్చే కుట్రలను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. గత లోక్ సభ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నాలుగు పార్లమెంట్ స్థానాల్లో బిజెపికి వచ్చిన మొత్తం ఓట్ల కన్నా కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కలిసినా వచ్చిన ఓట్లు తక్కువ. హైదరాబాద్ పార్లమెంటులో ఎంఐఎంకు పోటీ ఇచ్చింది కేవలం బిజెపి మాత్రమే. కాబట్టి వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపికి అండగా ఉన్న హిందువుల ఓట్లలో బలమైన చీలిక తీసుకురాకపోతే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి గెలుపు ఆపడం అసాధ్యమని గ్రహించే ఊసరవెల్లిని మించిన రంగులు మార్చే కుట్రలు ఈ మూడు పార్టీలు కూడబలుక్కొని చేస్తున్నాయి. ప్రధాన మీడియా అండ బిజెపికి ఎక్కువగా లేనప్పటికీ, లక్షల మంది విద్యావంతులు, ముఖ్యంగా యువకులు సోషల్ మీడియాలో బిజెపికి అండగా ఉండడంతో ఈ మూడు పార్టీల కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొంటే జీహెచ్ఎంసీలో బిజెపి గెలుపు నల్లేరు మీద నడకే. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ఉండడం కూడా, అందులో కాంగ్రెస్ ఘోర పరాజయం, బిజెపి ఘనవిజయం స్పష్టంగా కనిపించనుండడంతో తెలంగాణలో బిజెపి అధికారాన్ని ఎవరు ఎన్ని కుట్రలు చేసిన ఆపలేరన్న నమ్మకం ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండడం ప్రజలకు అవసరం, కష్టించి పని చేయడం బిజెపికి ముఖ్యం. ఇతర జాతీయభావ, ధార్మిక, దేశభక్త స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ మూడు పార్టీల కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు హిందువులు, తెలంగాణ, భారతదేశం సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుంది.