నారీశక్తికి నిలువెత్తు రూపం
మన భారతదేశ చరిత్రలో ఎంతో మంది వీర నారీమణులు ఉన్నారు. భారతదేశ సాంప్రదాయానికి, కళలకు, మహిళా సాధికారతకు, యుద్ధ నీతికి, సుపరిపాలనకు, హిందూ ధర్మానికీ.. అన్నింటినీ ఒంటి చేత్తో ఏకకాలంలో నిర్వహించి ఎంతో మందికి ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాత లోకమాత అహల్యాబాయి హోల్కర్. 1725లో ఔరంగాబాద్ జిల్లాలోని చౌండే అనే గ్రామంలో మంకోజే షిండే దంపతులకు అహల్యాబాయి జన్మించారు. తన 10వ ఏట మరాఠీ సర్దార్లో ప్రముఖులైన మల్హర్ రావు హోల్కర్ ఏకైక కుమారుడు ఖండేరావు హోల్కర్‌తో అహల్యాబాయి వివాహం జరిగింది. ఈ సమయంలో ఇండోర్ పాలకుడిగా మరాఠా సర్దార్లో మల్హర్ రావు వెలుగొందుతున్నాడు. 1759లో కుంభీర్ కోట ముట్టడి సమయంలో భర్త ఖండేరావు హోల్కర్ మృతి చెందారు. ఆ రోజుల్లో సతీ సహగమనానికి పూనుకున్న అహల్యాబాయిని మల్హర్ రావు అడ్డుకొన్నారు. ఆమెకు యుద్ధవిద్యలు, రాజనీతి, పరిపాలన, తదితర అంశాలపై తర్ఫీదు నిచ్చారు. 1766లో మల్హర్ రావు మరణిచారు. దీంతో 1767లో అహల్యాబాయి ఇండోర్ పాలనా బాధ్యతలు తీసుకున్నారు.
ఒక స్త్రీ రాజ్యాన్ని పరిపాలించటంపై అభ్యంతరాలు వ్యక్తమైనా 1767 నుండి 1795 వరకు ఇండోర్ రాజ్యాన్ని అహల్యాబాయి విజయవంతంగా పరిపాలించి ప్రజల ఆదరణ చూరగొన్నారు. పరదా పద్ధతిని పాటించకుండా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, సామంత రాజుల గౌరవాన్ని చూరగొని ఇండోర్ రాజ్యాన్ని విస్తరింపజేసారు. పాలనలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. మహిళా సాధికారత దిశగా మహిళలను విశేషంగా ప్రోత్సహించారు. మహిళలకు యుద్ధ విద్యలు నేర్పించి ప్రత్యేక మహిళాసేన ఏర్పాటు చేశారు. వితంతువులకు భర్త ఆస్తి సంక్రమించేలా చట్టం తీసుకొచ్చారు. వ్యవసాయాభివృద్ధికి తోడ్పడ్డారు. కాలువలు, చెరువులు తవ్వించి వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచారు. పరిపాలనా సమయంలో అహల్యాబాయి దాన ధర్మాలకు, సేవకు ప్రతీకగా నిలిచారు. హిందూ ధర్మ పరిరక్షణకు విశేషంగా కృషి చేసారు. భారతదేశం అంతటా శివాలయాలు నిర్మించారు. మహమ్మదీయ దాడుల్లో శిథిలమైన అనేక ఆలయాలను పునర్మించారు. కాశీ, ద్వారక, మధుర, ఉజ్జయిని, రామేశ్వరం, అయోధ్య, హరిద్యార్ లాంటి ఎన్నో పుణ్యక్షేత్రాల్లోని గుళ్ళను పునరుద్ధరించి హిందూ ధర్మం కోసం కృషి చేసారు.
ఇవేకాకుండా, మహేశ్వర్‌లోని నేత కార్మికులను ప్రోత్సహించి మహేశ్వరం చరలు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే ఈ చీరలు యావత్ భారతదేశంలో ప్రసిద్ధి. భారత ప్రభత్వం ఆమె పేరిట స్త్రీ శక్తి పురస్కారాలను ఏర్పాటు చేశారు. ఇండోర్‌లోని విమానాశ్రయానికి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయంగా నామకరణం చేసారు. అహల్యాబాయి జీవితాన్ని చిలకమర్తి లక్ష్మి నరసింహం నవలగా రాయగా, 1958 నాటి పదవ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా ఆమె జీవిత విశేషాలు పొందుపరిచారు. ప్రతి సంవత్సరం మార్చ్ 8న భారత ప్రభుత్వం మహిళాధివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా మహిళా సాధికారత కోసం కృషి చేసిన మహిళలకు, సంస్థలకు నారీ శక్తి పురస్కారం అందజేస్తారు.
157 తీర్థాలలో, పుణ్యక్షేత్రాలలో అహల్యాబాయి నిర్మించిన దేవాలయాల వసతి గృహాలు ఉన్నాయి. అహల్యాబాయి నిర్మించిన దేవాలయాలు, వసతి గృహాలు, ఇతర నిర్మాణాలు ఇంకా దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అహల్యాబాయి నర్మదా నదిలో స్నానం చేసిన తర్వాత, శివలింగానికి అభిషేకం చేసి, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచేట్టు పరమేశ్వరుడిని కోరుకునేవారు. అందుకే ఆమె లోకమాత అయ్యారు.
గీతామూర్తి,
బిజెపి రాష్ట్ర నాయకురాలు

