Oke Desam Oke Ennika

‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ మోదీతోనే సాధ్యం

One Nation One Electionదేశంలో ప్రధాని మోదీ నాయకత్వంలోనే మార్పు సాధ్యమవుతుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ కూడా మోదీతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. ‘వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌’ దేశవ్యాప్త అవగాహన కార్యక్రమంలో భాగంగా మే 18న హైదరాబాద్‌ సోమాజిగూడలో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు అధ్యక్షతన ‘ప్రొఫెషనల్స్ ఫర్ వన్ నేషన్, వన్ ఎలక్షన్’ సదస్సు జరిగింది. కిషన్‌రెడ్డితో పాటు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ. నర్సింహారెడ్డి, మేజర్‌ జనరల్‌ శ్రీనివాస్‌రావు, ‘వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌’ కార్యక్రమ కన్వీనర్‌ అనిల్‌ ఆంటోని, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పలువురు న్యాయవాదులు, వైద్యులు, ఐటీ నిపుణులు, బిజెపి నేతలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘స్వాతంత్రం సిద్ధించి 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా ఇంకా బ్రిటిష్ విధానాల్ని అవలంబిస్తున్నాం. దేశంలోని వర్తమాన రాజకీయ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్ని మార్చుకోవాలని మోదీ ఎప్పుడూ చెబుతుంటారు. దానికి అనుగుణంగా కొన్ని మార్చుకున్నాం. వాటిని మార్చే క్రమంలో కొందరు అడ్డంపడే ప్రయత్నం చేయడం దురదృష్టకరం. అందులో భాగంగానే ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’కు సంబంధించి ప్రజల్లో చైతన్యం నింపాలి. ప్రజల మధ్యకు వెళ్లి ప్రజలను చైతన్యం చేయడానికి ప్రయత్నం చేయాలని ప్రధాని చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీల మీద, మేధావుల మీద, విశ్లేషకుల మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారాలి. దేశంలో ఎక్కడ ఎలక్షన్ జరిగిన దేశమంతా చర్చ జరుగుతూ ఉంటుంది. ఎన్నో పని గంటలు వృథా అవుతున్నాయి. ఒకేసారి ఎన్నికలు జరిగితే ఇలాంటి పరిస్థితి ఉండదు. 

జీఎస్టీ కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు మోదీ పట్టుదలతోనే అది సాధ్యమైంది. ట్రిపుల్ తలాక్ విషయంలో కూడా అదే నిజమైంది. సీఏఏ, భారతీయ న్యాయ సంహితను తీసుకొచ్చింది మోదీ ప్రభుత్వమే. ఉగ్రవాదాన్ని మోదీ ప్రభుత్వం కూకటి వేళ్ళతో పెకిలించే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ చంపే వాళ్ళు, మనం చచ్చే వాళ్ళుగా ఉండిపోయాం, కానీ నేడు పరిస్థితి మారింది. ఉగ్రవాద చర్యలకు పాల్పడితే పాకిస్తాన్ గడ్డమీదికి వెళ్లి వారిని తుదముట్టించే ప్రయత్నాలు చేసాం. పహల్గాం దాడి తర్వాత క్యాండిల్ లైట్లతో ఎర్ర గులాబీలతో సంతాపం ప్రకటించలేదు, వారి స్థావరాల్ని పేల్చేశాం. ఇది దేశం గురించి ఆలోచించే వారికే సాధ్యమవుతుంది. అధికారం కోసం, ఓట్ల కోసం, పదవుల కోసం ఆలోచించే వారికి సాధ్యం కాదు.

దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావాల్సిందే. ఎక్కడో ఒకచోట ఎప్పుడూ ఎలక్షన్స్ ఉండడం అభివృద్ధికి అడ్డంకిగా మారింది. దేశ అభివృద్ధి కోసం భవిష్యత్తు తరాల నిర్మాణం కోసం సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. భవిష్య తరాలకు మంచి దేశాన్ని అందించాలంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అవసరం. మేధావులు ఆలోచించాలి, ప్రజలు సహకరించాలి.’’ అని అన్నారు. సునీల్‌ బన్సల్‌ మాట్లాడుతూ వికసిత భారత్‌ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ‘వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌’ అమల్లోకి రావాలన్నారు. అంతకుముందు కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వర్చువల్‌గా ప్రసంగించారు.