నిజాయితీ, నిబద్ధత, సుపరిపాలనల మేలి కలయిక అటల్ జీ
భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి వ్యక్తిగత జీవితంలో నిజాయితీ, ప్రవర్తనలో హుందాతనం, స్వభావంలో నిరాడంబరత, రాజకీయాల్లో స్వచ్ఛత, పరిపాలనలో సుపరిపాలన, దేశం పట్ల అచంచలమైన అంకితభావాల సంగమం. లక్షలాది మందికి ప్రేరణగా, సున్నితమైన రచయితగా, గొప్ప దేశభక్తుడిగా, ‘అజాతశత్రువు’ (శత్రువులు లేనివాడు)గా పేరొందిన ఈ అసాధారణ నాయకుడి శతజయంతి ఉత్సవాలను జరుపుకుంటున్న తరుణంలో ఆయన ప్రభావం ప్రతి భారతీయ పౌరుడి జీవితాల్లో గాఢంగా ప్రతిధ్వనిస్తూనే ఉంది. దార్శనిక ప్రధానిగా ఆర్థికాభివృద్ధి, సామాజిక సంక్షేమానికి ఆయన చేసిన కృషి 21వ శతాబ్దపు భారతదేశానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, సమర్థమైన, సుసంపన్నమైన భారతాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నారు.
అటల్ జీ వారసత్వం, సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. క్షేత్రస్థాయి రాజకీయాల్లో నిమగ్నమై ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఆయన నిజంగా భారతదేశానికి ఆణిముత్యం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత దేశ అభివృద్ధి కోసం తన దార్శనికతను సాకారం చేయడానికి చురుగ్గా ముందుకు సాగుతున్నారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి భారత రాజకీయాల్లో విలువలను, ఆదర్శాలను పునరుద్ధరించిన దార్శనిక రాజనీతిజ్ఞుడిగా గుర్తింపు పొందారు. తన మద్దతుదారుల్లో అంకితభావాన్ని పెంపొందించినా, రాజకీయ ప్రత్యర్థుల మన్ననలు పొందినా ఆయన తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన ప్రజా జీవితం హుందాగా, సంస్కారవంతంగా, మచ్చలేనిదిగా ఉంది. అందుకే ప్రత్యర్థులు సైతం ఆయనను ఆరాధించారు. జాతీయ ప్రయోజనాలే తన ప్రథమ ప్రాధాన్యంగా ఆయన వ్యవహరించారు. పార్లమెంటులో ప్రసంగిస్తున్నప్పుడు ప్రత్యర్థులు సైతం ఆయన తార్కిక, అనర్గళ ప్రసంగాలకు ముగ్ధులై నిశ్శబ్దంగా వినేవారు. కవిగా సామాజిక దురాచారాలను విమర్శించడానికి, యువతలో దేశభక్తిని ప్రేరే పించడానికి తన కవిత్వాన్ని ఉపయోగించారు.
ఆరెస్సెస్ ప్రచారక్ నుంచి భారత ప్రధాని స్థాయికి ఎదిగిన ఈ మహానేత 1924 డిసెంబర్ 25న గ్వాలియర్‌లో జన్మించారు. ఆయన గ్వాలియర్‌లోని విక్టోరియా కళాశాల (ప్రస్తుతం లక్ష్మీబాయి కళాశాల) నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కాన్పూర్‌లోని డి.ఎ.వి కళాశాల నుండి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందాడు. తన అసాధారణమైన వాక్చాతుర్యం, కవితా ప్రతిభను తండ్రి నుంచి వారసత్వంగా పొందారు. విద్యార్థి దశలోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో కార్యకర్తగా, ఆ తర్వాత పాత్రికేయుడిగా పనిచేశారు. ‘రాష్ట్రధర్మం’, ‘పాంచజన్య’, ‘స్వదేశ్’, ‘వీర్ అర్జున్’ వంటి జాతీయవాద వార్తాపత్రికలు, మ్యాగజైన్లకు సంపాదకత్వం వహించారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక సభ్యుడు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వంటి జాతీయవాద నాయకులతో కలిసి పనిచేశారు. ఆయన సంస్థాగత నైపుణ్యాలు, మేధో నైపుణ్యం, వాక్చాతుర్యం ఆయనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోడానికి సహాయపడ్డాయి. 1968 నుంచి 1973 వరకు జనసంఘ్ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 1957లో ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి జనసంఘ్ అభ్యర్థిగా విజయం సాధించి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. 1957 నుంచి 1977 వరకు జనసంఘ్ పార్లమెంటరీ పార్టీకి నేతృత్వం వహించారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సైతం వాజ్‌పేయి శక్తివంతమైన ప్రసంగాలకు ముగ్ధులయ్యారు.
అటల్ జీ అందరితో కలుపుగోలుగా, స్నేహపూర్వకంగా ఉండేవారు. 1975లో ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించారు. 1977లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడినప్పుడు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి అయ్యారు. ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయ నేతగా ఆయన ఘనత సాధించారు. 1980లో జనతా పార్టీ చీలిపోయిన తరువాత, అటల్జీ, తన సహచరులతో కలిసి భారతీయ జనతా పార్టీని (బిజెపి) స్థాపించారు. దాని మొదటి జాతీయ అధ్యక్షుడు అయ్యారు. 1996లో లోక్‌సభలో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రధాని అయ్యారు. అయితే ఈ ప్రభుత్వం కేవలం 13 రోజులు మాత్రమే కొనసాగింది. ఈ ఎదురుదెబ్బ తగిలినా ఆయన పార్టీ బలోపేతానికి కట్టుబడి ఉన్నారు. 1998లో బిజెపి మరోసారి అతిపెద్ద పార్టీగా అవతరించగా, అటల్ జీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 13 నెలల పాటు కొనసాగిన ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. ఈ స్వల్పకాలంలోనే అణుపరీక్షలు నిర్వహించి భారత్ బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించినప్పటికీ అటల్ జీ ఈ సవాళ్లను అసాధారణ ధైర్యసాహసాలతో, దృఢ సంకల్పంతో ఎదుర్కొన్నారు. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం తర్వాత జరిగిన 1999 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి మరోసారి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటల్ బిహారీ వాజ్‌పేయి జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) కింద 13 పార్టీలను ఏకం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఆయన నాయకత్వం కారణంగా బిజెపి మొదటిసారి పూర్తిగా ఐదేళ్ళ పాటు అధికారంలో కొనసాగింది. ఈ పాలనలో దేశం అపూర్వమైన ప్రగతిని సాధించింది. దేశంలోని నాలుగు మూలలైన దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబైలను హైవేల ద్వారా కలుపుతూ అటల్ జీ ప్రతిష్టాత్మక స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టును ప్రారంభించారు. ఆయన నాయకత్వంలో ఆర్థిక సంస్కరణల్లో దేశం కొత్త శిఖరాలకు చేరుకుంది. అటల్ జీని దేశవిదేశాల్లో అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలతో సత్కరించారు. 2015లో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనకు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నను ప్రదానం చేశారు.
తరుణ్ చుఘ్,
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి