తక్షణమే రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి
ఫీజు బకాయిలన్నీ వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని ఒకసారి, 12 వాయిదాల్లో చెల్లిస్తామని మాట ఇచ్చిన సంగతి మర్చిపోయారా? అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిలదీశారు. ఈ విద్యా సంవత్సరం నుండే విద్యార్థులకు చెల్లించే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఆన్ టైంలోనే (నిర్ణీత వ్యవధిలో) చెల్లిస్తామని ఇచ్చిన హామీని విస్మరించారా? అని ప్రశ్నించారు. పవిత్రమైన శాసనసభ సాక్షిగా ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకపోతే ప్రజల్లో ముఖ్యమంత్రిపై నమ్మకం సన్నగిల్లుతుందన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడం వల్ల ఎదురవుతున్న సమస్యలను ఎత్తిచూపుతూ, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ఏమైందని ఈ లేఖలో ప్రశ్నించారు. ‘‘ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యపూరిత ధోరణి లక్షలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్, నర్సింగ్ సహా వేలాది కాలేజీలు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సకాలంలో చెల్లించకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గత నాలుగేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకపోవడంతో దాదాపు 8 వేల కోట్ల రూపాయలు బకాయిలుగా పేరుకుపోయాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. అధ్యాపకులకు, సిబ్బందికి జీతభత్యాలు, మెయింటనెన్స్ ఛార్జీలు కూడా చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. అప్పుల పాలయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రాక, చేసిన అప్పులు తీర్చలేక ఇప్పటికే అనేక కళాశాలలు మూతపడ్డాయి.’’ అని లేఖలో పేర్కొన్నారు.
అధ్యాపకులకు, సిబ్బందికి జీతభత్యాలు, మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా చెల్లించలేక అవస్థలు పడుతున్నా పట్టించుకోరా? అని నిలదీశారు. ఇప్పటికే అనేక డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలు మూతపడ్డాయని, ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతో ఫీజులు చెల్లించనిదే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. విద్యార్థులకు, కాలేజీ యాజమాన్యాల మధ్య గొడవలై పోలీస్ స్టేషన్ల దాకా కేసులు వెళుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం లక్షలాది మంది విద్యార్థులను, కాలేజీ యాజమాన్యాలను, అందులో పని చేస్తున్న సిబ్బందిని తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేస్తున్నాయని తెలిపారు. డిగ్రీ కళాశాలలకు నాలుగేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో కాలేజీలు నడపలేక చేతులెత్తేశాయని, ఒక్క శాతవాహన వర్శిటీ పరిధిలోనే పదుల సంఖ్యలో డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు, యాజమాన్యాల మనుగడను దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లింపు విషయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని, ఇకపై క్రమం తప్పకుండా ఏటా నిర్ణీత వ్యవధిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఫీజులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని బండి సంజయ్ కుమార్ కోరారు.