Akala Varshalu

అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నా పట్టించుకోని ప్రభుత్వం

మే నెలలో ఎండలు ఎదురు కావాల్సిన సమయంలో అకాల వర్షాలు, వడగండ్ల వానలు తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలను పౌరసరఫరా శాఖ అధికారులు పట్టించుకోకపోగా, ధాన్యాన్ని కాపాడేందుకు కనీస చర్యలు చేపట్టలేదు. వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోయి నష్టం వస్తుందని తెలిసినా నింపాదిగా ధాన్యం కొనుగోళ్లు చేశారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. కనీసం ధాన్యంపై కప్పేందుకు టార్పాలిన్లు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కొనుగోలు కేంద్రాలు చెరువులను తలపిస్తున్నాయి. ధాన్యం వరదలో కొట్టుకుపోతుంటే వాటిని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్కారు నిర్లక్ష్యం రైతుల కొంపముంచుతున్నది. ఆరుగాలం కష్టం నీళ్లపాలవుతున్నది. 

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం తడిసి ముద్దవుతుంది. కొన్ని చోట్ల రైతుల కండ్ల ముందే వరదలో కొట్టుకుపోతున్నది. దీంతో రైతాంగం లబోదిబోమంటున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా రైతన్న కన్నీటి వేదనే కనిపిస్తున్నది. సర్కారు నిర్లక్ష్యానికి ధాన్యం కొనుగోళ్ల లెక్కలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. లక్ష్యం కొండంత ఉండగా కొన్నది మాత్రం కొసరంత ఉన్నది. ఈ యాసంగిలో 60.14 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, 130 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్వయంగా వెల్లడించారు. అయితే మే 19 నాటికి కేవలం 55.97 లక్షల టన్నులు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంటే మొత్తం ధాన్యంలో ఇది సగం మాత్రమే. మార్చి 20 నుంచి కొనుగోళ్లు ప్రారంభించినట్టు చెప్పిన పౌరసరఫరా శాఖ అధికారులు రెండు నెలలు గడుస్తున్నా సగం కూడా కొనలేదు. అకాల వర్షాల అంచనా నేపథ్యంలో ధాన్యం కొనుగోలు చేయండంటూ రైతులు కోరినా అధికారులు కాంటా పెట్టలేదు. నెలల పాటు కొనుగోలు కేంద్రాల్లోనే మూలిగిన ధాన్యం చివరికి వర్షార్పణం అవుతున్నది. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు, లారీలు, వేయింగ్‌ మిషన్లు, తేమ చూసేందుకు మాయిశ్చర్‌ మీటర్లు అందుబాటులో లేకపోవడం కూడా కొనుగోళ్ల ఆలస్యానికి కారణంగా తెలుస్తున్నది. మరోవైపు కొర్రీలు పెడుతూ ధాన్యం కొనకపోవడంతో రైతాంగం కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాయాల్సి వచ్చింది. వర్షాలకు వడ్లు తడిసినా ప్రభుత్వం కొనుగోలు చేయకుండా చోద్యం చూస్తోంది. రాష్ట్ర మంత్రులు, అధికారులు కొనుగోలు కేంద్రాలను సందర్శించిన దాఖలాల్లేవు.

సన్న ధాన్యానికి రూ.500 బోనస్‌ ప్రకటించిన ప్రభుత్వం చెల్లింపులో మాత్రం జాప్యం చేస్తున్నది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 2.87 లక్షల మంది రైతుల నుంచి 18.47 లక్షల టన్నుల సన్న ధాన్యం సేకరించింది. ఇందుకు గానూ రైతులకు బోనస్‌ కింద రూ. 923.40 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు రైతులకు ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం గమనార్హం. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో పంటల బీమా పథకాన్ని ప్రవేశ పెడతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పిన మాట నేటికీ అమలు కావడం లేదు. నిరుడితో పాటు ఈ సారి జరిగిన పంట నష్టానికి సంబంధించి పరిహారం చెల్లించడం లేదు. 48 గంటల్లో జొన్న డబ్బు చెల్లిస్తామని మంత్రి ఉత్తమ్‌ చెప్పి 48 రోజులు దాటినా చెల్లించడం లేదు. ఇప్పటికే రైతు భరోసా పథకాన్ని ఎగ్గొడుతున్న ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని కూడా సక్రమంగా అమలు పరచడం లేదు. రైతు బీమాకు ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని సక్రమంగా చెల్లించకపోవడంతో మృతి చెందిన రైతులకు బీమా డబ్బులు అందడం లేదు. ఈ విధంగా వందలాది రైతు కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. అందాల పోటీల మీద, మద్యం అమ్మకాల పట్ల చూపుతున్న ఆసక్తిని ఈ ప్రభుత్వం రైతుల పట్ల చూపడం లేదు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ గాలికి వదిలేశారు.

కృష్ణ చైతన్య