కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు మొక్కుబడికేనా!

న్నికల సమయంలో నాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, ఆయన ప్రభుత్వంపై లక్షల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు చేసి, అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటానని చెప్పుకుంటూ వచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి చేపట్టి 17 నెలలైనా ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మే నెలాఖరులో పదవీకాలం ముగియనున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన విచారణకు సంబంధించి మే చివరి వారంలో నివేదిక ఇవ్వనున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, విచారణ సందర్భంగా దాదాపు అందరూ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే చేశామని చెప్పడంతో, ఆయనను విచారించకుండా నివేదిక ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి. దాంతో హడావుడిగా కమిషన్ పదవీకాలాన్ని మరో మూడు నెలలు పెంచడం, ఆ మరుసటి రోజే విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్‌తో పాటు అప్పట్లో ఆయన ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన హరీష్ రావు, ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టిన ఈటల రాజేందర్‌లకు నోటీసులు జారీ చేశారు.

ఇప్పటికే కేసీఆర్ హయాంలో విద్యుత్ ప్రోజెక్టుల అక్రమాలపై విచారణ జరిపిన జస్టిస్ లోకుర్ కమిషన్ నివేదిక సమర్పించి ఏడు నెలలు అవుతున్నా ఎటువంటి చర్యలు చేపట్టని ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నివేదికపై స్పందిస్తుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. అసలు ఈ విచారణకు కేసీఆర్ హాజరవుతారా? అనే అనుమానాలూ కలుగుతున్నాయి. జూన్ 5న కేసీఆర్ విచారణకు రావాలని కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో ఆయన వ్యక్తిగతంగా హాజరవుతారా? లేదా? అనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో విచారణకు రావాలని విద్యుత్ కమిషన్ నోటీసులు ఇవ్వగా కేసీఆర్ హాజరుకాలేదు. తాను విచారణకు హాజరు కాలేనని మొదట లేఖ రాసిన కేసీఆర్, తర్వాత కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో చుక్కెదురవడంతో కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎల్. నర్సింహా రెడ్డి విచారణ దశలో ప్రెస్‌మీట్ పెట్టడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కమిషన్ జడ్జిని మార్చాలని సుప్రీంకోర్టు సూచించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను మార్చక తప్పలేదు. ఆయన స్థానంలో జస్టిస్ మదన్ బీ లోకూర్‌ను నియమించింది. 

జస్టిస్ ఎల్. నర్సింహా రెడ్డి కమిషన్ చైర్మన్‌గా ఉన్న సమయంలో కేసీఆర్ రాసిన లేఖనే ఆయన అభిప్రాయంగా పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ మదన్ బీ లోకూర్ కమిషన్ ఆ మేరకు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. అయితే తాజాగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపై కూడా కేసీఆర్ అదే రకంగా లేఖ రాసి సరిపెడుతారా? లేక వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇస్తారా? అనేది వేచి చూడాలి. జస్టిస్ లోకూర్ కమిషన్ తన నివేదికను సమర్పించి ఏడు నెలలు కావస్తున్నా అసలు ఈ నివేదిక ఒకటి ఉంది అనే విషయాన్ని కూడా మర్చిపోయినట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ నివేదిక ప్రభుత్వం చేతికి చేరగానే దీనిపై కేబినెట్‌లో చర్చించి, అసెంబ్లీలో పెట్టి కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు మీడియాకు లీకులు ఇచ్చారు. కొంత మంది మంత్రులు అయితే దీనిపై బహిరంగంగానే ప్రకటనలు చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ నివేదిక బహిర్గతం కాలేదు. దీనిపై ఎలాంటి చర్యలు లేకపోవడంతోనే సర్కారు తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన గోల్‌మాల్ వ్యవహారాలు తేల్చేందుకు ఈ కమిషన్ ఏర్పాటు చేశారు. ఇవే అంశాలపై ప్రతిపక్షంలో ఉండగా రేవంత్ రెడ్డి ఎన్నో సార్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల మేర నష్టానికి కారణమయ్యారు అంటూ అప్పట్లో కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ విమర్శలను మరచిపోయినట్లు వ్యవహరిస్తున్నారు. కాళేశ్వరం విచారణ పరిధి నుంచి కూడా కీలక అంశాలను తప్పించారు అనే విమర్శలు ఉన్నాయి. కొంతమంది బడా బడా కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని అధికార వర్గాలు కూడా చెప్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ డొల్లతనం మేడిగడ్డ , అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనే బయటపడింది. పైగా, విచారణను ఆయా బ్యారేజీలకు పరిమితం చేశారు.

ఈ ప్రాజెక్టులో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి, అందులో కీలక పాత్ర ఉందని భావిస్తున్న కాంట్రాక్టర్‌పై మాత్రం ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం లేదు. పైగా, ఆయనకే మరికొన్ని కాంట్రాక్టులు ఇస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆ కాంట్రాక్టర్‌కు ఎటువంటి ప్రాధాన్యత లభించిందో, ఇప్పుడు కూడా అదేవిధంగా లభిస్తుంది. పీసీ ఘోష్ కమిషన్ ఆగస్టులో నివేదికను సమర్పించే అవకాశం ఉంది. ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలను కమిషన్ పరిశీలన నుండి తప్పించడంతో నివేదిక సాంకేతిక అంశాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో నివేదిక ఏ విధంగా ఉంటుంది? ప్రభుత్వం ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తుంది? అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి.

ప్రవీణ్