atal

వాజ్‌పేయీ ఆదర్శాలను అందిపుచ్చుకోవాలి

సుపరిపాలనకు నిజమైన భాష్యం చెప్పిన పాలనాదక్షత భారత అభివృద్ధి గమనంలో నవశకానికి నాంది పలికిన మాజీ ప్రధాని వాజ్‌పేయీ సొంతం! కర్తవ్య నిర్వహణలో బాధ్యత, మాటలతో కట్టి పడేసే చతురత, దేశ ప్రయోజనాల విషయంలో దృఢ సంకల్పం… వాజ్‌పేయీ ప్రత్యేకతలు! వ్యక్తిత్వం, వక్తృత్వం, కర్తృత్వం, మితృత్వంతో కూడిన అటల్‌ బిహారీ వాజ్‌పేయీ నేతృత్వాన్ని ఈ శతాబ్దమే కాదు, సహస్రాబ్దాలు గడిచినా మరవలేం. ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టినప్పటి నుంచి దేశవ్యాప్తంగా యువతను కలవడం, వారి ఆలోచనలను తెలుసుకోవడం, నా ఆలోచనలను పంచుకోవడం అలవాటుగా మారింది. కొన్ని రోజుల క్రితం ఓ యువకుడు అడిగిన ప్రశ్న నన్ను ఆశ్చర్యానికీ, ఆందోళనకూ గురిచేసింది. ‘రాజకీయాల్లో వాజ్‌పేయీలాంటి విలక్షణ వ్యక్తిత్వం ఉన్న నాయకులు ఉన్నారంటే, కేవలం ఒక్క ఓటు తేడాతో అధికారాన్ని వదులుకున్నారంటే నమ్మలేకపోతున్నాను. ఇది నిజమేనా?’ అంటూ ఆ యువకుడు అడిగిన ప్రశ్న నన్ను ఆలోచనలో పడేసింది. ఈనాటి రాజకీయాలను, నాయకులను చూసి బహుశా ఆ యువకుడు ఆ ప్రశ్న అడిగి ఉండొచ్చు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకూడదంటే, ఈతరం రాజకీయ నాయకులు వాజ్‌పేయీ జీవితాన్ని అధ్యయనం చేసి, ఆయన ఆదర్శాలను అందిపుచ్చుకోవాలి.

మధ్యతరగతి ఉపాధ్యాయుడి కుమారుడి స్థాయి నుంచి దేశం గర్వించే ప్రధానమంత్రిగా ఎదిగారు వాజ్‌పేయీ. రాజకీయ జీవితంలో ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ, రాజనీతికి నిలువుటద్దంలా నిలిచారు. క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో భాస్వరమై నినదించిన వాజ్‌పేయీ స్వరం, తొలి ప్రధాని నెహ్రూ ప్రశంసలు పొందింది. ఆ తర్వాత ఎమర్జెన్సీ గ్రహణంలోనూ దేదీప్యమానంగా ప్రకాశించింది. జనసంఘ్‌ సభ్యుడిగా క్రమశిక్షణ, చిత్తశుద్ధి కలిగిన ఆయన శ్యామాప్రసాద్‌ ముఖర్జీ దృష్టిలో పడి, కార్యదర్శిగా సేవలు అందించారు. ఆ తరవాత ఒక్కో మెట్టు ఎక్కుతూ సంఘ్‌లో కీలక నేత అయ్యారు. ‘ఓ దేవుడా!/ సామాన్యుడి స్వరం వినలేనంత స్థాయికి నన్ను ఎదగనివ్వకు/ ఆ స్థితికి నన్ను దిగజారనివ్వకు/ అలాంటి పరిస్థితి నుంచి నన్నెప్పుడూ విముక్తుణ్ని చేయి’ అన్న స్వీయకవితా పంక్తుల్ని ఆచరణలో పెట్టి, ప్రజాస్వామ్యానికి నిజమైన నిర్వచనం చెప్పారు. అందుకే ప్రజల మనసుల్లోనే కాదు, ప్రత్యర్థుల మాటల్లోనూ అజాతశత్రువుగా నిలిచారు. రాజకీయాల్లో నీతినిబద్ధతలతో, నియమ నిష్ఠలతో రాణించవచ్చని వాజ్‌పేయీ ఆచరించి చూపారు. నేనూ అదే స్ఫూర్తితో, అదే మార్గంలో, అవే కట్టుబాట్లతో ప్రజాజీవితంలో ముందుకు సాగాను. ఏబీవీపీలో ఉన్నప్పుడు వాజ్‌పేయీ ఉపన్యాసాలు నన్నెంతగానో ప్రేరేపించాయి. ఆయనను తొలిసారిగా నెల్లూరులో కలిశాను. ఆయన రాక గురించి గుర్రపు బండిలో తిరుగుతూ ప్రచారం చేశాను. అలాంటి ఓ యువకుణ్ని, తమ పార్టీ అధ్యక్షుడిగా మలచి, తన పక్కనే కూర్చోబెట్టుకోగల వ్యక్తిత్వం అటల్‌జీ సొంతం.

