రాష్ట్రపతికి జమిలి ఎన్నికలపై నివేదిక
భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటైన జమిలి ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ మార్చ్ 14న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదికను సమర్పించింది. 2 సెప్టెంబర్ 2023న ఏర్పాటైన ఈ కమిటీ 191 రోజుల పాటు భాగస్వామ్యపక్షాలు, నిపుణులు, పరిశోధకులతో విస్తృతమైన సంప్రదింపుల జరిపి 18,626 పేజీల నివేదికను రూపొందించింది. కేంద్ర హోం మంత్రి, సహకార శాఖ మంత్రి అమిత్ షా, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్. సింగ్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాష్ సి. కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి ఈ కమిటీలోని ఇతర సభ్యులు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రత్యేక ఆహ్వానితుడిగా, డాక్టర్ నితేన్ చంద్ర ఈ ఉన్నత స్థాయి కమిటీ కార్యదర్శిగా ఉన్నారు.
ఈ ఉన్నత స్థాయి కమిటీతో పలు రాజకీయ పార్టీలు విస్తృతంగా చర్చించాయి. ఈ కమిటీకి 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు, సూచనలు సమర్పించాయి. ఇందులో 32 పార్టీలు జమిలి ఎన్నికలకు మద్దతు ఇచ్చాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని వార్తాపత్రికలలో ప్రచురించిన పబ్లిక్ నోటీసుకు భారతదేశం నలుమూలల నుండి 21,558 పౌరులు స్పందించారు. 80 శాతం మంది జమిలి ఎన్నికలకు మద్దతు తెలిపారు. ముఖాముఖి చర్చల కోసం నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, పన్నెండు మంది ప్రధాన హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులు, నలుగురు మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు, ఎనిమిది మంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు, భారత లా కమిషన్ ఛైర్మన్ వంటి న్యాయ నిపుణులను ఈ కమిటీ వ్యక్తిగతంగా ఆహ్వానించింది. భారత ఎన్నికల సంఘం అభిప్రాయాలను కూడా తీసుకుంది.
సీఐఐ, ఫిక్కీ, అసోచామ్ వంటి వాణిజ్య సంఘాలను, ప్రముఖ ఆర్థికవేత్తలను కూడా సంప్రదించారు. వేరువేరుగా ఎన్నికల నిర్వహణ ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తుందని, ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందంటూ జమిలి ఎన్నికలను వారు సమర్థించారు. అడపాదడపా ఎన్నికలు సామాజిక సామరస్యానికి భంగం కలిగించడంతో పాటు ఆర్థిక వృద్ధి, ప్రభుత్వ ఖర్చులు, విద్య, ఇతర అంశాలపై ప్రతికూల ప్రభావాలు ఉన్నాయని ఈ సంస్థలు కమిటీకి వివరించాయి. అన్ని సూచనలు, దృక్కోణాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, జమిలి ఎన్నికలకు దారితీసే రెండు దశల విధానాన్ని కమిటీ సిఫార్సు చేస్తుంది. తొలి దశగా పార్లమెంటుకు, రాష్ట్ర శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్నాయి. రెండవ దశలో మున్సిపాలిటీలు, పంచాయతీల ఎన్నికలను పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సమకాలీకరిస్తారు. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన వంద రోజుల్లో మున్సిపాలిటీలు, పంచాయతీల ఎన్నికలను నిర్వహిస్తారు. ప్రభుత్వంలోని మూడు అంచెల ఎన్నికలలో ఉపయోగించడానికి ఒకే ఓటర్ల జాబితా, ఎలక్టోరల్ ఫోటో గుర్తింపు కార్డులు (ఈపీఐసీ) ఉండాలని కమిటీ సిఫార్సు చేసింది.
జమిలి ఎన్నికల కోసం భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా కొన్ని రాజ్యాంగ సవరణలను సిఫార్సు చేసింది. కమిటీ సిఫార్సులు ఓటర్లలో పారదర్శకత, చేరిక, సౌలభ్యం, విశ్వాసాన్ని గణనీయంగా పెంపొందిస్తాయని నిర్ధారించింది. జమిలి ఎన్నికలు సామాజిక ఐక్యతను ప్రోత్సహిస్తుందని, మన ప్రజాస్వామ్య పునాదులను మరింత బలోపేతం చేస్తుందని, భారతదేశం ఆకాంక్షలను సాకారం చేస్తుందని ఈ కమిటీ తన నివేదికలో పేర్కొంది.