భారత రాజకీయాల్లో ప్రత్యామ్నాయ పార్టీని, సిద్ధాంతాలను, విధానాలను పరిచయం చేశారు. ప్రజాస్వామ్యం, విలువల ఆధారిత రాజకీయాలను బలోపేతం చేయడానికి కృషి చేశారు. ఆయన దూరదృష్టి ఫలితంగా దేశం వికసిత్‌ భారత్‌ దిశగా ముందడుగు వేసేందుకు పటిష్ఠమైన పునాది ఏర్పడింది. రాజకీయాలకన్నా ప్రజలకే విలువ ఇచ్చారు. అందుకే ప్రతిపక్షంలో ఉండి కూడా, నాటి ప్రధాని పీవీ నరసింహారావు అడిగిన వెంటనే, ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించేందుకు అంగీకరించి, పాక్‌ దుర్నీతిని ఎండగట్టారు. వాజ్‌పేయీ దేశం కోసం ఓ ప్రధానిగా కాకుండా, ఓ సంస్కర్తలా పనిచేశారనడంలో సందేహం లేదు. జవాబుదారీతనం, చట్టబద్ధ పాలన, సమర్థత, అందర్నీ కలుపుకొనిపోవడం, ప్రతిస్పందించగలగడం, మెరుగైన ఆర్థిక నిర్వహణ, నైతిక ప్రవర్తన, మానవ హక్కుల్ని కాపాడటం, వైవిధ్యాన్ని గౌరవించడం, సమర్థ వ్యవస్థల నిర్మాణం వంటి సుపరిపాలనాంశాల ప్రాతిపదికగా ప్రభుత్వాన్ని నడిపారు వాజ్‌పేయీ.

భారతీయ జనతా పార్టీకి 1984లో ప్రజలు ఇచ్చింది రెండు సీట్లే. ఆ స్థాయి నుంచి పార్టీకి ప్రజాదరణను పెంచి, సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతూ, అయిదేళ్లు ప్రధానమంత్రిగా కొనసాగిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా చరిత్ర సృష్టించారు. ఆయన ఎంత సున్నితమైన వ్యక్తో, దేశ ప్రయోజనాల పట్ల అంతే దృఢంగా వ్యవహరించే ప్రధానమంత్రి. దీన్ని పోఖ్రాన్‌ అణుపరీక్షలు, కార్గిల్‌ యుద్ధ సమయాల్లో యావత్‌ ప్రపంచం దర్శించింది. లాహోర్‌ బస్సు దౌత్యం, ఆగ్రా చర్చలు ఆయన దౌత్యనీతికి ఉదాహరణలు. ఆయన ముందుకు నడిపించిన ‘కనెక్ట్‌ ఇండియా’ సాహసంతో కూడుకుంది. జాతీయ, గ్రామీణ రహదారులు, టెలికాం, మౌలిక వసతులు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ప్రైవేటు భాగస్వామ్యం వంటి కీలక రంగాల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు ద్వారా దేశవ్యాప్తంగా విస్తృత రహదారి వ్యవస్థను నిర్మించిన ఘనత వాజ్‌పేయీ సర్కారు సొంతం. అదే సమయంలో గ్రామీణ భారతంలోనూ రహదారులు నిర్మించాలని ‘గ్రామీణ సడక్‌ యోజన’ను నేను ప్రతిపాదించినప్పుడు, అందరికీ సవివరంగా చెప్పి ఒప్పించాలంటూ ఆయన చేసిన దిశానిర్దేశం ఎప్పటికీ మరువలేను. అఖండ దేశభక్తి, నమ్మిన సిద్ధాంతాలపై అచంచల విశ్వాసం, కలుపుకొనిపోయే మనస్తత్వం అటల్‌జీ వ్యక్తిత్వాన్ని హిమాలయాలను మించేలా చేశాయి. వాజ్‌పేయీని ఒక పార్టీ నాయకుడిగా కాకుండా ఒక జాతికి నాయకుడిగా ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారు. భావి తరాల ప్రగతిలో, వికసిత్‌ భారత నిర్మాణంలో ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారు. వాజ్‌పేయీ స్ఫూర్తిని భవిష్యత్‌ తరాలకు సమగ్రంగా అందించాల్సిన అవసరం ఉంది. ఓ రాజకీయ నాయకుడిగా, ఓ పూర్వ ప్రధానిగా, ఓ కవిగానే కాకుండా అంతకు మించిన సుపరిపాలనా ‘శక’దార్శనికుడిగా ఆయన జీవితాన్ని అర్థం చేసుకోవాలి. వాజ్‌పేయీ విలువలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగడమే- ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి! 

ఎం. వెంకయ్య నాయుడు,
భారత మాజీ ఉపరాష్ట్రపతి

Tags: